23, జులై 2012, సోమవారం

అమెరికా ఏమీ మారలేదు ??

ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం కించిత్ కష్టం గా సాగినా, ఎందుకో మనసు అంతా ప్రశాంతతో కూడుకుని అన్నింటినీ క్షమించేసింది. అమెరికా లో నాకు చాలా విషయాలు నచ్చకపోయినా, నచ్చినా.. అవన్నీ ఇప్పుడు భావాతీతంగా అనిపిస్తున్నాయి. అమెరికా లోని ప్రజల అలవాట్లు నాకు ఎప్పటికీ అర్దం కాకపోయినా, వాటిల్ని అర్దం చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇక్కడ విభిన్నమైన జాతులు కలసి మెలసి ఉంటున్నా, అప్పుడప్పుడు నాలాంటి మానశిక వికలాంగులకు అమెరికా అప్పుడప్పుడు ఓ అర్దం కాని విచిత్రమే.

 

అమెరికా లోని ప్రజల జీవన విధానం పై మొదటగా నేను వ్రాసుకున్న విషయాలు ఇప్పటికీ మారక పోయినా, నా దృక్పధంలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. వ్యక్తుల మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి అన్యోపదేశంగా ఎవేవి వ్రాసినా, అమెరికా లోని ప్రజల గురించి ఏమి వ్రాసినా అది అర్ద రహితంగానే ఉంటుందనిపిస్తోంది. ఆరోజుల్లోని నా ఆలోచనలు వాటిపై పడ్డ మొట్టికాయలు ఇప్పుడు ఎందుకో గుర్తుకు రావటం లేదు. మొదటి సారిగా అమెరికా వచ్చినప్పుడు వేసుకున్న నీలిరంగు చొక్కా ఇప్పటికీ గుర్తుండి తీసుకురావడం ఇప్పుడు అదే వేసుకుని మూడోసారి కూడా క్లైంటు వద్దకు వెళ్ళడం ఎదుకో చిత్రంగా అనిపిస్తోంది. ఇంత సింహావలోకనం చేసినా, ఇప్పుడు చెప్పాలనుకున్నది ఎక్కడ మొదలు పెట్టలో అర్దం కావటం లేదు.

 

మఱో సారి ప్రారంభిస్తాను. అప్పుడు ఆలోచనలు ఓ రూపాన్ని తెచ్చుకుని అక్షరంగా ఇక్కడ కనబడుతుందేమో!!! అప్పటిదాకా ..

 

సశేషం ..

 
Clicky Web Analytics