17, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం – విలువ ఎంత?

దైవంపై పలు ఆలోచనల తరువాత, లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే ఈ పుట. దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది. ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన.

నిజానికి ఎలక్ట్రాన్ అనేది ఉందని ఎవ్వరు చూసారు? భూమి గుండ్రంగానే కాక ఎలిప్టికల్ ఆకారంలో ఉందని ఎవ్వరు చూసారు?  గురుర్వాకర్షణ శక్తి గురించి చేసిన ప్రతిపాదనను మనం ఎలా నమ్మాలి? ఇంకా వగైరా వగైరా.. ఇవన్నీ చార్వాకుల ఆలోచనలు. ఇంతకీ ఈ చార్వాకులెవ్వరు? వారి సిద్దాంతం ఏమిటి? అని ఆలోచిస్తే .. ముందుగా చార్వాక సిద్దాంతం బయట పడుతుంది. ఆ తరువాత వీరి నేచర్ అర్దం అవుతుంది.

ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము. ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి. అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది. ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే, చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే, చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి. ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే, అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట.

ఇలాంటి చార్వాకులే కొన్ని సార్లు మనకి మేలు చేస్తుంటారు, కానీ చాలా సార్లు (అంటే దాదాపుగా అన్ని సార్లు) మనకు నష్టాన్నే కలిగిస్తారు. ఉదాహరణకి నన్నయ్య గారిని మన ప్రభుత్వం ఆది కవి అని గౌరవిస్తే, అసలు నన్నయ్య అనే వాడు లేడు అందువల్ల ఇలాంటి ఆలోచన వ్యర్దం అని వాదించే వారు. అదిగో అలాంటి ఆలోచనే ఖచ్చితంగా “దేవుడు లేడనే” వాదన. “దేవుడనే వాడు నిజ్జంగా ఉంటే కనబడమనిండి చూద్దాం!!” అని వితండంగా వాదించేవారు. క్రిందటి పుటలో Physics / Geology / Education / వంటి వాటి గురించి సున్నితంగా సృజించాను. ఇప్పుడు Mathematics పరంగా లెక్కలేసే ప్రయత్నం చేస్తాను.

మనం ఎప్పుడైనా లెక్కలలో ఏదైనా తెలియనప్పుడు దానిని X (ఎక్స్) అనుకుంటాం. అలాగే ఈ దైవాన్ని ప్రస్తుతానికి X అనుకుందాం. అలాగే ప్రతీ మనిషికీ ఓ విలువ ఉంటుంది. ఈ విలువ వారు చేసే పనిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి మనచేత ఉద్యోగం చేయించుకునే వ్యవస్థ మన విలువను లెక్కగట్టి నెలకు ఇంత ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఆ విలువను Y అనుకుందాం. ఇప్పుడు నాకు అక్కడ చేసే పనిలో దైవం తోడైయాడనుకుందాం అప్పుడు నా విలువ ఏమిటంటే

నా విలువ =  X (దైవం విలువ) + Y (నాకు ప్రపంచం కట్టిన విలువ)

ఆ విధంగా నావిలువ Z అనుకుందాం. Mathematics సూత్రాల ప్రకారం  Z = X + Y

ఇప్పుడు దైవం లేదనుకుందాం. దైవమే లేదనుకుంటే, దైవానికి విలువకూడా లేనట్టే కదా, అందువలన Z = Zero + Y, కాబట్టి

Z = Y

కానీ ఒక్క సారి ఇలా ఆలోచించండి. దైవం ఉండటం వల్ల దైవానికి ఓ విలువ ఉంటుంది కదా, అందువల్లన Z = SomeValue + Y, కాబట్టి

Z ≠ Y

నేను పాజిటివ్‍గా ఆలోచించే వాడిని కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ప్రతిపాదనలోని SomeValue అనేది తప్పనిసరిగా అది సున్నాకన్నా ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. ఆ విధంగా SomeValue అనేది అధమ పక్షంలో 1 అయినా

Z = 1 + Y

నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను. ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి, ఒక సూటి ప్రశ్న. నిజ్జంగా దేవుడు లేడనుకుంటే, నాకు పోయిన నష్టం ఏమీ లేదు. అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా?

14, ఏప్రిల్ 2011, గురువారం

పుణ్యభూమిపై జరుగుతున్న దాడి – మహానుభావుల భావన

కొంతకాలం క్రిందట పుణ్యభూమి అనే గుంపునందు ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరు వ్యక్తులు నా భావాలకు వ్యతిరేకంగా స్పందించారు. వారిలో మొదటి వారు ఓ పేరు మోసిన తెలుగు బ్లాగర్ గారైతే, పరదేశి గారు మరొకరు. వీరి భావనలలోని ఆంతర్యం మరో మహానుభావునితో పోలి ఉందని ఈ మధ్య నాకు అర్దం అయ్యింది. వీరందరి ఆలోచనలలో చాలాచక్కటి పోలికే కాక భారతీయత యందు వీరందరికీ చాలా దగ్గరి సంబంధం కనబడుతోంది. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవ్వరంటే, గౌరవనీయులైన గరిక పాటి నరశింహా రావు గారు.
ప్రతీరోజు భక్తి టీవిలో గరికపాటి వారు రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నారు. మధ్య మధ్యలో వీరు పిట్టకధలుగా రామాయణం నుంచి తొలగి మన సంసృతికి పడుతున్న దుర్ఘతి గురించి వీరు పడుతున్న ఆవేదన పడుతూ చేసే వ్యాఖ్యానాలు పైన ఉదహరించిన వారి భావనలతో నూటికి నూరు శాతం సరిపోతుంది.  ఒక్కొసారి ఈ చర్చలో జరిగిన విషయాన్ని చదువుతుంటే, గరికపాటి వారి వ్యాఖ్యానం వింటుంటే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానే ఇది ఓ సరి అయిన సమయం, ముష్కరులపై మనం కూడా దాడి చెయ్యాలి. ఈ విషయం తెలియడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ వీరిని నేను అపార్దం చేసుకోలేదని బ్లాగు పూర్వకంగా వినతి. ఇక దాడి విషయానికి వస్తే, వివాదాలకి దూరంగా ఉంటూ వచ్చిన నాకు వివాదస్పదమైన చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి అనవసర దాడిని తిరిగి త్రిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యడానికి కొంచం ధైర్యం కావాలి. మన సంసృతిపై సరి అయిన అవగాహన వస్తే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది. అలాగే చొరవ వస్తుందని నమ్ముతూ సంసృతిని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
అన్యమనస్కంగా ఆ ఇద్దరి పేర్లను ఇంతకు ముందు ప్రస్తావించినందులకు వారి అభిమతం దెబ్బదిన్నట్లైతే, మన్నించ ప్రార్ధన.

13, ఏప్రిల్ 2011, బుధవారం

దైవం – ఆలోచనల రూపం

దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.

మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?

ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.

ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.

వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.

ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.

మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??

గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.

ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.

ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..

చదివి తెలుసుకోవాలి..

విని తెలుసుకోవాలి..

అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..

ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.

 
Clicky Web Analytics