Silly లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Silly లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2012, సోమవారం

అమెరికా ఏమీ మారలేదు ??

ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం కించిత్ కష్టం గా సాగినా, ఎందుకో మనసు అంతా ప్రశాంతతో కూడుకుని అన్నింటినీ క్షమించేసింది. అమెరికా లో నాకు చాలా విషయాలు నచ్చకపోయినా, నచ్చినా.. అవన్నీ ఇప్పుడు భావాతీతంగా అనిపిస్తున్నాయి. అమెరికా లోని ప్రజల అలవాట్లు నాకు ఎప్పటికీ అర్దం కాకపోయినా, వాటిల్ని అర్దం చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇక్కడ విభిన్నమైన జాతులు కలసి మెలసి ఉంటున్నా, అప్పుడప్పుడు నాలాంటి మానశిక వికలాంగులకు అమెరికా అప్పుడప్పుడు ఓ అర్దం కాని విచిత్రమే.

 

అమెరికా లోని ప్రజల జీవన విధానం పై మొదటగా నేను వ్రాసుకున్న విషయాలు ఇప్పటికీ మారక పోయినా, నా దృక్పధంలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. వ్యక్తుల మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి అన్యోపదేశంగా ఎవేవి వ్రాసినా, అమెరికా లోని ప్రజల గురించి ఏమి వ్రాసినా అది అర్ద రహితంగానే ఉంటుందనిపిస్తోంది. ఆరోజుల్లోని నా ఆలోచనలు వాటిపై పడ్డ మొట్టికాయలు ఇప్పుడు ఎందుకో గుర్తుకు రావటం లేదు. మొదటి సారిగా అమెరికా వచ్చినప్పుడు వేసుకున్న నీలిరంగు చొక్కా ఇప్పటికీ గుర్తుండి తీసుకురావడం ఇప్పుడు అదే వేసుకుని మూడోసారి కూడా క్లైంటు వద్దకు వెళ్ళడం ఎదుకో చిత్రంగా అనిపిస్తోంది. ఇంత సింహావలోకనం చేసినా, ఇప్పుడు చెప్పాలనుకున్నది ఎక్కడ మొదలు పెట్టలో అర్దం కావటం లేదు.

 

మఱో సారి ప్రారంభిస్తాను. అప్పుడు ఆలోచనలు ఓ రూపాన్ని తెచ్చుకుని అక్షరంగా ఇక్కడ కనబడుతుందేమో!!! అప్పటిదాకా ..

 

సశేషం ..

31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

 
Clicky Web Analytics