ఉచితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉచితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

24, ఆగస్టు 2011, బుధవారం

తెలుగుబాట లో పాలు పంచుకుందాం

telugubaata

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.


ఇది తెలుగు బాట లంకెలో  ఉన్న సమాచారం. కానీ దీనికి ఓ చక్కటి పుట వ్రాద్దాం అని ఆలోచిస్తూన్నంతలో నామాల మురళీధర్ గారు ఓ చక్కని లేఖవ్రాసారు. దానిని యధాతధంగా ఇస్తేనే నా మనసుకు తృప్తి.

 


ఆత్మీయులైన తెలుగుబ్లాగు మిత్రులకు,

e-తెలుగు సంస్థ తెలుగుబాటలో పాల్గొనవలసినదిగా సాదర ఆహ్వానంపలుకుతుంది. తామంతా పాల్గొనటమే కాక ఈ ఆహ్వానాన్ని మీమిత్రులందరితో పంచుకుని, తెలుగుబాటలో అత్యధికులు పాల్గొనటంలో మీసహాయాన్ని అందించవలసినదిగా కోరుతున్నాం.

 

అమ్మ అనే మాటతో మొదలయ్యి, నాన్న వేలు పట్టుకుని ఊ కొడుతూ, తాత పాడే పద్యాలను వల్లె వేస్తూ, బామ్మ చెప్పే కధలతో ఊహల రెక్కలు సంతరించుకునిమూర్తీభవించిన వ్యక్తిత్వాలని అందించిన కమ్మని అమ్మ తెలుగు.  లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లోచెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష తెలుగు. “దేశభాషలందు తెలుగులెస్స” అని పొరుగువారు కీర్తించిన కమ్మని భాష తెలుగు. అంత గొప్ప భాషకు, సంస్కృతికి వారసులమైన మనం మన అమ్మ వంటి భాషనేనిర్లక్ష్యం చేస్తున్నాం.  ఆంధ్రమహాభారతాలు, ఆంధ్రభాషాపదకోశాలు ఏనాడో అటకెక్కి చెదలుపట్టాయి. తెలుగుభాషకున్న అనంతమైన సాహితీ సంపదను భావి తరాలకి అందించే వారధులు కరువయ్యారు.కాస్తో కూస్తో మిగిలి, నోటిలో నానిన నీతిశతకాలకి ఇప్పుడు మనం మంగళంపాడేసాం. కారణం బ్రతుకుతెరువుకు అక్కరకురాని భాష అయిపోయింది తెలుగు.

 

జీవితమంటే కేవలం బ్రతుకుతెరువే కాదు. బ్రతుకు తెరువు చూపటం లేదని చెదలు పట్టించెయ్యడానికి భాష అంటే కేవలంఒక అక్షరమాల, గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం. ఆ జాతి జీవలక్షణం, అంతర్లీనంగా మెదిలే జీవశక్తి. అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగామిగిలిపోవటమే. మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్నిచాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమనిప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

 

తెలుగు ప్రజలందరినీచైతన్యవంతం చెయ్యటానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయసంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో అందరికీ వీలుగా ఉండేందుకుఆదివారం నాడు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. తెలుగు లలిత కళాతోరణంనుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువనుప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతఅందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటడానికి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మనభాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని మహోద్యమంగామారుద్దాం.


కృతజ్ఞతలతో,

e-తెలుగు.


ఎంత చక్కగా వ్రాసారో అనిపించి ఇక్కడ ఉంచుకుంటే, ఇలాంటి డ్రాఫ్ట్ నాకు మున్ముందు పనికి వస్తుందనిపించింది

30, డిసెంబర్ 2010, గురువారం

మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి

బ్లాగుని ఒక PDFగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. ఒక వేళ రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటారా, ఉదాహరణకి, మీరు వ్రాసిన బ్లాగు పోస్టులన్నీ మీరు భద్రప్రఱచుకోవాలనుకున్నారనుకోండి, ఎమి చేస్తారు? ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇలాంటి వారి ఆలోచనల నుంచి ఉద్బవించినదే ఓ అవకాశం. ఇలా చెయ్యాలనుకున్నవారి నిమిత్తం ఒక అప్లికేశన్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించి, మొదలు పెట్టాను. క్రిందటి సంవత్సరమే దీనిని మొదలు పెట్టినా, పెద్దగా పురోగతి సాధించలేక పోయ్యాను. దానికి పలు ఆటంకాలు మఱియు అవరోధాలు. వీటన్నింటినీ అధిగమించి ఎలాగైతే ఓ ఉపకరణాన్ని తయ్యారు చేసాను. ఇక అంతా అయ్యింది అని సంబరపడే వేళలో మరి కొన్ని విఘాతాలు. వాటినీ అధిగమిస్తాను అన్న మనోధైర్యం నాకు ఉంది అలాగే అధిగమించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానమూ ఉంది. కాకపోతే నా చేతిలో లేని ఓ విషయమే ఇక్కడ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది.

ఈ ఉపకరణం సృష్టించే ప్రయత్నంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. వాటిలో చాలా మటుకు సాంకేతిక పరమైనవి అయితే, ఒకటి బ్లాగు పరమైనటువంటిది. అది నలుగురితో పంచుకుంటే, అందరికీ తెలుస్తుందని ఇలా నా బ్లాగులో పెడుతున్నాను. తెలిసిన వారు ఒగ్గేయ్యండి, తెలియని వారు ప్రయత్నించండి. ఎందుకంటే, RSS కనుక ఎనేబుల్ చేస్తే మీ బ్లాగుని చదవాలనుకునే వారికి మీరు మఱో సౌలభ్యం కలిగించిన వారౌతారు. లేదనుకోండి చదవాలని ఆసక్తి ఉన్నవారు, తప్పని సరిగా మీ బ్లాగుని సందర్శించాల్సిందే. అంతే కాకుండా, నా ఉపకరణం ద్వారా మీ బ్లాగుని PDF చేసుకోవాలనుకుంటే, RSSని ఎనేబుల్ చెయ్యండి. చేసి, నాకో లేఖ వ్రాస్తే, మీ బ్లాగుని నా ఉపకరణం చదవగలుగుతుందో లేదో చూసి చెప్పగలను. నా ఈ ఉపకరణం యొక్క మొదటి మెట్టు RSS ద్వారా మీ బ్లాగుని చదివి ఆ తరువాత PDFని తయారు చెయ్యడం. ఇది సాధించిన తరువాత RSS లేకపోయినా చదవగలిగేటట్టు తయారు చేస్తాను.

ముందుగా మీ బ్లాగులో RSS ఎనేబుల్ చెయ్యబడి ఉందో లేదో చూసుకోండి లేదా ఈ క్రింద చూపిన చిత్రంలో హైలేట్ చెయ్యబడ్డ లంకెలను వరుసక్రమంలో ప్రయత్నించండి. ఈ క్రింద ఇచ్చేవి బ్లాగర్ వారి సెట్టింగ్స్ మాత్రమే, వర్డ్ ప్రస్ వారి సెట్టింగ్స్ మరో విధంగా ఉండవచ్చు. గమనించగలరు.

image

మీ బ్లాగు సెట్టింగ్స్ మార్చేటప్పుడు ఒక్క సారి “Advanced Mode” వెళ్ళి చూడండి. అక్కడ మీకు మరి కొన్ని సౌలబ్యాలు కనబడతాయి. దాని తెరపట్టుని ఇక్కడ మీకు అందిస్తున్నాను.

image

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ఒక్క బ్లాగు పోస్టులు మాత్రమే కాకుండా, పోస్టు స్పందనలు కూడా మీరు నియంత్రించవచ్చు. ఇలా నియంత్రించేటప్పుడు ప్రతీ పోస్టుకీ స్పందనలు విడివిడిగా ఇవ్వవచ్చు లేదా అన్ని స్పందనలను కలగలిపి ఒక ఫీడ్ మాదిరిగా ఇవ్వవచ్చు. అంతే కాకుండా, ఇవేమీకాకుండా, ఫీడ్ బర్నర్ ద్వారా మీ బ్లాగుకి ఒక లంకె ఏర్పరుచుకునే అవకాశమూ ఇక్కడ ఉంది. నా సలహా ఏమిటంటే, మీకు పైన చూపిన తెరపట్టులో అన్ని సౌలభ్యాలకు నేను “Full” అని ఉంచాను కావున నాకు ఫీడ్ బర్నర్ వారి అవసరం లేదు. మీరు కనుక మీ బ్లాగు సెట్టింగ్స్‍ పైన చెప్పినట్లు లేనట్లైతే మఱోసారి మీ బ్లాగు సెట్టింగ్స్ అన్నింటినీ ఒక్కసారి సరి చూసుకోండి లేదా నాకు ఒక విధ్యుల్లేఖ వ్రాయండి, స్పందిస్తాను.

అంతవరకూ నేను నా ఉపకరణం తయ్యారు చేసే పనిలో ఉంటాను. మీరు స్పందించే పనిలో ఉండండి.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉచిత విధ్యాలయం

మొదటి రెండు పుటలు నా కలల సౌధానికి రూప కల్పన చేస్తే.. ఈ పుట ద్వారా, ఉచిత విధ్యాలయం ఎలా ఉండాలను కుంటున్నానో తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.
పేరు చెప్పినట్లుగా, ఇక్కడ పూర్తిగా ఉచితం.. విధ్య మాత్రమే కాకుండా, విధ్యార్ధనకు అవసరమైన అన్నీ ఉచితమే అని అర్దమన్నమాట. ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఉండేటటు వంటి ఒకే ఒక అర్హత, ’చదువుకోవాలి అని అనుకోవడమే’.. ఏంటీ కొత్తగా.. కొంచం అర్దం కానట్లుందా.. ఈ బడిలో చేరాలనుకునే పిల్లలకు స్వతహాగా ఆ ఆలోచన ఉండాలి అన్న మాట. ఏంటిది .. పిల్లలు స్వతహాగా అలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం రావచ్చు. కానీ పిల్లల ఆశక్తి దేనిమీద ఉందో తెలుసుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అలాగే నాకంటూ కొన్ని పరిక్షలు ఉన్నాయి. అవి సశాస్త్రీయమైనవో కాదో నాకు తెలియదు కానీ అవి నాకు ఫలితాన్నిచ్చాయి. ఆ పద్దతులను నేను పలు పిల్లలపై విశ్లేషించినప్పుడు నేను ఆశించిన ఫలితం వచ్చింది. అలాగే వారు ఆ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు.
కొంతమంది పిల్లలలో చదువంటే ఆశక్తి ఉంటుంది, మరికొంత మంది పిల్లలలో ఆటలంటే ఆశక్తి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా అలాగే అందరూ ఐన్ స్టీన్ అవ్వాలనీ ఎక్కడా వ్రాసి లేదు. కొందరు విశ్వనాద్ ఆనంద్ లాంటి వారులాగా తయ్యారయ్యితే మరికొందరు జెస్సీ ఒవెన్స్ లాగా తయ్యారు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీరందరికీ కావాలసినది అల్లా ఒక్క చేయూత మాత్రమే. అదేదో సినిమాలో చెప్పినట్టు .. ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. అవకాశం మాత్రమే కావాలి. నాకు తెలిసినంత వరకూ అదేదో తెలుగు సామెత చెప్పినట్టు, జింక చిక్కిందంటే పరుగెత్త లేక కాదు కాలం కలసి రాక .. అలా కాలం ప్రతీ ఒక్కరికీ కలసి వస్తే ప్రతీ వ్యక్తి ఓ మహర్షి అవుతాడు అని నేను నమ్ముతాను.
అవకాశం రాకే ప్రతీ వ్యక్తి పనికిరానివడౌతాడని నా నమ్మకం. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎంతమంది వచ్చిన అవకాశాలను ఒదులుకుంటున్నారో (అని వ్రాయడం కన్నా జారవిడచుకుంటున్నారో అని వ్రాయడం ఇక్కడ సమంజసంగా ఉంటుంది) నాకు తెలుసు. అలా అవకాశాలు రాక కొందరు నిర్జీవులైతే.. వచ్చిన అవకాశాలను కాలరాచి మరికొందరు నిస్తాణువులై ఏమి పట్టనట్టు మిగిలిపోతున్నారు. వీటన్నింటికీ కారణం చిన్న వయస్సులో పడాల్సిన మంచి నాట్లు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు గనక మంచి చదువు లేదా మంచి నడవడిక అలవాటైతే వారి భావితరం బాగా వర్దిల్లుతుందని నేను నమ్ముతాను.
ఇలా చిన్న వయస్సులో మంచి నడవడిక, మంచి చదువు, ఇక్కడ చదువు అంటే పుస్తకాలకు పరిమితమైనటువంటిది మాత్రమే కాదు సుమా.. కనుక మనం నేర్పగలిగితే భావితారాలకు ఎంతోకొంత మేలు చేసిన వారం అవుతామని నా అభిప్రాయం. ఇక విద్యాలయం విషయానికి వస్తే.. ఇక్కడ పూర్తిగా గురుకులం పద్దతిలో ఓ సుశిక్షుతుడైన యోధుడు ఎలా క్రమశిక్షణగా పెరుగుతాడో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ కనబడాలని నేను కలగంటున్నాను. ఈ రోజునాటికి నాకు ఉన్న ఆలోచన ఈ విధంగా సాగింది, మరి రేపటి విషయమేమిటో.. నా పాఠశాలలో నేను జరపాలనుకునే దినచర్య ఈ విధంగా ఉంటుంది. మార్పు చెందవచ్చు..
  • వేకువఝామున, సూర్యోదయానికి ముందుగా పిల్లలు నిద్రలేస్తే.. సూర్యోదయం తరువాత ఓ గంట సమయానికల్లా చక్కగా తయ్యారై బ్రేక్ ఫాస్ట్ చేసేచోటికి చేరుకుని ఓ అరగంటలో తృప్తిగా తిని ఆటలాడుకోవడానికి వెళతారన్నమాట
  • ఇలా ఆటలాడుకోవడానికి వెళే సమయం దాదాపు ఏడు గంటలవుతుంది. ఇలా ఆటలాడడానికి వెళ్ళిన పిల్లలు ఓ రెండు గంటల పాటు ఆటలాడి తొమ్మిదిన్నర కల్లా చక్కగా  వారి వారికి ఏర్పరిచిన స్థలాలోకి చేరి ఓ కడివెడు పాలు త్రాగి పది గంటలకల్లా స్నానపానాది కార్యక్రమాలు ముగించుకుంటారు.
  • పదిన్నర లేదా పదకొండు గంటలకల్లా చదువు మొదలు
  • ఒంటిగంటకు భోజనం
  • రెండుగంటకు తిరిగి చదువు మొదలు
  • నాలుగున్నరవరకూ చదువు ఆ తరువాత ఫలహారం
  • ఐదునుంచి ఏడు వరకు మళీ ఆటలు
  • ఏడునుంచి ఎనిమిది వరకూ విశ్రాంతి
  • ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య రాత్రి భోజనం
  • తొమ్మిదిన్నర నుంచి ఎవ్వరిస్టానుసారం చదువు లేదా నిద్ర
  • ..
ఎలా ఉంది నా ఆలోచన..?

4, ఆగస్టు 2010, బుధవారం

అమెరికా వాళ్ళు ఇంత పిసినారోళ్ళనుకోలేదు..

అమెరికాలోని మనుష్యులు కూడా పిసినారోళ్ళే. వీళ్ళేం పెద్ద పుడ్డింగోళేంకాదు. వీళ్ళు మామూలు మన లాంటి సాదా సీదా వాళ్ళే కానీ మనలా బయటకి కనబడరు. దొంగలు.. ఇవాల్టి యు.ఎస్.టుడే వార్తలలో ఒకటి నిరుద్యోగం వారికి ప్రభుత్వం వారు ఇచ్చే జీవన్ భృతి గురించి. ఆ వార్త శీర్షిక ఈ విధంగా ఉంది, నిరుద్యోగం మరియు ఉపాధి బెనిఫిట్స్ స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ నేను తెలుగులోకి సరిగ్గా తర్జుమా చెయ్యలేకపోతే ఈ వార్తని ఈ లంకెలో చదువుకోండి. అఖరి గణనాంకాల ప్రకారం అమెరికాలోని నిరుద్యోగుల శాతం దాదాపు ౯.౫ (9.5%). అంతే కాకుండా ప్రతీ నిరుద్యోగికి ప్రబ్యుత్వం తరుఫున అందే మొత్తం  సగటున ౧,౫౪౬$లు (1,546$). దీనిని బట్టి మీకు అర్దం అయ్యిందేమిటి, ఇక్కడ నిరుద్యోగికి భత్యం వీరి నిత్య జీవనానికి సరిపోయే అంత దానికన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అలస్కా అనే రాస్ట్రంలో అయితే ఈ సంఖ్య మరీ ఎక్కువ దాదాపు మూడున్నర వేలకు పైగా. అన్నింటికన్నా అధమంగా ఫ్లోరిడా రాస్ట్రంలో పన్నిండున్నర వందల డాలర్లు నెలసరి వేతనంగా ఇచ్చారు. ఇవి జూన్ లెక్కలు. అస్సలు ఉద్యోగం లేని వ్యక్తికి ఇలా డబ్బులు ఇస్తే వాడెందుకు ఉద్యోగం చేస్తాడు? ఈ విషయం ప్రక్కన పెడితే.. ఇందుకు భిన్నంగా మూడు నాలుగు రోజుల క్రిందట ఓ వార్త చదివాను.. అది నన్ను విశ్మయానికి గురి చేసింది.

cashcowx ప్రస్తుత గణనాంకాల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో దాదాపుగా ఎనిమిదిన్నర వందల బిలియన్ల ధనం రొక్కంగా మూలుగుతోందట. ఇక్కడ రొక్కం అనే విషయాన్ని మీరు కాష్ అని చదువుకోండి. ఈ క్యాష్ నిలువలు ఇతిమిద్దంగా పెరిగి అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని కని విని ఎరుగని మొత్తాన్ని చేరుకున్నాయంట. ఇది ఒక రికార్డ్. ఈ మొత్తం ఎదుగుదల ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంట. అంటే ఇది ఇలాగే సాగితే, ఈ సంవత్సరాంతానికి అది దాదాపు వెయ్యి బిలియన్ల మొత్తానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ళ క్రిందట మొదలైన బ్యాంకుల మూతల నష్టాన్ని అమెరికా ప్రపంచం మొత్తానికి చూపించి సానుభూతిని కొట్టేసిందే, మరి ఇక్కడ పేరుకు పోతున్న నిధుల విషయమేమిటో. అది సరే గాని ఈ ఎనిమిదిన్నర బిలియన్ల్ మొత్తం ఏ మేరకు సరిపోతుందో తెలుసా.. దాదాపు రెండున్నర మిలియన్ల మందికి సంవత్సరానికి డెభ్భైవేల జీతంతో ఐదు సంవత్సరాల పాటు ఉపాధికి సరి సమానం. అంటే ఐదేళ్ళపాటు దాదాపు పాతిక లక్షల మందికి అవసరానికన్నా మించి మూడొంతులకు సరి సమానంగా ఆర్ధిక స్థితి ఉందన్నమాట, అంతే కాకుండా వీరు సంపాదించేదానిలో మూడో వంతు మళ్ళీ టాక్సులనో తొక్కనో లేకపోతే గాదిడ గుడ్డనో ప్రభుత్వం తీసుకుంటుందికదా. సంపాదించిన ప్రతీవాడు ఏదో విధంగా ఖర్చు చేస్తాడు కదా.. ఈ విధంగా వ్యాపారాల్లు పునఃరుద్దరణకు నోచుకుంటాయి కదా.. ఒక వేళ వీడు ఖర్చు పెట్ట లేదనుకోండి, మిగిలిన డబ్బులను బ్యాంకులోనే కదా దాచుకునేది. ఆవిధంగా నైనా డబ్బు మళ్ళీ బ్యాంకుల్లోనే కదా చేరేది. ఇలా ఎలా చూసుకున్నా వీరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉండేది!! ఎప్పుడ్? పైన ఉదహరించిన నాన్-ఫైనాషియల్ సంస్థలలో నిల్వలుగా పేరుకుంటున్న నికర ధనం గనుక ఉపాధికి ఉపయోగిస్తే.

పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు? వీటన్నింటి వెనుక మరో రహస్యం. నాన్-ఫైనాన్షియల్ సంస్థలలోనే ఇంత మొత్తం మూలుగుతుంటే, మరి ఫైనాన్షియల్ సంస్థల పరిస్థితేమిటంటా!! వీటి గురించి మరో సారి మనం విశ్లేషించుకుందాం. అంత వరకూ బై..

26, జులై 2010, సోమవారం

చదువు ఎగ్గొట్టే పిల్లలకు ఇదొక శుభవార్త

rr ఈ మద్య వచ్చే ప్రతీ సినిమాలోనూ హీరో గారికి చదువు అబ్బదు. ఇలా కధలు వ్రాయడం ఓ పెద్ద స్టైల్ అయ్యిపోయింది. అదేదో పెద్ద ఘన కార్యం అన్నట్లుగా చిత్రీకరిస్తారు మన సినిమా దర్శకులు. దానికి తోడు ఇలాంటి కధలు మరిన్ని రావాలని తీసిన వారి వెనకల తాన తందానా అంటూ తిరిగుతూ కోతలు కోసే భట్రాజులు, మరికొందరు.

 

ఏది ఏమైనా మన సినిమాలలో హీరో గారికి చదువు అబ్బదు.. జులాయి వెధవ.. పోరంబోకు.. ఇలా చూపించాం అనుకోండి.. ఇహ ఆ సినిమా వందరోజులు ఖాయమే..

 

అయినా నా వెఱి కాకపోతే, నేను బ్లాగితే మాత్రం జనాలు మారతారా పెడతారా.. ఆ విషయాని ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం. చదువు ఎగ్గొట్టి జులాయిగా తిరుగుదాం అనుకునే యువతరానికి మఱో ఆయుధం. ఎలాగో కాలేజీ అయ్యిన తరువాత మంచి ఉధ్యోగం వచ్చిందా లేదా అని మనల్ని వేపుకు తినే వాళ్ళు ఎలాగూ ఉంటారు, అదే ఫైల్ అయ్యామనుకోండి అప్పుడూ తిడతారు. అంటే పాస్ అయ్యినా తిట్లే అలాగే ఫైల్ అయ్యినా తిట్లే.. అలాంటప్పుడు చక్కగా ఫైల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు మనం రిటన్లో వాళ్ళని తిట్టోచ్చు కదా.. అందుకని చదువు సంధ్యా వద్దు .. చక్కగా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి. మరి ఉధ్యోగం మాట అంటారా.. అదిగో అక్కడికే వస్తున్నా..

యాహూ వారి హోమ్ పేజీలోని వార్త నన్ను చాలా ఆశ్చర్యాని మరియు ఆనందానిచ్చింది. ఓ ఏడు రకాల ఉధ్యోగాలకు అస్సలు కాలేజీ డిగ్రీ అవ్వసరం లేదని మరియు అవన్నీ చాలా దండిగా జీతానిస్తాయని వ్రాసారు. ఇంకేం మీరు కూడా చదివేయ్యండి అలాగే మీరు కూడా వేలకు వేల డాలర్లను సంపాదించి పెట్టే ఉధ్యోగాన్ని కొట్టేయ్యండి. వారి పాఠ్యాంశం క్లుప్తంగా..

ఈ క్రింద పేర్కొన్న ఏడు ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు అందువల్లన తమరు నిశ్చింతగా కాలేజీకి బంకు కొట్టేయ్యండి

౧) ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ – కనీస వేతనం – దాదాపు $47,800

౨) చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవిగారు చేసిన పాత్ర, ప్రైవేట్ డిటెక్టివ్ ఆర్ ఇన్వెస్టిగేటర్ – కనీస వేతనం - $50,600

౩) లిఫ్ట్ మెకానిక్ – కనేస వేతనం - $61,500

౪) న్యీక్లియర్ పవర్ రియాక్టర్ ఆపరేటర్ – కనీస వేతనం $79,100

౫) పర్సనల్ ట్రైనర్ – కనీస వేతనం - $37,500

౬) డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటి – కనీస వేతనం - $62,400

౭) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – కనీస వేతనం – $60,200

7, జనవరి 2010, గురువారం

తెలుగు బ్లాగర్లకు ఓ ఉచిత సౌలభ్యం


తెలుగులో బ్లాగే వారందరికీ ఈ నూతన సంవత్సర కానుకగా కంప్యూటర్ విఙ్ఞానం వారు జనవరి నెల పుస్తకాన్ని ఉచితంగా మీ ఇంటికే పంపే ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిన వారు చెయ్యవలసినదల్లా.. మీ బ్లాగు పేరు మరియు మీ ఇంటి పోస్టల్ అడ్రసుని నాకు పంపించడమే. ఈ సదవకాశం ఫిబ్రవరి నెల పత్రిక వచ్చే లోపులే అని గమనించగలరు. కావున ఈ నెల ఇరవయ్యో తారీఖులోపుల మీ చిరునామాలను నాకు పంపండి. మర్చిపోవద్దు...

జనవరి నెల పత్రికతో ఉచితంగా బ్లాగుల గురించిన ఒక చిఱు పుస్తకాన్ని మరియు రెండు సిడీలను ఇస్తున్నారు. ఒక సిడి లో బ్లాగింగు ఎలా చెయ్యాలో వివరంగా తెలియ జేస్తున్నారు. బ్లాగు ఉన్న మీకు అది ఉపయోగ పడక పోయినా మీ స్నేహితులకు అది ఉపయోగ పడవచ్చు. మర్చిపోకండి నా మైల్ ఐడీ dskcheck@gmail.com
 
Clicky Web Analytics