11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

5, అక్టోబర్ 2011, బుధవారం

క్రొత్తగా నేర్చుకున్న పాఠం

చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలదాకా వస్తాయన్న సామెత పరంగా కొన్ని కొన్ని అలవాట్లు నన్ను వదలి పోనంటున్నాయి.

ఇంతకు ముందు కొంతకాలం క్రిందట, అనుభవాలనుంచి నేను నేర్చుకోవటం లేదని వ్రాసుకున్నట్లు గుర్తు. ఇది జరిగి దాదాపుగా ఓ తొమ్మిది నెలలైనా, ఈ నిజం వంటపట్టడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. తోలు మందంకదా. అందునా ఒంటి నిండా కొవ్వుందని ఈ మధ్యనే డాక్టర్ గారు తేల్చేశారు. అంత కొవ్వు కరిగి నిజం మింగుడు పడాలంటే, కొంచం కష్టమే కానీ నిజం నిజం కాకపోతుందా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చదరంగం ఆట మఱియు నా ప్రవేశం గురించి.

ప్రతీ సంవత్సరం మా ఆఫీస్ వాళ్ళు చదరంగం పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నేను పాలు పంచుకుంటాను. క్రిందటి ఏడాది ఇలాగే పాలు పంచుకుని ఓ అనామకుని చేతిలో ఓడిపోయ్యాను. ఈసారి కూడా గెలుపు అంచులదాకా వెళ్ళి ఓడిపోయ్యానని ఒప్పుకుని విరమించుకున్నాను. నేను ఓడిపోయ్యాను అన్న స్థితికి ఒక్క నిమిషం వరకూ ఆలోచిస్తే, అన్ని కోణాల్లోనూ నాదే పైచేయ్యిగా సాగుతున్న ఆట అది. కానీ ఇక్కడ నా ప్రత్యర్ది పోరాట పఠిమని మెచ్చుకోకుండా ఉండలేను. తాను ఓడిపోవడనికి అన్ని దారుల్లోనూ వీలుంది అని తెలిసి కూడా చచ్చేవరకూ పోరాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అతనిని గెలిపించింది.

మానవుడన్న తరువాత తప్పులు అనేవి సహజం. ఒక్కొసారి మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో నాకు ఎన్ని సార్లు అవగతం అవుతున్నా, నేను తెలుసుకోలేక పోతున్నా. చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వతహాగా నాలో ఓ చిన్న భావన ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని. అదిగో అందువల్లే ఇంతకు ముందు నేను గెలవాల్సిన ఆట ఓడిపోవడనికి దారి తీసింది.

పోనీలే అని ఊరుకోకుండా, నిష్కర్షగా ఎలా పడితే అలా నరుక్కుంటూ పోతే అప్పుడు ఎదుటి వారు బాధ పడుతున్నారు అన్న భావన నాలో ఉత్పన్నం అవకుండా ఉండి, నేను గెలవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చివ్వరిదాకా పోరాడాలి అన్న క్రొత్త పాఠం నేను నేర్చుకున్నాను. ఎదుటి వారు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవ్వడం ఇంతకాలం నేను చేసిన ఓ తప్పిదం అని ప్రస్తుత కాలం ఓ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే కాలం ఇంకేం నేర్పుతుందో.

 
Clicky Web Analytics