ఈ మధ్య నేను తెలుగు నిఘంటువులో పాలుపంచుకుంటూ తెలుగు పదాలను యూనికోడ్ ద్వారా వ్రాస్తున్నప్పుడు కలిగింది ఈ ప్రశ్న. ఓ సత్‍సంగంలో ఈ విషయమై చర్చ మొదలు పెట్టగా పలు పలు సమాధానాలు మరియు వివరణలు వచ్చాయి. వాటన్నింటిని క్రోఢీకరించి ఓ చోట ఉంచితే బాగుంటుంది అన్న ఆలోచన రూపమే ఈ పోస్టు.
ముక్తి గురించిన వివరాలు చదివే మీకు తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిన వివరాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అసందర్బం అనిపిస్తే మన్నించండి.
ముక్తి అనేది రెండు స్థితులలో ఉంటుంది అని, “లేవండి మేల్కొనండి” అనే బ్లాగు రచయతైన సురేష్ బాబుగారు ఈ క్రింది విధంగా స్పందించారు.
1.జీవన్ముక్తి, అంటే జీవించి ఉండగానె పరమాత్మలో లేక ఆత్మానందం లొ నిమగ్నమై ఉండడం.
2.విదేహముక్తి, అంటే మరణించిన తర్వాత ముక్తి పొందడం.
చర్చలో పాల్గొంటూ, “వాగ్విలాసము” అని బ్లాగుతున్న ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు తన అభిప్రాయాన్ని వారిమాటలలో..
చతుర్విధ ముక్తములు అనేవి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఇవి ముక్తిభేదాలు కావనుకుంటా! తన్మార్గంలో వివిధస్థాయీభేదాలు అనుకుంటాను.
సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో೭స్మ్యహమ్
అని శివానందలహరిలో ఆదిశంకరులు స్తోత్రం చేస్తారు.
· నిరంతరసంకీర్తనం గుణగానం వలన సారూప్యం (ఆ గుణాలు అలవడటం) సిద్ధిస్తుంది.
· శివభక్తులతో నిత్యసాంగత్యం వలన సామీప్యం (దగ్గఱితనం) సిద్ధిస్తుంది.
· సమస్త చరాచరజగత్తునందూ శివునినే చూడటం వలన సాలోక్యం (కైలాసవాసం) సిద్ధిస్తుంది.
· తదనంతరం సాయుజ్యం (స్వామిలో ఐక్యమవ్వటం) సిద్ధిస్తుంది
చర్చలో ఆఖరున పాల్గొన్న లీలామోహనం బ్లాగరి చిలమకూరు విజయ మోహన్ గారు ఈ క్రింది విధంగా వారి అభిప్రాయాన్ని తెలియ జేసారు.
మోక్షము,కైవల్యం,సాలోక్యం,సారూప్యం,సామీప్యం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
మోక్షమంటే విడుదల అని అర్థము. కర్మబంధమునుండి పూర్తిగా విడుదల పొందడాన్ని మోక్షమని రూఢిగ అంటారు. అలా కర్మబంధం తొలిగాక, రెండు స్థితులుంటాయి.
జీవుడు అర్చిరాది మార్గం ద్వారా విరజానదిని దాటడందాక అంతా సమానమే. విరజానది దాటాక కేవలం ఆత్మానుభవమే కోరి తృప్తిచెంది, అలా ఉపాసన చేసినవారు ఆ పరమపదంలోనే ఓమూలనుండే చోటుకు చేరి కేవలునిగానే మిగిలిపోతాడు. దానిని కైవల్యం అంటారు. అదీ మోక్షమే.
కర్మలన్నీ నశించాయి అర్చిరాదిగుండా విరజానది దాటి వచ్చాడు కనుక ఇక తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశించడు. భగవదనుభవాన్ని కోరలేదు కనుక దాన్ని పొందడు, తిరిగి వెళ్ళడు. స్వాత్మసాక్షాత్కారం పొంది, ఆత్మానుభూతిలో తేలియాడుతుంటాడు.అది నిత్య స్థితి.
అదికాక, భగవత్సేవనే మోక్షమని ఉపాసించిన వాడు, విరజానది దాటగానే అమానవ అనే స్పర్శతో పంచోపనిషణ్మయ దివ్యదేహం ఏర్పడుతుంది. అది చాలా రకాలుగ అలంకృతమై, ప్రేమ పూర్ణమై భగవదనుభవార్హమై గరుడుని తోడ్పాటుతో పరమాత్మ సన్నిధికి చేరి స్వామిసేవలో ఉంటాడు.వీటిల్లో ఆలోకంలోకి, విరజానది దాటగానే, ప్రవేశిస్తాడే ఈ జీవుడు, ఆ స్థితిని సాలోక్యం. భగవంతునితో సమానంగా ఒకే లోకంలో ఉండడం.
ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి, అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది.
క్రమంగా భగవన్మండపము ప్రవేశించి భగవంతుని దరికి చేరు సమయం- సామీప్యం అంటారు.
అతడి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణ దివ్యదంపతుల గోష్ఠిలో ఉండి, అతడి గుణాలను పొంది నిత్యకైంకర్యాన్ని చేపట్టడం సాయుజ్యం అంటారు .
ఇందులో ముక్తులు అందరూనూ, గరుడాది పెద్దలందరినీ నిత్యులని వ్యవహరిస్తుంటారు.ఈ వెళ్ళిన వీడు ముక్త గోష్ఠిలో చేరతాడు.