భాధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భాధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2012, మంగళవారం

సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..

హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!!

మొదటి కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ చాలా పట్టణాలు తిరిగారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులు వీరికి చాలా కష్టాలు చూపించారు. ఈ విషయాన్ని ఆ ప్రేమికులే వారి స్వయం అనుభవాలుగా వివరించారు

రెండొవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కధనం ప్రకారం అబ్బాయి రైల్వే పట్టాల మీద శవమై కనబడ్డాడు. అంటే దీనిని ఆత్మహత్య క్రింద చిత్రీకరించారని సమాజంలోని కొన్ని మహిళా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి న్యాయం జరగాలని పోరాటం జరిపారు. ఈ విషయం అంతా చనిపోయిన అబ్బాయి తల్లి చేత చెప్పించారు.

మూడవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కల్లా ఒక్కటే.. వారిద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి వాటికి తోడుగా అక్కడి పెద్దలు కూడా వీరి వివాహానికి సమ్మతినివ్వలేదు. వాటిని  సమర్దించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ కలసి ఢిల్లీ వెళుతుంటే, దారిలో కాపు కాచి బస్సులో ప్రయాణం చేస్తున్న అబ్బాయిని కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినందుకు అబ్బాయి చెల్లెల్ని కూడా చంపించే ప్రయత్నం చేసారని ఆ అమ్మాయే చెప్పింది. న్యాయస్థానం కొందరు హంతకులను గుర్తించి పలువురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. మఱి కొందరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది.


ఇలాంటి వారిద్దరి కధలే ఈ నాటి చర్చాంశం.

 

సత్యమేవ జయతే గురించి జరిగిన ప్రచారంలో కొన్ని నగ్న సత్యాలు నన్ను చాలా భాదించాయి. అందుకని సత్యాన్ని నగ్నంగా నైనా చూసే ధైర్యం లేని నాలాంటి వాడు మొదటి ఎపిసోడ్ నందలి కొన్ని నిజాలు తెలుసుకున్న తరువాత, నిజాన్ని జీర్ణించుకు లేని స్థితిలో తరువాతి ఎపిసోడ్స్ చూడలేదు.

 

ఆ తరువాత చూసిన మఱో ఎపిసోడ్ ఇది. నేను ఈ ఎపిసోడ్ చూసే సమయానికి ఎంత భాగం అయ్యిందో తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు, ఓ గ్రామ పంచాయితీలోని ఓ ఐదుగురు పెద్దవాళ్లతో చర్చిస్తున్నారు. చర్చ ఎప్పుడూ మంచిదే కాదనను, కానీ చర్చ అనేది ఒక వైపుగా జరగ కూడదు. ఇరువైపులనుంచి జరగాలి. కానీ పంచాయితీ పెద్దలతో ఇక్కడ జరిగిన తతంగం చర్చలా కాకుండా, వారిని అపహాస్యం చేస్తుంటే, ప్రేక్షకులలో కూర్చున్న వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలేమో పరంపర / Tradetion అంటూ ఉంటే, మన అమీర్ ఖాన్ గారేమో భారతదేశ రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారు. వీరి చర్చను పూర్తి చెయ్యకుండానే అమీర్ ఖాన్ గారు మధ్యలో ముగిస్తూ మఱో వ్యక్తిని ప్రవేశ పెట్టారు

 

వీరి తరువాత మఱో వ్యక్తి వచ్చారు. ఆయన లవ్ కమాండోస్ అనే ఓ సమాజానికి ప్రతీకగా వచ్చారు. ఇంటర్ కాస్ట్ మారేజస్ మాత్రమే మన భారత దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతున్నాయని, అవి మాత్రమే భారతదేశ గౌరవాన్ని నిలబెడతాయని సుప్రిం కోర్ట్ చెప్పిందని ఈయన చెబుతున్నారు. ప్రేమ మూర్తులుగా కనబడే దేవతలను ఉదహరింపుగా రాధా శ్రీకృష్ణులను చూపిస్తున్నారు కదా!! అలాంటి వారందరికీ ఓ మాట చెబుతున్నాను, వీలైతే ఆ మూర్తులున్న గుడిలలో పూజలైనా ఆపేయ్యండి లేదా.. ప్రేమియోంక ప్రేమ్ కో స్వీకార్ కర్లో.. love shall conquer the world.. అనేది వీరి భాష్యంలోని ఆఖరి అంశం.

వీటి తరువాత, ఉదాహరణగా మఱో ప్రేమ జంట గురించి ప్రస్తావించారు. అలాగే, ఆ ప్రేమ జంట యొక్క చరిత్రను వివరిస్తూ వారి కుటుంబం వారిని పాతిక సంవత్సారాలు దూరంగా ఉంచిన తరువాత వారికి మఱో సారి సాంప్రదాయ బద్దంగా వారికి వివాహం జరిపించిన వైనాన్ని చిత్రీకరించి ప్రేక్షకులకు సెంటిమెంట్ అందేపరంగా చూపించారు.

ముగింపులోకి వస్తుండగా, ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి తన తండ్రికి సందేశానిస్తూ క్షమించమని వేడుకోవడం దానిని అమీర్ ఖాన్ గారు సమర్దిస్తూ ఆ పిల్ల తల్లి తండ్రులను బుజ్జగించే ప్రయత్నం చేసే పనిగా, ఓ చక్కని పాటని అందించారు.

ఇది అక్కడ జరిగింది. నా అభిప్రాయం మఱో సారి విపులంగా వ్రాస్తాను. ఈ పుటని ఇక్కడతో ముగించి, “సత్యమేవ జయతే ..” లో ఈ ఎపిసోడ్ గురించి నా అభిప్రాయాలు వ్రాసే ముందుగా, ప్రేమ అనే పదం గురించిన నా నిర్వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, నా భావన ఏమిటో .. అది ఏ కోణం నుంచి చూస్తూ వ్రాస్తున్నానో అనే విషయం పై ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది.


ప్రేమ పై నా నిర్వచనం

ప్రేమ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొవిధంగా అభివర్ణిస్తాను. నా భావనలో మాత్రం, ప్రేమ అంటే భాద్యత. మనం ఎవ్వరినైనా ప్రేమిస్తున్నాం అంటే వారి భాద్యత తీసుకున్నట్లే. ఇది భార్యా భర్తల విషయమైనా లేదా తల్లి పిల్లల విషయమైనా లేదా తండ్రి పిల్లల విషయమైనా లేదా మరింకేదైనా. ఆ విధంగా ప్రేమించడం అంటే భాద్యతని భుజాలపై వేసుకుని, ప్రేమించ బడుతున్న వారికి ఒక రకమైన భద్రతా భావనని ఇవ్వటమే అని నా అభిప్రాయం మఱియు అనుభవం.

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

12, జూన్ 2011, ఆదివారం

బొత్స సత్యన్నారాయణ – నా అభిప్రాయం

బొత్స సత్యన్నారయణ గారి గురించి క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. కాకపోతే, ఒక్క సారి వారి గతాన్ని అవలోకించుకుంటే, కొన్ని పచ్చి నిజాలు నాకు మింగుడు పడని పచ్చి వెలక్కాయలు అవుతాయి. ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా ఓ అభిప్రాయం ఉంది, కాకపోతే అది ఒక రాజకీయ పార్టీగా కాక రాజకీయ వ్యాపార వ్యవస్థగా ఓ మంచి వ్యాపార దృక్పధం కలిగిన సంస్థగా లాభాలను ఆర్జించే దిశలో సాగి అభివృద్ది చెందుతున్న లంచాల పార్టీగా నాకు అనిపిస్తోంది.

ఈ అభిప్రాయం వెనకాల కొన్ని (నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే) వివరాలు. మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని. కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి. ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ .. డాష్.. వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు, ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం. కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు.

ఇక వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలిందంటూ, వేరే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, స్వతంత్ర పార్టీగా ఎదిగిన ప్రజా రాజ్యం పార్టీ, సదరు ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత, ప్రస్తుతం అవినీతి / లంచ గొండితనం / వగైరా వగైరా లేవు కాబట్టి, ప్రరాపా అవసరం లేదు, చక్కగా కాంగేస్ పార్టీలో కలసి పోతాం అన్న వివరం నాకు మింగుడు పడటం లేదు. దీని వెనుక మాకేమీ ధనలాభం జరగలేదు అని ప్రరాపా వారు అంటే, నిరూపించడానికి నావద్ద సాక్ష్యాలు లేవు. కానీ అదంతా ఒఠి హంబక్, అంటూ నమ్మెయ్యమంటే కొంచం కష్టం మరి.

రారె గారు, రాజశేఖర్ రెడ్డి గారు అని ఇకపై చదువుకోమనవి. రారెగారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వాగెన్ స్కాం ద్వారా తన పదవిని కోల్పోయిన ప్రస్తుత బొస గారు, (బొత్స సత్యన్నారాయణ గారు), ఆంద్రప్రదేశ్ కాంగ్రేశ్ పార్టీకి అధ్యక్ష్యులు అయ్యారు. అప్పటి స్కాం కనుక ప్రతి పక్షం వారు పట్టించుకోకుంటే, మఱో కర్మాగారం ఆంద్ర ప్రదేశ్ కు వచ్చేది. అదేనండి కార్ల తయారి కర్మాగారం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరికేది. సరే, అది అంతా గతం, అదే గనుక జరిగి ఉంటే, బొస గారు చక్కగా ఆ సంస్థ పనులలో బిజీగా ఉండి ఇలా అయ్యేవారు కాదేమో. ఇలా జరిగినందులకు బొసగారు అప్పటి ప్రతి పక్ష నాయకుడైన నాచనా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలా ఋణ పడి ఉంటారు. ఉండాలి కూడా.

నాచానా గారు పట్టు పట్టి బొసగారిని పంచాయితీ రాజ్ వ్యవస్థనుంచి తప్పించ కుంటే, బొసగారిలో కసి పెరిగేది కాదు. అలా బొసగారిలో కసి పెంచి వారి కుటుంబం నుంచి ఏకంగా నలుగురు వ్యక్తులను ఎమ్ ఎల్ ఎ లుగా చేసేటట్టు చేసిన నాచానా గారికి బొసగారు ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక్కరు ఎన్నికల్లో గెలవడమే చాలా కష్టమైన సందర్బాలుండగా, ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి పార్టీ టికెట్టులు తెచ్చుకుని, ఆ నలుగురిని గెలిపించే భాద్యత బుజాల మీదకు వేసుకున్న బొసగారు సామాన్యుడు కాదని మనం గమనించాలి. నిజమే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నికల్లో పార్టీ సీటు రావడం గొప్ప కాదు, కానీ ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందంటే, ఆ కుటుంబం అయితే ప్రజా సేవలో నిరతిశయమైన కృషి చేసుండాలి లేదా మరింకేమైనా చేసి ఉండాలి. బొసాగారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించిన నలుగురు వ్యక్తుల గురించి ప్రజలకు అంతగా కాదు కద కొంతగా కూడా తెలియదనే చెప్పుకోవాలి. ఇక్కడ నా మట్టి బుర్రకు సమాధానం లభించని కొన్ని ప్రశనలు.

  • కొంతగా కూడా తెలియని ఈ నలుగురికి కాంగ్రెస్ టికెట్టు ఏ బేసిస్ మీద ఇచ్చిందబ్బా?
  • ఇలా టికెట్టు కొట్టేసిన నలుగురు ఏ విధంగా గెలిచారబ్బా?
  • గెలిచిన ఈ నలుగురి వెనుక బొసగారి సపోర్ట్ లేదంటే నా మది ఎందుకు అంగీకరించటం లేదబ్బా?
  • .. ఇంకా

రారేగారి హయాములో వోక్స్ వాగన్ స్కాంలోనుంచి క్లీన్ గా బయట పడి, తన ప్రతాపమేమిటో నాచానా గారికి అలాగే కాంగ్రేశ్ పార్టీలో అందరికీ షాకులు ఇస్తున్న బొసాగారిని అభినందించ కుండా ఉండలేను. ఏది ఏమైనా వీరు మాత్రం చాలా యునీక్, అంటే ఓ స్పెషల్ ఐటం అన్న మాట. దేవుడు వీరిని ఎలా చేశాడో కానీ చాలా స్పెషల్ గా తయారు చేసారు. కాకపోతే వీరి అభివృద్ది అంతా ప్రజా సేవ వల్లే జరిగింది అంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. వీరు చేసిన ప్రజా సేవ ఏమిటో నాకు అర్దం కావటం లేదు. ఒక్కసారి వీరి నియోజక వర్గం అయిన విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ది పనులేమిటో చూసి వస్తా. అంత వరకూ బొసాగారు, మీరు ఇక విజృంబించేయ్యండి. ఆల్ ద బెస్ట్

9, జూన్ 2011, గురువారం

హమ్మయ్య !! ఓ పనైపోయింది

ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.

పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.

ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.

ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.

3, జూన్ 2011, శుక్రవారం

అభివృద్దా లేక వినాశనమా!!

యాపిల్ వారు విడుదల చేసిన రెండొవ సంతతికి చెందిన ఐపాడ్ కొనుక్కునేందుకు చైనాలోని ఓ పదిహేడేళ్ళ అబ్బాయి తన కిడ్నీని అమ్ముకున్నాడన్న విషయం నిన్న చైనా టీవీలో కనబడ్డా అదేమీ పెద్ద వింతకాదన్నుట్లు చైనీయులు పట్టించుకోలేదంటే, అక్కడ జరుగుతున్నది అభివృద్దా లేక వినాశనమా?

జనాభా పెరిగితే ఇంతకన్నా ఘోరమైన విషయాలు చదవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ది మంచిదే, కానీ పిల్లలకు స్వేచ్చనిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడినా అదేమీ పెద్ద వింతకాదులే అనే వారి ధోరణిని ఎలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ విషయాన్ని స్పందిచినవాళ్ళు అదేదో పెద్ద హాస్యం అన్నట్లు నవ్వుకోవడం మరీ చోద్యంగా ఉంది.

దీనివెనుక అక్కడి తల్లి తండ్రుల పెంపకం ప్రధాన పాత్ర వహిస్తుంది అనిపిస్తోంది. మున్ముందుగా పిల్లలు జాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు పట్టించుకున్నట్లు లేరు. ఆపై మూడు రోజులు అబ్బాయి కనబడక పోతే పట్టించుకు పోగా ఒక చేతిలో ఓ లాప్ టాప్ మఱో చేతిలో ఐపాడ్ పట్టుకు తిరుగుతున్న అబ్బాయిని పట్టుకుని అడిగితే అప్పుడు అస్సలు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్లు వివరించాడంట.

అమ్మేవాడికి తెలివి లేదనుకుందాం, పోనీ కొనే వాడిని మానవతా విలువలు ఉండనక్కర్లేదా అని అడిగితే, దానిదేముందండి అది ఎక్కడ అమ్ముతారో చెప్పండి దాన్నీ కొనుక్కొచ్చేద్దాం అని అంటారు. ఇలా నైతికపరంగా వీరు చాలా దిగజారిపోతున్నారన్నది నిజమై అని మనం అనుకునేంతలో.. అక్కడెక్కడో ఎందుకు చూస్తావు, నీ ముడ్డి క్రింద నలుపు చూసుకో అంటూ మరో ఘటన మన ఆంద్ర ప్రదేశ్ లో ఇవ్వాళ్ళ ఉదయం జరిగింది.

మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం. అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి. చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే, మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్. ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె, మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు. వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం..

మొదటిది) తల్లి తండ్రుల పెంకపంలో లోపం.

రెండొవది) స్వతహాగా ఉండాల్సిన నైతిక విలువలు. తల్లి తండ్రి నేర్పలేదనుకోండి, పెరిగి పెద్దైన వీరి బుద్ధికేమైంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే, అసహనం వస్తోంది. పిల్లలు లేకపోవడం ఓ రంకంగా సమాజానికి మేలేనేమో అనిపిస్తోంది. ఇంకా వ్రాస్తే ఏదో వస్తుంది.

1, జూన్ 2011, బుధవారం

నేనూ తీవ్రవాదినే

Maunika

వరంగల్ జిల్లాలోని రఘునాధ పల్లిలో నిన్న జరిగిన ఘటనలో ఓ యువకుడిని గ్రామస్థులు కాల్చి చంపిన వైనంలో నాకు తప్పేమీ కనబడలేదు. ఇలా ఆలోచించడం ఓ తీవ్రవాది ఆలోచిస్తున్నట్లు ఉంటే, నేనూ తీవ్రవాదినే. నిజమే, ఆ అబ్బాయి తప్పు చేసి ఉండవచ్చు, అయినంత మాత్రాన అతనికి ఇంత పెద్ద దండన వెయ్యడం అనే హక్కుని గ్రామస్థులు తమ చేతిలోకి తీసుకోవడం అనేది భరతీయ న్యాయ వ్యవస్థకు విరుద్దమే అని మీరంటే నా దగ్గర అందుకు ఎటువంటి స్పందన లేదు అలాగే వారి చర్యను సమర్దించేందుకు కావలసిన సరైన సమాధానం నా వద్ద లేదు. న్యాయ వ్యవస్థ పై మనకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కి న్యాయాన్ని తేల్చి శిక్షని విధించే హక్కుని తమ చేతుల్లోకి తీసుకున్నారు అంటే, దాని వెనకాల

  • గ్రామస్థుల క్షణికావేశం ఉండి ఉండవచ్చు
  • వారి కళ్ళముందు ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం వారిని అసహనానికి గురి చేసి ఉండవచ్చు
  • వారి ఊరిలోని ఓ అభాగ్యురాలు దాడికి గురై రక్తం ఓడుతున్న స్థితిలో మృత్యువుతో పోరుడుతున్న వైనం వారి ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు

నిజానిజాలేమిటో నాకు తెలియదు. కానీ నాకు కనబడుతున్నదల్లా, ఓ అభాగ్యురాలు దారుణంగా, అత్యంత హేయంగా గాయపరచ బడి  అపస్మారకంగా పడి ఉంది. (ఇక్కడ ఇచ్చిన చిత్రం ఈనాడు వారి వెబ్ సైట్ నుంచి తీసుకోబడినది) అలాంటి స్థితిలోంచి ఓ యువకుడు పారిపోతున్నాడు అని ఈనాడులో వ్రాసారు. విచారించకుండా గ్రామస్థులు తొందరపడతారని నేను అనుకోను. ఒక్కరు లేదా ఇద్దరు తప్పుగా అనుకున్నారంటే ఆలోచించవచ్చు, గ్రామం మొత్తం దాదాపు ఆరు వందల మంది గుమ్మి గూడి పోలీసుల మధ్య ఉన్న ఆ యువకుడిని లాకొచ్చి మరీ కాల్చారంటే సదరు యువకుడు..

  1. తాను చెయ్యని పనికి గ్రామస్థులు పట్టుకుంటే, వారి అహాన్ని రెచ్చకొట్టే విధంగా ప్రవర్తించి తన మీదకు తెచ్చుకునే ఉంటాడు
  2. పోలీసుకు రంగప్రవేశం చేసిన తరువాత ప్రస్తుతానికి గండం గట్టేక్కిందనుకుని గ్రామస్తులతో విర్రవీగుంటాడు
  3. తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో కనీసం గ్రామస్థుల ఆగ్రహాన్ని గ్రహించి తనని తాను నిమ్మదించుకునే ప్రయత్నం చేసే వాడు. ఒక వేళ అలా జరిగి ఉంటే, గ్రామస్థులలో ఆగ్రహం ఇలా కట్టెలు తెంచుకునేది కాదు
  4. ఇంకా .. డాష్.. డాష్..

ఇలా చాలా విశ్లేషించ వచ్చు. ఒకవేళ నిజ్జంగా అతను నిర్దోషి అయినా, ఇలా శిక్షింపబడటం అతని దురదృష్టమే. కాని ఇలాంటి ఘటన మరో యువతిని దాడి చేయ్యాలనుకునే ప్రతీ మగవాడికి ఓ గుణపాఠం కావాలి. అమ్మాయిగా పుట్టడమే ఆడపిల్లకు శాపమా అని ఇంతకు మందు కొంతకాలం క్రిందట వ్రాసుకున్నాను. ఒక్కొక్క సారి అది నిజమేమో అనిపిస్తుంటుంది. అతివలు నిస్సహాయులు కాదు గ్రామం మొత్తం ఎకమై నిలుస్తుంది అని నిరూపించడం ఆ గ్రామం యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆడ పిల్ల ఒక్క ఇంటి పిల్లేకాదు గ్రామం మొత్తానికి ఆడపిల్లే అని చాటిన రఘునాద పల్లి గ్రామస్తులకు చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను.

ఇలా నేను వ్రాయడం కూడా అసాంఘీకమే అయితే నేను తీవ్రవాదినే. రాజకీయ నాయకుల లెక్కన ఏది జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని సమాధాన పరచుకుంటూ బ్రతికేయ్యమంటే, ఇంతటి దుర్ఘటన సమయంలో నా వల్ల కాదేమో. ఎవ్వరైనా మనల్ని మోసం చేయ్యడం ద్వారా డబ్బు నష్టపోతే ఎదో విధంగా తిరిగి సంపాదించుకోవచ్చు. అన్యాయంగా ఎవ్వరైనా నా ఇల్లు కబ్జా చేసి నన్ను ఇంట్లోనుంచి తరిమి వేస్తే వేరే ఇంట్లో చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి తిరిగి ఆ ఇంటిని దక్కించుకోవచ్చు. మాన ప్రాణాలకు ముప్పు కలగనంత వరకూ ఏదో విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించో లేక లంచాలిచ్చి పోలీసులను పట్టుకునో మన పనులు చేయించుకోవచ్చు. విజయవాడలో పరిక్ష హాలులో ప్రాణాలు తీసిన మనోహర్ ఇప్పుడు చక్కగా మూడు పూటల తిండి తింటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నాడే!!

కాని ఇలాంటి స్థితిలో ఈ అమ్మాయికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఈ ఆడ పిల్ల పళ్ళు ఎవ్వరు తెచ్చి ఇస్తారు? చిన్న యాక్సిడెంటు పరంగా నా కాలి చిలమండ విరిగితేనే ఎంత కష్టంగా నాకు మాత్రమే కాక మా కుంటుంబంలోని అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయి తన ప్రాణం కన్నా మిన్నగా దాచుకునే తన మానాన్ని దోచుకునే ప్రయత్నం చేసిన యువకునితో ఆత్మరక్షణార్దం జరిగిన ఘటనలో తన శరీరాన్ని ఇంతటి దుస్థితికి చేరుకుంది అన్న విషయం తెలుసుకుని ఎంత విలవిలాడిపోతుందో అర్దం చేసుకోగలను. ఈ అమ్మాయి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎన్ని ఆపరేషన్స్ చెయ్యాలో? ఎంతటి ఖర్చు అవుతుందో? ఇంతకాలం తిండి తినకుండా ఈ అమ్మాయి ఏమి తిని బ్రతకాలి?

15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ

భారత దేశం నా మాతృభూమి. భారతీయులు అందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. శుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

 

ఇలా చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకము. ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికైనా ఇది గుర్తుందా?? ఇలా ఏ పాఠశాలలోనైనా పదిమంది చేత చెప్పిస్తున్నారా??(డౌటే) ఇందులో మార్పు చెయ్యాల్సిన విషయాలు ఏమిటబ్బా!! మరోసారి ఆలోచిస్తాను. అంతవరకూ .. జైహింద్.

13, జనవరి 2011, గురువారం

సంక్రాంతి సంబరాలు – అ!!!

సంక్రాంతి సంబరాలు ఈ మధ్య సన్నబడుతున్నాయనిపిస్తోంది, ఎందుకో జనాలు సంక్రాంతి అంటే ఒక సెలవు రోజు మాత్రమే అనుకుంటున్నారు తప్ప ఒక సంస్కృతి అనుకోవటం లేదు అనిపిస్తోంది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక కట్టెల అడితి ఉండేది, దాని చుట్టూ రాత్రంతా మేము కాపు కాచే వాళ్ళము. ఎందుకంటే, ఎవ్వరైనా దొంగలు వచ్చి దుంగలు పట్టుకుపోకుండా చూస్తే మాకు పొద్దున్న కొన్ని దుంగలు ఊరికినే ఇచ్చేవాడు ఆ కట్టేల అడితి ఓనర్. అలా తెచ్చుకున్న దుంగలను రోడ్డు మధ్యలో వేసి కాల్చి వేడి నీళ్ళు కాచుకునే వాళ్ళం. అలా కాచిన నీళ్ళతో తల స్నానాలు. ఇవన్నీ భాగ్యనగరంలో కనబడటం లేదు. ప్చ్.. చూడబోతే ఇది కూడా కొద్ది రోజులకి దేశభక్తిలాగా తయ్యారవుతుందేమో!!

6, జులై 2010, మంగళవారం

కాళ్ళు లేవు చేతులు లేవు.. అలాగే కష్టాలు కూడా లేవు..

మనలో చాలామందికి అన్ని కష్టాలే.. కానీ ఈ అబ్బాయికి కాళ్ళు లేవు, చేతులు లేవు అలాగే జీవితంలో కష్టాలు కూడా లేవంట. ఎలా అనుకుంటున్నారా.. ఇదిగో ఈ క్రింద చెప్పాడు చూడండి. ఈ పుటని క్రింద చూపిన వీడియోలో ఆడియో లేకుండా చూసాను అయినా కన్నీళ్ళు ఆగలేదు.

అన్నీ ఉన్న మనకే అన్ని కష్టాలు అయితే, శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కొన్నింటి లేని ఇతని ఆత్మనిబ్బరం నన్ను అబ్బుర పరచింది. మరి మీ సంగతేంటి..

14, మార్చి 2010, ఆదివారం

కన్నీళ్ళు కారిస్తే సరిపోతుందా!!

ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలలో ఒకటి, BoSF అనే గుంపులో చేరడం. BoSF అంటే Birds of Same Feather. ఏది జరిగినా మన మంచికే అనే సూక్తిని నమ్మే నేను, ఈ గుంపులో చేరిన తరువాత చాలా భాధాకరమైన వార్తలే వింటూ వస్తున్నాను. వాటిలో ఒకటి ఈ క్రిందనున్న వీడియో కూడా. ఇంతటి చేదు విషయాలను విన్నప్పుడల్లా నాకళ్ళు అసంకల్పితంగా వర్షాన్ని కురిపిస్తోంటే, ఈ గుంపులో చేరడం ఏవిధంగా మంచో నాకు అర్దం కావడం లేదు. ప్రస్తుతానికి ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. కానీ ఏడిస్తే మాత్రం సరిపోతుందా!! ఏమో !! తెలియదు... తెలిసినదల్లా ఒక్కటే.. భాధపడటం.

 

నేనేమి సునీతా కృష్ణన్ కాను. కానీ సునీతా కృష్ణన్ శతృవులలో నేను ఒకడినే. ఇంత వరకూ నేను అచేతనంగానే ఉన్నాను. సునీత నన్ను ఏదో పెద్ద సహాయం చెయ్యమనలేదు కానీ నా ఈ మౌనాన్ని విడనాడమంది. ఇద్దరికి ఈ విషయాన్ని చెప్పమంది. అదే చేద్దామనే ప్రయత్నమే ఈ పోస్టు. నాకు ఉన్న స్టాటిస్టికల్స్ ప్రకారం నా ప్రతీ పోస్టు దాదాపు ఓ వంద మంది చదువుతారు, కానీ అందులోంచి చాలా (చాలా చాలా, బహు చాలా) కొద్ది మంది మాత్రమే స్పందిస్తారు. దీని వెనుక కారణం నా ప్రచురణలో సరైన అంశం లేకపోవడం అంతే కాకుండా నేను వ్రాసే విషయాలు పూర్తిగా స్వవిషయం అయ్యి ఉండడమే.

కానీ ఇవాల్టి ఈ విషయం ఒక్క నాది మాత్రమే కాదు మౌనంగా ఉండే మన అందరిదీ. పదిహేనేళ్ళ వయస్సులో ఎనిమిది మంది కామాంధులచేత మానభంగం చేయబడ్డ సునీతకు అన్యాయం చేసిన కామాంధులు గుర్తుకు లేరని చెప్పడమే కాకుండా, పబ్లిక్ గా పది మంది ఉన్న చోట ధైర్యంగా ఈ సమస్యకి మరియు సునీతకు శతృవులు మీరే అని చెప్పే సాహసం ప్రశంసనీయం. అమ్మాయు మాటల్లో చెప్పాలంటే,

 .. my [Sunitha's] biggest challenge is the civil society, not the human traffickers who beat her up, it is you and me, my biggest challenge is your mind blocks to accept these victims as our own. ..it is not nice to bring them to our home, it is not nice to let our children to befriending them.. can you break your silence, can you open your minds.. can you open your hearts.. accept them as human beings ..

అన్నింటికన్నా హృదయ విదారకమైన విషయమేమిటంటే, ఈ ప్రజెంటేషన్ మొదలు పెట్టినప్పుడు చూపించిన పసికూనల చిత్రాల విషయాలు. వ్రాయాలంటే వేళ్ళు నెప్పి పుట్టటంలేదు కానీ వ్రాసే సాహసం నా మనసుకు రావటంలేదు. మీరే వినండి. ఇంతకన్నా ఎక్కువవ్రాస్తే అది నా భాధ అవుతుంది కానీ సునీతకృష్ణన్ భావమవ్వదు.

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నన్నయ్యపై వ్రాసిన పుట - ఆత్మావలోకనం

 

క్రిందటి సంవత్సరం జులై నెలలో ఏడవ తారీఖున నేను పూజ్యనీయులైన నన్నయపై ఒక పుట వ్రాసాను. ఆ తరువాత కొంతకాలానికి ఆ పుటని నేను పునఃపరిశీలించాను. అప్పుడు నాలో నాపై కలిగిన ఆలోచనలు, భావనలు, స్పందనలు, వగైరా వగైరా నన్ను ఆత్మావలోకనం చేసుకునేటట్టు చేసాయి. అలాంటి ఆత్మావలోకనం లోంచి ఉద్బవించినదే ఈ పుట. మరి మీ ఆలోచనలేమిటో సెలవివ్వండి

మొదటగా నా ఆలోచనలు.

అచ్చంగా అర ఠావు నిండా అచ్చు తప్పులు లేకుండా వ్రాయడం చేతగాని నేను.. ఆది కవి అని ఎంతో మంది చేత జేజేలు అందుకున్న మహానుభావుని గురించి (హాస్యాస్పదంగా నైనా సరే..) వ్రాయడమా. ఎంతటి మూర్ఖత్వము? గూగుల్ వాళ్ళని అడిగి కొన్ని కొన్ని వెబ్ సైట్లలో జరిగిన చర్చలను తీసుకుని వచ్చి ఏదో పాయింట్ ఉంది అని వ్రాయడం ఎంత మాత్రం హర్షదాయకం. ఒక వేళ్ళ నేను ఉదహరించిన పాయింట్స్ నిజమై ఉండొచ్చు, అన్నంత మాత్రాన నా భాషలో అంతటి చులకనా భావం అవసరమా!! అక్కడ స్పందించిన వారిలో మరో పూజ్యనీయులైన డా॥ పాండు రంగ శర్మగారు ఉదహరించిన పాయింట్ లాజికల్ గానే ఉంది. కానీ, నిజం చెప్పాలంటే, నాకు సదురు "పాండు రంగ శర్మగారి లాంటి వారితో ఈ విషయంపై చర్చించటం.." అనే విషయాన్ని కాదు కదా అస్సలు అలాంటి విషయాన్ని వీరిని అడగటానికి సరైన పదాలే నావద్ద లేవంటే, నాకు తెలుగు భాషపై ఉన్న పట్టు మీకే అర్దం అవుతుంది. అలాంటి నేను, అల్పులలో అత్యంత అల్పుడను, నన్నయ్య వంటి (ఘనాపాటి అనచ్చో లేదో తెలియదు) మహాను భావులను తూలనాడటమా.. ఎంతటి ఘోర తప్పిదము? నా స్వార్దం కోసం ఇలాంటి మహానుభావులు బలి కాకూడదు.

అంతటితో ఆగకుండా నాకు విద్యా బుద్దులు నేర్పిన గురువులను చులకనగా ప్రస్తావించడం ఏమాత్రమూ మెచ్చుకోదగినది కాదు. ఇది ఒక విధంగా గురు ధూషణే అని నా అభిప్రాయం. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని ఆలోచిస్తే, భహిరంగంగా చేసిన తప్పుని ఒప్పుకోక తప్పదని నా మనసుకు అనిపించింది. తత్ ఫలితమే ఈ పుట. అందుకని సభా పూర్వకంగా, బ్లాగు ముఖంగా ..

నన్నయ్య గారికి మరియు నాకు విధ్యా బుద్దులు

నేర్పిన గురువులకు హృదయపూర్వక క్షమాపణలు.

మన్నించండి.. క్షమించండి..

12, నవంబర్ 2009, గురువారం

నేను కూడా లంచం ఇచ్చానోచ్

 

ఈ పుట చదివే వాళ్ళలో పోలీసోళ్ళు ఉన్నా (లేక) పోలీసు సానుభూతి పరులు ఉన్నా (లేక) పోలీసులకు చుట్టాలు ఉన్నా (లేక) పోలీసు అవ్వుదాం అనుకునే వాళ్ళున్నా (లేక) పోలీసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా దయచేసి మఱో బ్లాగుకి పోయి ఆ విషయాన్ని ఆనందించండి. ఇది మీ లాంటి వాళ్ళు చదివి జీర్ణించుకోలేరు. ఒక వేళ జీర్ణించుకున్నారంటే మీకు ఎంత వంట పట్టిందో చెప్పనక్కరలేదు.

ఓ మర్చిపోయ్యాను .. లంచం ఇవ్వడం తప్పు అలాగే పుచ్చుకోవడం తప్పు కాబట్టి .. పోలీసోళ్ళ భాషలో "ఖర్చుల నిమిత్తం " అని మీరు మార్చుకుని చదువుకోండి

ఇక అసలు విషయానికి వస్తా. నా పాస్ పోర్ట్ పరిమితి కాలం అయ్యిపోనది అందుకని తత్కాల్ లో కావాలని పాస్ పోర్ట్ కార్యాలయంలో దరకాస్తు చేసుకున్నాను. దరకాస్తు చేసుకోవడం ఇంత సులువైన పని అని నాకు అప్పటి వరకూ తెలియదు. మొదటిసారి అప్లై చేసుకున్నప్పుడు నా అంతట నేనే పాస్ పోర్ట్ దరకాస్తు ఫారం తెచ్చుకుని మూడువందల రూపాయల డీడీ తీసి చక్కగా తంతీ తపాళా వారి రిజిస్టర్ పోస్టు చేస్తే, ఖచ్చితంగా ముఫై రోజుల్లో పోలీసోడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని, దారి ఖర్చులకు డబ్బులడిగాడు. అప్పుడు మా పరిస్తితి అంతంత మాత్రం. అందువల్ల తెగించి వస్తే వస్తుంది లేకపోతే రాదు అన్న తెగింపుతో ఇవ్వను అని చెప్పెసాను. సరే అని వెళ్ళిన ఆ అధికారి మా నాన్నగారితో మాట్లాడాలన్నాడు. నాన్నగారు ఇంట్లో లేరు అని అప్పటికి దాటేశాను. సరే అని అప్పటి జారుకున్న సదురు పోలీసాయన, మరో పది రోజుల తరువాత మళ్ళీ వచ్చి దారి ఖర్చులకు రొక్కం అడిగాడు. అప్పుడు కూడా నాన్నగారు లేరని దాట వేస్తే అస్సలు విషయం చెప్పాడు. ఏమిటంటే, సదురు పోలీసు ఇంక్వైరీలో చెడుగా వ్రాస్తే ఇక జీవితంలో పాస్ పోర్ట్ రాదని. అప్పటికో నేను ఇవ్వకుండా ఉండటానికి చెప్పాల్సినన్ని కధలు చెప్పాను. దానితో మన పోలీసాయనకు మండింది. ఇంకే దరకాస్తు ఫారం పైన మేము ఇంటిలో లేమని వ్రాసి తిరిగి పంపేశాడు. మా దురదృష్టం ఏమిటంటె, ఆ రోజుల్లో పాస్ పోర్ట్స్ అన్నీ ఈ ఒక్క పోలీసాయనే చెయ్యాలంట. అప్పుడు కధ కాస్తా తిరిగి తిరిగి మా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దెగ్గరకు చేరుకుంది.

 

గుడిలో లింగాన్ని మ్రింగాలని ఒకడు ఆలోచిస్తుంటే ఏకంగా గుడినే మ్రింగేస్తే ఎలా ఉంటుంది అని మరొకడు ఆలోచించాడంట. ఈ పోలీసోళ్లు అంతే. ఇదిగో ఇక మన లోకల్ కానిస్టేబుల్ గారు మా ఇంటికొచ్చి నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దాంతో మా నాన్నగారికి ఒకటే ఖంగారు, నేనేమి తప్పు చేసానా అని. ఇక అక్కడితో ఆ తతంగం ఆగితే ఫరవాలేదు, మా ప్రక్కింటి వాళ్ళని కూడా అడగటం మొదెలెట్టాడు సదురు కానిస్టేబుల్. దాంతో మా పొరుగోళ్ళు కూడా కంగారు పడ్డారు, నేనేదో గొడవలో ఇరుక్కోవడం వల్లే ఈ సమాచారం అడుగుతున్నాడని. సరే అని మేము సర్దుకుని ఊరుకుని అన్నీ పద్దతి ప్రకారం జరగాలి కదా అనుకుంటూ ఉంటే, ఇవన్నీ జరిగిన తరువాత చావు కబురు చల్లంగా చెప్పాడు. మేము అర్జంటుగా పోయి ఇంతక ముందు వచ్చిన పాస్ పోర్ట్  అధికారికి తృణమో ఫలమో ఇస్తే బాగుంటుంది లేక పోతే ఫైలు ముందుకు కదలదు సరికదా ఇలాంటి వెటకారమైన పనులు మాత్రం మాకు తప్పవని. ఇంకే తప్పని సరై మా నాన్నగారికి తెలియకుండా నేనే వెళ్ళి ఓ వంద రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఛా.. ఏంటి ఆ మాట అంటారా.. అదే నండి పోలీశోళ్ళ భాషలో నా కాగితం ముందుకు వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది కదా, అదేనండి పోస్టాఫీసుకి వెళ్ళాలి అక్కడ స్టాంపులు తీసుకోవాలి. మళ్ళీ లోకల్ పోలీసోళ్ళకి ఇన్ ఫర్ మేషన్ చేరవెయ్యాలి.. వగైరా వగైరా అన్న మాట.

 

ఇదంతా పదేళ్ళ క్రిందటి మాటైతే, ఇప్పుడు పరిస్తితి మరోలా ఉంది. పైన చెప్పినట్లుగా నేను పాస్ పోర్ట్ ని తిరిగి పొందేందుకు చేసుకున్న ఆలోచనలో మొదటి అంకం దరకాస్తు ఫారం నింపి పరిశీలన నిమిత్తం అంద జేయ్యాలి. సరే.. అన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అనుకుని ఇచ్చిన సమయానికి మ్రుందే చేరుకుని కావాల్సిన పత్రాలన్నింటినీ చూపించి ఈనెల మూడవతారీఖున దరకాస్తు చేసుకున్నాను. పాస్ పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకు నాది ఒకటే అభ్యర్దన. మధ్యవర్తులను నమ్మకండి. చక్కగా మీ అంతట మీరే వెళ్ళి దరకాస్తు చేసుకోండి. ఇప్పుడు ఈ పనులన్నీ చాలా శులభతరం చేసారు. ఇక నా విషయానికి వస్తే, నా దరకాస్తు ఫారం కాస్తా పోలీస్ వెరిఫికేషన్ కోసం గత శనివారం వచ్చింది. ఇంకే మరో పోలీసు గుంటనక్క మా ఇంటికి చేరుకుంది. అడిగిన కాగితాలు చూపించాం కావలసిన నకలు పత్రాలు అంద జేసాం. ఇవన్నీ చాలవన్నట్టు, మేము అద్దెకు ఉంటునట్లుగా మా ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాగితం కావాలన్నాడు. అడిగినదే తడవుగా మా లీజ్ ఎగ్రిమెంట్ చూపించా. మరేదో లేదన్నాడు. అదీ చీపించా. ఇంకే మన నక్క తెలివితేటలు ఉపయోగించి మా ఎగ్రిమెంటు నోటరీ చేయించలేదు కావున చెల్లదు అంటూ అది చేసి మరునాడు ఉదయం పదిన్నరకు ఐమాక్స్ ధియేటర్ ఎదురుగా ఉన్న పాస్ పోర్ట్ సెల్ దగ్గరకు వచ్చి ఇవ్వమన్నాడు. అప్పుడు అర్దం అయ్యింది మనోడు పైసలు ఇస్తేనే గానీ వదలడు అని. కానీ అస్సలు దారి ఖర్చుల విషయం ఏమీ మాట్లాడ లేదు కదా అని ఊరుకున్నాను. మరునాడు చెప్పిన సమయానికి చక్కగా అన్ని కాగితాలు పట్టుకుని వెళితే, అప్పుడు మూల్గాడు అసలు విషయం.

 

అదిగో అప్పుడు నాకు కాలింది. ఎందుకు ఇవ్వాలి సార్ అన్నా. అదే డైలాగ్ .. పాస్ పోర్టుని లోకల్ పోస్టాఫీస్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్ కి పంపించాలిగదా అక్కడ ఖర్చు ఉంటుంది కదా .. అంటూ యదవ సోది చెప్ప బోయ్యాడు. అప్పుడు నేను అన్నాను, వీటన్ని ఖర్చుల నిమిత్తమై కదా తత్కాల్ లో ఎక్కువ పెట్టి చేయించుకునేది. ఇక మన నక్కగారికి పూనకం వచ్చి అచ్చంగా తోడేలైయ్యాడు. నా మీద ఘీంకరించడం మొదలైంది. ఇక్కడ వ్రాయలేను అసభ్య పదజాలం వీరు ఉపయోగించారు. ఇక లాభం లేదనుకుని ఖర్చుల నిమిత్తం ఎంత అవసరపడొచ్చు అంటే, ఓ రెండివ్వండి అన్నాడు. సరే రొండొందలే కదా అని రెండు వంద నోట్లు తీసి చేతిలో పెట్ట బోతే ఏదో చీడ పురుగుని చూసినట్టు చూసి, ఇది తత్కాల్ కాబట్టి మరో సున్నావేసి ఇవ్వు అన్నాడు. మరి కొంత సేపు వాగ్వివాదం. ఇదంతా ఎక్కడనుకున్నారు, అచ్చంగా పోలీసు వారి అధికారిక కార్యాలయంలో. అక్కడ మనం ఏదైనా అన్నాం అనుకోండి ఇంకే ముంది, రాజ్యం వాళ్ళది కదా బొక్కలో వేసి కుమ్ముడే!! కాదంటారా.. ఆఖరుకి ఒకటిన్నరకన్నా తగ్గితే ఊరుకునేది లేదు అని కరాఖండీగా చెప్పెశాడు.

వీళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి ఎవ్వరైనా తెలిసిన పోలీసు చేత చెప్పిస్తే వింటాడు కదా అని ప్రయత్నిస్తే, సదురు పోలీసు కుక్క కూడా ఇదే చెప్పింది. మనకు వాళ్ళతో గొడవ వద్దు కానీ అడిగింది ఇచ్చేయ్ మనకు ఎప్పుడైనా అవసరం పడితే చేస్తాడు, అని సమాధానమిచ్చింది. ఎంతైనా ఓ గూటి పక్షులే కదా వీరంతా అనుకుని అనువుగాని చోట అధికుల మనరాదని సమర్దించుకుని అడిగినంత ఇచ్చి మెల్లగా జారుకున్నాను.

 

ఇందు మూలముగా యావన్మందికీ తెలిజ జేయునది ఏమనగా, సదురు పోలీసు జాగిలం మీ యింటికి వచ్చినప్పుడే విషయాన్ని తేల్చేసుకుంటె మీకు వారి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే మీకూ తలకాయ నొప్పి ఉండదు. ఈ స్వతంత్ర భారత దేశ యంత్రాగానికి నిధులు కరువైనాయి కనుక మన ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు పడేసినట్లుగా ఇలా ఖర్చుల నిమిత్తం బ్లాక్ మైల్ చేసి డబ్బులు దండుకునే పోలీసులోళ్ళనుంచి దూరంగా ఉండడమే మంచిదని నా అభిమానం. ఆఖరుగా మాతాత గారు చెప్పిన ఓ విషయం స్మరించుకుంటాను

దుష్టులను దూరంగా ఉంచకూడదంట, వాళ్ళకి మనం దూరంగా ఉండాలంట.

పై విధంగా, మా ఇంటికొచ్చిన రాయల్ బ్లాక్ మైలర్ బెగ్గర్ కి ఖర్చుల నిమిత్తం ఒకటిన్నర సమర్పించుకున్నానని సవినయంగా విన్నవించుకుంటున్నాను

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

నా వల్ల అవుతుందా!!

నా జీవితంలో కొన్ని కొన్ని కోరికలు తీరకుండా పోతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు కానీ తీరడానికి అనువైనవే అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి నా కుటుంబం పిల్లల్లు గురించి నేను ఈ క్రింది విధంగా చెప్పుకోవాలని కోరిక

 

నేను.. చదువు రీత్యా పోస్టు గ్రాడ్యుయేట్.. వృత్తి రీత్యా బ్రమ్మి.. ప్రవృత్తి రీత్యా నృత్యకారుణ్ణి.. వీలైతే చదరంగంలో క్రీడాకారుడిగా రిటైర్ అవ్వాలని కలలు కంటున్నవాడిని. హాపీలీ మారీడ్ టు ఏన్ ఇన్డిపెన్‍డెంట్ టెక్నికల్ కాంన్సల్టెంట్. మాకు ఓ కూతురు  మేము మరో అమ్మాయిని దత్తత తీసుకున్నాం. వీరిద్దరినీ చక్కగా చదివించాం. వీరి భవిష్యత్తు వీరి చేతుల్లో ఉంచి మేము ఈ తనువు చాలించాం

 

పైన పరిచయ కార్యక్రమం లో చాలా “నేను” దాగి ఉంది కదా.. ఏమి చేస్తాం.. స్వార్ధం... ఈ సదురు నేను నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రాలేక పోతున్నాను. ఇప్పటికే మూడింట రెండొంతుల జీవితం అయిపోయింది. ఇప్పటికైనా నేను లోంచి మేము లోకి ఎప్పటికి వస్తానో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా, ఈ కోరికలు తీరనంతగా లేవని నా అభిప్రాయం.

 

మరి మీరేమంటారు?

16, ఆగస్టు 2009, ఆదివారం

మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!!

 

ఇవ్వాళ మా ఆఫీశ్ వాళ్ళం అంతా కలిసి చర్లపల్లి లోని స్పూర్తి ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్న అనాధ శరణాలయానికి వెళ్ళాం. అక్కడ దాదాపు ఓ వందకు పైగా అనాధ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఓ చిన్నపిల్ల అందరినీ ఆకట్టుకుంది. మేము అక్కడ ఉన్నంత సేపట్లో ఆ పిల్లని ఎత్తుకోని వాళ్ళు లేరు. నాకు తెలిసి ఆ పిల్ల కాలు క్రింద పెట్టలేదనుకుంటా. ఆ పిల్ల వయస్సు దాదాపు ఓ ఆరు లేదా ఏడు ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి తండ్రికి ఎయిడ్స్ వచ్చి పోయ్యాడు. పోతే పోయ్యాడు, (యదవ..) పోతూ పోతూ ఆ జబ్బుని తన భార్యకి అంట గట్టి పోయ్యాడు. వాడు పోయిన తరువాత ఆ తల్లి ఈ పిల్లని తీసుకుని ఈ శరణాలయానికి వచ్చి ఈ పిల్లని చేర్చిన ఓ రెండు నెలలకు తనూ చనువు చాలించింది. అందువల్ల ఈ పిల్లకి తన అనే వాళ్ళు ముద్దు ముచ్చట చేసే వాళ్ళు లేని తరుణంలో మేమంతా కనబడేటప్పటికి ఆనందం ధుఃఖం రెండూ ఒకేసారి వచ్చేసాయి. సరే అది వేరే కధ.


ఇక అసలు విషయానికి వస్తే.. సదురు సో కాల్డ్ దేవుడు అనేవాడుంటే.. నేను ఒకే ప్రశ్న వేయ దలచాను. అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు ఎయిడ్స్ ఆంటి ప్రాణాంతక వ్యాధుల భారిన పడి బలైతున్నారు. వీళ్ళేం పాపం చేశారని వీళ్ళకీ శిక్ష? ఒక వేళ వీళ్ళకి ఇలాంటి వ్యాధులు లేక పోయినా, ఇలా అనాధలని ఎందుకు చెయ్యాలి? ఇలా జీవితాంతం ప్రేమానుభవాలకు దూరంగా పెరగాల్సిందేనా!! ఇలా అనునిత్యం ఎంతో మంది చిన్నారులను ప్రేమానురాగాలకు దూరంగా బ్రతకమని తలరాత వ్రాసే దేవుడు నిజంగా దేవుడేనా?? ఎంతటి దుర్మార్గుడో సదురు దేవుడు!!

 

వీళ్ళని తీసి ప్రక్కన పెడదాం. దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటప్పుడు కూడా మౌనం వహిస్తున్న దేవుడు ఒక దేవుడేనా?? దేవుడనేవాడుంటే అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలుతున్నప్పుడు ఎక్కడున్నాడు? వేలకు వేల మంది జనాభా చనిపోతున్నప్పుడు ఎక్కడున్నాడు? ఇరవయ్యో శతాభ్దంలో స్మాల్ ఫాక్స్ (అమ్మోరు) అనే వ్యధి భారిన పడి అచ్చంగా ముప్పై కోట్ల మంది చనిపోయ్యారే!! అప్పుడెక్కడున్నాడు ఈ దేవుడు? 2004లో వచ్చిన సునామి 2,29,866 మంది ప్రాణాలు తీసేస్తే ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఓ!!! కమలహాసన్ తీసిన దశావతారం అనే సినిమాని చూడాల్సిందే అంటారా!! 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ద్వారా ప్రపంచం మొత్తం మీద దాదాపు యాభై లక్షల మంది చనిపోయ్యారే!! మరి వీరేందుకు పోయ్యారబ్బా!! అనునిత్యం ఎన్నో మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో సదురు దేవుడేమి చేస్తున్నాడు?

 

ఇవన్నీ ఒక ఎత్తైతే కరువు కాటకాలతో దేశానికి దేశాలే అన్నమో రామ చంద్రా అంటూ అలమటిస్తున్నాయే, మరి వారి మాటేమిటి? వారందుకు భాధ పడాలి? ఏం మాయలు మంత్రాలు వచ్చిన బాబాలు చాలామంది మన దేశం లోనే ఉన్నారుగా!! వారంతా పోయి సదురు దేశాలలో ఉండి బంగారాన్ని శృష్టించి వారి దేశంలో పేదరికం అనేది లేకుండా చెయ్యొచ్చు కదా!! ఏం? సదురు మాయలు మంత్రాలు ఆ దేశ కాల మాన పరిస్థులలో పనిచెయ్యవా !! లేక మరింకేదైనానా!!?? కంబోడియాలాంటి దేశాల గురించి ఎందుకు గానీ మన దేశాన్ని ముందు బాగు చెయ్యొచ్చు కదా.. పుష్కలంగా వానలు కురిపించొచ్చు కదా!!?? పాడి పంటలతో చల్లగా ఉండేటట్లు దీవించొచ్చు కదా..

ఇదంతా ఓ బోగస్.. మరి మీరేమంటారు?

25, జులై 2009, శనివారం

నన్నయ్య ఆది కవి - నేనొప్పుకోను !!

తెలుగు మాట్లాడేనేను నన్నయ్యను ఆది కవిగా ఒప్పుకోను. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నన్నయ్యను ఆది కవిగా నిర్ణయించి నా మనోః భావాలను దెబ్బదీసినది. ఇందుకు అసమ్మతిగా నేను న్యాయస్థానంలో ప్రజా వాఙ్మయాన్ని (సరిఅయినదో కాదో .. ఆంగ్లంలో చెప్పాలంటే, Public Litigation Interest) వేయ తలంచాను. ఖబడ్ దార్ !! అందరూ ఇక కాచుకోండి. చిన్నప్పుడు నాకు విధ్యా భుద్దులు నేర్పిన గురువులారా!! సిద్దం కండి.. చెరసాలలో ఊచలు లెక్క పెట్టడానికి. అబద్దపు విధ్యను భోదిస్తారా!! హన్నన్నా .. ఎంత కండ కావరము .. వీరికి తోడు మన అన్న తారక రామారావు గారు నన్నయ్యకు టాంక్ బండ మీద విగ్రహం కూడా కట్టిస్తారా!! చూస్తా అది ఎంత వరకూ నిలుస్తుందో, కట్టించిన ప్రభుత్వమే దిగి వచ్చి తమ తప్పు ఒప్పుకుని ఆ విగ్రహం తీసేటంత వరకూ పోరాడుతాను.


భళా !! ఏమి ఈ వైపరీత్యం .. ఎందుకీ పక్షపాతం.. నాకు తెలిసి నన్నయ్య వీళ్ళందరికీ లంచం ఇచ్చుంటాడు. కమాన్ నన్నయ్య.. కమాన్ .. ఏదీ నాకు లంచం ఇచ్చి చూడు. నిన్ను తీసుకెళ్ళి బొక్కలో పెట్టిస్తా.. అలాగే ఒరేయ్ తొక్కలో తెలుగోళ్ళలారా .. సభా ముఖంగా మీ అందరికీ ఇదిగో ఇదే నా హెచ్చరిక.. మర్యాదగా అందరూ కలసి ముక్త ఖంఠంతో నా మాటని ఒప్పుకున్నారా, సరి, పోనీలే యదవలు తెలియక తప్పు చేసారని క్షమించి ఒదిలేస్తాను. కాదని మొండికేశారా.. అంతే మరి .. ఇకపై మాటలుండవు.. ఓన్లీ చేతలే..


ఏమిటిది వీడికేమైందనుకుంటున్నారా !! ఏమీ కాలేదు .. నా ఈ పుటకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇవిగో వాటిల్లో మచ్చుకు కొని..


మొదటిది ) కాళ్ళకూరు నారాయణరావు గారన్న్ట్లట్లు పూజ్య పాదుడనే తెలుగు కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడంట. ఎప్పుడనుకుంటున్నారు క్రీ.పూ. 28వ సంవత్సరంలో అనుకుంటా. అందుమూలంగా నన్నయ్య కన్నా దాదాపు 1000 సంవత్సరాలకు ముందే ఈయన గురించి జనాలకు తెలుసు, ఆఫ్ కోర్స్ ఈయన కన్నడంలో రచించాడు అనేది ఓ నిజం అనుకోండి, అన్నంత మాత్రాన తెలుగులో రచించ లేదంటారా!!


రెండవది ) అంతెందుకండి, మాకు విధ్యా భుద్దులు చెప్పిన గురువులే చెప్పారు, గాధా సప్తశతి అనేదేదో కావ్యం ఉందంట. దానిని రచించిన వారిలో తెలుగోళ్ళు ఉన్నారంట. మరి ఆ తెలుగోళ్ళు ఈ కావ్యం కాకుండా ఏమీ పీకలేదా!! (అన్నమయ్య సినిమాలో తనికెళ్ళ భరణి అన్నమయ్యకు చెప్పిన డైలాగ్ .. "రాజుగారిమీద కవిత్వం చెప్పవయ్యా అంటే.. చక్కగా, నువ్వది పీకావో, నువ్విది పీకావో .." అన్న వైనంలో ఈ డైలాగ్) ఏదో ఒకటి పీకే ఉంటారు .. మరి అలాంటప్పుడు మన నన్నయ్యను ఆది కవి అని ఎలా అన గలుగుతున్నారు !! కమాన్ .. ఐఆమ్ హర్ట్.. ఐ వాన్ట్ టి స్పీక్ టు పెద్దారెడ్డి నౌ


మూడవది ) తెలుగు కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లుకు ధీటుగా కన్నడ భాషకూ మరో కవిత్రయం ఉంది. గౌరవనీయులైన నాగయ్య గారు ప్రస్తావించినట్లుగా, కన్నడ కవిత్రయం (పంపడు, రన్నడు, పొన్నడు) లోని పద్మ కవి (క్రీ.శ.950 నాటి సర్వ దేవుడు) తెలుగు దేశంలోనే పుట్టినా కన్నడ రచనలు చేసినారని , మొదట్లో వారు తెలుగు రచనలు చేసి ఉంటారని, కొందరు పండితుల అభిప్రాయం. మరి అట్లాంటప్పుడు మన పంపడు కూడా తెలుగోడేగా .. ఏంది కాదంటారా.. మరి ఈయన ఏమీ ఈ(పీ)కలేదంటారా!!


ఇవ్వన్నీ మనకొద్దు భాయ్ .. ఇప్పుడు సచ్చిన ఈళ్ళందర్నీ ఈడకు రప్పియాలే.. మన ప్రభుత్వ నిరంశ ధోరణి పై కోర్ట్ల కేసేయ్యాలా !! అప్పుడు గాని నాకు నిద్ర రాదు !!


చదివే మీరే ఏమంటారు?

ఈ పుట చదివిన తరువాత మీ అభిప్రాయాన్ని నిస్కర్షగా తెలియ జేయగలరు ..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

12, జూన్ 2009, శుక్రవారం

నేను తప్పు చేస్తా..

ఇవాళ్ళ ఉదయం ఆఫీస్ యాహోలో లాగిన్ అవ్వగానే నా కళ్ళను ఓ వార్త కట్టేసింది. యాహో మెసెంజర్ లో లాగిన్ అవ్వగానే యాహో వారి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దానిలో Top Stories అనేది ఎప్పుడూ హైలైట్ అయ్యి ఓ మూడు లింకులు లేటెస్ట్ వార్తలను చూపిస్తుంటాయి. అలాంటివి నేను జనరల్ గా పట్టించు కోను. కాని ఇవ్వాళ్ళ నా దృష్టికి మైక్రోసాఫ్ట్ వాళ్ళపై అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రం వేసిన కోర్ట్ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోయి ఓ వంద మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా తీర్పు వెలువడింది అన్న వార్త నన్ను ఆ లింకుని క్లిక్ చేసేటట్టు చేసింది. స్వతహాగా మైక్రోసాఫ్ట్ అంటే ప్రేమ, అభిమానం, గౌరవం, తొక్క, తోటకూర, గోంగూర, బెండకాయ, దొండకాయ, కాకరకాయ, వగైరా వగైరా మెండుగా ఉన్నవాడినేమో, కించిత్ ఆశక్తితో ఆ వార్తను మొత్తం చదివాను.

ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటున్నారా.. అస్సలు కధ ఇది కాదు. ఇదిగో ఆ కధంతా చదివిన తరువాత ఆఖరున మరో లింకు నాకళ్ళను ఆకట్టుకుంది. ఆ ఆకట్టుకోవడం వెనకాల ఆశక్తి లేక పోయినా ఇంకేదో తెలియని భావన ఆ వార్తని చదివేటట్టు చేసింది. ఇంతకీఆ  విషయం ఏమిటంటే..

సన్ని ఖన్నా అనే ఓ పత్రికా విలేఖరి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకునే ముందు ఓ చిన్న ఉత్తరం వ్రాసి మరీ పోయాడు. అందులో తనను ఓ లోకల్ MLA వేధిస్తున్నాడని అందువల్లనే తాను ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నానని వ్రాసి ఉన్నందువల్ల పోలీసులు సదురు MLAపై కేసు నమోదు చేసారు అన్నది ఆ వార్త సారాంశం. మొన్నామధ్య సుప్రీం కోర్ట్ ఇలాంటి ఆత్మహత్యా లేఖలు చెల్లవని.. ఇక ముందు ఇలాంటివి ఎన్కరేజ్, అంటే ప్రోత్సాహించకుండా ఉండే విధంగా ఓ శాసనాన్ని జారీ చేసిందని చదివిన తరువాత ఏ విధంగా పోలీసోళ్ళు మన MLA మహాసయుడిని బొక్కలొ వేసారా అన్న కుతూహలంతో చదవడం జరిగింది. ఈ కధ ఈ విధంగానే సాగితే నేను ఈ పుటని ప్రచురించక పోదునేమో!!! కానీ అసలు విషయమేమిటంటే.. చచ్చేటోడు ఎలాగో చచ్చాడు, వాడి గురించి వార్త వ్రాయనక్కర్లేదు. కానీ హింసా మార్గాన పోతున్న రాజకీయ నాయకుడు ఊచలు లెక్క పెట్టేటట్టు జరిగింది అన్నందువల్ల వార్తగా వ్రాయడంలో తప్పులేదు.

కానీ చచ్చినోడు ఏమి తిని చచ్చాడు అన్న విషయాన్ని కూడ ప్రచురించి, ఫలానాది తింటే నువ్వు పోతావ్ అన్న విషయాన్ని చెప్పకుండానే చెబుతున్నారు. ఇదిగో ఇక్కడ నాకు కాలింది. బర్నాల్ రాసుకున్నా ఆ మంట వేడి ఉపశమనాన్ని ఇవ్వలేదు. ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచితే బాగుంటుంది అంతే కానీ ఇలా పది మందికీ తెలిసే విధంగా ప్రచురించడం ఎంత వరకూ సబబు. అందునా యాహో లాంటి ఎక్కువ ప్రాచుర్యం ఉన్న వెబ్ సైట్లలో ఇలా ప్రచురించడం ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాట్లిల్ని వ్రాసే వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచరో అర్దం కాదు. ఇది చదివి మఱొకరు ఆ మందు కొని ప్రయత్నించరని నమ్మకమేమిటి?

ఇలాంటి వాటిల్ని మనం ఏవిధంగా తొలగించేటట్లు చెయ్యవచ్చు?? నేను సదురు వెబ్ మాస్టర్ కి లేఖ వ్రాసాను. మీరు గూడా వీలైతే తొలగించ మని లేఖ వ్రాయ మనవి. ఏమంటారు?

 
Clicky Web Analytics