22, మే 2008, గురువారం

బత్తీ బంద్.. ఎందుకు చెయ్యాలా?? నేను చెయ్య..

ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ విషయమై చాలా మంది చాలా విధాలుగా ప్రచారాలు చేస్తుంటే.. నా వంతు కర్తవ్యంగా నాకు తెలిసిన నాకు పరిచయమున్న వారికి ఈ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నించా. ఆ ప్రయత్నంలో నాకు ఎదురైన అనుభావల సంపుటి ఈ పుటకి మూల కధ.


పాత్రలు పాత్రధారులు : అస్మదీయుడు ఎలాగో ఉంటాకాబట్టి ప్రతీ సారి నేను ఉన్నానని కొత్తగా చెప్పనక్కరలేదు.

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఒక సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: నేనెందుకు ఒక గంట ఆర్పాలండీ. అదేదో బిల్లులు కట్టేవారు ఆపితే ఎదో పొదుపు క్రింద బిల్లు తగ్గుతుంది
అస్మదీయుడు: మరి మీకు కూడా ప్రొడక్షన్ తలకాయ నొప్పి తగ్గుతుంది కదా
విపఉ: ప్రొడక్షనా .. గాడిద గుడ్డా.. నేనెక్కడ చేస్తున్నా.. ఎదో వర్షాలు పడుతున్నాయి .. అక్కడెక్కడో మా వాళ్ళు కష్ట పడ్డట్టు చెబుతున్నారే.. నీళ్ళుంటే దానంతట అదే ప్రొడ్యూస్ అవుతుంది
అస్మదీయుడు: ఒకవేళ నీళ్ళు లేకపోతే ప్రభుత్వం మిమ్మల్నే కదా దుమ్మెత్తి పోసేది?
విపఉ:ఎవ్వడు పట్టించు కుంటాడు చెప్పండి..
అస్మదీయుడు:మరి విధ్యుత్ తక్కువైంది అని ప్రభుత్వం మిమీద మండి పడితెనో..
విపఉ: ఏముంది .. తక్కువైంది అనేస్తాం.. ప్రక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటే సరి..
అస్మదీయుడు:మరి అప్పుడు ప్రభుత్వం మీకు కేటాయించిన అర్దిక బడ్జట్‍లో సొమ్ములు లేకపోతేనో..
విపఉ: ఏముంది, ప్రభుత్వమే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తీసిస్తుంది
అస్మదీయుడు: మరి దానికెక్కడినుంచి వస్తుంది..?
విపఉ: ఇంకెక్కడి నుంచి .. బిల్లులు కట్టే వాళ్ళనుంచి .. అంతే గానీ నానుంచి కాదుగా.. అయినా మీ పిచ్చి గానీయ్యండీ దీనిలో మనకి ఒరిగేదేముంది.. గంట బొక్క తప్ప

----------------
ముఖ్యపాత్రధారి: విధ్యుత్ సంస్థలో పనిచేస్తున్న మరో సదురు ఉధ్యోగి - విపఉ

విపఉ: చూడండీ మీరు వాడుకున్నా వాడుకోక పోయినా పెద్ద ఫరక్ పడదు సార్
అస్మదీయుడు: ఎలా అంటారు?
విపఉ: ఇప్పుడు మీరు వాడినా వాడక పోయినా మీ 3 phase కనక్షనుకు మీరు కడుతున్న బిల్లు ద్వారా మీకు అవుతున్న బిల్లు మొత్తం దాదాపు రెండు వందల యాభై రూపాయలవుతుంది
అస్మదీయుడు: అంటే దాదాపుగా వాడినా వాడకపోయినా నేనూ అంతే కట్టాలంటారా..
విపఉ: కదా.. అందుకని నేను చెప్పేదేమిటంటే.. బత్తీ బంద్ .. ప్రిజ్జు బంద్ .. అంటూ గోల చెయ్యకుండా ..
అస్మదీయుడు: మరి మనకే ఉపయోగ పడుతుందంటున్నారు కదా..
విపఉ: ఎవ్వరది అనేది.. మా డిపార్టుమెంటు వాళ్ళు చెప్పి కొన్ని గంటలు .. చెప్పకుండా కొన్ని గంటలు కోత విధించడం లేదా..
అస్మదీయుడు: ఇది అసమంజసం కదా..
విపఉ: మీరు ఎంత చెప్పండి, ఓ గంట బత్తీ బంద్ జేసి ఏమి జెయ్యాలంటా..
అస్మదీయుడు: చక్కగా మీ కుటుంబ సభ్యులంతా ఒక్క చోట జేరి ఏదైనా చెయ్యవచ్చుగదా..
విపఉ: అదేగదా నేను జెబుతుండా.. ఓ గంట బత్తీ బంద్ జేస్తే ఏమొస్తదీ .. బొచ్చు ఓ గొంట సీరియల్ బొక్క.. మళ్ళీ ఈ రోజేమైందో అని రేపటి వరకూ ఎదురు జూడాల..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: నాకెందుకు చెబుతున్నారు .. నేనేమైనా తేరగా దొరికానా.. అప్పుడే కదా చక్కగా వంట వండుకునేది.. అలాంటప్పుడు బత్తీ బంద్ అంటే ఎలా?
అస్మదీయుడు: ఆ ఒక్క రోజు వంటేదో ముందుగా చేసుకోవచ్చుగా..
గృహిణి: మా ఆయన వంట వేడిగా లేకపోతే తినరు.. తరువాత నేనే తినాలి.. మరునాడు కూడా చద్దన్నం ఎవ్వరు తింటారు?
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: ఏమిటండి అదికాదు.. ఇది కాదంటారు.. చద్దన్నం మీరు తింటారా.. మా ఆయన సంగతి మీకు తెలియదు..
అస్మదీయుడు: ఇది మీ ఇద్దరి మధ్య జరిగే విషయం కాదు.. అందరికీ సంభందించిన ..
గృహిణి: మా ఆయన నన్ను తిడుతూ ఉంటే.. మీరు చెప్పే ఈ అందరూ వస్తారా.. ఆయన చేత చీవాట్లు ఎవ్వరు తింటారు? పోనీ ఎవ్వరో ఎందుకు నువ్వు తింటావా..
అస్మదీయుడు: అది కాదండి .. (ఎదో చెప్పబోయేటంతలో..)
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. మీ మగాళ్ళంతా ఇంతే... ఒక్కడొచ్చి బత్తీ బంద్ అంటాడు.. మరొకడొచ్చి ఎందుకు బంద్ జేసావ్ అంటూ నా తాటవలుస్తాడు.. నీకు పుణ్య ముంటాది.. మరేదన్నా జెప్పు బిడ్డా..
అస్మదీయుడు: ఇంకే చెబ్తా..

----------------
ముఖ్యపాత్రధారి: గృహిణి

గృహిణి: దానివల్ల వచ్చే ఉపయోగమేమిటి?
అస్మదీయుడు: (హమ్మయ్య.. చాలా కాలంగా ఎవ్వరూ అడగని ప్రశ్న అడిగింది అనుకుంటూ మొదలు పెట్టా..) భూగోళం చుట్టూ..
గృహిణి: భూగోళం చుట్టూ సరేగానీ.. నాకు ఏవిధంగా ఉపయోగమో చెప్పు బాసూ
అస్మదీయుడు: అది కాదండి
గృహిణి: నేను అనేది అదే.. అదికాదు.. ఇది కాదనకుండా .. అస్సలు విషయానికిరా..
అస్మదీయుడు: అంటే.. ఇలా ఒక గంట సేపు బత్తీ బంద్ జేస్తే మన వాతావరణానికి ..
గృహిణి: మళ్ళీ వాతావరణం గీతావరణం అంటావు .. మన గురించి చెప్పు బాసూ..
అస్మదీయుడు: (ఎదో చెప్పబోయేటంతలో..) ..
గృహిణి: చాల్ చాల్లేవయ్య .. చెప్పొచ్చావు. దాని వల్ల లాభం లేదు గానీ .. దానివల్ల జరిగే నష్టాలే చాలా ఉన్నాయి .. నీకు తెల్సా..
అస్మదీయుడు: నష్టాలా..
గృహిణి: అవును బాసూ..
అస్మదీయుడు: ఏమిటో..
గృహిణి: నేను చేసుకునే వంటలూ అవీ బాగా కుదిరినా .. లేక మిగిలిపోయినా చక్కగా తీసుకెళ్ళి ప్రిజ్‍లో పెట్టేస్తా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అలాగే వారానికి సరిపోయే కూరగాయలన్నీ ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: అట్లాంటిది.. ఓ గంట బత్తీ బంద్ అంటే.. ప్రిజ్‍లో పెట్టిన కూరగాయలన్నీ కుళ్ళిపోవా.. నిన్న వండిన పులుసు పరిస్థితేమిటి?
అస్మదీయుడు: ఆ..
గృహిణి: అవన్నీ చెడిపోతే మళ్ళీ తెచ్చుకోవాలా..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇవి కాకుండా.. పాలు కూడా ప్రిజ్‍లోనే కదా ఉండేది..
అస్మదీయుడు: ఉ..
గృహిణి: ఇన్ని వస్థువులు చెడిపోతా ఉంటే.. బత్తీ బంద్ చెయ్యమంటావా.. నీకు కావాలంటే మీ ఇంట్లో జేసుకో .. అంతే గానీ ఊరికే ఇలాంటి సలహాలు ఇవ్వమాక...
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: వ్యాపారి

వ్యాపారి: దానివల్ల మా కస్టమర్లు ఆ గంట సేపు రావడం మానేస్తారు ..
అస్మదీయుడు: అదికాదండీ..
వ్యాపారి: చూడు నాయనా నీ సలహా వల్ల నాకు లాభం రాక పోయినా ఫరవాలేదు గానీ ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టమాకు .. నీకో దణ్ణం .. (ఇంక ఇక్కడినుంచి ఫో.. అని చెప్పకనే చెప్పాడు
అస్మదీయుడు: అదికాదండీ.. (ఇంకా ఎదో చెప్పి ఒప్పిద్దాం అనే ప్రయత్నంగా..)
వ్యాపారి: ఏమయ్యా.. ఆ గంట బిజినస్ వల్ల వచ్చే నష్టం నువ్వు భరిస్తావా..
అస్మదీయుడు: మరండీ..
వ్యాపారి: పనిచూసుకో ..
అస్మదీయుడు: ఆ..

----------------
ముఖ్యపాత్రధారి: తెలుగు దేశం కార్యకర్త - తెదేకా

తెదేకా: ఒక గంట ఎందుకు సారు.. మొన్న మా బాబు గారు చెప్పినట్లు..
అస్మదీయుడు: బాబుగారు ఈ విషయం గురించి చెప్పారా.. ఎమన్నారబా..
తెదేకా: అబ్బే .. బాబుగారు ఈ విషయంపై ఏమీ చెప్పలా.. రైతన్నలను తీసుకున్న బాకీల్లో దేనికీ తిరిగి కట్టద్దొన్నారుగా..
అస్మదీయుడు: అయితే..
తెదేకా: వారేమో తీసుకున్న రుణాలు కట్టొద్దన్నారుగా.. అలాగే... ఇది కూడా.. పూర్తిగా ఎగ్గొట్టేస్తే పోలా..
అస్మదీయుడు: అప్పుడు అసలుకే ఎసరొస్తుందిగా.. ఉన్న కరంటు కనక్షను పీకేస్తుంది కదా ప్రభుత్వం..
తెదేకా: దొంగ కనక్షన్ ఉండనే ఉందిగా..
అస్మదీయుడు: ప్రభుత్వం మీ మీద దొంగ కనక్షన్ కేసులు పెడితే..
తెదేకా: అప్పుడు మా బాబుగారున్నారుగా... తిరిగి.. ప్రభుత్వం పైనే కేసులు వెస్తారుగా..
అస్మదీయుడు: ఎలా..
తెదేకా: అధికార ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రతి పక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారని...
అస్మదీయుడు: (ఏమిటిది .. ఎక్కడ మొదలైంది .. ఎటు పోతోంది .. అని తలస్తూ .. ఇంక లాభంలేదని విరమించుకున్నా..) ..

----------------
ముఖ్యపాత్రధారి: కాంగ్రెశ్ కార్యకర్త - కాకా

కాకా: ఏం మాట్లాడుతున్నావు? నీకే మైనా అర్దం అవుతోందా..
అస్మదీయుడు: ఏం బాబూ.. ఎదో ప్రపంచం అంతా..
కాకా: ప్రపంచం అంటావు.. బొత్తిగా నీకు లోక ఙ్ఞానం లేకుండా పోతోంది
అస్మదీయుడు: నాకా..
కాకా: నీకు కాక పోతే .. నాకా మరి..
అస్మదీయుడు: ఏందుకంటారు..
కాకా: మరేమో మా పెద్దాయన చక్కగా ఉచితంగా ఇస్తా ఉంటే.. నువ్వేంది.. ప్రతి పక్షం వాళ్ళు చెప్పినట్లు .. వాగుతున్నావు..
అస్మదీయుడు: అదికాదు.. (ఎదో అనబోతుంటే..)
కాకా: ఏందీ ప్రతి పక్షం వాళ్ళదగ్గర ఎదైనా తీసుకున్నావా..
అస్మదీయుడు: నేనా ..
కాకా: ఫరవాలేదులే.. ఎంత తీసుకున్నావో చెప్పు .. నాకు ఎంతిస్తావో చెప్పు.. దీని గురించి నేనెవ్వరికీ చెప్పను..
అస్మదీయుడు: ..
కాకా: పెద్దాయనతో నేను మాట్లాడతా.. నువ్వెమీ వర్రీ గాకు..
అస్మదీయుడు: మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్దం కావటంలేదండి..
కాకా: ఒరేయి .. వీడ్నెవడురా లోపలికి పంపించింది..
అస్మదీయుడు: ..

----------------

ఇలా చాలా చాలా అనుభవాలు .. ఎన్నెని చెప్పను నా వెతలు .. సూక్ష్మంగా అందరూ బత్తీ బంద్‍కి వ్యతిరేకులే కానీ .. మన వంతు కర్తవ్యంగా ఎదో ఒకటి చెద్దాం అని అనుకోని పరిస్థితి చూస్తుంటే..

రాజుగారి పెళ్ళికి నావంతు భాగంగా గిన్నెడు నీళ్ళైతే ఎం పోతుందిలే..

అని అందరూ అనుకున్న వైనం గుర్తుకు వస్తోంది. చదివే చదవరులూ మరి మీరు వచ్చేనెల 15వ తారీఖున బత్తీ బంద్ పాటిస్తున్నారా..

మీ విలువైన స్పందనలకై ఎదురుచూస్తున్న

భవదీయుడు.

-------------------------------------------
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ! వినురవేమ!

16, మే 2008, శుక్రవారం

మహిళలూ .. నా దృష్టిలో వీరు మనుష్యులు

నా మొదటి పుట నుంచి నేటి పుటకి ఒకే ఒక దారం.. ’మగాళ్ళంతా ఒక్కటే టైపు..’ అన్న ఆలోచనే. మొదటి పుటలో అస్సలు ఈ ప్రచురణల వెనుక ఆంతర్యమేమిటి అనేది మూల విషయమయితే, రెండవ భాగం వెనకాల ముఖ్య ఉద్దేశ్యం మగాళ్ళలో ఎన్ని భావనలు ఉంటాయూ అని తెలియ జేయడమే. మంచి చేడులు అన్ని చోట్ల ఉంటాయి. ’భాభా’లు అన్ని చోట్లా ఉంటారు. ఎవ్వరీ ’భాభా’లు అని అనుకుంటున్నారా.. ’భార్యా భాధితులు'. కానీ వాళ్ళని వెలుగులోకి తెచ్చే కన్నా భర్తల భాధితులనే ఈ సంఘం వెలుగు లోనికి తేవడం వల్ల, ఇలాంటి వార్తలు ఎక్కువ మంది ఆడవాళ్ళు చదవడం వల్ల.. ’మగాళ్ళు అంతా ఇలాగే ఉంటారేమో..’ అని జనరలైజ్ చేసేసి అందరినీ ఒకే తాటికి కట్టేసి మాట్లాడెస్తుంటారు.

రెండవ పుటలో ఉదహరించిన వాళ్ళందరూ మగ వాళ్ళైతే.. అస్సలు మగవాడు అంటే ఎలా ఉండాలి అనే నా ఆలోచనకు ప్రతి రూపమే ఈ మూడవ పుట. చదివిన తరువాత తప్పని సరిగా మీ మీ అభిప్రాయాన్ని తెలియ జేస్తారని తలుస్తాను. ఈ పుటలో నేను మగవాళ్ళనే ఎందుకు ఎత్తి గొప్పగా చూపాలి అని కూడా ఆలోచించిన పిదప, అస్సలు భార్యా భర్తలు అంటే ఇలా ఉండాలి అని తెలియ జేస్తే ఎలా ఉంటుందో అని కూడా అలోచించాను. దాని ఫలితమే ఈ స్త్రీ పురుష సంగమం. తత్ విధంగా ఇద్దరూ జీవితం అనేటటువంటి కాడిని మోసే రెండెద్దులుగా మాత్రమే కాక, జీవిత పయనంలో సాగే సంసారం అనే రైలు బండికి ఆధరవుగా నిలిచే రైలు పట్టాల్లాంటి వారని, సమాంతరంగా సాగి పోయే తోడూ నీడ అని, పాలు నీళ్ళలాగా కలసి పోవాలని, తెలియజేసే ఎన్నో ఉదాహరణలు మన ముందే ఉన్నా.. వాటిలోంచి కొన్ని ఇక్కడ ..
వ్యక్తి: నారాయణ మూర్తి                              జీవిత భాగ స్వామి: సుధా మూర్తి

వివరణ:

ఒక భర్తగా, సుధా మూర్తికి పూర్తి స్వాతంత్ర్యాన్నిచారు. ఆవిడ ఎదుగుదలను చూసి కుళ్ళుకోకుండా తన వంతు కర్తవ్యంగా ఆమెను ప్రోత్సాహిస్తూ.. ఆమె ఎదుగడానికి ప్రయత్నంగా తన కంపెనీ నుంచి నిధులు కూడా సమకూరుస్తున్నారు. ఇక్కడ సుధా మూర్తిగారి గురించిన కొన్ని ముఖ్య విషయాలు మనం గమనించాలి. సుధా మూర్తిగారు M.Tech చదివారు. చదువుకునే రోజుల్లో ఆవిడ బంగారు పతకాన్ని కూడా పొందారు. టెల్కో వారి పూణే ప్రాంత కార్యాలయంలో ఉద్యోగం కూడా చేసారు. నారయణ మూర్తిగారు కూడా ఆరోజుల్లో పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ లో పూణేలోనే పనిచేసేవారు. ఆరోజుల్లో మొదలైన సాన్నిహిత్యమే అనుకోండి లెదా వీరిద్దరికి ఉన్న పుస్తక పఠనం అయితే కానివ్వండీ, ఇద్దరిని ఒక్కటి చేసాయి.

అంతే అనుకుంటే మనం చాలా విలువైన విషయాలు కోల్పోయామని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ ఈరోజు ఇలా ఉంది అంటే అది సుధామూర్తి గారిచ్చిన పదివేల రూపాయల పెట్టుబడే అని చెబితే నమ్ముతారా? అంతే కాకుండా, ఎన్నో ఆలోచనలతో తాను చెయ్యాలని తపన పడుతున్న భర్తని అర్దం చేసుకుని తాను దాచుకున్న డబ్బుని నారాయణ మూర్తిగారికిచ్చి, ’నీకు మూడేళ్ళు సమయం అలాగే పదివేలు ఇస్తున్నా!!! ఈ మూడేళ్ళు ఇంటిని నేను నడిపిస్తా, మీరు నిశ్చింతగా మీ ఆలోచనలకు ఒక రూపం తెచ్చుకోండి. కుదిరిందా అంతా మంచిదే, లేక పోతే ఆ తరువాత ఇంటి భాధ్యత యధావిధిగా ఇద్దరం భరిద్దాం..’ అంటూ ప్రోత్సాహ పరిచారే, ఎంతటి గొప్ప హృదయం ..

నారాయణ మూర్తిగారు కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. భార్యకి ప్రయాణాలు అంటే ఇష్టమని తెలిసి అమెరికా చుట్టి వచ్చే అవకాసం వచ్చిందని సుధామూర్తిగారు చెప్పగా, వెంటనే చక్కగా వెళ్ళిరా.. నీ ఇష్టా ఇష్టాల్ని నేను ఏనాడూ కాదనను అని పంపించడమే కాకుండా.. ప్రతి రోజూ ఆవిడ బస చేసే హోటల్ కి ఫోను చేస్తూ ఉండేవారు. ఏనాడైనా అర్దరాత్రి వరకూ ఆమె దగ్గరనుండి తన ఫోన్ కాల్‍కి స్పందన లేదనుకోండీ తబ్బిబ్బయ్యేవారు. ఇవన్నీ నేను చెబటం లేదు, గూగులమ్మని అడగండి అదే చెబుతుంది.

ఇంతకన్నా మించిన భార్యా భర్తలు.. నా దృష్టిలో వీరు అసలు సిసలైన ..

ఆడ మగ
వ్యక్తి: బోడపాటి వీర రాఘవులు                            జీవిత భాగ స్వామి: శుంకర పుణ్యవతి

వివరణ:

రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు, అలాగే వీరిద్దరి గురించి కూడా చాలా తక్కువే తెలుసు అని కూడా తెలియజేయాలి. కానీ తెలిసిన కొంచంలో వీరిరువురూ చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్నట్లు అర్దమవుతోంది. ఎలాగంటారా.. రాఘవులు స్వతహాగా చలాకీ మనిషి. వేర్వేరు దృవాలు ఆకర్షితులవుతాయి అనేటటువంటిది సైన్సయితే, వీరిరువురు ఎలా ఆకర్షితులయ్యారో ఏ సైన్టిష్టు చెప్పలేని, విప్పలేని ఒక సూత్రంగా మిగిలిపోతుంది. ఇద్దరూ అభ్యుధయ వాదులే. ఇద్దరూ సంఘ సంస్కారానికి పాటు పడెవారే. ఒకరిది రాజకీయవాదమయితే మరొకరిది మహిళా లోకం.

వీరే ఇలా అనుకుంటే, వీరి అమ్మాయి ఒక ముస్లిమ్ యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను అంటే, సమాజంలోని సదురు సామాన్య తల్లి తండ్రుల్లా అరచి గీపెట్టి గోలచేయ్య కుండా, వీరి పెళ్ళి దగ్గరుండి జరిపించారు. నిరాడంబరుడు, నిగర్వి, బి వి రాఘవులు తన కుమార్తె వివాహం విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇట్టి గొప్ప ఆలోచనా పరిధి ఎంత మందికి ఉంటుంది?

పెళ్ళి చేసుకోగానే భార్య ఇంటి పేరు మార్చుకోవాలి అన్నది మన తెలుగు వారి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా అని నేను చెప్పను కానీ, పుణ్యవతి గారి ఇంటి పేరు ఇంతవరకూ మార్చుకోక పోయినా ఎటువంటి రభసా చెయ్యకుండా, ఆవిడను ఒక స్వతంత్ర భావాలు కలిగిన పరిపూర్ణ మహిళగా గుర్తించి, ఆవిడను ఒత్తిడి చెయ్యకుండా తన అభీష్టం మేరకు స్వేశ్చ నిచ్చి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారే.. ఇంతకన్నా ఏమికావాలి వీరు కూడా ఒక చక్కటి కుటుంబం లెక్కలోకి చేర్చక పోవడానికి. ఒకరి నొకరు అర్దం చేసుకున్న మరో

మగ ఆడ
ఇంకా ఎందరో.. మరెందరో.. ఎన్నో ఎన్నెన్నో జీవితాలు మనకు కళ్ళకు కట్టి నట్లుగా మన ముందే తిరుగాడుతుంటే.. ఎందుకో ఇంకా ఆ అలోచనలు. మహిళలూ నిద్రలేవండి, మీరెంతో .. మీ శక్తి ఎంతో మీకు తెలియదు. మీరు ఎవ్వరితోనూ తక్కువకాదు, అలాగే ఎదో మిమ్మల్ని ములగ చెట్టెక్కించాం కదా అని మగవాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. వారూ మీతో సరి సమానమే. కాకపోతే, ప్రతీ నాణానికీ రెండు ముఖాలు ఉన్నట్లు, ప్రతి వ్యక్తిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. మనం దేన్ని చూస్తున్నాం అన్నదే మన వ్యక్తిత్వం అవుతుంది.

మగవాళ్ళలో చెడ్డ వాళ్ళున్నట్లే ఆడవాళ్ళలో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. మీకు వాళ్ళు కనబడక పోతే ఒక్క సారి మన ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఒక్క సారి గమనించండి. మీకే అర్దమవుతుంది. అంతకీ అర్దం కాకపోతే, నన్నడగండీ.. నేను చూపిస్తా మీకు అట్టి ’నారీ విలన్’లను. ముగింపులో చెప్పొచ్చేదేమిటంటే, ఏ విషయాన్నీ జనరలైజ్ చెయ్యకండీ. కొంచం అలోచించి statements ఇస్తూ ఉండండి.

ముక్తాయింపుగా, మరొక్క మాట,


మహిళలూ .. ఒక్క పిల్లల్ని కనడానికి పెట్టడానికి తప్ప.. మీరు మరే విషయంలోనూ మగవారిపై అధార పడకండి.

దేవుడు మగవాళకి ఇచ్చినట్లు మీకూ అన్నీ సరి సమానంగా ఇచ్చాడు. అంతే కాకుండా ఈ రోజుల్లో మగాళ్ళతో సరి సమానంగా పోటీ పడుతూ మా ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు. కొంచం కుళ్ళుగా ఉన్నా, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. అలా అలా ముందుకు సాగి పోతూ ఉండండి. ఏమాత్రం తగ్గద్దు. ఇంక గోతికాడ నక్కల్లాగా, చిత్తాకార్తె కుక్కల్లాగా మిమ్మల్ని ఎప్పుడు మింగేద్దామా అని ఎదురుచూసే మగాళ్ళు ఇదే సమాజంలో ఉన్నారు, అలాగే మహిళా జనోద్దారకులూ ఉన్నారు. కాబట్టి, అందరూ ఒక్కటి కాదని తలుస్తారని భావిస్తూ.. సెలవు

ఇట్లు
భవదీయుడు


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

14, మే 2008, బుధవారం

మహిళలూ - వీరే మగాళ్ళు : రెండవ భాగం

సమయం: అప్పుడెప్పుడో.. 2004    స్థలం: ఒక విధ్యాలయం, విజయవాడ
పాత్రలు పాత్రధారులు: ప్రేమ అని తలచే ఉన్మాది, అలియాస్ మనోహర్ మరియు పైశాచికానికి బలైపోయున కుసుమం శ్రీలక్ష్మీ

సందర్బం:

దేవాలయానికన్నా పవిత్రమైనటు వంటి ఒక విధ్యాలయంలో పరీక్షా సమయానికై ఎదురు చూస్తూ సన్నిహితులతో ముచ్చట్లాడు తున్న శ్రీలక్ష్మికి తాను మరికొన్ని నిమిషాలే బ్రతికి ఉండేదన్న విషయం తెలియదు. దేవాలయం కన్నా పవిత్రంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయం ప్రక్కన పెడితే, విధ్యార్దులను శారదా తనయులుగా తీర్చిదిద్ద వలసిన ఒక కళాశాల ప్రాంగణం లోకి కొబ్బరి బోండాలు తెగగొట్టే కత్తితో ప్రవేశించాడు మన విలన్.. క్షమించాలి మన ఒక్క మగాడు, మనోహర్. రెండో అంతస్తులో తన వంతు కోసం ఎదురు చూస్తున్న శ్రీలక్ష్మిని నిండు క్లాసు రూము మధ్యలో.. విధ్యార్దుల సమక్షంలో.. నిర్దాక్షిణ్యంగా.. కిరాతకంగా.. పైశాచికంగా.. నరికేశి ఏమీ పట్ట నట్లు చక్కగా చెన్నై చెక్కేసాడు.

వీడూ మగాడేసమయం: అటు తరువాత.. 2007 స్థలం: పునాదిపాడు ఊరి సరిహద్దు
పాత్రలూ పాత్రధారులు: అభం శుభం తెలియని కోనేరు నాగశ్రీ, పరువంలో ఉన్న స్నేహితులు శివ శంకర్, ప్రవీణ్ కుమార్, కిషోర్ బాబు

సందర్బం:

ఇది ఒక అన్నెం పున్నెం ఎరుగని పదవ తరగతి చదువుకునే బాలిక విషాధగాధ. స్నేహితునిగా భావించే శివ శంకర్ పిలుపుని కాదనలేక చెరువు గట్టుకు చేరుకుంది నాగశ్రీ. మెల్లగా తన స్నేహితులతో అక్కడకి చేరుకున్నాడు శంకర్. ఒంటరిగా ఉన్న నాగశ్రీని చూసిన ముగ్గురూ అదే అదునుగా భావించి, కలసి మానభంగం చేయ్యబోయ్యారు. విషయం అర్దం అయ్యి సహాయం కోసం అరచే లోపల ముగ్గురూ కలసి దాడి చేసి, అతి కౄరంగా సృహ కోల్పోయేలా కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు గుంతలో కప్పి పెట్టి పైన ఊపిరి కూడా ఆడకుండా చెత్త మరియూ గడ్డి వేసి కప్పి పాతేశారు.

వీళ్ళూ మగాళ్ళేసమయం : మొన్నీమధ్య 2008 స్థలం: విజయవాడ
పాత్రలూ పాత్రధారులు: మీనాకుమారి, ఆమె తల్లి తండ్రులు మరియూ మరో ప్రెమోన్మాది సందీప్

సందర్బం:

పెళ్ళికి నిరాకరించారన్న ఒకే ఒక కోపంతో మీనాకుమారి గొంతుకును ఆమె తల్లి తండ్రుల సమక్షంలో నిర్దాక్షిణ్యంగా చీల్చే ప్రయత్నంలో తనని తానూ గాయ పరచుకుని ఊచలు లెక్క పెడుతున్నాడు. గాయంతో మృత్యువుతో పోరాడి గెలిచిన మీనా కుమారి విధి మిగిల్చిన గాయాన్ని ఎలా గెలవగలదు?

వీడూ మగాడేసమయం: నిన్నగాక మొన్నీ మధ్య, 2008 స్థలం: బ్రిటన్
పాత్రలూ పాత్రధారులు: జ్యోతిర్మయి మరియు నాగరాజ్ కుమార్

సందర్బం:

ప్రేమ పేరుతో మరో విషాధం.

వీడూ మరో మగాడేసమయం: 2008 ఏప్రెల్ నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: నేను, నా అర్దాంగి, మా కూర గాయల సంచీ మరియూ మనందరికీ సుపరిచితులైన తొలి తెలుగు బ్లాగరి, చావా కిరణ్

సందర్బం:

నా శ్రీమతి చేతిలోని కూరగాయల సంచీని చూచి, ’ఏమిటీ ఇటు నుంచి ఇటుగా కూరగాయలకా..’అని చావా కిరణ్ గారు అన్నారు.’అవునండీ.. తొందరగా వీలైతే కూరగాయలు కొన్నుకుని ఇంటికి చేరుకుంటాం..’ అని జవాబిస్తూ, ’మీరు ఇక్కడ దగ్గర్లో ఎక్కడ కొంటారు?’ అని ఎదురు ప్రశ్న వేసా.

’మాకు దగ్గర్లోని రైతు బజారుకు ఉదయానే వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇచ్చి సాయంత్రం మన సమావేశానికి హాజరు అవ్వడానికి పర్మీషన్ కొట్టేశా..’, చావా కిరణ్ గారి జవాబు
శ్రీమతి కి భయపడి అలా అన్నారని నేను భావించడం లేదు. తన అర్దాంగిని కూడా చర్చించి మరీ సమావేశాలకు హాజరవుతున్నారే అదే మనం గమనించాల్సిన విషయం

వీరూ మగవారేసమయం: 2008 మే నెల రెండవ ఆదివారం సాయంత్రం స్థలం: కృష్ణ కాంత్ ఉద్యానవనం, eతెలుగు నెలవారీ సమావేశం
పాత్రలూ పాత్రధారులు: eతెలుగు సమావేశానికి తరచుగా హాజరయ్యె సభ్యులు మరియూ మనందరికీ సుపరిచితులైన మరో తెలుగు బ్లాగరి, కశ్యప్

సందర్బం:

సమావేశం తేవ్ర స్థాయికి చేరుకుంది. ఏవేవో చర్చిస్తున్నాం. ఇంతలో కశ్యప్ గారి ఫోను మ్రోగింది. వెంటనే వారు లేచి, ’నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్, ఇంట్లో గ్యాస్ బండ అయ్యి పోయిందంట, ఇక నేను దయచేస్తాను, క్షమించాలి’ అంటూ క్షణంలో మాయమై పోయ్యారు.

దీన్ని బట్టి అర్దం చేసుకోవాల్సినదేమిటంటే, ఎంతో శ్రమ కోడ్చి, నిస్వార్దంగా అందరూ చేయు చేయు వేసి, మెల్లగా ఒక సంఘంగా తయారయ్యిన eతెలుగు సమావేశాని కన్నా ఇంటిలో ఉన్న తన శ్రీమతి పడే శ్రమముందు, eతెలుగు సమావేశంలో అప్పటికి తన పాత్ర ముంగింపుకు చేరుకున్నందున, ముక్తాయింపుకు సెలవిచ్చి, ఇంతి చేరువుకు ఇంటికి చేరుకున్నారు మన కాశ్యప్‍గారు. అర్దాంగి శ్రమను అర్దం చేసుకునేవారికి ఇదేమి పెద్ద విషయంకాదు.

వీరు మగవారేపైన చెప్పిన వారందరూ మగవాళ్ళే.. ఏమైనా అంటే, ’పైన పేర్కొన్న ఉన్మాదులు ఒక్క సారిగా హత్య చేసి శారీరకంగా హింసిస్తారు, మిగిలిన వారేమో మానశికంగా హింసిస్తారు.. ఏది ఏమైనా, ఏ రాయైనా ఒక్కటె, మమ్మల్ని (మహిళల్ని) హింసించడమే మగవాళ్ళ మొదటి కర్తవ్యం.. అందరు మగాళ్ళు ఎదో విధంగా హింసించే వారే..’ అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు.

 

కానీ ఎదో కధలో చెప్పినట్లు, పులితోలు కప్పుకున్న నక్కలాగా, మంచిగా ప్రవర్తించే మగవాళ్ళంతా, మగాళ్ళ తోలు కప్పుకున్న ఆడవాళ్ళంటారా!!!!???? అంతే కాదు, ’మగాళంతా ఒకే రకం.. ’ అంటూ ఊటంకించే మహిళలకు, మహిళా జనోద్దరణకు పాటు పడిన కందుకూరి వీరేశ లింగం గారు గుర్తుకురారు..


వీరాధి వీరుడైన, ఒక భగత్ సింగ్, మగాడు కాదు
ఒక సుభాష్ చంద్ర బోస్, మగాడు కాదు
ఒక తాంతియా తోపే మగాడు, కాదు
ఒక లాలా లజపతిరాయ్, మగాడు కాదు
ఒక మహాత్మా గాంధీ, మగాడు కాదు
ఒక బాల గంగాధర్ తిలక్, మగాడు కాదు
మన ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు, మగాడు కాదు
ఒక బిపిన్ చెంద్రపాల్, మగాడు కాదు
వందే మాతరం గీత రచయత బంకిం చంద్ర చటర్జీ, మగాడు కాదు
ఒక రవీంద్ర నాధ్ ఠాగోర్, మగాడు కాదు
తనలో అర్ద భాగాన్ని పంచి పెట్టిన పరమశివుడు మగాడు కాదు..

మరి వీరెవరో.. ????


ఏమో!!! ఏది ఏమైనా మగాళ్ళంతా మగాళ్ళే.. వారిలో తేడాలు ఏమీ లేవు .. కరస్టే .. ’Men are from Mars and Women are from Venus', చదవక పోయినా మీరన్నదే కరస్టు. జీవితానుభవంలో ఇంకా రాటు తేలలేదు కనుక, వేమన గారి పద్యంలో

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను,
సజ్జనుండు బల్కు జల్లగాను,
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వధా అభిరామ వినురవేమా

అని చెప్పినట్లు.. ఎదేదో వాగేస్తున్నా.. ముక్కు పగిలేలా అనుభవఙ్ఞులు తమ విలువైన అభిప్రాయములు తెలుపగలరు.

అంతవరకూ సెలవు,
ఇట్లు
భవదీయుడు

13, మే 2008, మంగళవారం

మహిళలూ - మహరాణులు - మీ ఉద్దేశ్యమేమి? భాగం - ౧

ఈ పుట వెనుక కధా కమామీషు ఏమిటంటే.. మొన్నా మధ్యన జ్యోతిగారితో పిచ్చా పాటిగా మాట్లాడుతుంటే, ఉద్దేశ్య పూర్వకంగా కాక పోయినా మామధ్య జరిగిన సంభాషణలో, ’అందరూ మగాళ్ళేగా.. అంతా ఒకే టైపు. మీ మగాళ్ళంతా ఇంతే..’ అన్నారు. అప్పుడని పించింది. నిజంగానే మగాళ్ళంతా ఒకే లాంటి వారా. అదేదో సామెత చెప్పినట్లు..

పళ్ళూడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే నేమి? కంకర రాయితో కొట్టినా పగులుతుంది, అంతే కాకుండా బియ్యంలోని రాయి అన్నంలో కలసి పంటికడ్డం పడ్డా పగులుతుంది. అదీ ఇదీ గాక, దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి పీక మన్నా పీకుతాడు..

ఏది చేసినా పళ్ళు మాత్రం ఊడతాయి.. కాకపోతే వూడకొట్టే విధానం మాత్రం వేరు వేరు. మొదటి రెండూ మనకు నెప్పి చేసేవైతే, వైద్యుడు మనకు నెప్పి తెలియకుండా, డబ్బులు తీసుకుని, పీకి పెడతాడు. అంత మాత్రాన మనం వైద్యుడిని రాయిని ఒకే తాటితో కట్టేయ్యలేం కదా. వైధ్యుడిని రాళ్ళతో సమానంగా పోల్చుకో గలమా. ఒక్క సారి ఎవ్వరైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళి

ఏందయ్యా నీకు పైసలిచ్చేది? గాఠిగా ఒక్కటిస్తే పోలా.. పన్నూడి చేతిలోకొస్తుంది. ఈ మాత్రందానికి నీకు వందివ్వాలా?

అని చూడండి. అప్పుడు వైద్యులుంగారి స్పందన ఎలా ఉంటుందో. ఇంతకీ చెప్పొచ్చిందేమిటంటే.. అందరు మగాళ్ళూ ఒక్కటేనా? అస్సలు తేడా లేదా? అన్న నా అలోచనల పరంపరలో భాగంగా నాకు తెలిసిన.. నాకు అర్దమయిన.. నా పీత బుర్రకి తెలిసినంత వరకూ.. నా అనుభవం మేరకూ.. నా పరిధిలో.. ఎదో చిన్న అభిప్రాయం.

ఎదోపాటలో చెప్పినట్లు.. ’మగువ మనసు తెలిసేనా మగజాతికీ..’ (అతడు సినిమాలోని ’నీతో చెప్పనా.. నీక్కూడా తెలిసేనా’ అన్న పాటలో మధ్యలో వస్తుంది) మాటలకు వ్యతిరేకంగా, మగజాతి సంగతి సరే.. అస్సలు స్త్రీ జాతికి తెలుసా అన్న నా సంసయానికి మన తెలుగు మహిళలు  ఏవిధంగా స్పందిస్తారో వేచి చూద్దం.

ఆఖరుగా మరొక్క విషయం, జ్యోతి గారి అంత పెద్ద వారిని నా ఈ పుటలో ప్రస్తావించే అంత అనుభవం నాకు లేదు, అలాగే వారి అంత వయస్సు నాకు లేదు. ఇక్కడ జ్యోతిగారేదో అన్నారని చదువరులు అనుకుని వారిని ఆ దృక్పధంతో చూడనక్కర లేదు. అట్టి జ్యోతిగారే, ప్రమదావనం యొక్క మొదటి సమావేశం గురించిన సంగతులు ప్రచురిస్తూ..

నిజంగా మొగుళ్లని ఆడిపోసుకుంటాము గాని మంచి వాళ్ళే...

అని నిర్మొహమాటంగా ప్రచురించారు. ఆ మాటల్లో వారి అనుభవం, వారి గొప్పతనం, వారి హుందా తనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందువల్ల జ్యోతిగారిని నేను టార్గెట్ చేసుకుని ప్రస్తావిస్తున్నానని మాత్రం నామీద అభాండం వెయ్య వలదు. చాలా మంది ఆడ వాళ్ళు ఈ మాటని అంటూ ఉండగా విన్న నేను అప్పుడప్పుడూ మనసులో పడ్డ వేదనే ఈ ప్రహాసం. నా భార్య నా మొహం మీద అనక పోయినా, ఎప్పుడైనా మనసులో ఈ విధంగా అనుకుని ఉంటుందా?? (ఎమో!! సందేహమే..)

దీని రెండవ భాగం నుంచి కొన్ని సంఘటనలు, ఋజువులు, ఉదాహరణలతో మీ ముందుంటాను. అంత వరకూ.. సెలవు,

ఇట్లు,

భవదీయుడు

PS: ఈ పుట ద్వారా మహిళల మీద యుద్ధాన్ని ప్రకటించానని మాత్రం తలంచ వలదు. ’మగాళందరూ ఒకే టైపా..’ అన్న నా అలోచన ఎంతవరకూ ఏ ఏ కోణాలలో ఏ ఏ విధంగా మార్పు చెందుతుందో నన్నదే అని గమనించ గలరు.

3, మే 2008, శనివారం

మొదటి పుట

ఉబుసు పోక మొదలు పెట్టిన నా బ్లాగు ప్రయాణం ఇప్పుడిప్పుడె కొత్త పుంతలు తొక్కు తున్నట్లుంది. దాని ఫలితమే, ఈ భవదీయుడు. నిజానికి ఈ భవదీయుడిని ప్రారంభించి చాలా రోజులే అయ్యింది, కానీ రెండవ బ్లాగు అవసరమా(??) అన్న ప్రశ్నకు సమాధానం దొరకక ఇంత కాలం స్వీయ శోధనలో కాలం వెళ్ళబుచ్చా. మరి ఇప్పుడెందుకు మొదలు పెడుతున్నా నంటే, స్వీయ శోధనలో సమాధానం దొరికిందని దానర్దం కాదు. కానీ ఉబుసు పోక చేసే పనుల్లో భాగంగా అక్కడ ప్రసురిస్తే, ఏదైనా కొంచం తీవ్రత ఎక్కువై తప్పని సరిగా ఆలోచించ తగ్గ విషయాలు ఇక్కడ ఉంచితే బాగుంటుందని పించింది. అన్నంత మాత్రాన ఇక్కడ అన్నీ సీరియస్ విషయాలే ఉంటాయని మాత్రం భావించకండీ.

ఇక్కడ ప్రచురించ బోయే విషయాలు పొల్లు పోకుండా, స్వీయ భావాలే. స్వీయ ఆలోచనలే. నేనైతే ఎలా స్పందిస్తానో అలా. అదేదో బ్లాగులో చదివిన వాక్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక విధంగా ఆ మాటలు కొంచం అర్దవంతంగానే ఉన్నాయనిపిస్తోంది.

ముక్కు పగిలేంత వరకూ ముక్కు సూటిగా పోవడమే..

ఇదేదో బాగుందే. ఇంతకీ ఎవ్వరీ మహానుభావుడు? చదివే వారికి ఎవ్వరికైనా తెలిసి నట్లైతే తెలియజేయగలరు. వారికి మన తరుపున ధన్యవాదాలు తెలియజేద్దాం.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics