3, జనవరి 2015, శనివారం

స్త్రీలు - జుత్తు

ఈ పోస్టు చాలా మంది ఆడవాళ్లకు నచ్చక పోవచ్చు. ఎందుకంటే, ఇది మా జీవితం, మా ఇష్టం, నువ్వెవ్వడివి నన్ను’ఇలా ఉండాలి..’ అని శాసించడానికి అనేది వారి యొక్క భావన.


అలాంటి భావన ఉన్నవారు, ఈ పోస్టుని ఇక్కడితో చదవడం ఆపేసి, మీకు ఇష్టమైన మఱో పని చేసుకోండి.


భారతీయ సాంప్రదాయానికి పట్టుకొమ్మలాంటిది రామాయణం. రామాయణాన్ని విష వృక్షంగా అభివర్ణించినది ఓ ఆడది. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. ఆ విషయం గురించి చర్చ కూడా వృధా ప్రయాసే.


అలాంటి రామాయణంలోని ఓ విషయాన్ని ఇక్కడ వ్రాసుకుంటున్నాను. ఇష్టమైన వారు చదవండి, కష్టమైన వారు ఏమి చెయ్యాలో నేను చెప్పను.


కస్యప మహర్షికి ఉన్న భార్యలలో ఇద్దరు ఎప్పుడూ విరుద్దమైన భావనతో కలిగి ఉంటారు. వారు దితి మఱియు అదితి. రామాయణాన్ని ఓ భారతీయ తత్వ శాస్త్రంగా చూడాలనుకునేవారికి ఇది ప్రధమ ఉదాహరణ. భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒక్కరుగా బ్రతకాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని వారికి ఏమి చెప్పినా అర్దం కాదు. దానికి తోడు, పాశ్చాచ్య సాంస్కృతి అన్న పేరుతో, పులిని చూచి నక్కలు వాత పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.


ఆంగ్లంలో అయితే, బెట్టర్ హాఫ్ (better half) అని అనవచ్చు, కానీ ఆ అమ్మాయికి గౌరవం ఉండదు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అసలు విషయం జారిపోతుంది.


దితి అంటే రెండుగా చూచునది, అలాగే, అదితి అంటే, రెండుగా చూడనిది. ఇక్కడ కోడిగుడ్డుపై ఈకలు పీకేరకాలు ఈ అదితి అర్దానికి వక్రభాష్యం ఇస్తారు. రెండుగా చూడటం లేదంటే, మూడు చూస్తోంది అన్నమాట. ఏం? మూడే ఎందుకు చూడాలి, నాలుగుగా చూడకూడదా, అంటూ అసలు విషయాన్ని ప్రక్కదారి పట్టిస్తారు. రెండుగా చూడనిది అంటే, బహు విషయాలుగా కాకుండా ఒక్కటిగా మాత్రమే చూచేది అని అర్దం చేసుకుంటే, ఉన్నతమైన భావన కలిగినట్లౌతుంది.


ఇంద్రుడు అదితికుమారుడు. ఇంద్రుడిని చంపే శక్తి కలిగిన పుత్రుడు కావాలని ఓ సారి అదితి వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ సందర్బంలో స్త్రీలకు అశౌచం ఎప్పుడు కలుగుతుందో తెలియ జేసే ఘటన ఇక్కడ వివరించ బడి ఉంది. ఆ ఘటన ఏమిటంటే, స్త్రీలు ఎప్పుడూ వారి జుత్తుని ముడి వేయ్యకుండా ఉంచ కూడదు. అయితే, కొప్పులాగా ముడి వేసుకుని ఉండాలి లేదా జడలాగా అల్లుకుని ఉండాలి.


ఈ నాటి స్త్రీలకు సినిమాలే ప్రతి పాదిక. నూటికి తొంభై ఐదు శాతం స్త్రీలు ఆ సినిమాల ప్రభావం వల్ల జుట్టుని విరబోసుకుని తిరుగుతున్నారు. వివాహితలు కాని వారు అలా తిరిగారు అంటే, ఏదోలే వారి వంక చుట్టూ ఉన్న జనాలు చూడాలి అన్న భావనతో తిరిగారు అనుకోవచ్చు. వివాహితలు కూడా అలా తిరుగుతూ ఉంటే... ఇక వారికి ఎలా చెప్పాలో


వాళ్లకీ వీళ్లకీ చెప్పడం దేనికి, నాకు నేను చెప్పుకుంటే, ఎంతో శ్రేష్టం. అందుకని అన్నీ మూసుకుని, నా గోడుని ఇక్కడ వెళ్లగక్కుకుంటున్నాను.


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
 
Clicky Web Analytics