Friday లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Friday లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

5, ఆగస్టు 2011, శుక్రవారం

షుగర్ వ్యాధి గ్రస్తులకు శుభవార్త

మా అమ్మ షుగర్ వ్యాధితో చాలా కాలంగా బాద పడుతూ దానికి సంబందించిన మందులను వేళ తప్పకుండా వేసుకుంటూ అలా వేసుకోవడానికి అలవాటైపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎండాకాలంలో చక్కగా మామిడి పళ్ళు తినాల్సి వస్తే, చక్కగా ఓ రొండు షుగర్ టాబ్లెట్లు వేసుకుని తృప్తిగా మామిడి పళ్ళు లాగించేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే, మా అమ్మ పరిస్థితి చాలా బాలెన్సుడ్ గా సాగుతోందనే చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్య ఎందుకు చేసానంటే, ఇలా షుగర్ వ్యాధి భారిన పడిన వారిలో మా పిన్ని కూడా ఉన్నారు. కాకపోతే మా పిన్నిది కొంచం ఎడ్వాన్సుడ్ స్టేజ్ అని చెప్పుకోవాలి. మా చిన్నాన్న పిన్ని ఓ మారు మూల ప్రాతంలో ఓ చిన్న గ్రామంలో ఉంటున్నారు. అలాంటి గ్రామానికి వైద్యుడు ఎప్పుడో చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి స్థితిలో మా పిన్ని షుగర్ వ్యాది ఎంత ముదిరిందంటే, ప్రస్తుతం తాను రోజు ఇన్సులెన్ ఇంజెక్షన్ చేసుకుంటుంది. ఇలాంటి వారిని చూసిన తరువాత, తిండిపై కొంచం శ్రద్ద పెరిగింది. జన్యురీత్యా వస్తే చెప్పలేను కానీ తినే పదార్దాల ద్వారా, లేదా తినే హాబిట్స్ ద్వారా మాత్రం నేను షుగర్ వ్యాధిన పడకూడదనుకుంటున్నాను. ఇదంతా ప్రస్తుతం వ్రాయబోయే విషయానికి ఉపోద్ఘాతం అయితే, చెప్పబోయే విషయం కొంచం శుభ సూచకమే అయినా, కొంచం ఇబ్బంది కరం.

shudev

స్కాట్ హన్సల్ మెన్ అనే వ్యక్తి శాంకేతి పరంగా చాలా విద్వత్తు ఉన్న వ్యక్తి. క్రొత్తగా ఏది విడుదలైనా ముందుగా వాటి గురించి తెలుసుకుని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తి నిన్న ఓ విషయం గురించి బ్లాగారు. అదే షుగర్ వ్యాధి గ్రస్తులకు నేను తెలుసుకున్న శుభవార్త. ఆ విషయం గురించి నేను ప్రస్తావించే ముందు, స్కాట్ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, క్రొత్తగా వచ్చే డివైజస్ వాడటం ద్వారా శత్రువులకు అధునాతన పరికరాలు ఉపయోగించి హత్య చేసే అవకాశం ఉందే అనేది ఒఠి అపోహ అని. ఈ విషయం విశదీకరంగా వ్రాసే ముందు, ప్రస్తుతం ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు మరో అధునాతనమైన పరికరం ఓ వరంలా దొరికింది అని చెప్పుకోవాలి.

పైన నేను ఉదహరించిన మా పిన్ని లాంటి వారికి అనునిత్యం ఇంజెక్షన్ చేసుకోకుండా, ఇదిగో ఇక్కడ చిత్రంలో చూపించినట్లు ఓ చిన్న సూదికలిగినటు వంటి పరికరాన్ని మన శరీరానికి తగిలించుకుని ఉంటే చాలు. మన శరీరంలో గ్లుకోజ్ పాళ్ళు అటు ఇటు అయ్యినాయి అని అది గుర్తించగానే సరిపడే పరిమాణంలో సమతౌల్యానికి తెచ్చే ప్రయత్నం ఈ పరికరం చేసేస్తుంది అనేది ముఖ్యాంశం. అందువల్ల షుగర్ వ్యాధి గ్రస్తులు వారి వారి గ్లూకోజ్ గణణాంకాలను గమనించుకోవలసిన పనిలేదు. ఈ పరికరం గురించి వివరించే ప్రయత్నంలో స్కాట్ ఓ విడియో కూడా చేసారు.

ఈ విడియో చూసిన తరువాత నాకు కొంచం బాధ మరికొంచం బాద్యత పెరిగిందని చెప్పుకోవాలి. లేకపోతే, పనిగట్టుకుని ఇలా షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి వ్రాస్తానా!!

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

3, జూన్ 2011, శుక్రవారం

అభివృద్దా లేక వినాశనమా!!

యాపిల్ వారు విడుదల చేసిన రెండొవ సంతతికి చెందిన ఐపాడ్ కొనుక్కునేందుకు చైనాలోని ఓ పదిహేడేళ్ళ అబ్బాయి తన కిడ్నీని అమ్ముకున్నాడన్న విషయం నిన్న చైనా టీవీలో కనబడ్డా అదేమీ పెద్ద వింతకాదన్నుట్లు చైనీయులు పట్టించుకోలేదంటే, అక్కడ జరుగుతున్నది అభివృద్దా లేక వినాశనమా?

జనాభా పెరిగితే ఇంతకన్నా ఘోరమైన విషయాలు చదవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ది మంచిదే, కానీ పిల్లలకు స్వేచ్చనిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడినా అదేమీ పెద్ద వింతకాదులే అనే వారి ధోరణిని ఎలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ విషయాన్ని స్పందిచినవాళ్ళు అదేదో పెద్ద హాస్యం అన్నట్లు నవ్వుకోవడం మరీ చోద్యంగా ఉంది.

దీనివెనుక అక్కడి తల్లి తండ్రుల పెంపకం ప్రధాన పాత్ర వహిస్తుంది అనిపిస్తోంది. మున్ముందుగా పిల్లలు జాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు పట్టించుకున్నట్లు లేరు. ఆపై మూడు రోజులు అబ్బాయి కనబడక పోతే పట్టించుకు పోగా ఒక చేతిలో ఓ లాప్ టాప్ మఱో చేతిలో ఐపాడ్ పట్టుకు తిరుగుతున్న అబ్బాయిని పట్టుకుని అడిగితే అప్పుడు అస్సలు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్లు వివరించాడంట.

అమ్మేవాడికి తెలివి లేదనుకుందాం, పోనీ కొనే వాడిని మానవతా విలువలు ఉండనక్కర్లేదా అని అడిగితే, దానిదేముందండి అది ఎక్కడ అమ్ముతారో చెప్పండి దాన్నీ కొనుక్కొచ్చేద్దాం అని అంటారు. ఇలా నైతికపరంగా వీరు చాలా దిగజారిపోతున్నారన్నది నిజమై అని మనం అనుకునేంతలో.. అక్కడెక్కడో ఎందుకు చూస్తావు, నీ ముడ్డి క్రింద నలుపు చూసుకో అంటూ మరో ఘటన మన ఆంద్ర ప్రదేశ్ లో ఇవ్వాళ్ళ ఉదయం జరిగింది.

మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం. అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి. చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే, మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్. ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె, మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు. వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం..

మొదటిది) తల్లి తండ్రుల పెంకపంలో లోపం.

రెండొవది) స్వతహాగా ఉండాల్సిన నైతిక విలువలు. తల్లి తండ్రి నేర్పలేదనుకోండి, పెరిగి పెద్దైన వీరి బుద్ధికేమైంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే, అసహనం వస్తోంది. పిల్లలు లేకపోవడం ఓ రంకంగా సమాజానికి మేలేనేమో అనిపిస్తోంది. ఇంకా వ్రాస్తే ఏదో వస్తుంది.

11, మార్చి 2011, శుక్రవారం

నేను అనుభవాలనుంచి నేర్చుకోవటం లేదు

ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది. దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం.

స్వతహాగా నాకు ఉన్న కొన్ని బలహీనతలలో ఒకటి నన్ను చాలా ఇబ్బందులలోకి తోస్తోంది. అలా చెయ్యడం ద్వారా నేను ఇబ్బందుల పాలౌతున్నాను అన్న విషయం గ్రహించి కూడా అలా చెయ్యడం మానుకోలేక పోతున్నాను. అలా చెయ్యడం మానడానికి నేను చాలా శ్రమించ వలసి వస్తుంది. కానీ చాలా కాలంనుంచి ఉన్న అలవాట్లు తొందరగా మానుకోలేం అన్న ఆంగ్ల నానుడి నాయందు స్పష్టమైంది. ఆంగ్ల నానుడిని ఆంగ్లంలో, Old habits die hard.

ఈ పుట వ్రాయడం వెనకాల ఉన్న చాలా విషయాలలో ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ’రాయడం’ అనే పదం చూచిన రోజునుంచి నాకు చాలా కోపంగా ఉండేది. ఎవ్వడో చదువురాని లేదా వ్రాయడం చేత కాని ఓ అభాగ్యుడు వ్రాయడం అనే అచ్చమైన తెలుగు పదాన్ని తెలియక అలా వ్రాస్తే, ఏవిదంగా వ్రాస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తూ ఈ నాటి చాలా మంది రచయితలు అందునా విద్యావంతులు అంతే కాక సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా ఈ రాసే జబ్బుని వారంటించుకుని అందరికీ పూయ్యడం అలవాటు చేస్తుంటే కడుపు రగిలిపోయ్యేది. ఇక్కడ మరో విషయన్ని ప్రస్తావించాలి.

ఉదాహరణాకి, ఓ ఇంటి ముందు నుంచొని ఓ పెద్దాయిన ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది..

౧) అబ్బాయి, మీ నాన్నగారు ఉన్నారా?

౨) బిడ్డా!, మీ నాయిన ఉన్నడా?

౨) కొడకా, బాబు ఏంజేస్తుండు?

౪) వగైరా .. వగైరా..

ఇవన్నీ ఏదో ప్రాంతీయ యాస కలిగి ఉంటాయి, అంతే కానీ ఏ భాణిలోను మనం తండ్రి అనే పదాన్ని అగౌరవ పరచం. కాకపోతే మనం చేయ్య వలసినదల్లా, ఆ ప్రాంతీయ తత్వాన్ని మనం అర్దం చేసుకోవడమే.

అదిగో అలాంటి సమయంలో తెలుగు బ్లాగింగ్ చెయ్యడం, eతెలుగులో చేరడం, నా అభిప్రాయాన్ని నలుగురితో పంచుకోవడం, పలువురు నన్ను వ్యక్తిగతంగా నిందించడం, వగైరా వగైరా, ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయ్యాయి. ఎవ్వరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ విషయమై నేను ఓ అభిప్రాయానికి వచ్చేసాను. నేను తెలుగు భాషని నలుగురిలోకి తీసుకు వేళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరు ఏవిధంగా నైనా తెలుగులో వ్రాయడం మొదలైతే ఎంతో కొంత తెలుగు భాష వాడుకలోకి వస్తుంది కదా అని సమర్దించుకుని నా భాదని దిగమింగుకుని నాకు వీలైనంత వరకూ వ్రాయడమే చేస్తున్నాను.

అదిగో అలాంటిదే మరొక్కటి. అయినా నాకు ఎందుకో ఈ జాడ్యం? భాష యందు పూర్తి పట్టులేక పోయినా కొన్ని కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పవచ్చు. నాకు అవగాహన ఉన్న విషయాలలోని అర్దాన్ని తెలియని అందునా మాకు తెలియని విషయాన్ని చెప్పండి అని అడిగిన వారికి మాత్రమే తెలియ జేస్తుంటాను. అలా తెలియజేస్తూ ఉండే ప్రక్రియలో తెలుసుకునే వారు, తాము చేస్తున్నది భాషకి విరుద్దం అని తెలిసి.. ఆ విషయాన్ని ఒప్పుకునే చొరవ లేక వితండంగా వాదించడమే కాకుండా తిరిగి నాపై లేదా నేను చేసే తప్పులను భూతద్దంలో చూపించి వారేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవుతారు.

ఇలాంటి వారి విషయాలలో కొన్ని అంశాలు. మొదటిది, నాకు నేరుగా తపుచేస్తున్న వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం లేదు. వారు అడిగితేనే నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను. రెండవది. నేనేమి తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని ఎవ్వర్ని నేను అడగలేదే, మరి అలాంటది నా చర్యలపై ఎందుకు స్పందిస్తారు? ఇలాంటి వాటి గురించి మరోసారి. ప్రస్తుతానికి ముఖ్య విషయానికి వచ్చేస్తా..

ప్రస్తుత ముఖ్య విషయాన్ని, అనుభవం నుంచి నేర్చుకోవడం అనే విషయంపై నేను ఇంతకు ముందు ’వ్రాయడం’ అనే విషయంలో అనుభవించి ఉన్నాను. కానీ ఇది పునరావృత్తం అవుతోంది అంటే, నేను అనుభవాలనుంచి నేర్చుకో లేక పోవడమే కాకుండా, స్వయం కృతాపరాధానికి అనుభవించాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం జరుగుతుందో చూడాలి ఇకనైనా నేను నాలోని ఈ బలహీనతను అధిగమించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూచుకోవాలి.

 
Clicky Web Analytics