31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

 
Clicky Web Analytics