14, నవంబర్ 2009, శనివారం

బుక్ ఎగ్జిబిషన్ కమిటీ ప్రస్తావన : సలహాలు

ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

నిరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున ధన్యవాదములు. మరి  రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.

ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు నీళ్ళతో చేరుకున్న పాలేమీ పలుచనైపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.

 

మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.

మొదటి సలహా అందినది, కావున సలహా పాటించడమైనదని గమనించగలరు

12, నవంబర్ 2009, గురువారం

నేను కూడా లంచం ఇచ్చానోచ్

 

ఈ పుట చదివే వాళ్ళలో పోలీసోళ్ళు ఉన్నా (లేక) పోలీసు సానుభూతి పరులు ఉన్నా (లేక) పోలీసులకు చుట్టాలు ఉన్నా (లేక) పోలీసు అవ్వుదాం అనుకునే వాళ్ళున్నా (లేక) పోలీసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా దయచేసి మఱో బ్లాగుకి పోయి ఆ విషయాన్ని ఆనందించండి. ఇది మీ లాంటి వాళ్ళు చదివి జీర్ణించుకోలేరు. ఒక వేళ జీర్ణించుకున్నారంటే మీకు ఎంత వంట పట్టిందో చెప్పనక్కరలేదు.

ఓ మర్చిపోయ్యాను .. లంచం ఇవ్వడం తప్పు అలాగే పుచ్చుకోవడం తప్పు కాబట్టి .. పోలీసోళ్ళ భాషలో "ఖర్చుల నిమిత్తం " అని మీరు మార్చుకుని చదువుకోండి

ఇక అసలు విషయానికి వస్తా. నా పాస్ పోర్ట్ పరిమితి కాలం అయ్యిపోనది అందుకని తత్కాల్ లో కావాలని పాస్ పోర్ట్ కార్యాలయంలో దరకాస్తు చేసుకున్నాను. దరకాస్తు చేసుకోవడం ఇంత సులువైన పని అని నాకు అప్పటి వరకూ తెలియదు. మొదటిసారి అప్లై చేసుకున్నప్పుడు నా అంతట నేనే పాస్ పోర్ట్ దరకాస్తు ఫారం తెచ్చుకుని మూడువందల రూపాయల డీడీ తీసి చక్కగా తంతీ తపాళా వారి రిజిస్టర్ పోస్టు చేస్తే, ఖచ్చితంగా ముఫై రోజుల్లో పోలీసోడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని, దారి ఖర్చులకు డబ్బులడిగాడు. అప్పుడు మా పరిస్తితి అంతంత మాత్రం. అందువల్ల తెగించి వస్తే వస్తుంది లేకపోతే రాదు అన్న తెగింపుతో ఇవ్వను అని చెప్పెసాను. సరే అని వెళ్ళిన ఆ అధికారి మా నాన్నగారితో మాట్లాడాలన్నాడు. నాన్నగారు ఇంట్లో లేరు అని అప్పటికి దాటేశాను. సరే అని అప్పటి జారుకున్న సదురు పోలీసాయన, మరో పది రోజుల తరువాత మళ్ళీ వచ్చి దారి ఖర్చులకు రొక్కం అడిగాడు. అప్పుడు కూడా నాన్నగారు లేరని దాట వేస్తే అస్సలు విషయం చెప్పాడు. ఏమిటంటే, సదురు పోలీసు ఇంక్వైరీలో చెడుగా వ్రాస్తే ఇక జీవితంలో పాస్ పోర్ట్ రాదని. అప్పటికో నేను ఇవ్వకుండా ఉండటానికి చెప్పాల్సినన్ని కధలు చెప్పాను. దానితో మన పోలీసాయనకు మండింది. ఇంకే దరకాస్తు ఫారం పైన మేము ఇంటిలో లేమని వ్రాసి తిరిగి పంపేశాడు. మా దురదృష్టం ఏమిటంటె, ఆ రోజుల్లో పాస్ పోర్ట్స్ అన్నీ ఈ ఒక్క పోలీసాయనే చెయ్యాలంట. అప్పుడు కధ కాస్తా తిరిగి తిరిగి మా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దెగ్గరకు చేరుకుంది.

 

గుడిలో లింగాన్ని మ్రింగాలని ఒకడు ఆలోచిస్తుంటే ఏకంగా గుడినే మ్రింగేస్తే ఎలా ఉంటుంది అని మరొకడు ఆలోచించాడంట. ఈ పోలీసోళ్లు అంతే. ఇదిగో ఇక మన లోకల్ కానిస్టేబుల్ గారు మా ఇంటికొచ్చి నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దాంతో మా నాన్నగారికి ఒకటే ఖంగారు, నేనేమి తప్పు చేసానా అని. ఇక అక్కడితో ఆ తతంగం ఆగితే ఫరవాలేదు, మా ప్రక్కింటి వాళ్ళని కూడా అడగటం మొదెలెట్టాడు సదురు కానిస్టేబుల్. దాంతో మా పొరుగోళ్ళు కూడా కంగారు పడ్డారు, నేనేదో గొడవలో ఇరుక్కోవడం వల్లే ఈ సమాచారం అడుగుతున్నాడని. సరే అని మేము సర్దుకుని ఊరుకుని అన్నీ పద్దతి ప్రకారం జరగాలి కదా అనుకుంటూ ఉంటే, ఇవన్నీ జరిగిన తరువాత చావు కబురు చల్లంగా చెప్పాడు. మేము అర్జంటుగా పోయి ఇంతక ముందు వచ్చిన పాస్ పోర్ట్  అధికారికి తృణమో ఫలమో ఇస్తే బాగుంటుంది లేక పోతే ఫైలు ముందుకు కదలదు సరికదా ఇలాంటి వెటకారమైన పనులు మాత్రం మాకు తప్పవని. ఇంకే తప్పని సరై మా నాన్నగారికి తెలియకుండా నేనే వెళ్ళి ఓ వంద రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఛా.. ఏంటి ఆ మాట అంటారా.. అదే నండి పోలీశోళ్ళ భాషలో నా కాగితం ముందుకు వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా, అదేనండి పోస్టాఫీసుకి వెళ్ళాలి అక్కడ స్టాంపులు తీసుకోవాలి. మళ్ళీ లోకల్ పోలీసోళ్ళకి ఇన్ ఫర్ మేషన్ చేరవెయ్యాలి.. వగైరా వగైరా అన్న మాట.

 

ఇదంతా పదేళ్ళ క్రిందటి మాటైతే, ఇప్పుడు పరిస్తితి మరోలా ఉంది. పైన చెప్పినట్లుగా నేను పాస్ పోర్ట్ ని తిరిగి పొందేందుకు చేసుకున్న ఆలోచనలో మొదటి అంకం దరకాస్తు ఫారం నింపి పరిశీలన నిమిత్తం అంద జేయ్యాలి. సరే.. అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అనుకుని ఇచ్చిన సమయానికి మ్రుందే చేరుకుని కావాల్సిన పత్రాలన్నింటినీ చూపించి ఈనెల మూడవతారీఖున దరకాస్తు చేసుకున్నాను. పాస్ పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకు నాది ఒకటే అభ్యర్దన. మధ్యవర్తులను నమ్మకండి. చక్కగా మీ అంతట మీరే వెళ్ళి దరకాస్తు చేసుకోండి. ఇప్పుడు ఈ పనులన్నీ చాలా శులభతరం చేసారు. ఇక నా విషయానికి వస్తే, నా దరకాస్తు ఫారం కాస్తా పోలీస్ వెరిఫికేషన్ కోసం గత శనివారం వచ్చింది. ఇంకే మరో పోలీసు గుంటనక్క మా ఇంటికి చేరుకుంది. అడిగిన కాగితాలు చూపించాం కావలసిన నకలు పత్రాలు అంద జేసాం. ఇవన్నీ చాలవన్నట్టు, మేము అద్దెకు ఉంటునట్లుగా మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాగితం కావాలన్నాడు. అడిగినదే తడవుగా మా లీజ్ ఎగ్రిమెంట్ చూపించా. మరేదో లేదన్నాడు. అదీ చీపించా. ఇంకే మన నక్క తెలివితేటలు ఉపయోగించి మా ఎగ్రిమెంటు నోటరీ చేయించలేదు కావున చెల్లదు అంటూ అది చేసి మరునాడు ఉదయం పదిన్నరకు ఐమాక్స్ ధియేటర్ ఎదురుగా ఉన్న పాస్ పోర్ట్ సెల్ దగ్గరకు వచ్చి ఇవ్వమన్నాడు. అప్పుడు అర్దం అయ్యింది మనోడు పైసలు ఇస్తేనే గానీ వదలడు అని. కానీ అస్సలు దారి ఖర్చుల విషయం ఏమీ మాట్లాడ లేదు కదా అని ఊరుకున్నాను. మరునాడు చెప్పిన సమయానికి చక్కగా అన్ని కాగితాలు పట్టుకుని వెళితే, అప్పుడు మూల్గాడు అసలు విషయం.

 

అదిగో అప్పుడు నాకు కాలింది. ఎందుకు ఇవ్వాలి సార్ అన్నా. అదే డైలాగ్ .. పాస్ పోర్టుని లోకల్ పోస్టాఫీస్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్ కి పంపించాలిగదా అక్కడ ఖర్చు ఉంటుంది కదా .. అంటూ యదవ సోది చెప్ప బోయ్యాడు. అప్పుడు నేను అన్నాను, వీటన్ని ఖర్చుల నిమిత్తమై కదా తత్కాల్ లో ఎక్కువ పెట్టి చేయించుకునేది. ఇక మన నక్కగారికి పూనకం వచ్చి అచ్చంగా తోడేలైయ్యాడు. నా మీద ఘీంకరించడం మొదలైంది. ఇక్కడ వ్రాయలేను అసభ్య పదజాలం వీరు ఉపయోగించారు. ఇక లాభం లేదనుకుని ఖర్చుల నిమిత్తం ఎంత అవసరపడొచ్చు అంటే, ఓ రెండివ్వండి అన్నాడు. సరే రొండొందలే కదా అని రెండు వంద నోట్లు తీసి చేతిలో పెట్ట బోతే ఏదో చీడ పురుగుని చూసినట్టు చూసి, ఇది తత్కాల్ కాబట్టి మరో సున్నావేసి ఇవ్వు అన్నాడు. మరి కొంత సేపు వాగ్వివాదం. ఇదంతా ఎక్కడనుకున్నారు, అచ్చంగా పోలీసు వారి అధికారిక కార్యాలయంలో. అక్కడ మనం ఏదైనా అన్నాం అనుకోండి ఇంకే ముంది, రాజ్యం వాళ్ళది కదా బొక్కలో వేసి కుమ్ముడే!! కాదంటారా.. ఆఖరుకి ఒకటిన్నరకన్నా తగ్గితే ఊరుకునేది లేదు అని కరాఖండీగా చెప్పెశాడు.

వీళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి ఎవ్వరైనా తెలిసిన పోలీసు చేత చెప్పిస్తే వింటాడు కదా అని ప్రయత్నిస్తే, సదురు పోలీసు కుక్క కూడా ఇదే చెప్పింది. మనకు వాళ్ళతో గొడవ వద్దు కానీ అడిగింది ఇచ్చేయ్ మనకు ఎప్పుడైనా అవసరం పడితే చేస్తాడు, అని సమాధానమిచ్చింది. ఎంతైనా ఓ గూటి పక్షులే కదా వీరంతా అనుకుని అనువుగాని చోట అధికుల మనరాదని సమర్దించుకుని అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకున్నాను.

 

ఇందు మూలముగా యావన్మందికీ తెలిజ జేయునది ఏమనగా, సదురు పోలీసు జాగిలం మీ యింటికి వచ్చినప్పుడే విషయాన్ని తేల్చేసుకుంటె మీకు వారి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే మీకూ తలకాయ నొప్పి ఉండదు. ఈ స్వతంత్ర భారత దేశ యంత్రాగానికి నిధులు కరువైనాయి కనుక మన ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు పడేసినట్లుగా ఇలా ఖర్చుల నిమిత్తం బ్లాక్ మైల్ చేసి డబ్బులు దండుకునే పోలీసులోళ్ళనుంచి దూరంగా ఉండడమే మంచిదని నా అభిమానం. ఆఖరుగా మాతాత గారు చెప్పిన ఓ విషయం స్మరించుకుంటాను

దుష్టులను దూరంగా ఉంచకూడదంట, వాళ్ళకి మనం దూరంగా ఉండాలంట.

పై విధంగా, మా ఇంటికొచ్చిన రాయల్ బ్లాక్ మైలర్ బెగ్గర్ కి ఖర్చుల నిమిత్తం ఒకటిన్నర సమర్పించుకున్నానని సవినయంగా విన్నవించుకుంటున్నాను

 
Clicky Web Analytics