23, సెప్టెంబర్ 2010, గురువారం

టాలెంట్ ఎక్కడో లేదు – మనం గుర్తించడంలోనే ఉంది

ఈ పోస్టు వ్రాయడానికి ముందు పైన చూపిన వీడియోని హరనాద్ గారు వారి బ్లాగులో ఉంచారు. నేను స్వతహాగా వీడియోలను చూడను. కానీ ఈ పోస్టు చూడటానికి ఒకటే కారణం ఆ పాట. మర్యాద రామన్న సినిమాలో నాకు నచ్చిన అంశాలలో ఈ పాట ఒకటి. అదేదో సినిమాలో మహేష్ బాబు ఎంట్రన్స్ కూరగాయల బండిపై చిత్రీకరించారు. ఆ స్టైల్లో తీసినదీ పాట.

మర్యాద రామన్న సినిమాపై నా రివ్యూ మరొ సారి వ్రాస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ కుర్ర గాంగ్ కూడా యమ చేసారు. బాగుంది వీరి క్రియేటివిటి. అన్నింటికన్నా నాకు నచ్చిన అంశం ఏమిటంటే.. ఈ పాట మధ్యలో ఒక్కసారిగా మన హీరోలు అమెరికా నుంచి ఆంద్రాలోని మురికి వాడలో కనిపించడం.  అలాగే మరి కొన్ని సీన్లు. హాలీవుడ్ తీరులో తల్లక్రిందులుగా కొన్ని కొన్ని సీన్లను చిత్రీకరించడం సాంకేతుకంగా పెద్ద కఠినమైన పని కాకపోయినా, క్రియాత్మకతని దృష్టిలో ఉంచుకుంటే.. తలక్రిందులు అనే పదానికి ఈ విడియోలో బాగా కుదిరింది అని నా అభిప్రాయం.

ఈ మధ్య నాకు ఎదురైన కొంత మంది యువకులలో ఒకరిద్దరు వారి వారి భవిష్యత్ ప్రణాళికల పరంగా ఏమి అవుతావు అని అడిగితే సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పడం కొంచం విశ్మయానికి గురి చేసినా, ఇలాంటి వాళ్ళని చూస్తే వీరి ఆలోచనలు నిజమే అనిపిస్తుంది. అవును ఒక విషయాన్ని ప్రజెంట్ చెయ్యడానికి అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్స్ మాత్రమే అవ్వాల్సిన పనిలేదు. క్రొత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోగల అవగాహన ఉంటే చాలు అని నా అభిప్రాయం. ఇదిగో ఇలా.. వీరు నా స్టేట్‍మెంట్‍కి సాక్షాలు. వీరిలో ఏదో తెలియని ఫైర్ ఉంది. వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కనుక దీనిని చూస్తే వీళ్ళని పైకిరాకుండా తొక్కేస్తారు. ఈ విడియోలో నాకు మంచి డాన్స్ కనబడింది.. అలాగే వైవిధ్యమైన డైరెక్షన్ కనబడింది.. మరికొంత హ్యూమర్.. మొత్తానికి హాస్యభరితంగా పాటకు తగ్గట్టుగా ఉంది.

ఆ విధంగా టాలెంట్ అనేది ఎవ్వరో గుర్తించ వలసిన అవసరం లేదు, మనకి మనం ముందుగా తెలుసుకుంటే అంతే చాలు. వీరు గుర్తించి ప్రజెంట్ చేసారు. మన ప్రతిభని ముందుగా మనం తెలుసుకుంటే అందులోంచి క్రొత్తగా ఏదో ఒకటి ఉద్బవిస్తుంది. అలా ఉద్బవించినదే మనకి గుర్తింపుని తెస్తుంది. అంతే గాని మన టాలెంట్ ఎదుటివారు గుర్తించాలి అని మనం ఏదో ఒకటి చెయ్యకూడదు అని నేను నమ్ముతాను. ఏదో ఒకటి చెయ్య్ండి .. కానీ ఆ చేసేది క్రొత్తగా మీ స్వంత ఆలోచనతో మీదైన ఒక శైలిలో చెయ్యండి. అప్పుడు నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు. అదేదో ఆంగ్లంలో చెప్పినట్టు సెల్ఫ్ రియలైజేషన్ అన్నింటికన్నా ముందుండాలి అన్నట్టు, ముందుగా మీరు మీ టాలెంట్ ఏమిటో తెలుసుకోండి.

ఈ సందర్బంగా నాకు 7G బృందావన్ కాలని సినిమాలోని హీరో హీరోయిన్ గుర్తుకు వస్తారు. ప్రతీ వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అసలు సమస్య అంతా దానిని తెలుసు కోవడంలోనే ఉంది. దానిని తెలుసుకో గలిగితే, ఇక మనకి అడ్డు లేదు అని నేనంటాను. మరి మీరేమంటారు.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉచిత విధ్యాలయం

మొదటి రెండు పుటలు నా కలల సౌధానికి రూప కల్పన చేస్తే.. ఈ పుట ద్వారా, ఉచిత విధ్యాలయం ఎలా ఉండాలను కుంటున్నానో తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.
పేరు చెప్పినట్లుగా, ఇక్కడ పూర్తిగా ఉచితం.. విధ్య మాత్రమే కాకుండా, విధ్యార్ధనకు అవసరమైన అన్నీ ఉచితమే అని అర్దమన్నమాట. ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఉండేటటు వంటి ఒకే ఒక అర్హత, ’చదువుకోవాలి అని అనుకోవడమే’.. ఏంటీ కొత్తగా.. కొంచం అర్దం కానట్లుందా.. ఈ బడిలో చేరాలనుకునే పిల్లలకు స్వతహాగా ఆ ఆలోచన ఉండాలి అన్న మాట. ఏంటిది .. పిల్లలు స్వతహాగా అలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం రావచ్చు. కానీ పిల్లల ఆశక్తి దేనిమీద ఉందో తెలుసుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అలాగే నాకంటూ కొన్ని పరిక్షలు ఉన్నాయి. అవి సశాస్త్రీయమైనవో కాదో నాకు తెలియదు కానీ అవి నాకు ఫలితాన్నిచ్చాయి. ఆ పద్దతులను నేను పలు పిల్లలపై విశ్లేషించినప్పుడు నేను ఆశించిన ఫలితం వచ్చింది. అలాగే వారు ఆ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు.
కొంతమంది పిల్లలలో చదువంటే ఆశక్తి ఉంటుంది, మరికొంత మంది పిల్లలలో ఆటలంటే ఆశక్తి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా అలాగే అందరూ ఐన్ స్టీన్ అవ్వాలనీ ఎక్కడా వ్రాసి లేదు. కొందరు విశ్వనాద్ ఆనంద్ లాంటి వారులాగా తయ్యారయ్యితే మరికొందరు జెస్సీ ఒవెన్స్ లాగా తయ్యారు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీరందరికీ కావాలసినది అల్లా ఒక్క చేయూత మాత్రమే. అదేదో సినిమాలో చెప్పినట్టు .. ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. అవకాశం మాత్రమే కావాలి. నాకు తెలిసినంత వరకూ అదేదో తెలుగు సామెత చెప్పినట్టు, జింక చిక్కిందంటే పరుగెత్త లేక కాదు కాలం కలసి రాక .. అలా కాలం ప్రతీ ఒక్కరికీ కలసి వస్తే ప్రతీ వ్యక్తి ఓ మహర్షి అవుతాడు అని నేను నమ్ముతాను.
అవకాశం రాకే ప్రతీ వ్యక్తి పనికిరానివడౌతాడని నా నమ్మకం. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎంతమంది వచ్చిన అవకాశాలను ఒదులుకుంటున్నారో (అని వ్రాయడం కన్నా జారవిడచుకుంటున్నారో అని వ్రాయడం ఇక్కడ సమంజసంగా ఉంటుంది) నాకు తెలుసు. అలా అవకాశాలు రాక కొందరు నిర్జీవులైతే.. వచ్చిన అవకాశాలను కాలరాచి మరికొందరు నిస్తాణువులై ఏమి పట్టనట్టు మిగిలిపోతున్నారు. వీటన్నింటికీ కారణం చిన్న వయస్సులో పడాల్సిన మంచి నాట్లు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు గనక మంచి చదువు లేదా మంచి నడవడిక అలవాటైతే వారి భావితరం బాగా వర్దిల్లుతుందని నేను నమ్ముతాను.
ఇలా చిన్న వయస్సులో మంచి నడవడిక, మంచి చదువు, ఇక్కడ చదువు అంటే పుస్తకాలకు పరిమితమైనటువంటిది మాత్రమే కాదు సుమా.. కనుక మనం నేర్పగలిగితే భావితారాలకు ఎంతోకొంత మేలు చేసిన వారం అవుతామని నా అభిప్రాయం. ఇక విద్యాలయం విషయానికి వస్తే.. ఇక్కడ పూర్తిగా గురుకులం పద్దతిలో ఓ సుశిక్షుతుడైన యోధుడు ఎలా క్రమశిక్షణగా పెరుగుతాడో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ కనబడాలని నేను కలగంటున్నాను. ఈ రోజునాటికి నాకు ఉన్న ఆలోచన ఈ విధంగా సాగింది, మరి రేపటి విషయమేమిటో.. నా పాఠశాలలో నేను జరపాలనుకునే దినచర్య ఈ విధంగా ఉంటుంది. మార్పు చెందవచ్చు..
 • వేకువఝామున, సూర్యోదయానికి ముందుగా పిల్లలు నిద్రలేస్తే.. సూర్యోదయం తరువాత ఓ గంట సమయానికల్లా చక్కగా తయ్యారై బ్రేక్ ఫాస్ట్ చేసేచోటికి చేరుకుని ఓ అరగంటలో తృప్తిగా తిని ఆటలాడుకోవడానికి వెళతారన్నమాట
 • ఇలా ఆటలాడుకోవడానికి వెళే సమయం దాదాపు ఏడు గంటలవుతుంది. ఇలా ఆటలాడడానికి వెళ్ళిన పిల్లలు ఓ రెండు గంటల పాటు ఆటలాడి తొమ్మిదిన్నర కల్లా చక్కగా  వారి వారికి ఏర్పరిచిన స్థలాలోకి చేరి ఓ కడివెడు పాలు త్రాగి పది గంటలకల్లా స్నానపానాది కార్యక్రమాలు ముగించుకుంటారు.
 • పదిన్నర లేదా పదకొండు గంటలకల్లా చదువు మొదలు
 • ఒంటిగంటకు భోజనం
 • రెండుగంటకు తిరిగి చదువు మొదలు
 • నాలుగున్నరవరకూ చదువు ఆ తరువాత ఫలహారం
 • ఐదునుంచి ఏడు వరకు మళీ ఆటలు
 • ఏడునుంచి ఎనిమిది వరకూ విశ్రాంతి
 • ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య రాత్రి భోజనం
 • తొమ్మిదిన్నర నుంచి ఎవ్వరిస్టానుసారం చదువు లేదా నిద్ర
 • ..
ఎలా ఉంది నా ఆలోచన..?
 
Clicky Web Analytics