23, జూన్ 2011, గురువారం

అమెరికా వాళ్ళే పిసినారోళ్ళు కాదు

ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.

ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.

ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.

ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

 1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
 2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
 3. మూడు వందల ఏడు కిలోల వెండి
 4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

12, జూన్ 2011, ఆదివారం

బొత్స సత్యన్నారాయణ – నా అభిప్రాయం

బొత్స సత్యన్నారయణ గారి గురించి క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. కాకపోతే, ఒక్క సారి వారి గతాన్ని అవలోకించుకుంటే, కొన్ని పచ్చి నిజాలు నాకు మింగుడు పడని పచ్చి వెలక్కాయలు అవుతాయి. ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా ఓ అభిప్రాయం ఉంది, కాకపోతే అది ఒక రాజకీయ పార్టీగా కాక రాజకీయ వ్యాపార వ్యవస్థగా ఓ మంచి వ్యాపార దృక్పధం కలిగిన సంస్థగా లాభాలను ఆర్జించే దిశలో సాగి అభివృద్ది చెందుతున్న లంచాల పార్టీగా నాకు అనిపిస్తోంది.

ఈ అభిప్రాయం వెనకాల కొన్ని (నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే) వివరాలు. మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని. కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి. ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ .. డాష్.. వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు, ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం. కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు.

ఇక వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలిందంటూ, వేరే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, స్వతంత్ర పార్టీగా ఎదిగిన ప్రజా రాజ్యం పార్టీ, సదరు ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత, ప్రస్తుతం అవినీతి / లంచ గొండితనం / వగైరా వగైరా లేవు కాబట్టి, ప్రరాపా అవసరం లేదు, చక్కగా కాంగేస్ పార్టీలో కలసి పోతాం అన్న వివరం నాకు మింగుడు పడటం లేదు. దీని వెనుక మాకేమీ ధనలాభం జరగలేదు అని ప్రరాపా వారు అంటే, నిరూపించడానికి నావద్ద సాక్ష్యాలు లేవు. కానీ అదంతా ఒఠి హంబక్, అంటూ నమ్మెయ్యమంటే కొంచం కష్టం మరి.

రారె గారు, రాజశేఖర్ రెడ్డి గారు అని ఇకపై చదువుకోమనవి. రారెగారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వాగెన్ స్కాం ద్వారా తన పదవిని కోల్పోయిన ప్రస్తుత బొస గారు, (బొత్స సత్యన్నారాయణ గారు), ఆంద్రప్రదేశ్ కాంగ్రేశ్ పార్టీకి అధ్యక్ష్యులు అయ్యారు. అప్పటి స్కాం కనుక ప్రతి పక్షం వారు పట్టించుకోకుంటే, మఱో కర్మాగారం ఆంద్ర ప్రదేశ్ కు వచ్చేది. అదేనండి కార్ల తయారి కర్మాగారం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరికేది. సరే, అది అంతా గతం, అదే గనుక జరిగి ఉంటే, బొస గారు చక్కగా ఆ సంస్థ పనులలో బిజీగా ఉండి ఇలా అయ్యేవారు కాదేమో. ఇలా జరిగినందులకు బొసగారు అప్పటి ప్రతి పక్ష నాయకుడైన నాచనా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలా ఋణ పడి ఉంటారు. ఉండాలి కూడా.

నాచానా గారు పట్టు పట్టి బొసగారిని పంచాయితీ రాజ్ వ్యవస్థనుంచి తప్పించ కుంటే, బొసగారిలో కసి పెరిగేది కాదు. అలా బొసగారిలో కసి పెంచి వారి కుటుంబం నుంచి ఏకంగా నలుగురు వ్యక్తులను ఎమ్ ఎల్ ఎ లుగా చేసేటట్టు చేసిన నాచానా గారికి బొసగారు ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక్కరు ఎన్నికల్లో గెలవడమే చాలా కష్టమైన సందర్బాలుండగా, ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి పార్టీ టికెట్టులు తెచ్చుకుని, ఆ నలుగురిని గెలిపించే భాద్యత బుజాల మీదకు వేసుకున్న బొసగారు సామాన్యుడు కాదని మనం గమనించాలి. నిజమే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నికల్లో పార్టీ సీటు రావడం గొప్ప కాదు, కానీ ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందంటే, ఆ కుటుంబం అయితే ప్రజా సేవలో నిరతిశయమైన కృషి చేసుండాలి లేదా మరింకేమైనా చేసి ఉండాలి. బొసాగారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించిన నలుగురు వ్యక్తుల గురించి ప్రజలకు అంతగా కాదు కద కొంతగా కూడా తెలియదనే చెప్పుకోవాలి. ఇక్కడ నా మట్టి బుర్రకు సమాధానం లభించని కొన్ని ప్రశనలు.

 • కొంతగా కూడా తెలియని ఈ నలుగురికి కాంగ్రెస్ టికెట్టు ఏ బేసిస్ మీద ఇచ్చిందబ్బా?
 • ఇలా టికెట్టు కొట్టేసిన నలుగురు ఏ విధంగా గెలిచారబ్బా?
 • గెలిచిన ఈ నలుగురి వెనుక బొసగారి సపోర్ట్ లేదంటే నా మది ఎందుకు అంగీకరించటం లేదబ్బా?
 • .. ఇంకా

రారేగారి హయాములో వోక్స్ వాగన్ స్కాంలోనుంచి క్లీన్ గా బయట పడి, తన ప్రతాపమేమిటో నాచానా గారికి అలాగే కాంగ్రేశ్ పార్టీలో అందరికీ షాకులు ఇస్తున్న బొసాగారిని అభినందించ కుండా ఉండలేను. ఏది ఏమైనా వీరు మాత్రం చాలా యునీక్, అంటే ఓ స్పెషల్ ఐటం అన్న మాట. దేవుడు వీరిని ఎలా చేశాడో కానీ చాలా స్పెషల్ గా తయారు చేసారు. కాకపోతే వీరి అభివృద్ది అంతా ప్రజా సేవ వల్లే జరిగింది అంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. వీరు చేసిన ప్రజా సేవ ఏమిటో నాకు అర్దం కావటం లేదు. ఒక్కసారి వీరి నియోజక వర్గం అయిన విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ది పనులేమిటో చూసి వస్తా. అంత వరకూ బొసాగారు, మీరు ఇక విజృంబించేయ్యండి. ఆల్ ద బెస్ట్

9, జూన్ 2011, గురువారం

హమ్మయ్య !! ఓ పనైపోయింది

ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.

పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.

ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.

ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.

7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

3, జూన్ 2011, శుక్రవారం

అభివృద్దా లేక వినాశనమా!!

యాపిల్ వారు విడుదల చేసిన రెండొవ సంతతికి చెందిన ఐపాడ్ కొనుక్కునేందుకు చైనాలోని ఓ పదిహేడేళ్ళ అబ్బాయి తన కిడ్నీని అమ్ముకున్నాడన్న విషయం నిన్న చైనా టీవీలో కనబడ్డా అదేమీ పెద్ద వింతకాదన్నుట్లు చైనీయులు పట్టించుకోలేదంటే, అక్కడ జరుగుతున్నది అభివృద్దా లేక వినాశనమా?

జనాభా పెరిగితే ఇంతకన్నా ఘోరమైన విషయాలు చదవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ది మంచిదే, కానీ పిల్లలకు స్వేచ్చనిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడినా అదేమీ పెద్ద వింతకాదులే అనే వారి ధోరణిని ఎలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ విషయాన్ని స్పందిచినవాళ్ళు అదేదో పెద్ద హాస్యం అన్నట్లు నవ్వుకోవడం మరీ చోద్యంగా ఉంది.

దీనివెనుక అక్కడి తల్లి తండ్రుల పెంపకం ప్రధాన పాత్ర వహిస్తుంది అనిపిస్తోంది. మున్ముందుగా పిల్లలు జాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు పట్టించుకున్నట్లు లేరు. ఆపై మూడు రోజులు అబ్బాయి కనబడక పోతే పట్టించుకు పోగా ఒక చేతిలో ఓ లాప్ టాప్ మఱో చేతిలో ఐపాడ్ పట్టుకు తిరుగుతున్న అబ్బాయిని పట్టుకుని అడిగితే అప్పుడు అస్సలు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్లు వివరించాడంట.

అమ్మేవాడికి తెలివి లేదనుకుందాం, పోనీ కొనే వాడిని మానవతా విలువలు ఉండనక్కర్లేదా అని అడిగితే, దానిదేముందండి అది ఎక్కడ అమ్ముతారో చెప్పండి దాన్నీ కొనుక్కొచ్చేద్దాం అని అంటారు. ఇలా నైతికపరంగా వీరు చాలా దిగజారిపోతున్నారన్నది నిజమై అని మనం అనుకునేంతలో.. అక్కడెక్కడో ఎందుకు చూస్తావు, నీ ముడ్డి క్రింద నలుపు చూసుకో అంటూ మరో ఘటన మన ఆంద్ర ప్రదేశ్ లో ఇవ్వాళ్ళ ఉదయం జరిగింది.

మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం. అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి. చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే, మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్. ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె, మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు. వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం..

మొదటిది) తల్లి తండ్రుల పెంకపంలో లోపం.

రెండొవది) స్వతహాగా ఉండాల్సిన నైతిక విలువలు. తల్లి తండ్రి నేర్పలేదనుకోండి, పెరిగి పెద్దైన వీరి బుద్ధికేమైంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే, అసహనం వస్తోంది. పిల్లలు లేకపోవడం ఓ రంకంగా సమాజానికి మేలేనేమో అనిపిస్తోంది. ఇంకా వ్రాస్తే ఏదో వస్తుంది.

1, జూన్ 2011, బుధవారం

నేనూ తీవ్రవాదినే

Maunika

వరంగల్ జిల్లాలోని రఘునాధ పల్లిలో నిన్న జరిగిన ఘటనలో ఓ యువకుడిని గ్రామస్థులు కాల్చి చంపిన వైనంలో నాకు తప్పేమీ కనబడలేదు. ఇలా ఆలోచించడం ఓ తీవ్రవాది ఆలోచిస్తున్నట్లు ఉంటే, నేనూ తీవ్రవాదినే. నిజమే, ఆ అబ్బాయి తప్పు చేసి ఉండవచ్చు, అయినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద దండన వెయ్యడం అనే హక్కుని గ్రామస్థులు తమ చేతిలోకి తీసుకోవడం అనేది భరతీయ న్యాయ వ్యవస్థకు విరుద్దమే అని మీరంటే నా దగ్గర అందుకు ఎటువంటి స్పందన లేదు అలాగే వారి చర్యను సమర్దించేందుకు కావలసిన సరైన సమాధానం నా వద్ద లేదు. న్యాయ వ్యవస్థ పై మనకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కి న్యాయాన్ని తేల్చి శిక్షని విధించే హక్కుని తమ చేతుల్లోకి తీసుకున్నారు అంటే, దాని వెనకాల

 • గ్రామస్థుల క్షణికావేశం ఉండి ఉండవచ్చు
 • వారి కళ్ళముందు ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం వారిని అసహనానికి గురి చేసి ఉండవచ్చు
 • వారి ఊరిలోని ఓ అభాగ్యురాలు దాడికి గురై రక్తం ఓడుతున్న స్థితిలో మృత్యువుతో పోరుడుతున్న వైనం వారి ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు

నిజానిజాలేమిటో నాకు తెలియదు. కానీ నాకు కనబడుతున్నదల్లా, ఓ అభాగ్యురాలు దారుణంగా, అత్యంత హేయంగా గాయపరచ బడి  అపస్మారకంగా పడి ఉంది. (ఇక్కడ ఇచ్చిన చిత్రం ఈనాడు వారి వెబ్ సైట్ నుంచి తీసుకోబడినది) అలాంటి స్థితిలోంచి ఓ యువకుడు పారిపోతున్నాడు అని ఈనాడులో వ్రాసారు. విచారించకుండా గ్రామస్థులు తొందరపడతారని నేను అనుకోను. ఒక్కరు లేదా ఇద్దరు తప్పుగా అనుకున్నారంటే ఆలోచించవచ్చు, గ్రామం మొత్తం దాదాపు ఆరు వందల మంది గుమ్మి గూడి పోలీసుల మధ్య ఉన్న ఆ యువకుడిని లాకొచ్చి మరీ కాల్చారంటే సదరు యువకుడు..

 1. తాను చెయ్యని పనికి గ్రామస్థులు పట్టుకుంటే, వారి అహాన్ని రెచ్చకొట్టే విధంగా ప్రవర్తించి తన మీదకు తెచ్చుకునే ఉంటాడు
 2. పోలీసుకు రంగప్రవేశం చేసిన తరువాత ప్రస్తుతానికి గండం గట్టేక్కిందనుకుని గ్రామస్తులతో విర్రవీగుంటాడు
 3. తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో కనీసం గ్రామస్థుల ఆగ్రహాన్ని గ్రహించి తనని తాను నిమ్మదించుకునే ప్రయత్నం చేసే వాడు. ఒక వేళ అలా జరిగి ఉంటే, గ్రామస్థులలో ఆగ్రహం ఇలా కట్టెలు తెంచుకునేది కాదు
 4. ఇంకా .. డాష్.. డాష్..

ఇలా చాలా విశ్లేషించ వచ్చు. ఒకవేళ నిజ్జంగా అతను నిర్దోషి అయినా, ఇలా శిక్షింపబడటం అతని దురదృష్టమే. కాని ఇలాంటి ఘటన మరో యువతిని దాడి చేయ్యాలనుకునే ప్రతీ మగవాడికి ఓ గుణపాఠం కావాలి. అమ్మాయిగా పుట్టడమే ఆడపిల్లకు శాపమా అని ఇంతకు మందు కొంతకాలం క్రిందట వ్రాసుకున్నాను. ఒక్కొక్క సారి అది నిజమేమో అనిపిస్తుంటుంది. అతివలు నిస్సహాయులు కాదు గ్రామం మొత్తం ఎకమై నిలుస్తుంది అని నిరూపించడం ఆ గ్రామం యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆడ పిల్ల ఒక్క ఇంటి పిల్లేకాదు గ్రామం మొత్తానికి ఆడపిల్లే అని చాటిన రఘునాద పల్లి గ్రామస్తులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను.

ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే. రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే, ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో. ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు. అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఆ ఇంటిని దక్కించుకోవచ్చు. మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు. విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే!!

కాని ఇలాంటి స్థితిలో ఈ అమ్మాయికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఈ ఆడ పిల్ల పళ్ళు ఎవ్వరు తెచ్చి ఇస్తారు? చిన్న యాక్సిడెంటు పరంగా నా కాలి చిలమండ విరిగితేనే ఎంత కష్టంగా నాకు మాత్రమే కాక మా కుంటుంబంలోని అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయి తన ప్రాణం కన్నా మిన్నగా దాచుకునే తన మానాన్ని దోచుకునే ప్రయత్నం చేసిన యువకునితో ఆత్మరక్షణార్దం జరిగిన ఘటనలో తన శరీరాన్ని ఇంతటి దుస్థితికి చేరుకుంది అన్న విషయం తెలుసుకుని ఎంత విలవిలాడిపోతుందో అర్దం చేసుకోగలను. ఈ అమ్మాయి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎన్ని ఆపరేషన్స్ చెయ్యాలో? ఎంతటి ఖర్చు అవుతుందో? ఇంతకాలం తిండి తినకుండా ఈ అమ్మాయి ఏమి తిని బ్రతకాలి?

 
Clicky Web Analytics