13, ఏప్రిల్ 2011, బుధవారం

దైవం – ఆలోచనల రూపం

దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.

మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?

ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.

ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.

వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.

ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.

మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??

గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.

ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.

ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..

చదివి తెలుసుకోవాలి..

విని తెలుసుకోవాలి..

అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..

ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.

9 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

భళా చక్రవర్తీ. మీ తెలుగు రచనా సామర్ధ్యం చాలా చాలా మెరుగుపడింది. చాలా బాగా రాస్తున్నారు ఇటీవలి టపాలన్నీ. అభినందనలు.

లలిత (తెలుగు4కిడ్స్) చెప్పారు...

దేవుడు ఉంటే మనం నమ్మినా నమ్మక పోయినా ఆయన "అస్తి"త్వానికేం లోటు లేదు.
దేవుడు లేకుంటే?
దేవుడు ఉన్నాడనడానికి నిరూపణ కావాలని అనిపించినట్టే దేవుడు లేదు అనడానికి కూడా నిరూపణ కావాలి అనిపిస్తుంది.
సృష్టికారకులెవ్వరో, సృష్టి జరగడానికి కావలసిన మూల పదార్థమేంటో దానినే దేవుడు అనచ్చేమో.
కానీ ఆ దేవుడు మన ప్రార్థనలను వింటాడా? నిర్గుణుడూ నిరామయుడూ అవునా కాదా?
'దేవుడు ' ఉన్నా లేకున్నా ఎన్నో ప్రశ్నలు.
ప్రస్తుతానికి నాకు దేవుడూ infinity లాగా నా పరిధికి మించిన వాటిని పూర్తిగా తెలుస్కోనక్కర్లేకుండా నా జీవితం నడిపించుకోవడానికి ఒక సాధనం.
infinity ఎందుకన్నాను అంటే - statistics లో infinity అంటే scope కి మించినది అని అర్థం. వృత్తానికి infinite sides అని చదువుకున్నాము. ఒకప్పుడెప్పుడో ఆలోచిస్తుంటే తట్టింది. సరళ రేఖ భూమి మీద గీస్తాము. కానీ నిజానికి అది భూమి చుట్టూ వెళ్ళే వృత్తాకారపు రేఖలో భాగం కదా? ఈ సరళ రేఖ పరిధికి భూమి చుట్టు కొలత infinity కదా. కానీ ప్రతిసారీ, ప్రతి దాన్నీ ఆ దృష్టితో చూస్తే మామూలు జీవనం సాధ్యం అవుతుందా? మీ దేవుళ్ళు టపా కూడా చదివాను. మీరు 'దేవుడు ' అని ఎందుకంటున్నారు వాళ్ళని? అదే పదం 'అరువు ' తెచ్చుకోవడం ఎందుకు? అంటే indirect గా infinity లాగే 'దేవుడు ' కి కూడా మీ దృష్టిలో విస్తృతార్థం ఉందనుకోవచ్చా?
దైనందిన జీవితంలో 'దేవుడు ' గురించి ధ్యాస పెట్టకుండా రోజులు గడిపేయచ్చు. ఒక్కో సారి మనం వివరించలేని పరిస్థితులు ఎదురైనప్పుడూ మన ఆలోచన పరిధిని పెంచుకోవలసి వస్తుంది. అది పెరిగి పెరిగి చివరకు 'పూర్ణం ' అవుతుంది, మనం విడవకుండా వెంటాడితే. అది అనంతం కావచ్చు, శూన్యం కావచ్చు. రెండు ఒకటే అప్పుడు.
మీ టపా అవకాశంగా తీసుకుని నా ఆలోచనలు పంచుకుంటున్నానంతే. ఎప్పటిలాగే ఇది నా ఆలోచన పెంచుకోవడం కోసమే.
ఇంకొకటి 'దేవుడు ' అనేది అందమైన concept కూడా. మన సాహిత్యం చూడండి. ఆ భావన ఎంత అందమైన కావ్యాలకు కారణమయ్యిందో. మనం గమనించే వాటినే దేవుడికి ఆపాదిస్తూ కూడా 'దివ్యత్వం' వల్ల వన్నె ఎలా పెరిగిందో, కల్పనా శక్తి ఎంత అందంగా రూపు దిద్దుకుందో...
దానికి విపరీతం కూడా నిజమే అనుకోండి. 'దేవుడు ' పేర ఎన్ని అక్ర్మాలు, అనర్థాలూ జరిగాయో, జరుగుతున్నాయో కూడా. దానికి విపరీతం కూడా నిజమే అనుకోండి.దానికి విపరీతం కూడా నిజమే అనుకోండి. 'దేవుడు ' పేర ఎన్ని అక్రమాలు, అనర్థాలూ జరిగాయో, జరుగుతున్నాయో కూడా. అందుకేనేమో ఏ గుణమూ అంటని వాడయ్యాడు దేవుడు, అన్ని గుణాలు తనవే చేసుకున్నాడు కూడా :)

Mauli చెప్పారు...

హ హ , లలిత గారి ప్రశ్నే నాదీను, మీరిచ్చిన లి౦క్ లొ వ్యాఖ్య కు ఈ ప్రశ్న కూడా చేర్చుకోవాలి :)

మీరు 'దేవుడు ' అని ఎందుకంటున్నారు వాళ్ళని? అదే పదం 'అరువు ' తెచ్చుకోవడం ఎందుకు?

సమాధాన౦ చెపితే వినాలని ఉ౦ది.

ఓ బ్రమ్మీ చెప్పారు...

కొత్తపాళి గారు,

మున్ముందుగా అభినందించినందులకు నెనరులు. ఇక నా తెలుగు రచనా సామర్ద్యం మెఱుగు పడింది అని మీలాంటి వారు స్పందించినందులకు నిజ్జంగా అది మెఱుగు పడిందని నేను నమ్ముతాను, కాకపోతే అది కావలసినంత వరకూ మెఱుగు పడలేదు కానీ నూటికి ఓ పది పాళ్ళు అయ్యుండవచ్చని నా అభిప్రాయం. మీలాంటి వాళ్ళు నేను చేసే తప్పులను సరిదిద్దుతూ ఉంటే ఇంకాస్త మెఱుగు పడుతుందని భావిస్తూ మొట్ట మొదటగా స్పందించినందులకు నెనరులు.

veera murthy (satya) చెప్పారు...

అది ’దైవం’

అంత సులువు కాదు!
కొందరు స్పందిస్తారు
కొందరు అనుభవిస్తారు
కొందరు భావిస్తారు
కొందరు ఊహిస్తారు
కొందరు విశ్వసిస్తారు
కొందరు గ్రహిస్తారు
కొందరు గర్హిస్తారు
కొందరు గమనిస్తారు
కొందరు ఆలోచిస్తారు
కొందరు అస్వాదిస్తారు

కొందరు మాత్రమే భగవంతున్ని వాస్తవంగా పొందుతారు!

అందరికీ అందడు దైవం!

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిధ్ధ్హయే |
యతతా మపి సిధ్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత: ||

వేలకొలది మనుష్యులలో ఎవ్వడో ఒక్కడు మాత్రమే నిజమైన జ్ఞానసిధ్ధి కొరకు ప్రయత్నిస్తాడు (కుతూహలం తో కాదు!)
అలా ప్రయత్నించిన వాళ్ళలో ఒకానొకడు మాత్రమే భవవంతున్ని తెలుసుకుంటాడు.
అలా తెలుసుకొన్న వాళ్ళలో ఒకానొకడు మాత్రమే భగవంతున్ని వాస్తవంగా పొందగలడు!

కానీ భగవంతుడు కొందరిపై కాక అందరిపై సమదృష్టితో వుంటాడు. 'అస్తులు' 'నాస్తులు' అర్థం కానంత వరకే!
-satya

veera murthy (satya) చెప్పారు...

మంచి పోస్ట్ రాసారు అభినందనలు!



ధన్యవాదాలు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

లలిత గారు,

మీ స్పందనలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అలాగే లోతైన భావాలు ఉన్నాయి. సరిగ్గా చదివితే సశాస్త్రీయమైన వాదన కనబడుతుంది. మీ భావనలో స్పష్టమైన వివరం దాగి ఉంది. మీ అభిప్రాయంలో విభేదించదగ్గ కోణమేమీ కనిపించక పోయినా వివరించిన విధానంలో ఓ కొత్త/వైవిధ్యభరితమైన చర్చకు దారితీసేటట్టు కనబడుతోంది. మీకు సమాధానం ఇవ్వాలి అని నేను అనుకోవడం తప్పని సరిగా అతిశయమే, కాబట్టి మీతో నేను నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తూ, స్పందించి వివరించినందులకు నెనరులు.
అలాగే ఇదే విధంగా స్పందించి ప్రోత్సాహపరచమని వేడుక.

మౌళీ గారు,
స్పందించినందులకు నెనరులతో తదుపరి పోస్టులకై ఎదురు చూడమనవి.

ఓ బ్రమ్మీ చెప్పారు...

సత్య గారు,

అహా!! ఏమి చెప్పారండి. ఠార్ మని చిరిగిందనుకోండి. ఏమిటంటారా.. అదే నా బ్లాగు పోస్టు వ్రాసిన పేపర్. మీకు వినపడలేదా?

మీరు ప్రస్తావించిన అంతమందిలోకి నేనొక్కడినైనా అవ్వగలనా అని నా ప్రయత్నం. స్పందిస్తూ ఓ శ్లోకాన్ని మఱియు దాని అర్దాన్ని వివరించినందులకు అన్యధా కృతఙ్ఞతలు. ఇకపై ఇలాగే స్పందిస్తూ ఉండమనవి.

veera murthy (satya) చెప్పారు...

అయ్యో! చింపేయాలని కాదండీ...
చింతనలెలా వుంటాయో చెప్పానంతే!

మీరు బాగా రాస్తున్నారు!

థాంక్యూ!

 
Clicky Web Analytics