ఈ అంతర్మధనం వెనకాల కారణాన్ని మొదటి భాగంలో చదివారు కదా, ఇప్పుడు మలి భాగానికి వస్తాను. ఈ పుట నేను రెండవ సారి వ్రాస్తున్నాను. మొదటి సారి అంతా వ్రాసి చక్కగా ప్రచురించే వేళకి నా కలన యంత్రం కాస్తా భీష్మించుకు కూర్చుంది. తప్పక రీబూట్ చేసి మళ్ళి మొదలు పెట్టాను. ఈసారి మొదటి సారి వివరించినంతగా కాకపోయినా కొంచం సహనంతో అన్ని విషయాలు ఏకరువు పెట్టడానికి ప్రయత్నిస్తాను.
అస్సలు విషయంలోకి వెళ్ళే ముందు ఒక ఉపోద్ఘాతం. మా తాతయ్యగారు, శ్రీ దామరాజు వెంకట రామ సూరి గారు, కాలం చేసే ముందు కొంత కాలం మా దగ్గర ఉన్నారు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వారు చెప్పిన ఓ కధ ఈ పుటకి మూలం. ఆ కధని నేను ఎప్పుడూ మర్చి పోలేను ..
ప్రతి మనిషి తన గమ్య స్థానాన్ని వెతుక్కుంటూ సాగే పయనంలో తనకు తెలిసిన లెదా తెలుసుకున్న దారులలో శ్రేష్టమైన దానిని యెంచుకుని (ఎన్నుకుని అని వ్రాసాను, ఈ పదం ఇక్కడ బాగుందా!!) తన ప్రయాణం ఆరంభం చేస్తారు. అట్లా పయనించే పయనంలో తనకు చేదోడు వాదోడుగా ఉండడానికి, హితులు.. సన్నిహితులు.. స్నేహితులు.. భందువులు.. ఇలా ఎందరో మరెందరినో కలుపుకుని పయనిస్తూ ఉంటారు.
అలాంటి పయనంలో తనకు శత్రువులు ఎదురైతే, అది తన తప్పుగా అర్దం చేసుకోవాలి. కానీ అదే పయనంలో తనకు తోడుగా పయనిస్తున్న మిత్రులు ఒక్కొరొక్కరుగా తొలగిపోతూ ఉంటే, అది తాను ఎంచుకున్న దారి తప్పుగా అర్దం చేసుకోవాలి. మన శ్రేయస్సు కోరే వారిని బలి ఇచ్చి సాగించే పయనంలో ఒక్కొక్కరూ తొలగి పోతూ ఉంటే, అలాంటి పయనంలో ఆఖరుగా మిగిలేది ఒంటరి తనమే. అలాంటి పయనం కన్నా శుఖః దుఖాఃలయందు మనతో పాటు కలసి పయనించే తోడు అవసరం అని ప్రతి వ్యక్తి గమనించాలి. అలాంటి సహచరుల కోసం అవసరమైతే మనం పయనించే గమనాన్ని లేదా మనం జీవించే పంధాన్ని మార్చుకోవాలి.
ఇది చాలా పెద్ద కధ, కానీ క్లుప్తంగా పైన చెప్పినట్లన్నమాట. అందువల్ల చెప్పొచ్చినదేమిటంటే, నా పంధా కనుక నాకు శత్రువులను తెచ్చిపెట్టినా ఫరవాలేదు కానీ, ఉన్న మిత్రులను కోల్పోయేటట్లుంటే, ఆలోచించ వలసిన .. కాదు కాదు, మార్చుకో్వలసిన సమయం ఆశన్నమైందన్నమాట. అందుకని ఒక్కొక్క పుటని ఒక్కొక్కరికి కేటాయించేదుకు బదులుగా .. అందరికీ ఒక్క సారే జేజేలు కొట్టేస్తే పోలా అని తోచింది. అదిగో అలా తోచినదే తడవుగా ఇలా..
***************************************************************************
తాడేపల్లి గారు : వీరి గురించి నేను చెప్పేటంతటి వాడినా!! వీరు ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. మరి పుస్తక ప్రదర్శన శాలలో ఊరుకుంటారా.. వీరి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే..
దాట్ల శ్రీనివాస రాజు గారు: వయస్సులో నాకన్నా చిన్న వారైనా, ఎప్పుడూ చిరునవ్వుతో ఏది అడిగినా సహనంతో చక్కగా వచ్చే పోయ్యే వారందరికీ ఏదో తనకు తోచినది చేర వెయ్యాలి అన్న తపన నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది..
నల్లమోతు శ్రీధర్ గారు: వీరికి దేవుడు ఓర్పు అనే పదాన్ని లెదా పదార్దాన్ని ఎంత మోతాదులో ఇచ్చాడో అని ఎన్ని సార్లు నన్ను నేను ప్రశ్నించు కున్నానో నాకే తెలియదు. వీరికి ఇంత ఓర్పు ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్దం కాలెదు
నమ్మల నాగ మురళీధర్ : వీరు వచ్చినన్ని రోజులూ వీరితో పాటుగా వీరి కలన యంత్రం చక్కగా పాలు పంచుకుంది. వీరికి ధన్యవాదాలు చెప్పాలో లేక వీరి కలనయంత్రానికి చెప్పాలో అర్దం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. వీరి కలనయంత్రం చాలా బాగా ఉపయోగ పడిందంటే అతిసయోక్తి కాదు్
కశ్యప్ గారు : అడగంగానే పుల్లైస్ కొనిచ్చిన వీరిని ముందుగా ప్రస్తావిస్తే ఏదో స్వార్దం అనుకుంటారని తలుస్తూ.. తటపటాయిస్తూ.. ఏది ఏమైనా వీరిని మర్చి పోకూడదని ఇక్కడ. ఎంత చలాకీగా పాలు పంచు కున్నారంటే, వీరిని చూస్తే దీపావళి సీమటపాసు కాయ గుర్తుకు వస్తుంది
జీవితంలో కొత్తకోణంతో మన ముందున్న శ్రీనివాస్ గారు : ఎంత వినయస్తులో .. నేను చెప్పేకన్నా మీరు మాట్లాడి చూస్తే తెలుస్తుంది. ఇంత నిదానం మనిశిని నేను ఇంతక ముందు చూడలేదంటే నమ్ముతారా..
చావా కిరణ్ గారు : అడగంగానే నేనున్నాను అనే రీతిలో ఎక్కడున్నా ఎప్పుడైనా పిలవంగానే వాలేస్తారు. కావలంటే ఒక్క సారి మీరు ప్రయత్నించి చూడండి
సనాతన భారతిగా బ్లాగుతున్న సతీశ్ : లేటుగా వచ్చినా లేటెశ్టుగా వచ్చా .. అన్న నానుడి వీరికి చక్కగా సరిపోతుందేమో వీరు అంతగా పాలు పంచుకోక పోయినా, ఎవ్వరెవరు ఏమేమి చేస్తున్నారు అని గమనిస్తూ, ఎవ్వరికైనా ఏదైనా సహాయం కావలంటే సహాయం చెయ్యడానికి సంశయించని వీరి వ్యక్తిత్వానికి జేజేలు కొట్టాలనిపించింది
చాలా మంది పేర్లు నాకు గుర్తుకు రావటం లేదు, కావున మీరు నాకు గుర్తులేరనుకోవద్దు, ఒక్క సారి స్పందించ గలరు. మీ ముఖ చిత్రం చూస్తే తప్పక గుర్తు పడతాను. కావున నన్ను క్షమించి, ఇక్కడ ఒక్కసారి స్పందించండి.
ఇక మహిళా బ్లాగర్ల విషయానికి వస్తే.. మొట్ట మొదటగా ఒక్కరు నేను ప్రస్తావించకుండ ఉండలేను ..
రమణి గారు : కాలేజీకి వెళ్ళే కూతురు ప్రక్కనే ఉన్నా, నేను గమనించ లేక పోయ్యాను. అంటే ఇకడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే.. వీరు వయ్యస్సులో పెద్దవారైనా అంత గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా, అందరితో చనువుగా మెలిగిన తీరు చూస్తుంటే, అబ్బుర పడ్డాను.
పప్పు అరుణ గారు : వీరిని చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. అదేదో పాత సినిమాలో ఉమ్మడి కుటుంబంలో సావిత్రి గారిలా, మరో సినిమాలో ఇంటికి పెద్దక్క అయిన జయప్రద గారిలా, మరో సినిమాలో సౌందర్య లాగా చలాకీగా తిరిగే వారు
ఙ్ఞాన ప్రసూనాంబ గారు : వీరు చేసిన పూర్ణాలు ఇంకా నా శృతి పధంలోంచి జారుకోలేదంటే నమ్మండి. మేము తింటామని తలచి కష్టపడి ఇంటి నుంచి చేసి తీసుకు వచ్చారంటే, వీరి ఆప్యాయతను ఏ శిఖరానితో పోల్చాలో నాకు అర్దం కావటం లేదు. వీరు చేసిన పూర్ణాలకు ముక్తాయింపు నేను, నాకు తోడుగా పైన ఉదహరించిన రమణిగారు వీరికి సరి సమానంగా మరో బ్లాగరు సుజాత గారు పోటీ పడి మరీ ఆ డబ్బను ఖాళీ చేసామనుకోండి. బ్లాగు ముఖంగా వీరికి మరోసారి భన్యవాదములు అలాగే మరో విన్నపము.. మనం ఇంకొక సారి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు? అదేనండీ కలవడానికి వచ్చినప్పుడు మీరెలాగో ఒట్టి చేతులతో రారు కదా.. చక్కగా వచ్చేటప్పుడు ఆ పూర్ణాలేవో చేసి తెస్తారు కదా.. వాటి గురించి మనం అప్పుడు చర్చించు కుందాం. ఏమంటారు.. ఏమి అనకండి, ఎప్పుడు కలుస్తున్నామో నాకు ఒక్కడికే మైల్ చెయ్యండి, లోకానికి తెలిసందనుకోండి నా వాటా పూర్ణాలు కొట్టేస్తారు. (ఇక్కడ వ్రాసిన వాళ్ళందరిలో వీరి గురించే ఎక్కువ ప్రస్తావించడం వెనుక పూర్ణాలే కారణం కాదని గమనించాలి)
శిరీష గారు : వీరు ఓ పెద్ద కంపెనీలో మంచి పొజీషన్ లో ఉన్నా అందరితో చాలా కలివిడిగా తిరిగిన తీరు చూస్తుంటే, ముచ్చట వేసింది. నేను చాలా కొద్ది మహిళా బ్లాగర్లతో మాట్లాడాను, అలాంట్ వాళ్ళలో ఎక్కువ సేపు వీరితోనే మాట్లాడానంటే మీరు నమ్మాలి
పూర్ణిమ గారు : వయస్సులో నాకన్నా చిన్నవారైనా (ఇలాంటి పద ప్రయోగం చెయ్యడం అసభ్యం అనుకుంటే, క్షమించాలి) వీరితో అస్సలు మాట్లాడలేదు కానీ వీరు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా వీరి భావనలు, వీరి ఆలోచనలు నా ప్రమేయం లేకుండనే నా చెవిన పడ్డాయి. కొన్ని విషయాలలో వీరిది చాలా స్పష్టమైన భావన, ఖశ్చితమైన ఆలోచనా సరళి, వీరి పరి పక్వాన్ని తెలియ జేసింది. ఇంకా ఎక్కువ వ్రాస్తే, అర్దం చేసుకునే కన్నా అపార్దానికి అవకాశం ఉంది.
సుజాత గారు : ముందు చెప్పినట్లుగా, వీరు నాకు పోటీకి వచ్చారు. అదేనండీ, పైన ప్రస్తావించిన పూర్ణాల విషయం గుర్తు ఉండే ఉంటుంది. కొంచం కుళ్ళొచ్చింది, కానీ అక్కడ స్థానబలం వారి వైపే ఉంది. వీరితో మాట్లాడుతుంటే, ఎటువంటి inhibition లేకుండా మాట్లాడేశానంటీ అని నామీద నాకే ఆశ్చర్యం వేసింది. అడగంగానే వెళ్ళి మిర్చి బజ్జీలు తెచ్చిచ్చారు. కానీ నా వరకూ రాలేదు. పైన ఉదహరించిన అరుణగారు మళ్ళి వెళ్ళి తీసుకు వచ్చి, మిస్సయిన వాళ్ళకోసం దాచి మరీ పంచారు.
వలబోజు జ్యోతి గారు : వీరిని రెండుసార్లు కలిసాను, కలసిన రెండు సార్లు, చక్కగా వారి ఇద్దరు సంతానంతో వచ్చారు. వారి పుత్రికా పుత్రులు వారిలాగే చాలా కలివిడిగా కలసి మెలసి పోయ్యారు. ఆ!! మరో విషయం మర్చి పోయ్యాను. అదేనండీ, సున్నుండలు.. ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ బాగున్నాయి. వీరు ఉత్తచేతులతో రావడం నేనెప్పుడూ చూడలేదు. ఏమిటో ఇలాంటి వాళ్ళను చూస్తే, కొంచం గర్వంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉన్నాను అని
ఆఖరుగా కాకపోయినా చివ్వరలో, వరూధిని గారు : వీరిని కలవక ముందు వరకూ వీరికి కొంచం గాంభీర్యం పాళ్ళు ఎక్కువ అని అనుకునే వాడిని. వీరిని కలిసిన తరువాత నేను చదివిన వారేష్ బ్లాగు చీరిదేనా అనిపించింది. అచ్చంగా చెప్పాలంటే, down to earth, అనుకోండి. తెలుగులో ఇలాంటి వారిని ఏమంటారో అర్దం కాలేక పోవడమే ఈ పుట ఇంత ఆలస్యంగా ప్రచురించడానికి కారణం. నేను అతి తక్కువగా మాట్లాడిన మహిళా బ్లాగర్లలో వీరిదే అగ్రస్థానం.
--------
ముగించే ముందు మరొక విన్నపం, రాజుగారి రెండవ భార్య బాగుంది అంటే.. పెద్ద భార్య బాగాలేదా అన్నాడట వెనుకటికి ఒకడు.. అలా ఒకళ్ళ గురించి వ్రాస్తే, మరొకరికి ఈ గొప్పతనం లేదా అని మాత్రం చచ్చు ప్రశ్నలు వేయకండి. అలాంటి చొప్పదంటు స్పందనలను తొలగించే హక్కు నాకు ఉందని మరచి పోవద్దు
ఇక నా అభిప్రాయం ఇంతటితో ముగింపునకు వచ్చింది. మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను,
ఇట్లు,
భవదీయుడు