20, ఆగస్టు 2012, సోమవారం

మూడో సారి అమెరికా ప్రయాణం

ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. కానీ నాలోనే ఏదో మార్పు వచ్చినట్లుంది.

అది ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు కానీ, ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసుకున్నట్లు అంగీకరించడం ఎందుకో కష్టంగా ఉంది. కానీ నిజాన్ని నిజం అని ఒప్పుకోక తప్పదు. కానీ నిజాన్ని ఒప్పుకునేంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాలో ఎందుకు కలగలేదో అర్దం కావటం లేదు. ఒక్కొక్క సారి చాలా కుశ్చితంగా ఆలోచిస్తున్నాను అని వ్రాసుకోవడానికి సిగ్గుగా లేదు కానీ, ఇలా వ్రాసుకోవడానికి చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఇలా నారో మైండెడ్ గా తయరవ్వడానికి నా ఆలోచనలే కారణమని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది.

ఇలా వ్రాసినంత మాత్రాన నేను ఇంతక ముందు వ్రాసినవన్నీ యాదార్దాలు కాకపోలేదు. ఆచారాన్ని సహిస్తాను కానీ అనాచారారాన్ని అంగీకరించలేను. ఇది అనాచారము అని నిర్ణయించే హక్కు నాకు లేక పోయినా, ఆచారముగా చెప్పబడినదానికి విరుద్దంగా ప్రవర్తించి మా ప్రవర్తన ఇంతే, ఎవ్వరో నిర్ణయించిన ఆ ఆచారాన్ని మేము పాటించము, మా ఆచారాన్ని మేము వ్రాసుకుని మాకు నచ్చినట్లు ఉంటాము అనే వారి ఆచారము నాకు అనాచారముగా అనిపిస్తోంది అనేది మాత్రం నిజం. ఏది సదాచారము? ఏది దురాచారము? అని నేను నిర్ణయించే స్థితిలో నేను లేకపోయినా, అలాంటి చర్చకు కూడా నేను సిద్దంగా లేను. అంతే కాదు సరికదా, అలాంటి చర్చను కూడా స్వాగతించే  హక్కు నాకు లేదు. ఈ చర్చ ఇప్పుడు అప్రస్తుతం అయనా, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు.

నేను కొంచం (కొంచం ఏం ఖర్మ, చాలానే..) దూకుడు మన:తత్వం కలిగిన వాడిని. అలాంటి నాకు ఈ సారి అమెరికా ప్రయాణంలో చాలా అవరోధాలు ఎదురైనా చిరునవ్వుతో దాటవేసే గుణం ఎందుకు కలిగిందో నాకు అర్దం కాలేదు. నా ప్రస్తుత ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుంటే, హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమాన యానం ముంబైలో మఱో అంకానికి చేరుకుంది. అక్కడి నుంచి పారీస్ వరకూ బాగానే సాగినా అక్కడి నుంచే మొదలైంది అసలైన కధ. నేను శాఖాహారిని. ముంబై నుంచి వచ్చే లేదా ముంబైకి వెళ్లే ప్లైట్లలో చాలామంది శాఖాహారులు ఉండటం అనేది చాలా సామాన్యం. కావున సదరు విమానాలలో విమానయానం చేసే ప్రయాణీకుల సౌకర్యార్దం కొన్ని శాఖాహార భోజనాలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతూ ఉంటారు. కానీ పారీస్ నుంచి అటు పశ్చిమంగా వెళ్లే వారిలో శాఖాహారులు ఉండటం అనేదు అఱదు. కావున ప్రత్యేకంగా చెప్పకపోతే గాని శాఖాహారాన్ని అందు బాటులో ఉంచుకోరు. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు నేను టికెట్ కౌంటర్లో శాఖాహారిని అని చెప్పనందున వారు నా విషయాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల నేను సాధారణ మాంసాహారిని అన్నమాట.

శాఖాహారం తినటం అనేది నాకు పరంపరగా వచ్చిన ఆచారం. మా ఇంటికి అతిధి వస్తే లేదా మేము ఆహ్వానిస్తే, మేము శాఖాహారమే పెడతాము. అదే విధంగా మాంశాహారం పశ్చిమ దేశాలలో ఆచారంగా వస్తున్నందున అక్కడి వారు కూడా అక్కడికి విచ్చేసే యాత్రికులకు అదే ఆచారం ప్రకారం పద్దతలు పాటిస్తారు కదా, అదే పంధాలో అక్కడికి వచ్చే వారికి కూడా మాంశాహారాన్ని పెడతారు కదా!! అలాగే నా విషయంలో మాంశాహారాన్ని నా ప్రధాన ఆహార ఆచారంగా తీసేసుకున్నారు. కానీ నేను శాఖాహారిని అని తెలిసిన తరువాత శాఖహారం వడ్డించడం జరగక పోయినా, శాఖాహారం లేదని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చినా, నాలోని సహనం ఆ కోపాన్ని అధిగమించేసింది. నవ్వుతో ఆనాటికి పళ్ల రసంతో సరిపెట్టుకుని, బ్రెడ్డు ముక్కలు తిని చాలించాను. అదిగో అలా మొదలైంది మఱో వింత అనుభవం. ఏదో తెలియని క్రొత్త ఆలోచనలు. సరి క్రొత్త భావనలు.

 

అదే ప్రపంచం మఱో కోణంలో కనబడటం మొదలైంది.

 
Clicky Web Analytics