26, ఆగస్టు 2010, గురువారం

అమెరికాలో నాకు నచ్చిన అంశాలు

AMERICA

ఎప్పుడూ అమెరికాని ఆడిపోసుకుంటున్నననే అనుకుంటునారుగా, అదేంలేదు. ఇదిగో ఇక్కడ అమెరికాని మరో కోణంలోంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ నాణానికి రెండు వైపులుంటాయి, ఇంతకాలం ఒకవైపు చదివిన మీకు ఇప్పుడు మరో వైపు చూపడానికే ఈ ప్రయత్నం.

అన్నింటికన్నా మొదటిది వీరి నవ్వు మొహం. మనం ఎవ్వరమో తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం వారిని చూసాము అన్న విషయం వారు గమనించగానే నవ్వుతూ .. ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఇలా ప్రశన్న వదనంతో పలకరించడం వీరికి చిన్నప్పటి నుంచి నేర్పి ఉంటారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, స్మైల్ కాస్ట్స్ నథింగ్, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా మొహం ఎప్పుడో కాని స్మైలీగా కనబడదు. అలాగని చికాకు వదనంతో కూడా ఉండను. అక్కడే వచ్చింది చిక్కంతా, ఆ పెట్టే మొహం ఏదో నవ్వు మొహం కాకపోయినా చిరు దరహాసమో లేక మందహాసమో నీ మొహంలోకి తెచ్చుకోవేరా వెధవా అని నా అంతరాత్మ తెగ ఘోషిస్తూ ఉంటుంది. అయినా మొహాన్ని కొంచం ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా!!

ఇక రెండొవది. వీరి సహజ వనరుల నిధి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అలాగే పచ్చని గడ్డి. అంటే నేను ప్రస్తుతం ఎండాకాలం మరియు వానాకాలం మధ్యలో ఉన్నాను కదా అలాగే ఉంటుంది. వీళ్ళ శీతాకాలంలో ఇక్కడ ఎక్కడ చూసినా మంచే కనబడుతుందంట. నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఊరిలో ఉన్న చెట్లను ఆ ఊరి ప్రభుత్వం చూస్కుకుంటే, ఇంటి బయట ఉన్న విశాలమైన ప్రదేశంలో ఇష్టమున్న వాళ్ళు వారి అభీష్టం మేరకు చెట్లను పెంచితే, లేని వాళ్ళు కనీసం గడ్డిని క్రమబద్దంగా పెంచుతారు. ఆ విధంగా పచ్చదనం అన్ని చోట్ల కనబడుతుంది. ఇక పై చెప్పిన రెండు చోట్లకాక అడవిలో పెరిగే చెట్లను కూడా వీరు చాలా శ్రద్దగా చూసుకుంటారు, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న అడవులు కాలుతుంటాయి కూడా. అలా అడవులు కాలుతూ ఉండే సమయంలో ఆ మంటలర్పడం కూడా ఓ నేర్పే. దానికి కూడా, అంటే అడవులు ఆర్పడానికి ఉండే సిబ్బంది కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు అంతే కాకుండా అది ఒక కెరీర్ అంటే నమ్ముతారా!! ఇక్కడ అనవసరమైనా మఱో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చాలా రాష్ట్రాలలో ఫైర్ మెన్స్ అంతా జీతాలు లేకుండా పనిచేసే సంఘ శేవకులు అంటే నమ్ముతారా!! అంటే వీళ్ళకు ఎంతో కొంత మొత్తం జీత భత్యాలు ఉంటాయి కానీ ఇక్కడి ఫైర్ మెన్ మాత్రం జీత భత్యాల కోశం మాత్రం పని చెయ్యరు అన్నది నేను విన్నది. ఇది నిజమైతే వీరెంత నిశ్వార్ధ పరులో కదా..

ఇక మూడవది వీరి డ్రైవింగ్ విధానం. చాలా మంది అంటే నూటికి తొంబై శాతం మంది డ్రైవింగ్ పద్దతులను చూచా తప్పకుండా పాటిస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవ్వరూ వస్తున్నట్టు కనబడకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా, ఆగుము అన్న సంజ్ఞ కనబడగానే కారుని అచ్చంగా ఆపి మరీ వెళతారు అనేది ఒక చిన్న ఉదాహరణ. ఎటొచ్చీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ నగరంలో మాత్రం అలా కాలేదు. అక్కడ మరో విధంగా ఉంది. అది అచ్చం మన హైదరాబాద్ లాగా అనిపించింది. ఇలా అనిపించడం వెనకాల ఒకటే కారణం అక్కడ ఎక్కువ మంది జనాభా ఉండటమే. అలాగే రోడ్డు మీద నడిచేవాళ్ళు కనుక కనబడితే తప్పని సరిగ్గా నడిచి వెళ్ళే వాళ్ళకే వీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. రోడ్డు దాటేటప్పుడు అడ్డదిడ్డంగా దాటినా వీరేమి అనరు, ఎటొచ్చి బండి ఆగగల వేగంలో వెళుతూ ఉంటే తప్పని సరిగా ఆపేసి నడిచి వెళ్ళే వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఒక వేళ బండి కనుక ఆపలేని వేగంతో వెళుతోందనుకోండి.. నడిచి వెళ్ళే వాళ్ళను ఎవ్వరూ ఆదుకోలేరు. వీరికి అవకాశం ఉన్నంత వరకూ నడిచి వెళ్ళే వాళ్ళకు దారినిచ్చిన తరువాతే వీరి ప్రయాణం సాగుతుంది. చాలా తక్కువగా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అన్నంత మాత్రాన అవ్వవు అని కాదు కాకపోతే వీటి తీవ్రత చాకా తక్కువ అని నా ఉద్దేశ్యం. చాలా మటుకు ఇన్స్యూరెన్స్ ఉండటం మూలాన ఎవ్వరికి ఇది ఇబ్బంది కాదు, ఇన్స్యూరెన్స్ లేకపోతే ..

మరో పుటలో మరికొన్ని నచ్చిన అంశాలతో .. వీటిపై మీ స్పందనలను మాత్రం మరువవద్దు..

15, ఆగస్టు 2010, ఆదివారం

మీ జీవతం ప్రాముఖ్యతల సమాధానాలు

ఇంతకు మ్రుందు చెప్పినట్టుగా ఇది ఒక మాస్ మైల్ లోని అంశానికి సంబందించినది. కాబట్టి దీనిని నేను కనుగొన్నానని మీరు అనుకోవద్దు. ఒక వేళ ఇక్కడ ప్రస్థావించిన విషయాలు ఏమైనా మీ మనోఃభావాలను దెబ్బదీసేవిగా ఉంటే, ఈ ప్రశ్నలను అస్సలు పట్టించుకోవద్దని ప్రార్దన. ఈ ప్రశ్నల ద్వారా నాకు కొన్ని నిజాలు తెలిసాయి అన్నంత మాత్రాన అవి మీకు కూడా వర్తిస్తుందన్న గ్యారెంటీ లేదు కావున ఈ ప్రశ్నలను ఏ మాత్రం కేర్ చెయ్యవద్దని మనవి.

మొదటి ప్రశ్న: ఇక్కడ కొన్ని జంతువులను ఇచ్చి వాటిని మీకు నచ్చిన వరుసక్రమంలో పెట్టమన్నాను. అవి మీ ప్రాముఖ్యతలు వరుస క్రమం అని అన్వయించుకోండి

ఆవు మీ కెరీర్
టైగర్ మీ ప్రైడ్
గొఱె ప్రేమకి చిహ్నం
గుఱం ఫామిలీకి ప్రతిరూపం
పంది ని డబ్బుతో పోల్చవచ్చు

 

రెండవ ప్రశ్నకు : ముందుగా మిమ్మల్ని కొన్ని జంతువులను డిస్క్రైబ్ చెయ్యమన్నాను. వాటి డిస్క్రిప్షన్స్ ఇప్పుడు చూద్దాం

మొదటగా కుక్కని మీరు ఏదైతే డిస్క్రైబ్ చేసారో ఆ చేసినది మీ వ్యక్తిత్వానికి ఇంప్లై అవుతుంది

పిల్లిని డిస్క్రైబ్ చేసినది మీ పార్టనర్‍కి ఇంప్లై అవుతుంది

ఎలుకకు మీరిచ్చిన డిస్క్రిప్‍షన్ మీ శత్రువులకు అర్దం పడితే

కాఫీకి ఇచ్చినది సెక్స్ పై మీ ఇంట్రప్‍టేషన్

ఆఖరుగా సముద్రం అంటే మీ జీవితాన్ని మీరు డిస్క్రైబ్ చేసినది.

 

మూడవ ప్రశ్న: ఇది రంగులకు సంబందించినది. ఇక్కడ కొన్ని రంగులు ఇచ్చి వాటి ప్రక్కన మీకు నచ్చిన లేదా ఈ రంగుని మీకు తెలిసిన వారి పేర్లను జ్ఞప్తికి తెచ్చేవిగా ఉంటే వారి పేర్లను వ్రాసుకోండి అన్నాను

యెల్లో - మీరు ఎప్పటికీ మరచిపోలేని వ్యక్తి
ఆరెంజ్ - మీరు నిజాయతీగా కంసిడర్ చేసే ఓ నిజమైన స్నేహితుడు
రెడ్ - సమ్ వన్ దట్ యు రియల్లీ లవ్
వైట్ - మీ ట్విన్ సౌల్
గ్రీన్ - మీ జీవిత చరమాంకం వరకూ మీరు గుర్తు పెట్తుకునే వ్యక్తి

 

ఆఖరుగా నాల్గొవ ప్రశ్నకు అర్దం లేదని నా అభిప్రాయం, అయినా సరే దానిని మీకు చెబుతాను, కానీ పాటించవద్దని మనవి

ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ అన్ని విషయాలను మీ ఫేవరేట్ అంకెలో చెప్పినన్ని మనుష్యులకు చేరవేయ్యండి అప్పుడు మీరు వ్రాసుకున్న రోజు లోగా మీరు కోరుకున్నది జరుగుతుంది.

14, ఆగస్టు 2010, శనివారం

మీ జీవితం మరియు మీ ప్రాముఖ్యతలు

ఈ మద్య నాకు ఓ మాస్ మైల్ వచ్చింది. అందులోని అంశాలు నాకు చాలా మటుకు సూట్ అయ్యాయి అంతే కాకుండా ఆ విషయాలై నేను చాలా కాలం ఆత్మ శోధన చేసుకోవలసి వచ్చింది. అలాంటి ప్రశ్నల మరియు సమాధానాల మైల్ మీకు కూడా వచ్చే ఉంటుంది, ఒక వేళ మీకు కనుక రాకపోతే, ఇదిగో ఇక్కడ ప్రశ్నించిన నాలుగింటికి సమాధానాలేమిటో మీరు మీవద్దేఉంచుకోండి. కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాసుకునేటప్పుడు మీకు మీరు నిజాయతీగా ఉండండి. వీటి సమాధానాలు ఏమిటో నేను మిమ్మల్ని అడగబోవటం లేదు, మీరు నాకు తెలియ జేయనక్కరేదు, నాకే కాదు మరెవ్వరికీ మీరు ఆన్సరబుల్ కాదు, కానీ మిమ్మల్ని మీరు ఒక్క సారి ప్రశ్నించుకోమంటున్నాను.

ఈ ప్రశ్నల వల్ల నాకు జీవితంలో ఏమి ప్రాముఖ్యమైనవో అర్దం అయ్యింది. అలా మీకు కూడా అవుతుందని ఆశిస్తూ.. ముందుగా

-------------------------

మొదటి ప్రశ్నః
ఈ క్రింది ఉఅదహరించిన జంతువులను మీకు నచ్చిన వరుసక్రమంలో పేర్చండి

ఆవు
టైగర్
గొఱె
గుఱము
పంది

రెండొవ ప్రశ్నః

ఈ క్రింది ఉదహరించిన జంతువులను డిస్రైబ్ చెయ్యండి. అంటే మీ స్వంత వాక్యాలలో వీటిని వల్లించండి.

కుక్క
పిల్లి
ఎలుక
కాఫీ
సముద్రము

మూడవ ప్రశ్నః

ఈ క్రింద ఉదహరించిన రంగులను ఉద్దేశ్శించి మీకు తెలిసిసిన ఎవ్వరైనా వ్యక్తులను మరియు మీకు అత్యంత ఇంపార్టెంట్ అయిన వారి పేర్లను ఆయా రంగుల ప్రక్కన వ్రాసుకోండి

ఎల్లో - Yellow
ఆరెంజ్ - Orange
రెడ్ - Red
తెలుపు - White
గ్రీన్ - Green

ఆఖరిగా నాల్గొవ ప్రశ్న..

మీకు ఇష్టమైన సంఖ్యని మరియు వారంలో ఇష్టమైన రోజుని వ్రాసుకోండి

-----------------------

ఇప్పుడు మీరు వ్రాసుకున్న మరియు నేను అడిగిన ప్రశ్నల వెనకాల ఆంతర్యం ఏమిటో మరో పుటలో ప్రచురిస్తాను. అంత వరకూ మీరు వ్రాసుకున్న సమాధానాలు మరొక్క సారి సరి చూసుకోండి అంతే కాకుండా నన్ను మొట్టండి..

13, ఆగస్టు 2010, శుక్రవారం

అమెరికా అలవాట్లు / ఆచారాలు / పద్దతులు / ఇతరేతమైన పదాలు నాకు ఎప్పటికీ అర్దం కావనుకుంటా!!

అమెరికాలో నాకు నచ్చని మరో మూడు అంశాలు. అమెరికా అంటే ఇష్టం ప్రేమ అభిమానం తొక్క తోటకూర వంకాయ్ బెండకాయ్ గాడిద గుడ్డు గోంగూర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఈ పుటని చదవవద్దని మనవి. ఎందుకంటే ఇవి నాకు అనిపించిన నిజాలు. అవి మీకు నిష్టూరంగా మరియు వెటకారంగా అనిపిస్తాయి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న.


మొదటిది.. ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో చేస్తారు. అసలు విషయానికి వద్దాం.  ఇక్కడ నీరు సంవృద్దిగా దొరుకుతుంది. అందువల్లన వీరి ప్రకృతి సంపద చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చక్కటి చెట్లు మంచి రోడ్లు. శీతాకాలం వస్తే మోకాలు ఎత్తుకు మంచు. అన్నీ బాగుంటాయి. అందువల్ల వీరు నీటిని చాలా శుద్ది చేసి వాడుకుంటారు. ఎంత శుద్ది చేసి అంటే, అచ్చంగా కుళాయి నుంచి వచ్చే నీటిని మనం యధావిధిగా త్రాగేయవచ్చన్నంతగా. నీరు ఇంత బాగా దొరుకుతున్నా, అన్ని పనులకు నీటిని వీరు వాడుతున్నా అసలైన చోట మాత్రం వీరు నీటిని వాడరు. ఎక్కడంటారా.. అదే అక్కడికే వస్తున్నా.. అది మల విశర్జన చేసి అశుద్దం అంటిన శరీరాన్ని నీటితో కడగరు సరికదా కాగితంతో తుడుచుకుని బయటకి వచ్చి, *డ్డిని నీటితో కడుక్కోరు కానీ *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు. అసలు అలాంటి చోట నీళ్ళను ఏర్పాటు చేసుకోరు. ఏమైనా అంటే కాగితంతో తుడుచుకున్నాంగా అంటారు.

అలాగే ఈ కాగితాన్ని తయారు చేసే కంపెనీలు విపరీతమైన రీసెర్చ్ చేసి మా కాగితంలో పది శాతం మాయిశ్చర్ ఉంటుంది, దీనితో కనుక మీరు తుడుచుకుంటే అది అచ్చంగా నీటితో కడిగినంత స్వఛంగా ఉంటుంది అని ప్రకటనలు చేస్తాయి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ చక్కగా నీటితోనే కడుక్కోవచ్చు కదా అంటే, అందరూ చేసింది మేము చేస్తే ఇక మా స్పెషాలిటిటీ ఏంటి? అని ఎదురు ప్రశ్నిస్తారు.

వీళ్ళలాగే వీళ్ళ పిల్లలు కూడా, నేను ఉంటున్న హోటల్లో నేను గమనించినది ఏమిటంటే.. ఉదయం నిద్ర లేవంగానే తినడానికి ఏమి ఉంది అంటూ క్రిందనున్న బ్రేక్ ఫాస్ట్ స్థలానికి వెళ్ళి ఏదో నోటికి పట్టినంత కుక్కుకుని ప్రక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. ఆడినంత సేపు ఆడి ఆ తరువాత మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తారు. మరి శారీరక శుబ్రత వంటి వాటి విషయాలేమిటంటే, గాడిద గుడ్డేం కాదు అంటూ మనల్ని వెధవల్ని చేస్తారు.


ఇక రెండవ విషయానికి వస్తే అది.. పెళ్ళి .. ఇక్కడ నేను కలిసిన ప్రతీ అమెరికన్ని కదిపితే, మగాడైతే ఇలా అంటూ ఉంటాడు.. "నా మొదటి పెళ్ళాం .. ఇప్పుడున్న పెళ్ళాం.. రేపు కనుక విడిపోతే మరో పెళ్ళాం .." ఇలా అనే వాడికి ముడ్డి క్రిందకి యాభై ఏళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు కూడా వీడికి కొత్త పెళ్ళాం కావల్సివస్తే, అమ్మాయిల పని మరోలా ఉంటుంది. నా మొదటి బాయ్ ఫ్రండ్ నా రెండో పెళ్ళికి వచ్చి త్రాగి తందనాలాడి తతంగం చేస్తే నా మొదటి మొగుడు వీడ్ని పట్టుకుని చితకొట్టాడు.. అంటారు. ఇవన్నీ ఏదో ఉత్తుత్తి వ్రాతలు అని మీరనుకుంటే ఈ మధ్య ఓ మాస్ మైల్ నాకు భలే నవ్వు తెప్పించింది. అదేదో పాత కమల హాసన్ సినిమాలో ఉన్నట్టుంది. ఆ మైల్ లోని సారంశం. వీలైనంత విపులంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.. ఒక వేళ అర్దం కాకపోతే వదిలేయ్యండి. స్టోరి ఇలా సాగుతుంది

నేనెవ్వరు? మీకు తెలిస్తే చెప్పండి. . . . ఈ మధ్యకాలంలో నేనో విదవరాలితో కలసి సహజీవనం కానిస్తూ ఓ బిడ్డను కనే ఆలోచనలో ఉండగా ఆ విదవరాలి పెద్దమ్మాయి ఎవ్వరినో ఇష్ట పడి ఆపై కష్టపడి ఓ పిల్లని కన్న తరుణంలో ఆ పుట్టిన బిడ్డ శాక్షిగా పెళ్ళి చేసుకుంటున్నాను మీరు రావాలి అని మా ఇద్దరికి వెడ్డింగ్ కార్డ్ పంపింది. తీరా వెళ్ళి చూస్తె ఆ పెళ్ళి కొడుకెవ్వరో కాదు నాకు జన్మనిచ్చిన బయలాజిలక్ తండ్రి. అంటే నా తండ్రికి నేను ఇప్పుడు మామగారినన్నమాట మా నాన్నకు పుట్టిన ఆ బిడ్డకి నేను తాతనా లేక అన్ననా.. నా నాన్న నాకు అల్లుడా లేక నేను డేటింగ్ చేసే విధవరాలి కూతురు భర్తగా నా పెళ్ళాం కూతురు మొగుడైతే నాకు అల్లుడౌతాడు కదా .. అలా అల్లుడా లేక ..

ఇలా సాగుతుంది వావి వరుస లేని వీరి వృత్తాంతం. ఈ మధ్య ఇక్కడ జరిగే చెర్చి పెళ్ళిళ్ళలో అక్కడి ఫాదర్ ఈ విధంగా అడగటం మొదలు పెట్టారు..

ఫాదర్ అమ్మాయితో : ఏమ్మా!! జాన్ అనే ఈ అబ్బాయితో నీకు నచ్చినంత కాలం నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈయన ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అమ్మాయి : అవును..
ఫాదర్ అబ్బాయితో : ఏరా!! జాకీ అనే ఈ అమ్మాయితో నీకు నచ్చినంత కాలం / నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈమె ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అబ్బాయి : అలాగే కానీయ్యండి

వీళ్ళిద్దరు చెర్చి బయట ఇలా ఈ ఎగ్రిమెంట్ కి వచ్చి ఉంటారు. నాకు నీకు పిల్లలు కలిగితే మొదటి ఐదేళ్ళు నేను పెంచుతానని అమ్మాయి ఒప్పుకుంటే మరో ఐదేళ్ళు అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ తరువాత పుట్టిన పిల్లలకు యుక్త వయసొచ్చింది కాబట్టి వాడి సంపాదన వీళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి అచ్చోసిన ఆంబోతులా వదిలేద్దాం. ఆ తరువాత మనమిద్దరం మరొకళ్ళని తగులుకుందాం .. వాకే!! అని ఒక ఎగ్రిమెంట్కి వచ్చుంటారు.

ఇక్కడ నేను వ్రాసేవన్నీ ఉత్తుత్తి వ్రాతలనుకునేవారు ఎప్పుడైనా ఒక నేటివ్ అమెరికన్ వ్యక్తిగత జీవితం ఏమిటో అడగండి అప్పుడు బయట పడుతుంది అస్సలు విషయం. ఇక్కడ ఓ పదేళ్ళు కలసి కాపురం చేసాము అన్నామంటే అదో గొప్ప విషయం అలాగే ఓ వింత విషయం కూడా.. ఇదే సంస్కృతి ఇప్పుడు మన దేశానికి దిగుమతి అయ్యి మన జీవనంలో ఓ చీడపురుగౌతోంది. ఆ విషయం గురించి మరో సారి.


ఇక ఈ పుటకి ఆఖరి పాయింట్.. అప్పాయింట్ మెంట్స్.. ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలోని ఓ ఉద్యోగి తండ్రి మరణించిన విషయాన్ని నాతో చర్చిస్తూ ఇలా అన్నాడు..

.. మానాన్న ఫలాన రోజు ఉదయం పది గంటలకు హృదయ స్పందన ఆగిపోవడం వల్ల హాస్పిటల్లో కాలం చేసారు, ఆరోజు  మాకు లంచ్ ఎప్పాయింట్ మెంట్ ఉంది కదా అని నేను అక్కడకు చేరుకుంటే ఇంట్లో ఎవ్వరూ లేరే!! కనీసం నాకు చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళుతున్నారు అని. విషయం ఏమిటో అని తెలుసుకుందాం అని మా చెల్లెలికి ఫోన్ చేస్తే చావు కబురు చల్లగా అప్పుడు చెప్పింది ..

పైన వ్రాసిన పేరా ద్వారా చదివే వాళ్ళకు ఏమి అర్దం అయ్యిందో గాని నాకు మాత్రం ఓ విషయం అర్దం అయ్యింది. తండ్రితో  కలసి భోజనం చెయ్యాలంటే కొడుకులకు అప్పాయింట్‍మెంట్ కావాలని. ఇలాగయితే ఈ క్రింద చెప్పబోయే మాటలు నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టదేమో!!

ప్రియమైన పెళ్ళానికి ఓ అమెరికన్ మొగుడు వ్రాయునది,
వచ్చే శనివారం సాయంత్రం ఏడు గంటలకు హిల్టన్ హోటల్లో మన ఇద్దరికి డిన్నర్ ఎరేంజ్ చేస్తున్నాను. ఓ గంటకి నాలుగు వందల డాలర్లు. ఇందులో రెండు వందల యాభై డాలర్లు నేను పెట్టుకుంటా మిగిలిన నూట యాభై డాలర్లు నువ్వు పెట్టుకోవలసి వస్తుంది. మనకు కేటాయించిన గంటలో ఓ అరగంట భోజనం చేస్తూ ఈ క్రింద వ్రాసిన లిస్టులోని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం మిగిలిన అరగంట సంసారం చేద్దాం. ఇందుకు నీకు ఇష్టమైతే ఈ మీటింగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి లేక పోతే కాన్సిల్ కానీ / క్రొత్త ప్రపోజల్‍ని పంపించు.

మనం మాట్లాడుకోవాలని నాకు అనిపించిన విషయాల లిస్ట్

౧) మనకు పిల్లలు పుడితే ఎవ్వరెంతకాలం సాకాలి, సాకినందుకు ఎవ్వరు ఎవ్వరికి ఎంత ఇవ్వాలి

౨) ఎవ్వరెవ్వరికి ఏ ఏ కార్లు ఉన్నాయి, వాటిని ఎవ్వరు తయ్యారు చేసారు, వాటి ఇన్‍స్యూరెన్స్ ఎంత

౩) సంవత్సరాంతంలో వచ్చే వెకేషన్ ఎక్కడ జరుపుకోవాలి మరియు ఎంత ఖర్చు పెట్టాలి

ఇవి కాకుండా నీకేమైన ఉంటే ముందుగా నాకు తెలియ జేయి, నేను కొంచం ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాను.
ఇక ఉంటాను

లవ్యా

ఇక మీ టైం మొదలైంది.. దేనికంటారా, స్పందనలకు.. ఆఖరుగా మరో విషయం మర్చిపోయ్యాను. ఇవ్వాళ 13th అందునా శుక్రవారం.. దీని వెనకాల మరో ఇస్టోరి.. అప్పటిదాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను.

పాత పాటలోని లిరిక్స్ – ప్రశ్నలకు సమాధానాలు

ఇంతక మ్రుందు వ్రాసిన పుటలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సమాధానాలు వ్రాయడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసానంటే.. దానికి పలు కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి ఈ పాత పాట మళ్ళీ నా చెవిన పడటం మొదటి కారణమైతే, ఇంతకు ముందు వ్రాసిన పుటకి ఎవ్వరూ స్పందించకపోవడం ఈ ఆలశ్యానికి మఱో కారణం. ఏది ఏమైనా ఈ సినిమా నేను పుట్టడానికి ఓ సంవత్సరం ముందు విడుదలైంది, అంటే 1971 లో అన్నమాట. ఈ సినిమాకి కేవీ మహదేవన్ సంగీతాన్ని అందిస్తే మల్లికార్జున్ దర్శకత్వ భాద్య్తతలను స్వీకరించారు. నట శేఖర కృష్ణ మరియు భారతి అలాగే జయసుధ ముఖ్య పాత్రలలో నటించింన అందరికీ మొనగాడు సినిమాలోని "ఆడగనా మాననా అమ్మాయి.." పాటలోని చరణాలే ఇంతకు మ్రుందు వ్రాసిన పుటలో ప్రశ్నలకు మూలం.

ఇదిగో ఇక ఆలశ్యం చెయ్యకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా..

౧) మగవాడు చేసేది అల్లరి .. వగలాడి విరిసేది మురిసేది రాగ వల్లరి..

౨) మగవాడు తలచేది కమ్మని కైపు.. జవరాలు మఱువనిది ప్రియతమ రూపు..

౩) మగవాడు కోరేది ఆనందం.. ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబందం..

౪) ..

నాల్గొవ ప్రశ్నకు సమాధానం నేను వ్రాయను. మీకు తెలుసుకోవాలనిపిస్తే ఎక్కడైనా ఈ పాటని పట్టుకోండి లేదా నన్ను సంప్రతించండి. ఈ పాటను నేను మీకు పంపుతాను, అది విన్న తరువాత మీకే అర్దం అవుతుంది ఆ నాల్గొవ ప్రశ్నకు సమాధానం

5, ఆగస్టు 2010, గురువారం

ద గివింగ్ ప్లడ్జ్ – సంపాదనను దానం చేస్తానన్న ప్రమాణం

page_header

ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వారిలో కొంతమంది అంటే ఓ లభైమంది తాము సంపాదించిన దానిలో వీరి ఆస్తిలోని దాదాపు అంతా సమాజ సేవకు దానం చేస్తామని ప్రమాణం చేసారు. ఇలా ప్రమాణం చేసిన వీరి ఆస్తులు వీరు బ్రతికి ఉండగాగానీ తదనంతరం కానీ సమాజ సేవకు ఉపయోగ పడుతుందన్న మాట. వీరంతా వ్యాపారాలకు భిన్నంగా ఒకే గూటి క్రిందకు చేరి పాలు నీళ్ళుగా కలసి మెలిసి అందరం బాగుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని నేను ఏదో సొల్లు వేస్తున్నాననుకోకండి. వీలైతే ఓ సారి ఈ లంకెను దర్శించండి. మీకే అర్దం అవుతుంది. ఇలా ఈ గివింగ్ ప్లడ్జ్ లో పాలు పంచుకోవాలంటె మీకు ఉండవలసిన అర్హత అల్లా ఒక్కటే మీ ఆస్తి బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ ఉండటమే..

ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు. కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇది నిజం కాకపోతే.. ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే, వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని, ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు.

నా ఆలోచనలు నా అభిప్రాయాలను ప్రక్కన పెట్టి మనం కనుక ఆలోచించుకుంటే, హిల్టన్ హోటల్స్ అధిపతికూడా ఇలా తన సంపాదనలో ఎక్కువ శాతం సంపాదనని అవసరమైన వారికి ధారాదత్తం చేస్తానని ప్రమాణం చేసారు. ఇలా ఇక్కడ ఓ నలభై మంది ప్రమాణం చేస్తే, వీరందరిలో ఓ ముగ్గురి గురించి మాత్రమే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉంది. నాకు తెలిసిన ఆ ముగ్గురు ఎవ్వరంటే, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ మరియు వీరి భార్య ఒక్కరైతే, తన ఆస్తిలో 99% వాటాని మిలిండా గేట్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ పేర వ్రాసిన అపర దానశీలి వారెన్ బఫేట్ మరొక్కరు. ఆఖరుగా నేను అభిమానించే వ్యక్తి, ఆరకిల్ అధిపతి లారీ ఎలీసన్.

వీలైతే మీరు ఒకసారి చూడండి.

4, ఆగస్టు 2010, బుధవారం

అమెరికా వాళ్ళు ఇంత పిసినారోళ్ళనుకోలేదు..

అమెరికాలోని మనుష్యులు కూడా పిసినారోళ్ళే. వీళ్ళేం పెద్ద పుడ్డింగోళేంకాదు. వీళ్ళు మామూలు మన లాంటి సాదా సీదా వాళ్ళే కానీ మనలా బయటకి కనబడరు. దొంగలు.. ఇవాల్టి యు.ఎస్.టుడే వార్తలలో ఒకటి నిరుద్యోగం వారికి ప్రభుత్వం వారు ఇచ్చే జీవన్ భృతి గురించి. ఆ వార్త శీర్షిక ఈ విధంగా ఉంది, నిరుద్యోగం మరియు ఉపాధి బెనిఫిట్స్ స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ నేను తెలుగులోకి సరిగ్గా తర్జుమా చెయ్యలేకపోతే ఈ వార్తని ఈ లంకెలో చదువుకోండి. అఖరి గణనాంకాల ప్రకారం అమెరికాలోని నిరుద్యోగుల శాతం దాదాపు ౯.౫ (9.5%). అంతే కాకుండా ప్రతీ నిరుద్యోగికి ప్రబ్యుత్వం తరుఫున అందే మొత్తం  సగటున ౧,౫౪౬$లు (1,546$). దీనిని బట్టి మీకు అర్దం అయ్యిందేమిటి, ఇక్కడ నిరుద్యోగికి భత్యం వీరి నిత్య జీవనానికి సరిపోయే అంత దానికన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అలస్కా అనే రాస్ట్రంలో అయితే ఈ సంఖ్య మరీ ఎక్కువ దాదాపు మూడున్నర వేలకు పైగా. అన్నింటికన్నా అధమంగా ఫ్లోరిడా రాస్ట్రంలో పన్నిండున్నర వందల డాలర్లు నెలసరి వేతనంగా ఇచ్చారు. ఇవి జూన్ లెక్కలు. అస్సలు ఉద్యోగం లేని వ్యక్తికి ఇలా డబ్బులు ఇస్తే వాడెందుకు ఉద్యోగం చేస్తాడు? ఈ విషయం ప్రక్కన పెడితే.. ఇందుకు భిన్నంగా మూడు నాలుగు రోజుల క్రిందట ఓ వార్త చదివాను.. అది నన్ను విశ్మయానికి గురి చేసింది.

cashcowx ప్రస్తుత గణనాంకాల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో దాదాపుగా ఎనిమిదిన్నర వందల బిలియన్ల ధనం రొక్కంగా మూలుగుతోందట. ఇక్కడ రొక్కం అనే విషయాన్ని మీరు కాష్ అని చదువుకోండి. ఈ క్యాష్ నిలువలు ఇతిమిద్దంగా పెరిగి అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని కని విని ఎరుగని మొత్తాన్ని చేరుకున్నాయంట. ఇది ఒక రికార్డ్. ఈ మొత్తం ఎదుగుదల ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంట. అంటే ఇది ఇలాగే సాగితే, ఈ సంవత్సరాంతానికి అది దాదాపు వెయ్యి బిలియన్ల మొత్తానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ళ క్రిందట మొదలైన బ్యాంకుల మూతల నష్టాన్ని అమెరికా ప్రపంచం మొత్తానికి చూపించి సానుభూతిని కొట్టేసిందే, మరి ఇక్కడ పేరుకు పోతున్న నిధుల విషయమేమిటో. అది సరే గాని ఈ ఎనిమిదిన్నర బిలియన్ల్ మొత్తం ఏ మేరకు సరిపోతుందో తెలుసా.. దాదాపు రెండున్నర మిలియన్ల మందికి సంవత్సరానికి డెభ్భైవేల జీతంతో ఐదు సంవత్సరాల పాటు ఉపాధికి సరి సమానం. అంటే ఐదేళ్ళపాటు దాదాపు పాతిక లక్షల మందికి అవసరానికన్నా మించి మూడొంతులకు సరి సమానంగా ఆర్ధిక స్థితి ఉందన్నమాట, అంతే కాకుండా వీరు సంపాదించేదానిలో మూడో వంతు మళ్ళీ టాక్సులనో తొక్కనో లేకపోతే గాదిడ గుడ్డనో ప్రభుత్వం తీసుకుంటుందికదా. సంపాదించిన ప్రతీవాడు ఏదో విధంగా ఖర్చు చేస్తాడు కదా.. ఈ విధంగా వ్యాపారాల్లు పునఃరుద్దరణకు నోచుకుంటాయి కదా.. ఒక వేళ వీడు ఖర్చు పెట్ట లేదనుకోండి, మిగిలిన డబ్బులను బ్యాంకులోనే కదా దాచుకునేది. ఆవిధంగా నైనా డబ్బు మళ్ళీ బ్యాంకుల్లోనే కదా చేరేది. ఇలా ఎలా చూసుకున్నా వీరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉండేది!! ఎప్పుడ్? పైన ఉదహరించిన నాన్-ఫైనాషియల్ సంస్థలలో నిల్వలుగా పేరుకుంటున్న నికర ధనం గనుక ఉపాధికి ఉపయోగిస్తే.

పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు? వీటన్నింటి వెనుక మరో రహస్యం. నాన్-ఫైనాన్షియల్ సంస్థలలోనే ఇంత మొత్తం మూలుగుతుంటే, మరి ఫైనాన్షియల్ సంస్థల పరిస్థితేమిటంటా!! వీటి గురించి మరో సారి మనం విశ్లేషించుకుందాం. అంత వరకూ బై..

3, ఆగస్టు 2010, మంగళవారం

అమెరికాలో నేను చేసిన మొదటి సాహసం

 

DSCN1095 అమెరికాని దర్శించడం నేను ఇది రెండవసారి. మొదటి సారి వచ్చినప్పుడు పెద్దగా ఏమీ చూడలేదు సరికదా ఎక్కువగా ఎక్స్ ప్లోర్ చేసింది లేదు. కాని అందుకు భిన్నంగా ఈ సారి ఎన్నో సాహస ప్రయత్నాలు చేస్తున్నాను. వాటిల్లో మొదటిది వచ్చీ రాగానే న్యూయార్క్ నగరాన్ని చుట్టేయ్యడం. దీని గురించి ఒక్క సారి క్లుప్తంగా కాకపోయినా కొంచం తక్కువ వివరంగా..

నా ఫ్లైట్ భాగ్యనగరం నుంచి దుబాయికి మొదటి అంగలో చేరుకుంటే, రెండవ అంగ దుబాయి నుంచి న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయానికి, ఆ తరువాత అక్కడినుంచి ఫిలడెల్‍ఫియాకు మూడవ అంగలో విమాన యానం. ఫిలడెల్‍ఫియా నుంచి రెడింగ్ నగరానికి కారులో ప్రయాణం అన్నమాట. ఇదిగో ఇక్కడే నేను చేసిన మొదటి సాహసం. న్యూయార్క్ ఏయిర్ పోర్టులో దిగిన తరువాత ఇక్కడి సహోద్యోగులకు ఫోన్ చేసి నేను క్షేమంగా చేరుకున్నాను ఇక్కడ నాకు ఓ అయిదు గంటల సమయం ఖాళీ దొరికింది, కనుక ఏమి చెయ్యమంటారు అని అడిగాను. ఏమీ చెయ్యొద్దు, చక్కగా అక్కడ లాంజ్‍లో నిద్దరో అన్నారు. ఉన్న అయిదు గంటల్లో ఓ గంట మళ్ళీ సెక్యూరిటీ చెకిన్.. గాడిద గుడ్డు .. గోంగుర పాసు ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కడో ఓ జాగా చూసుకుని ఓ మూడు గంటలు కళ్ళు మూసుకుని కునుకు తీయ్యు అని ఓ చెత్త సలహా ఇచ్చారు.

అది కాదురా ఎలాగో న్యూయార్క్ ఏయిర్ పోర్టులో ఉన్నాగా అలా ఓ రౌండ్ వేసి వస్తా అన్నా, ఎవ్వడి కాడు నన్ను భయపెట్టినోళ్ళే గాని, భలే !! మంచి ఆలోచన జాగ్రత్తగా పోయి చూసి క్షేమంగా తిరిగిరా అన్న వెధవలేడు. అలాంటప్పుడేకదా నేను సాహసం చేసేది. ఇంకేం, లగేజీ చెకిన్ చేసేసి కెన్నెడి విమానాశ్రయం నుంచి మాన్‍హట్టన్ నగరానికి ఎయిర్ ట్రైన్ ఉంటే అది పట్టుకుని జాం అంటూ బయలు దేరాను, అక్క్డడకు వెళ్ళంగానే నాకోసమే అన్నట్టు లోకల్ ట్రిప్స్ తిప్పే బస్సు వాడు వేచి ఉన్నాడు. వాడి మొహాన ఓ నలభై నాలుగు డాలర్లు కొట్టి ఇక ఫో అన్నా. వాడు వెంటనే ఓ తాడి చెట్టంత చిట్టా చించి నా మొహాన విసిరి నా పనైపోయిందన్నట్టు చూసాడు. ఇంతకీ ఇది ఏమిటిరా అబ్బాయి అని అడగ్గానే, ఓ వింత మనిషిని చూసినట్టు ఓ లుక్కేసి, దీనిని రిసీట్ అంటారు, నువ్వు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా నిన్ను ఎవ్వరూ అడగరు. నిన్ను న్యూయార్క్ నగరం మొత్తం చుట్టాలంటే, మూడు దారులు గుండా నిన్ను తిప్పాలి కాబట్టి ఒక్కొ మార్గంలో తిరిగే బస్సు వాళ్ళు ఒక్కొక్క బిల్లు తీసుకుంటారు అంటూ విసుక్కున్నాడు

DSCN1117 విసుక్కుంటే విసుక్కున్నాడు వివరం చెప్పాడు అనుకుని ఎదురుగా కనబడ్డ డబల్ డక్కర్ బస్సెక్కి మన బొమ్మరిల్లు సినిమాలో వీరోయిన్ కూర్చున్నట్టు బస్సు టాప్ ఎక్కి అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్న రెండు సీట్లను ఆక్రమించేసా. ఇంతలో మరో తెల్ల తోలు వచ్చి నీ ప్రక్కన చోటుందా అని అడిగితే, మొహమాటం లేకుండా అదిగో ప్రక్కన ఉన్న మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ సద్దుకో అని ఓ సలహా పడేశా.. హీ హీ.. అదిగో అలా బయలు దేరిన న్యూయార్క్ ప్రయాణంలో అక్కడి చారిత్రక కట్టడాలను చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోలు తీసుకుంటూ గడిపేశా. అక్కడ నేను చూసిన కొన్ని చారిత్రాత్మక స్థలాలలో మొదటిది.. టైటానిక్ ఓడని ఉపయోగించిన వ్యాపార సంస్థ భవనం. ఆ తరువాత ఎంపైర్ స్టేట్ భవనం.. అటుపై గ్రౌండ్ జీరో మరియు దానికి ప్రక్కనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి, దూరం నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టి, న్యూయార్క్ బ్రిడ్జ్, చైనా టౌన్ మొదలగు ప్రదేశాలు చూస్తుంటే పుణ్యకాలం ఎలా గడిచిపోయిందో తెలియదు.

న్యూయార్క్ లో నా ఫ్లైట్ మూడు గంటలకు తీరా చూద్దును కదా అప్పటికే రెండయ్యింది. ఇంకే మరొసారి సాహసం. గబగబా దగ్గర్లోని సబ్‍స్టేషన్ పట్టుకుని, అక్కడి నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం. ఇది దాదాపు ఓ నలబై నిమిషాలు. తీరా అక్కడికి చేరుకున్న తరువాత తెలిసిన విషయమేమిటంటే సెక్యూరిటీ చెకిన్ మూసేశారని. అక్కడి కౌంటర్ క్లర్క్ ఆ రోజున ఎవ్వరితోనో గొడవ పడ్డట్టున్నాడు అందువల్ల ఏ మాత్రం నాగోడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని, కొంచం టోన్ మార్చి గంభీరంగా అడిగా, ఎప్పుడైతే గొంతుకులో సౌండు మారిందో వెధవ దారికొచ్చాడు. బోర్డింగ్ టికెట్ ఇస్తా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆలశ్యం చేస్తే దానికి నాది కాదు పూచీ అన్నాడు. ఏదో ఒకటి ముందు చెయ్యిరా మగడా అని వాడినుంచి బోర్డింగ్ టికెట్ తీసుకుని సెక్యూరిటీ చెకిన్ చేసే క్యూలోకి దూరాను. అక్కడ మరో చాంతాడంత క్యూ ఉంది. ఎలాగరా అనుకుంటూ దిక్కులు చూస్తుంటే అక్కడి సెక్యూరిటీ వాళ్ళకు నాపైన అనుమానం కలిగింది.

వెంటనే ఓ ఆఫీసర్ నన్ను ప్రక్కకి పిలిచి విషయమేమిటన్నాడు. ఇదీ సంగతి అక్కడ నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకొన్ని నిమిషాలలో ఎగర బోతున్నది ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నా. విషయం అర్దం చేసుకున్న ఆఫీసర్ ముందుగా క్షమాపణలు అడిగి ఆతరువాత అక్కడ ఉన్న మరో ఆఫీసర్‍తో ఏదో మాట్లాడి ఆ క్యూలోంచి ప్రక్క దారిలో చెక్కింగ్ చేయించే ప్రయత్నం చేసాడు. హమ్మయ అనుకునేంతలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఆఖరుగా చెక్కింగ్ చేసే అధికారికి నాపై లేని పోని అనుమానం కలిగింది. నన్ను తీసుకొచ్చిన ఆఫీసర్ నాకెలా తెలుసు, నన్ను ఎందుకు ప్రక్కదారిలో ఇక్కడకు తెచ్చాడు, వంటి వంకర టింకర ప్రశ్నలు వేస్తుంటే.. ఇందాక టికెట్ దగ్గర వాయిస్ పెంచితే పనైన విషయం గుర్తుకు వచ్చి మెల్లగా నా వాయిస్ స్థాయిని పెంచి సమాధానాలిస్తూ, ఒక వేళ నేను ఫ్లైట్ మిస్ అయితే నువ్వే మరో ఫ్లైట్లో నన్ను పంపించాల్సొస్తుంది అని క్లూ ఇచ్చాను. ఈ విషయం తెలియంగానే ముందుగా కంట్ర్లోల్ రూమ్‍కి ఫోన్లో నా విషయాన్ని చేరవేసి మా ఫ్లైట్ కొంత సేపు ఆపించాడు.

విషయం తెలియంగానే హమ్మయ్య అనుకున్నా. ఇక నీ ఇష్టం ఎన్ని ప్రశ్నలు కావాలో అన్ని ఏసుకోరా అంటూ ఎదురు తిరిగాను. అప్పుడు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం దాదాపు ఓ అరవై నిమిషాలు సాగింది. వాడికి కాలక్షేపం నాకు అదో ఆటవిడుపు. ఈ ప్రశ్నోత్తరాలలో నా బ్యాగ్‍లో ఉన్న టూత్ పేస్ట్ కూడా పాలు పంచుకుంది. దాని అలా టాయిలెట్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్ళకూడదంట. దానికి మరో ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు పట్టుకెళ్ళాలంట. వీటికి తోడు మా అమ్మ చేసిచ్చిన గారెలు మరియు దిబ్బరొట్టెలు. ఇవేంటన్నాడు. వీటిల్ని దిబ్బరొట్టేలంటారు వీటిల్ని ఆవకాయతో తింటాం అంటే ఏదీ ఇప్పుడు తిని చూపించమన్నాడు. ఒరేయ్ ఇవి నాకు రాత్రికిరా అంటే వినడే. అప్పటికప్పుడు తినమంటాడు. సరే అని ఓ సగం తిన్న తరువాత అంతా నువ్వే తింటావా అన్న లుక్కు వాడి మొహంలో కనబడగానే ఓ సగం వాడికి ఆఫర్ చెసా. ఆకలి మీద ఉన్నపులి మాంశం కనబడగానే ఎలా ఎగ్గిరి దూకుతుందో అలా వీడు నా దిబ్బరొట్టిపైకి దాడి చేశాడు.

ఎప్పుడైతే వీడు మనదారిలోకి వచ్చాడో అని తెలియంగానే ఇక మా ఇద్దరి మధ్య వాయిస్ సౌండ్‍లో స్థాయి తగ్గి సిఖరాగ్రావేశ సమావేసపు చర్చలు సజావుగా సాగినాయి. అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇకపో అన్నాడు. ఏడికి పోయేది నువ్వురా నాతోటి లేకపోతే ఆ ఫ్లైట్ వాళ్ళు నన్ను తిడతారు అన్నా. సరే అలాగే కానీయ్ అంటూ నా వెనకాలే మా బోర్డింగ్ కౌంటర్ దాకా వచ్చి దింపి పోయ్యాడు. అలా ఉన్న అయిదు గంటల్లో ఓ సారి న్యూయార్క్ నగరాన్ని చుట్టి రావడమే కాకుండా సెక్యూరిటీ వాళ్ళకు ఆంద్రా దిబ్బరొట్టెలను ఆవకాయను రుచి చూపించాను.

ఈ వీకెండ్లో మరో సాహస యాత్ర విషయమై మళ్ళీ మీముందుంటాను, అప్పటి దాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూఉంటా..

2, ఆగస్టు 2010, సోమవారం

పాత పాటలోని లిరిక్స్ - ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలు ఓ పాత పాటలోనివి.. కొంచం ద్వందర్దాలుగా ఉంటాయి కానీ బాగున్నాయి. వీలైతే మీరు ప్రయత్నించండి. వీటికి సమాధానాలు మరో పుటలో.. అప్పుటిదాకా ప్రశ్నలు మాత్రమే. చదివే వాళ్ళు ఏ విధింగా స్పందింస్తారో చూద్దాం.

 

౧) మొగవాడు చేసేది ఏమిటి? వగలాడి మురిసేది ఏమిటి?

౨) మొగవాడు తలచేది ఏమిటి? జవరాలు మరువనిది ఏమిటి?

౩) మొగవాడు కోరేది ఏమిటి? ప్రియురాలు ఇచ్చేది ఏమిటి?

౪) మొగవాడు అడిగేది ఏమిటి? ప్రాణసఖి ఇచ్చేది ఏమిటి?

 

ఈ పాటలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే నాయికని ఎన్ని విధాలుగా వర్ణించారో బాగుంది కానీ నచ్చని విశయమేమిటంటే అన్ని సార్లు మగవాడు అంటూ వర్ణించడం. ఏది ఏమైనా వీటి వర్ణనలు ప్రక్కన పెడితే, పాటలోని చరణాలు వాటిల్లోని పద ప్రయోగం మాత్రం బాగుంది.

నిజం వ్రాయాలంటే ఈ పాట వింటున్నప్పుడు అన్ని సార్లు ద్వందార్ద సమాధానాలు మదిలో తలచాయి, కానీ సున్నితంగా వీటికి నాయిక సమాధానం ఇవ్వటం బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది?

 
Clicky Web Analytics