1, జూన్ 2011, బుధవారం

నేనూ తీవ్రవాదినే

Maunika

వరంగల్ జిల్లాలోని రఘునాధ పల్లిలో నిన్న జరిగిన ఘటనలో ఓ యువకుడిని గ్రామస్థులు కాల్చి చంపిన వైనంలో నాకు తప్పేమీ కనబడలేదు. ఇలా ఆలోచించడం ఓ తీవ్రవాది ఆలోచిస్తున్నట్లు ఉంటే, నేనూ తీవ్రవాదినే. నిజమే, ఆ అబ్బాయి తప్పు చేసి ఉండవచ్చు, అయినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద దండన వెయ్యడం అనే హక్కుని గ్రామస్థులు తమ చేతిలోకి తీసుకోవడం అనేది భరతీయ న్యాయ వ్యవస్థకు విరుద్దమే అని మీరంటే నా దగ్గర అందుకు ఎటువంటి స్పందన లేదు అలాగే వారి చర్యను సమర్దించేందుకు కావలసిన సరైన సమాధానం నా వద్ద లేదు. న్యాయ వ్యవస్థ పై మనకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కి న్యాయాన్ని తేల్చి శిక్షని విధించే హక్కుని తమ చేతుల్లోకి తీసుకున్నారు అంటే, దాని వెనకాల

  • గ్రామస్థుల క్షణికావేశం ఉండి ఉండవచ్చు
  • వారి కళ్ళముందు ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం వారిని అసహనానికి గురి చేసి ఉండవచ్చు
  • వారి ఊరిలోని ఓ అభాగ్యురాలు దాడికి గురై రక్తం ఓడుతున్న స్థితిలో మృత్యువుతో పోరుడుతున్న వైనం వారి ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు

నిజానిజాలేమిటో నాకు తెలియదు. కానీ నాకు కనబడుతున్నదల్లా, ఓ అభాగ్యురాలు దారుణంగా, అత్యంత హేయంగా గాయపరచ బడి  అపస్మారకంగా పడి ఉంది. (ఇక్కడ ఇచ్చిన చిత్రం ఈనాడు వారి వెబ్ సైట్ నుంచి తీసుకోబడినది) అలాంటి స్థితిలోంచి ఓ యువకుడు పారిపోతున్నాడు అని ఈనాడులో వ్రాసారు. విచారించకుండా గ్రామస్థులు తొందరపడతారని నేను అనుకోను. ఒక్కరు లేదా ఇద్దరు తప్పుగా అనుకున్నారంటే ఆలోచించవచ్చు, గ్రామం మొత్తం దాదాపు ఆరు వందల మంది గుమ్మి గూడి పోలీసుల మధ్య ఉన్న ఆ యువకుడిని లాకొచ్చి మరీ కాల్చారంటే సదరు యువకుడు..

  1. తాను చెయ్యని పనికి గ్రామస్థులు పట్టుకుంటే, వారి అహాన్ని రెచ్చకొట్టే విధంగా ప్రవర్తించి తన మీదకు తెచ్చుకునే ఉంటాడు
  2. పోలీసుకు రంగప్రవేశం చేసిన తరువాత ప్రస్తుతానికి గండం గట్టేక్కిందనుకుని గ్రామస్తులతో విర్రవీగుంటాడు
  3. తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో కనీసం గ్రామస్థుల ఆగ్రహాన్ని గ్రహించి తనని తాను నిమ్మదించుకునే ప్రయత్నం చేసే వాడు. ఒక వేళ అలా జరిగి ఉంటే, గ్రామస్థులలో ఆగ్రహం ఇలా కట్టెలు తెంచుకునేది కాదు
  4. ఇంకా .. డాష్.. డాష్..

ఇలా చాలా విశ్లేషించ వచ్చు. ఒకవేళ నిజ్జంగా అతను నిర్దోషి అయినా, ఇలా శిక్షింపబడటం అతని దురదృష్టమే. కాని ఇలాంటి ఘటన మరో యువతిని దాడి చేయ్యాలనుకునే ప్రతీ మగవాడికి ఓ గుణపాఠం కావాలి. అమ్మాయిగా పుట్టడమే ఆడపిల్లకు శాపమా అని ఇంతకు మందు కొంతకాలం క్రిందట వ్రాసుకున్నాను. ఒక్కొక్క సారి అది నిజమేమో అనిపిస్తుంటుంది. అతివలు నిస్సహాయులు కాదు గ్రామం మొత్తం ఎకమై నిలుస్తుంది అని నిరూపించడం ఆ గ్రామం యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆడ పిల్ల ఒక్క ఇంటి పిల్లేకాదు గ్రామం మొత్తానికి ఆడపిల్లే అని చాటిన రఘునాద పల్లి గ్రామస్తులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను.

ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే. రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే, ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో. ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు. అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఆ ఇంటిని దక్కించుకోవచ్చు. మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు. విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే!!

కాని ఇలాంటి స్థితిలో ఈ అమ్మాయికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఈ ఆడ పిల్ల పళ్ళు ఎవ్వరు తెచ్చి ఇస్తారు? చిన్న యాక్సిడెంటు పరంగా నా కాలి చిలమండ విరిగితేనే ఎంత కష్టంగా నాకు మాత్రమే కాక మా కుంటుంబంలోని అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయి తన ప్రాణం కన్నా మిన్నగా దాచుకునే తన మానాన్ని దోచుకునే ప్రయత్నం చేసిన యువకునితో ఆత్మరక్షణార్దం జరిగిన ఘటనలో తన శరీరాన్ని ఇంతటి దుస్థితికి చేరుకుంది అన్న విషయం తెలుసుకుని ఎంత విలవిలాడిపోతుందో అర్దం చేసుకోగలను. ఈ అమ్మాయి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎన్ని ఆపరేషన్స్ చెయ్యాలో? ఎంతటి ఖర్చు అవుతుందో? ఇంతకాలం తిండి తినకుండా ఈ అమ్మాయి ఏమి తిని బ్రతకాలి?

8 వ్యాఖ్యలు:

Tejaswi చెప్పారు...

అతను నిర్దోషి అనే వాదన కూడా వినబడుతోంది. తెలిసిన వాళ్ళని కలవడానికి ఈ ఊరికి వచ్చామని, తన భర్త కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడని హతుడి భార్య చెబుతోంది. కాలకృత్యాలు తీర్చుకుని చేతులు కడుక్కుంటుంటే, రక్తం అంటిన చేతులు కడుక్కుంటున్నాడని గ్రామస్తులు భావించి చంపి ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఆ యువకుడు(జిల్లాబాబు) యువతిపై దాడి చేసినట్లు చూసినవాళ్ళు ఎవరూ లేరనేది సుస్పష్టం. ఇక్కడ నేను అతనిని సమర్ధించడంలేదు. ఒక వేళ అతను నిర్దోషేమోనని నా సందేహం.

ramana చెప్పారు...

నేరం ఎంత దుర్మార్గమైనదైనా .. నిందితుణ్ణి సజీవదహనం చెయ్యటం సభ్యసమాజానైకి తలవంపులే ! వెంటనే ఈ దుశ్చర్యకి పాల్పడిన గ్రామస్తులపై కేస్ బుక్ చెయ్యాలి .

చక్రవర్తి చెప్పారు...

తేజస్వీ గారు,

నిజమేనండి. ఇవ్వాళ లైవ్ టీవీలో ఆ యువకుని భార్య పిల్లలు వచ్చి హైదరాబాద్ నిమ్స్ ఎదురుగుండా భైటాయింపు చేస్తుంటే చూసాను. ఎవ్వరి కధనం వారిది. ఒకవేళ అతను నిరపరాధి అయ్యుండవచ్చు. కాదనను. కానీ ఇది ఒక సాముహిక చర్యగా నిలచిపోతుంది. అతివలయెడ ఎవ్వరు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా ఇలాంటి చర్య తప్పుకాదని నాఅభిప్రాయం. ముందుగా స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.

రమణగారు,
సమాజమా!!! ఎటువంటి సమాజం గురించి మీరు ప్రస్తావిస్తున్నది? కలసి కట్టుగా ఉన్నాము అని తెలియజేస్తున్న సమాజాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులపై కేసు బుక్ చెయ్యాలా? మీ ఆలోచనా విధానానికి జోహార్లు. మీఇంట్లోని ఆడపిల్లలకు ఇలాంటి స్థితి ఎదురైతే మీరేమిచేస్తారో? ఇది నా ఇంటి ఆడపడచుకైతే నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ వారి మానానికి భంగం కలుగకుండా చూస్తాను. అలాంటి ప్రయత్నంలో నేను ప్రాణాలు తీయ్యాల్సి వస్తే నా ఇంటి ఆడపడచుకన్నా నా జీవితం ఎక్కువేమీ కాదు. ఇలా ఆలోచించడం ఉన్మాదమైతే నేనూ ఉన్మాదినే. స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.

Mauli చెప్పారు...

@ఇలాంటి ఘటన మరో యువతిని దాడి చేయ్యాలనుకునే ప్రతీ మగవాడికి ఓ గుణపాఠం కావాలి


చేదుగా ఉన్నా, ఇ౦తకు మి౦చి ఉపాయ౦ లేదు :(

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

అతను నిర్దోషి కాదనే అనిపిస్తోంది.అతను ఇంట్లోంచి పారిపోతూండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారని వ్రాశారు.కఠినశిక్షలు లేక ఇటువంటి సంఘటనలన్నీ పునరావృత్తమవుతున్నాయి.అందుకే ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.

చక్రవర్తి చెప్పారు...

మౌళి గారు,

ఇలా స్పందించినందులకు మిమ్మల్ని కూడా ఉన్మాది అనుకునే ప్రమాదం ఉంది అని ఆలోచించకుండా మీ స్పందనను తెలియజేసినందులకు నెనరులు

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,
నిజమేనండి. మీరన్నట్లు ఖఠినమైన శిక్షలు లేకపోవడం వల్లనే ఈ విధంగా కాసాయి అహంకారులు ఒంటరి ఆడ పిల్ల అనే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అపరాధి లేదా నిరపరాధి అనే విషయాల గురించి కాలమే చెబుతుంది. ముందుగా ఆ అమ్మాయి కోలుకోవాలని ఆ దేవుడుని ప్రార్ధిదాం. ఆ అమ్మాయి కోలుకుంటే విషయం తేట తెల్లమౌతుంది. స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు

ramana చెప్పారు...

మీ ఆవేశం నేను అర్ధం చేసుకోగలను . హ్రుదయవిదారకమైన మౌనిక ఫొటో పక్కనే జుగుప్సాకరమైన నిందితుడి శవం ఫొటో కూడా ముద్రిస్తే బాగుండేది . ఒక హేయమైన నేరానికి బదులుగా క్రూరమైన శిక్ష అనేది అరబ్ దేశాలలో అమలవుతుంది . ఈ అనాగరిక శిక్షల వల్ల నేరాలు తగ్గుతాయని నిరూపింపబడలేదు . మా ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగినా .. సజీవదహనాలు మాత్రం చేయను . అట్లా ఎవరైనా చేసినా తప్పని ఖండిస్తాను . తప్పని నమ్ముతున్నాను కూడా .

చక్రవర్తి చెప్పారు...

రమణ గారు,

అర్దం చేసుకున్నందులకు ధన్యవాదములు. నేను ఆవేశంతో మీ మనోభావాలు దెబ్బతినే విధంగా స్పందించి ఉంటే, మన్నించ మనవి. ఇలాంటి శిక్ష మరొకనికి గుణపాఠం అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అంతే తప్పితే ఇలాంటి శిక్షలు ఉండాలి అని నేను అనటం లేదు. మీకు మరో విషయం బంగ్లాదేష్ దేశంలో పరిక్షలో కాపీ కొట్టినట్టు రుజువైతే వారికి జైలు శిక్షే అన్న విషయం మీకు స్పురణకు వస్తే ఇది అంత పెద్ద విషయం కాదేమో అనిపించవచ్చు.

 
Clicky Web Analytics