30, డిసెంబర్ 2008, మంగళవారం

e-తెలుగుతో నా అనుబంధం - మొదటి భాగం

హైదరాబాదులో ఈ మద్య జరిగిన పుస్తక ప్రదర్శన గురించి అందరికీ తెలుసు, కాబట్టి నేను కొత్తగా చెప్పొచ్చేది ఏమీ లేదు. కానీ ఇక్కడ నేను ప్రస్తావించే విషయలు e-తెలుగు సంఘం గురించి, అలాగే e-తెలుగు సంఘం తో నాకు ఉన్న అనుభవం గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. రాబోయే రెండవ భాగంలో పుస్తక ప్రదర్శనలో e-తెలుగు సంఘం యొక్క కార్యకలాపాలలో నా వంతు కృషి ఏమిటి? ఎలా? ఎందుకు? వంటి పలు విషయాలు ప్రస్తావిస్తాను.

నేను కాలానుగుణంగా మారుతూ ఉన్నాను అనేందుకు సాక్షమే ఈ పుట. నా ప్రవర్తనకి నేను ఎవ్వరికీ జవాబుదారీ కాక పోయినా, నా మటుకూ నేను ఎంత నిస్పక్షపాతంగా ఉన్నానో అని నేను తెలుసుకునే క్రమంలో వెలువడినదే ఈ ప్రచురణ. ఈ పుటకి ఉన్న శీర్షిక ఏమాత్రం సరిపోక పోయినా, రెండవ పుటకి ఇది ఉపోద్ఘాతం.

ఈ బ్లాగు నందు కొంచం సీరియస్ గా అనిపించే విషయాలు ప్రస్తావించినా, మరోవైపు సరదాగా ఉండేందుకు మొదలు పెట్టిన బ్లాగు, ’ఉబుసు పోక..’. దీనికి ముందు నేను ఎక్కువగా e-తెలుగు సైటు నందు చలాకీగా పాలు పంచుకుంటూ ఉండేవాడిని. ’అందరూ చేస్తుండగా లేంది మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం..’ అంటూ మొదలు పెట్టిన బ్లాగే ’ఉబుసు పోక..’. ఇదిగో అలా అలా కాల క్రమేణంలో నేను భవదీయుడుగా రూపాతరం చెందిన ఉదంతం జగద్విదితమే. నాకు తోడుగా, నా సహధర్మచారిణి తన మనసులో మాటగా మొదలు పెట్టి, మహిళా బ్లాగర్లాందరి నుంచి పొందిన ప్రోత్సాహంతో, ఇదిగో ఇప్పుడిప్పుడే తన ఊసులు నలుగురితో పంచుతోంది. అప్పట్లో మా దగ్గరే ఉంటున్న మా అమ్మ కూడా ’ఒక సగటు భారత నారి ఆలోచనలు..’ అంటూ తన అభి ప్రాయాలు ప్రచురించడం మొదలు పెట్టింది. కానీ ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా విజయవాడలో ఉండటం వలన కొంత కాలం తరువాత తను తిరిగి తన బ్లాగు ప్రపంచంలోకి అడుగిడుతుంది.

ఇన్ని బ్లాగులకు ప్రేరితమైన తెలుగు ప్రియులకు ఆలవాలమైన e-తెలుగు సంఘం గురించి మరో పుటలో నా అనుభవాలతో కలుస్తాను, అంతవరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

12, డిసెంబర్ 2008, శుక్రవారం

అందం శాపమా ? లేక అమ్మాయా!!! ఏది?

 

రెండు రోజుల క్రిందట TV9లో వార్తలు వింటుంటే చూసిన దృశ్యాలు నన్ను ఈ రెండు రోజులూ దుఃఖసాగరంలో ముంచి తేల్చాయి. శీర్షికలో చెప్పినట్లుగా.. అందంగా ఉండడం శాపమా? లేక అమ్మాయిగా పుట్టడం శాపమా? అంతే అనుకుంటే, అమ్మాయిగా పుట్టి అందంగా ఎదగడమే ఈ నాటి ఆడ పిల్లలు చేసుకున్న గత జన్మ కర్మ ఫలమా? జీవితపు ప్రారంభ దశలోనే అష్టకష్టాలకు ఎదురీదుతున్న స్వప్నిక మరియూ ప్రణీతలు ఏ జన్మలో చేసుకున్న పాపఫలం ఇది?

 

ఆశించద్దు అని ఎవ్వరూ చెప్పలేదే, కానీ శాసిస్తే ఎదుర్కునే హక్కు ప్రతీ వారికీ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కుంటారు? ఎవ్వరిని ఎదొర్కొంటారు? అలనాడు ప్రాణమే తీసిన అగంతకుడు చక్కగా ఊచల వెనుక మనో నిబ్బరంతో నిద్రపోతుంటే, ఈ నాడు ఉన్న జీవితాన్ని అంధఃకారం లోకి నెట్టేసిన కిరాతకులను కొమ్ముకాస్తున్న పోలీసు వ్యవస్థని ఎవ్వరు నిలదీస్తారు? ఏమి చేస్తే ఇలాంటి వారికి న్యాయం జరుగుతుంది? సబ్య సమాజం నివ్వెర పోయేటట్లు ప్రవర్తించిన కిరాచకుడి చర్యనుంచి వీరు బయట పడి నిండు జీవితాన్ని ఎలా పోరాడాలో నేర్చుకునేంత వరకూ వీరికి ఉపశమనమేది?

 

వయ్యస్సులో చిన్నదైనా, ’దేవుడనే వాడు ఉన్నాడు.. నాకు అన్యాయం చెయ్యడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు ..’ అంటూ పలుకుతున్న ఈ చిన్నారికి ఏమి చెప్పాలి? మున్ముందు ఉన్న జీవితం అంతా అంధః మయమై చీకటిలోనే రంగులు వెతుక్కోవాల్సిన పరిస్తితికీ, ఈ పిల్ల చేసుకున్న పుణ్యం ఏమిటి? దేవుడా!! నిన్ను ప్రశించే వారు ఎవ్వరూ లేరా? ఎవ్వరూ లేరని విర్రవీగుతున్నావా? లేక ఎవ్వరికి ఏమి నేర్పిద్దామని ఈ చిన్నారులకు ఇంత పెద్ద శిక్ష విధించావు? హింశ అన్నింటికీ ఒకదారి కాదు అని అందరికీ తెలుసు, మరి ఈ ఇద్దరు చిన్నారులను ఇంత కౄరంగా చేసేటట్లు తలంచిన యువతను పెంచే పెద్దలకు ఈ విషయాన్ని ఎవ్వరు తెలియ జేస్తారు?

 

శిక్ష పిల్లలకు ఎంత వేస్తారో అంతకన్నా ఓ విడత ఎక్కువగా వారిని కన్న తల్లి తండ్రులకు కూడా వెయ్యాలనేది నా అభిప్రాయం. ఇందులో వారి తప్పేంటి అంటారా.. అదేదో తెలుగు సామెత చెప్పినట్లుగా, మ్రొక్కై వంగనిది మానై వంగునా .. అన్నట్లు, మొక్కగా ఉన్నప్పుడే వీరి ఆలోచనలను పసిగట్టలేని తల్లి తండ్రులు, వారి నిర్లక్షానికి ఎంత పెద్ద రుసుము చెల్లించాయో ఈ పసి హృదయాలు. వయ్యస్సులో ఉన్న యువతను అర్ధం చేసుకో లేని తల్లి తండ్రులూ తల్లితండ్రులేనా? వీడెవడో ఇలాంటి పని చేస్తే మరొకడు ఎంచక్కా తాను ప్రేమించిన అమ్మాయి కాలం చేసిందని ఎంచక్కా పేపర్లో ప్రకటనే ఇచ్చేసాడే.. ఏమిటి ఈ ప్రవర్తన? వీరిని ఒక సక్రమమయిన దారిలో పెంచలేని తల్లి తండ్రులు ఇక ఉండీ ఏమి ప్రయోజనం?

 

పిల్లలు అప్రయోజకులుగా పెరుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించ లేనంత బిజీగా ఈ తల్లి తండ్రులు ఏమి చేస్తున్నారో నాకు అర్దం కావటం లేదు. ఇల్లు, ఇల్లాలు, కన్నవాళ్ళు, కని పెంచిన వాళ్ళు, వారి వారి భవిష్యత్తు వీటి  కన్నా ముఖ్యమైన విషయాలు ఉంటాయా.. వీటిల్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంతటి ఘాతుకాని పాల్పడుతున్న పిల్లలను పట్టించు కోని పెద్దల హస్తం ఇటువంటి చర్యలకు అన్యమస్తకంగా హేతువు కాదా? మరి వారికి ఎటువంటి శిక్ష పడాలి?

2, డిసెంబర్ 2008, మంగళవారం

రత్నమా? ముత్యమా? లేక పగడమా?

ఈ పుట ప్రచురించే ముందు చాలా సంశయించాను. కానీ, ఆలోచించిన కొద్దీ నాలో కలుగుతున్న భావనకి అన్యాయం చేస్తున్నానేమో అనిపించి ఎక్కువగా ఆలోచించడం మానేసి, ఇదిగో ఇలా మీముందు నా అభిప్రాయాన్ని ఉంచుతున్నాను. సద్బుద్దితో గ్రహిస్తారో లేక నా మది మందగతైందని తలుస్తారో మీ అభీష్టానికే వదిలేస్తున్నాను.

నేను స్వతహాగా తెలుగు TV ఛానళ్ళను చూడను. కారణాలేవైనా అవి ఎక్కువ శాతం స్త్రీని తక్కువ చేసి చూపించడమో, లేక, స్త్రీకి పలు పెడర్దాలు ఆపాదించడమో చేస్తుంటాయి అనే అభిప్రాయం నాలో చాలా బలంగా నాటుకు పోయింది. కానీ కొంత మంది స్త్రీలను చూసినప్పుడు, మహా పురుషులు అనే పదం వెలితిగా తోస్తుంది. అలాంటి మహిళలకు ఎలాంటి పద ప్రయోగం చెయ్యాలా అని బుఱ్ఱగోక్కున్నప్పుడల్లా, ఉన్న వెంట్రుకలు రాలటం తప్పితే మంచి పదం దొరకడం లేదు.

’మహా వనితలు’ అందాం అనుకుంటే.. ఈ పద ప్రయోగంలో వ్యంగ్యం తొంగి చూస్తున్నట్లుంది.

ఇంతకీ అస్సలు చెప్పొచ్చినదెవ్వరి గురించంటే.. విజయలక్ష్మి దేశికన్. వనితా TVలో నాకు చాలా నచ్చిన వ్యాఖ్యాత.

ఈవిడను ఇక్కడే, అంటే వనితాTV లోనే, మొదటి సారి చూడడం. అహా.. ఏమి మాధుర్యం.. నిజంగా పాత కాలంలో జయప్రద గృహిణిగా చేసిన పాత్రలు అన్నీ కలగలిపి ఈవిడలా ప్రాణం పోసుకున్నాయేమో. ఒక్క సౌందర్యమే ఈవిడ బలమనుకుంటే పొరపాటు చేసినట్లే అనిపిస్తుంది. ఈవిడ గళంలో ఉన్న గాత్ర శుద్ది విన్న వాళ్ళకే అర్దం అవుతుంది. అలవోకగా స్పందించె ఈవిడ సంగీత ఙ్ఞానానికి మచ్చు తునకలే వనితాTVలోవచ్చే కార్యక్రమాలు.

నేను ఈవిడను చూడక ముందు వరకూ  SP శైలజ గారు, అదేనండి మన బాలుగారి చెల్లెలు, అంటే తెగ అభిమానం. ఈవిడ కూడా చక్కగా నిండుగా చూడ ముచ్చటగా తయ్యరైయ్యె వారు. సందర్భానికి తగ్గట్టుగా వీరి ఆహార్యం ఉంటుంది. చాలా సామాన్యంగా, ఎక్కువ ఆభరణాలు లేకుండా, simpleగా, gentleగా చాలా చక్కగా తయ్యరయ్యే చాలా (.. ఇన్ని ’చాలా’లు అవసరం లేకపోయ్యినా...) కొద్ది మంది ఆడవాళ్ళలో ఈవిడ ఒక్కరు.

ప్రతీ మగువలోనూ ఏదో ఒక శక్తి అంతర్లీనంగా ఉంటుంది. కానీ అందరు మహీళ లోనూ ఉండే ఒకే ఒక్క గొప్పగుణం, స్త్రీ తత్వం. అటువంటి గొప్ప భావాన్ని కాదనుకుంటూ తమ తమ ఉనికిని మరచిపోయి ప్రఘల్బాలు పలికే మహిళలు ఇలాంటి వారిని చూసి ఏమనుకుంటారో??

ఇక అసలు విషయానికి వస్తే.. నాకు భార్యగా వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో అని నేననుకున్న కొన్ని ఊహలలో వీరిరువురూ నూటికినూరు శాతం సరి పొతారు. అఫ్‍కోర్స్.. ఈ విషయం నా శ్రీమతికి తెలుసనుకోండి, కానీ అన్నీ మనం కోరుకున్నట్లు జరిగితే, దేవుడనేవాడు ఎందుకు? నా విషయం ప్రక్కన పెడితే..

విజయలక్ష్మి దేశికన్.. ఈవిడ మాటలో ఎంత వినయం.. ఎంత స్పష్టత.. ఎంత కమ్మదనం.. అబ్బో.. ఏమి చెప్పమంటారు. శ్రావ్యమైన కంఠం.. ప్రతీ రాగం గురించి లోతైన అవగాహన..ఏ రాగాన్ని ఏ సంగీత దర్శకుడు ఏ ఏ సందర్బాలలో.. ఏ ఏ విధంగా .. ఎప్పుడెప్పుడు.. ఎలా ప్రయోగించారో తెలుసు కోవాలంటె, ఈవిడ చేసే కార్యక్రమాలు చూసి తీరాల్సిందే. విజయలక్ష్మి దేశికన్.. ఈ పేరు వింటుంటే, ఈవిడ తెలుగు అమ్మాయి లాగా అనిపించడంలేదు. కానీ ఈమె పలికే తెలుగు చూస్తూంటే, చాలా కాలంగా తెలుగుని చిలికి___ కాచి___ చల్లార్చి___ వాడ బోసారేమో అనిపిస్తోంది. ఈవిడ గురించి నాకు చాలా తక్కువే తెలుసు, చదువరులకు ఈవిడ గురించి ఏమైనా తెలిస్తే తెలియ జేయగలరని మనవి.

ఇంకా ఏవేవో వ్రాయాలని ఉన్నా.. భావ రూపం మరో వైపు మరలి నారీ లోకం అంతా ఒక్కటై కుమ్మేస్తారేమో అని భయంతో ముగిస్తున్నాను.

అఖరుగా.. ప్రతీ ఒక్కరి ప్రతిభా పాఠవాలు మెచ్చుకోవడం తప్పు కాదని భావిస్తూ, మీలోనూ అంతర్లీనంగా నిక్షిప్తమై అప్రయోజకంగా మిగిలిపోతున్న మీ మీ శక్తి యుక్తులను వెలుగు లోకి తెస్తారని ఆశిస్తాను.

 
Clicky Web Analytics