9, సెప్టెంబర్ 2008, మంగళవారం

బంధం - సంబంధం - అనుబంధం : అమెరికాలో నా ఆలోచనలు ౨

మొదటి పుట చదవని వాళ్ళు ముందుగా దానిని చదివి తరువాత ఈ పుట దర్శించమని మనవి. మొదటి పుట చదివిన తరువాత పడ్డ మొట్టికాయలు కూడా చదవడం మర్చిపోవద్దు. మొట్టికాయల ప్రవాశం చదివిన తరువాత, ఇంత మంది ఇంతగా ఇదిగా చెబుతున్నారంటే.. వీరు స్పందించిన విషయాలు ఎంత వరకూ సమంజసం .. లేక నా ఆలోచనలలో ఎదైనా తేడా ఉందా అన్న సంశయం నన్ను ఈ రెండవ పుటను ప్రచురించే సమయాన్ని కొంచం ఆలస్యం చేసింది. ఏది ఏమైతేనేమీ, ఆలోచనలతో కర్తవ్యాన్ని మరవకూడదని, ఆలోచనలను ఆపకుండా, సమాంతరంగా వాటి పని వాటిని చేసుకోనిస్తూ ఇదిగో ఇక్కడ ఇలా. ఈ పుటలో "సంబంధం" అనే విషయాన్ని ’అమెరికాలో నివసిస్తున్న వారు ఎలా అనువదించుకుంటున్నారో’ అని నాకు అనిపించిందో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను.

తెలుగులో పదాలన్నీ ఒకేలాగా అనిపుస్తున్నా.. నాకు మాత్రం "బంధం" అనేది ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించినదని, "సంబంధం" అనేది తప్పని సరిగా వ్యక్తులకు మాత్రమే కాదు గానీ ఒక వ్యక్తికి మరియు ఒక వస్తువుకు మధ్య ఉండేది కూడా కావచ్చు అనిపిస్తోంది. అందుకని ఇక్కడి మనుష్యుల మధ్య మాత్రమే కాకుండా ఇక్కడి ప్రతీ వ్యక్తీ తనతో అవసరం ఉన్న ప్రతీ వస్తువైనా / మనిషైనా / మరి ఏదైనా.. వంటి వాటి యందు ప్రవర్తిస్తున్నారో అని గమనించిన తరువాత నాకు అవగతమైన విషయాలు మాత్రమే ఈ పుట. ఇంతక ముందు చెప్పినట్లుగా ఈ పుట నేను ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాస్తున్నది కాదు. కాబట్టి ఎవ్వరూ తప్పుగా భావించరని తలుస్తాను.

అసలు విషయానికి వచ్చేముందు ఒక చిన్న ఉపోద్ఘాతం.. నేను భారతదేశంలో ఉండేటప్పుడు, తప్పని సరిగా వారానికి ఓ రెండు సార్లో (అధమ పక్షం) లేదా రోజూనో, మా అన్నయ్య ఫోన్ చేసి, ఎలా ఉన్నారు? ఏమి చేస్తున్నారు? అంతా బాగానే ఉందా.. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఒక వేళ నేను ఆఫీస్ లో ఉంటే, కాల్ కట్ చేసి, నేను ఇంటికి వెళ్ళిన తరువాత నేను కాల్ చేసి వివరాలు అడుగుతూ ఉంటాను. ఈ తతంగం అంతా మా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది. ఇది మా మధ్య ఉన్న అతి సాధారణ మైన పని. అవసరం ఉన్నా లేక పోయినా ఫోన్ చేసి.. ’ఎలా ఉన్నావు’ అని పలకరించి పెట్టేస్తాం.

 

ఏదైనా విషయం ఉంటే ఓ పది నిమిషాలు పిచ్చాపాటి, లేకపోతే ఒక్క నిమిషం పని. అంతే. ఇక్కడేమో (అంటే అమెరికాలో..) ఎవ్వరికైనా ఫోన్ చేసి ’ఎలా ఉన్నార’ అని అడిగామో .. అంతే, వెంటనే ఎదుటి వాళ్ళు (వాడితో) ఏదో పని ఉండే చేశారనుకుంటారు. మనం ఏదీ అడగక ముందే, ’మేమేమైనా చెయ్యగలమా..’ అని అడిగేస్తారు. అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది స్పందన ఇలాగే ఉంది. ఇది వాళ్ళ గొప్పతనం అనుకుందాం. ’అక్కరలేద’ అని అన్న వెంటనే, పెద్ద.. పని లేనప్పుడు ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసావు అన్నట్లు ఒక ఫీలింగ్ పెట్టి అయితే  ’అస్సలు సంగతేమిటో చెప్పి ఏడు..’ అన్నట్లు ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తారు.

 

దీనిని బట్టి ఇక్కడ public relation అనే మాటకి అర్దం లేదనిపిస్తోంది. ఎవ్వరైనా తమను పలకరిస్తుంటే, ఆనందం కన్నా ముందు భయాన్ని పెంచుకుంటున్నారు. ఏమన్నా అన్నమనుకోండి, ఎదుటి వాళ్ళు తమనుంచి ఏదో ఆశిస్తున్నారు అందుకనే తమని పలకరిస్తున్నారు అని ఆలోచిస్తారు. అనవసరంగా ఒకరినొకరు పలకరించుకోరు. ఏదైనా పని ఉంటేనే ఇద్దరు మాట్లాడుకుంటారు, అది సహోధ్యోగులైనా, మన ఇంటి ప్రక్కన నివశిస్తున్న వారైనా, మరి ఇంకెవరైనా. మరి భార్య భర్తల విషయమేమిటో!!! (నాకు తెలియదు...)

ఈ ప్రవర్తన ఇద్దరు మనుష్యుల మధ్యనే అనుకుందాం అనుకుంటే.. అంతటితో ఆగి పోలేదు. ఇక్కడి (అమెరికాలోని) వాళ్ళు చాలా సాధారణంగా కార్లు ఉపయోగిస్తారు. చాలా అసాధరణంగా ద్విచక్ర వాహనాలు వాడతారు. వ్యాయామానికి మాత్రమే ద్విచక్ర వాహనాన్ని వాడుతారు. ఇక్కడ నాకు తిరగడానికి కారు లేనందున, వీలైతే సౌఖ్యంగా ఉంటుంది కదా అని ఒక సైకిల్ కొంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. అన్నదే తడవుగా ఎవ్వరు అమ్ముతారు ? ఎంతలో ఉంటాయి? అని పరిశోధించడం మొదలు పెట్టాను. ఈ ప్రయత్నంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అర్దమయ్యాయి. సైకిల్ విషయం అనగానే.. నా గతం.. సైకిల్ తో నాకు ఉన్న అవినాభావ సంభంధాన్ని ఈ ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనిపించింది.

 

నాకు గుర్తున్నంత వరకూ నేను ఏడో తరగతి ఉత్తీర్ణుడినైన తరువాత నాన్నగారిని సైకిల్ కొనిపెట్టమని పోరితే ఎనిమిదవ తరగతి అయ్యిన తరువాత (దాదాపుగా 1983 లో అనుకూంటా) ఒక చిన్న సైకిల్ కొనిపెట్టినట్లు చూచాయగా గుర్తు. అప్పుడు దానిమీద ఉదయం పూట సంగీత కళాసాలకు అలాగే సాయంత్రం టూషన్ కు మాత్రమే వెళ్ళనిచ్చే వారు. ఎందుకంటే ఆ వేళల్లో ఎక్కువ రద్దీ ఉండదు మిగిలిన వేళల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, తెలిసో తెలియకో దేనికైనా గుద్ది గాయ పడతామో అని వారి అభిప్రాయం.

 

కానీ కొనిచ్చే ముందు వారు పెట్టిన షరత్తేమిటంటే, ’తొక్కినా తొక్కక పోయినా.. రోజూ సైకిల్ ని గుడ్డ పెట్టి తుడవాల్సిందే’. వర్షాకాలంలో ఎక్కువగా తొక్కేది ఉండదు. అందుకని ఎక్కువ కాలం లోపలే ఉంటుంది. ఆ వేళల్లో చక్కగా నూనె వేసి తళ్ళుక్కు మనేటట్లుగా రుద్ది రుద్ది మరీ శుబ్రం చేసేవాడిని. ఆ తరువాత కాలేజీ కి వచ్చిన తరువాత రేంజర్ సైకిల్ ఒకటి అమ్మ కొనిబెట్టింది. (చూచాయగా 1992 Decemberలో) దీనికీ వాళ్ళెవరూ చెప్పకపోయినా, అలవాటైన ప్రాణం కదా.. ఎవ్వరూ చెప్పనక్కరలేదు. ఆ తరువాత ఉద్య్గోగంలోకి వచ్చిన తరువాత ద్విచక్ర వాహనం. Feb 2002 లో కొన్నాను. Oct 2nd 2006 లో నేను ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో కాపురం మొదలు పెట్టాను. అప్పటి వరకూ నా బండిని నేనే తుడుచుకునే వాడిని. ప్రస్తుతానికి నేను తుడవక పోయినా, మా అపార్టుమెంటు వాచ్ మెన్, ’అయ్యా నేను తుడుస్తా.. నెలకు ఎంతోకొంత ఇవ్వండి’ అనడంతో మానేశాను. కానీ క్రమం తప్పకుండా నేనే దగ్గరుండి సర్వీసింగ్ చేయించుకుంటాను.

కానీ ఇక్కడి (అమెరికాలోని) వ్యక్తులను గమనించిన తరువాత, ఒక్క విషయం అర్దం అయ్యిందేమిటంటే. పనిచేస్తోందా, కానీయి. రిపేరుకు వచ్చిందా, మూల పడేయి, అంతే.. వెంటనే, కొత్తది కొన్నుక్కో. ఇక్కడ (అమెరికాలో) అప్పుడప్పుడు గరాజ్ సేల్స్ అనేవి జరుగుతుంటాయి. వీటి ఉద్దేశ్యమేమిటంటే, వారికి అవసరం లేనివి లేదా పనికిరాని వస్తువులు, ఎలా ఉన్న వస్తువులను అలా, యధావిధిగా అమ్మెస్తారు, కొనేవాళ్ళు అందుకు సిద్దమైతే ముందుకు వెళ్ళాలి. వీలైతే అమ్మెస్తారు, లేదా పారేస్తారు. వాటి స్థానంలో కొత్తవి తెచ్చుకుంటారు.

 

చాలా తక్కువ మంది తగిన పరికరాలు తెచ్చుకుని చెడిపోయిన వాటిల్ని బాగుచేసుకుని తిరిగి వాడుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కళ దగ్గర అధమ పక్షం రెండు సైకిళ్ళు పనిచెయ్యనివి ఉండటం గమనించాను. ఇలా చెడిపోయిన వస్తువుల్ని బాగుచేసుకుని వాడుకుందాం అని అన్నాననుకోండి, మన Independent లాంటి వాళ్ళేమే నాది చీపు మనస్తత్వం అంటారు. ఏమి చేస్తాం, కష్టం లోంచి పుట్టి పెరిగిన వాళ్ళం కదా, మాదంతా మట్టి వాసనే మరి. మా చమట కూడా వాసనే..

 

ఆఖరుగా చెప్పొచ్చినదేమిటంటే, "సంబంధం" అనేది "అవసరం ఉంటేనే" అని మాత్రమే వీరి అభిప్రాయము అనిపిస్తోంది. నేను తప్పుకావచ్చు. చదువరులు అచ్చు తప్పులెక్కడ ఉంటే అక్కడ ఎలాంటి పదం ఉంటే బాగుంటుందే తెలియ జేస్తారని తలుస్తాను. మరో పుటలో "అనుబంధం" గురించి వ్రాయడానికి ప్రయత్నిస్తాను. అంత వరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

--------------------------
మేడిపండు జూడ మేలిమై యుండున్, పొట్ట విచ్చి చూడ పురుగు లుండు
బెరుకువాని మదిని బింక మీలాగురా, విశ్వదా అభిరామ వినురా వేమా

2 కామెంట్‌లు:

దైవానిక చెప్పారు...

చక్రవర్తి గారు,
ఈ కామెంట్ మీ టపాకి కాదు. ఆఖరున వున్న వేమన పద్యానికి. అది చూసి ఎందుకో ఉండబట్టలేక సరి చేయాలనిపించింది. తప్పుగా భావించకండి.
మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్ట విప్పి జూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వధాభిరామ వినుర వేమ!

తెలుగుకళ చెప్పారు...

చాలా విచిత్రంగా ఉంది.
తిండీ తిప్పలు లేకపోయినా ఉండొచ్చుకానీ ఓ పలకరింపు లేకుండా వాళ్ళెలా , ఎందుకు బ్రతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు.
poor fellows !
మీ టపా చూసాక ఎప్పటికైనా ఓ సారి అమెరికా వెళ్ళి రావాలన్న నా కోరిక గురించి ఓ సారి ఆలోచించాల్సిందే ననిపిస్తుంది. ...............పద్మకళ.

 
Clicky Web Analytics