Tuesday లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tuesday లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2020, మంగళవారం

ప్రతీ రోజుకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే..

సూర్యోదయ సమాయానికి ఉన్న గ్రహాన్ని ఆధారంగా తీసుకుని ప్రతీ రోజికి ఆ పేరు పెట్టారు, మన పురాతన ఖగోళ శాస్త్రవేత్తలు.

జ్యోతిషం ప్రకారం ఉన్న నవ గ్రహాలలో, రాహు కేతులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వకపోయినా, వాటి ప్రభావం లేదని అనుకోకూడదు. ఈ రెంటినీ మినహిస్తే, మిగిలిన ఏడు గ్రహాలు సూర్యోదయానికి ఉండేటందున, వాటి పేరుపై ఆ రోజు పిలవబడుతుంది.

హోర అంటే, రెండున్నర ఘడియల సమయం అన్నమాట. ఒక ఘడియ అంటే, దాదాపుగా 24 నిమిషాల సేపు ఉంటుంది. అంటే, ఆ విధంగా రెండున్నర ఘడియలు దాదాపుగా ఒక గంట పాటు. ఇక్కడ ఒక చిన్న సవరింపు. ఇరవై సెకన్ల సమయాన్ని మనం లెక్కలోకి తీసుకుని, ప్రతీ రోజు నిమిషాన్ని ఎక్కువ చేసుకుంటూ మూడు రోజుల తరువాత సమయాన్ని అదే విధంగా ఉంచుకోవాలి.  ఉదాహరణకి ఈ వారంలోని ఆదివారం నాడు, అంటే, 29/Mar/2020 నాడు భాగ్యనగరంలో సూర్యోదయం ఆరుగంటల పద మూడు నిమిషాలకు అవుతూ, ప్రతీ రోజూ ఒక నిమిషం తగ్గుతోంది. కానీ మంగళ బుధవారాలు ఒకే సమయాన్ని లెక్కలోకి తీసుకున్నాం. ఎందుకంటే, రోజుకి ఇరవై సెకన్లపాటు వదిలేసిన సమయాన్ని ఇక్కడ కలిపేసుకున్నాం అనమాట.
ఆవిధంగా ప్రతీరోజుని లెక్కగడితే, ఆ నాటి ఉదయానికి ఉన్న గ్రహాన్ని ఆధారంగా ఆరోజునకు ఆ పేరు వచ్చింది. ఇది వ్రాస్తున్న సమయంలో అంటే, 8:05 pm of 31/March/2020, గురు హోర నడుస్తోంది.


మరిన్ని వివరాలు మఱో సారి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
 కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

5, జూన్ 2012, మంగళవారం

సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..

హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!!

మొదటి కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ చాలా పట్టణాలు తిరిగారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులు వీరికి చాలా కష్టాలు చూపించారు. ఈ విషయాన్ని ఆ ప్రేమికులే వారి స్వయం అనుభవాలుగా వివరించారు

రెండొవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కధనం ప్రకారం అబ్బాయి రైల్వే పట్టాల మీద శవమై కనబడ్డాడు. అంటే దీనిని ఆత్మహత్య క్రింద చిత్రీకరించారని సమాజంలోని కొన్ని మహిళా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి న్యాయం జరగాలని పోరాటం జరిపారు. ఈ విషయం అంతా చనిపోయిన అబ్బాయి తల్లి చేత చెప్పించారు.

మూడవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కల్లా ఒక్కటే.. వారిద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి వాటికి తోడుగా అక్కడి పెద్దలు కూడా వీరి వివాహానికి సమ్మతినివ్వలేదు. వాటిని  సమర్దించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ కలసి ఢిల్లీ వెళుతుంటే, దారిలో కాపు కాచి బస్సులో ప్రయాణం చేస్తున్న అబ్బాయిని కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినందుకు అబ్బాయి చెల్లెల్ని కూడా చంపించే ప్రయత్నం చేసారని ఆ అమ్మాయే చెప్పింది. న్యాయస్థానం కొందరు హంతకులను గుర్తించి పలువురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. మఱి కొందరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది.


ఇలాంటి వారిద్దరి కధలే ఈ నాటి చర్చాంశం.

 

సత్యమేవ జయతే గురించి జరిగిన ప్రచారంలో కొన్ని నగ్న సత్యాలు నన్ను చాలా భాదించాయి. అందుకని సత్యాన్ని నగ్నంగా నైనా చూసే ధైర్యం లేని నాలాంటి వాడు మొదటి ఎపిసోడ్ నందలి కొన్ని నిజాలు తెలుసుకున్న తరువాత, నిజాన్ని జీర్ణించుకు లేని స్థితిలో తరువాతి ఎపిసోడ్స్ చూడలేదు.

 

ఆ తరువాత చూసిన మఱో ఎపిసోడ్ ఇది. నేను ఈ ఎపిసోడ్ చూసే సమయానికి ఎంత భాగం అయ్యిందో తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు, ఓ గ్రామ పంచాయితీలోని ఓ ఐదుగురు పెద్దవాళ్లతో చర్చిస్తున్నారు. చర్చ ఎప్పుడూ మంచిదే కాదనను, కానీ చర్చ అనేది ఒక వైపుగా జరగ కూడదు. ఇరువైపులనుంచి జరగాలి. కానీ పంచాయితీ పెద్దలతో ఇక్కడ జరిగిన తతంగం చర్చలా కాకుండా, వారిని అపహాస్యం చేస్తుంటే, ప్రేక్షకులలో కూర్చున్న వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలేమో పరంపర / Tradetion అంటూ ఉంటే, మన అమీర్ ఖాన్ గారేమో భారతదేశ రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారు. వీరి చర్చను పూర్తి చెయ్యకుండానే అమీర్ ఖాన్ గారు మధ్యలో ముగిస్తూ మఱో వ్యక్తిని ప్రవేశ పెట్టారు

 

వీరి తరువాత మఱో వ్యక్తి వచ్చారు. ఆయన లవ్ కమాండోస్ అనే ఓ సమాజానికి ప్రతీకగా వచ్చారు. ఇంటర్ కాస్ట్ మారేజస్ మాత్రమే మన భారత దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతున్నాయని, అవి మాత్రమే భారతదేశ గౌరవాన్ని నిలబెడతాయని సుప్రిం కోర్ట్ చెప్పిందని ఈయన చెబుతున్నారు. ప్రేమ మూర్తులుగా కనబడే దేవతలను ఉదహరింపుగా రాధా శ్రీకృష్ణులను చూపిస్తున్నారు కదా!! అలాంటి వారందరికీ ఓ మాట చెబుతున్నాను, వీలైతే ఆ మూర్తులున్న గుడిలలో పూజలైనా ఆపేయ్యండి లేదా.. ప్రేమియోంక ప్రేమ్ కో స్వీకార్ కర్లో.. love shall conquer the world.. అనేది వీరి భాష్యంలోని ఆఖరి అంశం.

వీటి తరువాత, ఉదాహరణగా మఱో ప్రేమ జంట గురించి ప్రస్తావించారు. అలాగే, ఆ ప్రేమ జంట యొక్క చరిత్రను వివరిస్తూ వారి కుటుంబం వారిని పాతిక సంవత్సారాలు దూరంగా ఉంచిన తరువాత వారికి మఱో సారి సాంప్రదాయ బద్దంగా వారికి వివాహం జరిపించిన వైనాన్ని చిత్రీకరించి ప్రేక్షకులకు సెంటిమెంట్ అందేపరంగా చూపించారు.

ముగింపులోకి వస్తుండగా, ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి తన తండ్రికి సందేశానిస్తూ క్షమించమని వేడుకోవడం దానిని అమీర్ ఖాన్ గారు సమర్దిస్తూ ఆ పిల్ల తల్లి తండ్రులను బుజ్జగించే ప్రయత్నం చేసే పనిగా, ఓ చక్కని పాటని అందించారు.

ఇది అక్కడ జరిగింది. నా అభిప్రాయం మఱో సారి విపులంగా వ్రాస్తాను. ఈ పుటని ఇక్కడతో ముగించి, “సత్యమేవ జయతే ..” లో ఈ ఎపిసోడ్ గురించి నా అభిప్రాయాలు వ్రాసే ముందుగా, ప్రేమ అనే పదం గురించిన నా నిర్వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, నా భావన ఏమిటో .. అది ఏ కోణం నుంచి చూస్తూ వ్రాస్తున్నానో అనే విషయం పై ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది.


ప్రేమ పై నా నిర్వచనం

ప్రేమ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొవిధంగా అభివర్ణిస్తాను. నా భావనలో మాత్రం, ప్రేమ అంటే భాద్యత. మనం ఎవ్వరినైనా ప్రేమిస్తున్నాం అంటే వారి భాద్యత తీసుకున్నట్లే. ఇది భార్యా భర్తల విషయమైనా లేదా తల్లి పిల్లల విషయమైనా లేదా తండ్రి పిల్లల విషయమైనా లేదా మరింకేదైనా. ఆ విధంగా ప్రేమించడం అంటే భాద్యతని భుజాలపై వేసుకుని, ప్రేమించ బడుతున్న వారికి ఒక రకమైన భద్రతా భావనని ఇవ్వటమే అని నా అభిప్రాయం మఱియు అనుభవం.

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

11, జనవరి 2011, మంగళవారం

ఈ నాటి ప్రత్యేకత

హల్లో..

ఈ నాటి ప్రత్యేకతేమిటో తెలుసా.. అదేనండి. ఇవ్వాల్టి తేదీలో దాదాపు అన్నీ ఒకట్లే!! ఎలా అంటారా.. ఇదిగో ఇలా

ఒకటో నెల - 1

పదకొండో రోజు - 11

పదకొండో సంవత్సరం - 11

అదే గనుక పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకన్లకు ..  11:11:11 am అవుతుందన్నమాట. సొ ఫైనల్‍గా చెప్పొచ్చేదేమిటంటే,

11/1/11 తారీకున 11:11:11 am సమయ్యాన్ని ఇప్పుడు మీరు మిస్ అయితే, మరో పది నెలలు ఆగండి. అప్పుడు ఇలాంటిది మరొకటి వస్తుంది. అదేనండి నవంబర్ నెలలో కూడా రెండు ఒకట్లు ఉన్నాయి కదా.. ఇప్పుడు మిస్ ఆయిన శుభం మీకు 11/11/11 తేదీన 11:11:11 am సమయంలో తప్పకుండా జరగాలని కోరుకుంటూ ..

సెలవ్

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముక్తి అనగానేమి?

ఈ మధ్య నేను తెలుగు నిఘంటువులో పాలుపంచుకుంటూ తెలుగు పదాలను యూనికోడ్ ద్వారా వ్రాస్తున్నప్పుడు కలిగింది ఈ ప్రశ్న. ఓ సత్‍సంగంలో ఈ విషయమై చర్చ మొదలు పెట్టగా పలు పలు సమాధానాలు మరియు వివరణలు వచ్చాయి. వాటన్నింటిని క్రోఢీకరించి ఓ చోట ఉంచితే బాగుంటుంది అన్న ఆలోచన రూపమే ఈ పోస్టు.

ముక్తి గురించిన వివరాలు చదివే మీకు తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిన వివరాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అసందర్బం అనిపిస్తే మన్నించండి.


ముక్తి అనేది రెండు స్థితులలో ఉంటుంది అని, “లేవండి మేల్కొనండి” అనే బ్లాగు రచయతైన సురేష్ బాబుగారు ఈ క్రింది విధంగా స్పందించారు.

1.జీవన్ముక్తి, అంటే జీవించి ఉండగానె పరమాత్మలో లేక ఆత్మానందం లొ నిమగ్నమై ఉండడం.
2.విదేహముక్తి, అంటే మరణించిన తర్వాత ముక్తి పొందడం.


చర్చలో పాల్గొంటూ, “వాగ్విలాసము” అని బ్లాగుతున్న ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు తన అభిప్రాయాన్ని వారిమాటలలో..

చతుర్విధ ముక్తములు అనేవి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఇవి ముక్తిభేదాలు కావనుకుంటా! తన్మార్గంలో వివిధస్థాయీభేదాలు అనుకుంటాను.

సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో೭స్మ్యహమ్

అని శివానందలహరిలో ఆదిశంకరులు స్తోత్రం చేస్తారు.

· నిరంతరసంకీర్తనం గుణగానం వలన సారూప్యం (ఆ గుణాలు అలవడటం) సిద్ధిస్తుంది.

· శివభక్తులతో నిత్యసాంగత్యం వలన సామీప్యం (దగ్గఱితనం) సిద్ధిస్తుంది.

· సమస్త చరాచరజగత్తునందూ శివునినే చూడటం వలన సాలోక్యం (కైలాసవాసం) సిద్ధిస్తుంది.

· తదనంతరం సాయుజ్యం (స్వామిలో ఐక్యమవ్వటం) సిద్ధిస్తుంది


చర్చలో ఆఖరున పాల్గొన్న లీలామోహనం బ్లాగరి చిలమకూరు విజయ మోహన్ గారు ఈ క్రింది విధంగా వారి అభిప్రాయాన్ని తెలియ జేసారు.

మోక్షము,కైవల్యం,సాలోక్యం,సారూప్యం,సామీప్యం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మోక్షమంటే విడుదల అని అర్థము. కర్మబంధమునుండి పూర్తిగా విడుదల పొందడాన్ని మోక్షమని రూఢిగ అంటారు. అలా కర్మబంధం తొలిగాక, రెండు స్థితులుంటాయి.

జీవుడు అర్చిరాది మార్గం ద్వారా విరజానదిని దాటడందాక అంతా సమానమే. విరజానది దాటాక కేవలం ఆత్మానుభవమే కోరి తృప్తిచెంది, అలా ఉపాసన చేసినవారు ఆ పరమపదంలోనే ఓమూలనుండే చోటుకు చేరి కేవలునిగానే మిగిలిపోతాడు. దానిని కైవల్యం అంటారు. అదీ మోక్షమే.

కర్మలన్నీ నశించాయి అర్చిరాదిగుండా విరజానది దాటి వచ్చాడు కనుక ఇక తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశించడు. భగవదనుభవాన్ని కోరలేదు కనుక దాన్ని పొందడు, తిరిగి వెళ్ళడు. స్వాత్మసాక్షాత్కారం పొంది, ఆత్మానుభూతిలో తేలియాడుతుంటాడు.అది నిత్య స్థితి.

అదికాక, భగవత్సేవనే మోక్షమని ఉపాసించిన వాడు, విరజానది దాటగానే అమానవ అనే స్పర్శతో పంచోపనిషణ్మయ దివ్యదేహం ఏర్పడుతుంది. అది చాలా రకాలుగ అలంకృతమై, ప్రేమ పూర్ణమై భగవదనుభవార్హమై గరుడుని తోడ్పాటుతో పరమాత్మ సన్నిధికి చేరి స్వామిసేవలో ఉంటాడు.వీటిల్లో ఆలోకంలోకి, విరజానది దాటగానే, ప్రవేశిస్తాడే ఈ జీవుడు, ఆ స్థితిని సాలోక్యం. భగవంతునితో సమానంగా ఒకే లోకంలో ఉండడం.

ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి, అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది.

క్రమంగా భగవన్మండపము ప్రవేశించి భగవంతుని దరికి చేరు సమయం- సామీప్యం అంటారు.

అతడి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణ దివ్యదంపతుల గోష్ఠిలో ఉండి, అతడి గుణాలను పొంది నిత్యకైంకర్యాన్ని చేపట్టడం సాయుజ్యం అంటారు .

ఇందులో ముక్తులు అందరూనూ, గరుడాది పెద్దలందరినీ నిత్యులని వ్యవహరిస్తుంటారు.ఈ వెళ్ళిన వీడు ముక్త గోష్ఠిలో చేరతాడు.

23, నవంబర్ 2010, మంగళవారం

భవదీయుడు అంటే..

అనే గూగుల్ గుంపులో ‘’ అనే పదం యొక్క అర్దంపై ఓ చక్కని చర్చ జరిగింది. ఆ చర్చలో గౌరవనీయులైన Dr. R. P. Sarma గారు ఇచ్చిన వివరం బహు విపులంగా ఉండటంతో దానిని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


మొదటగా పవిరాల అచ్యుత్ ప్రసాద్ గారు ఈ ప్రశ్నని అడిగి ఈ క్రింది విధంగా వివరించారు

భవదీయుడు = భవత్ + విధేయుడు = your's obidiently

ఇక్కడ "భవదీయుడు" ని విడదీసిన విధానము మరియు "భవత్ = your's" రెండూ కూడా crude guesses మాత్రమే


ఇందుకు స్పందిస్తూ టెకుముళ్ళ వెంకటప్పయ్య గారు ఈ క్రింది విధంగా వివరిస్తూ తెలుగులోని ప్రధమా విభక్తి ప్రస్తావన తెచ్చారు

భవత్ అంటె నీవు, మీరు, జరుగుచున్న కాలం అని అర్ధము. అదే భవదీయ అంటే  నీది అని అర్ధం

ఐతే తెలుగు లో ("డు, ము, వు, లు") ప్రధమా విభక్తి చేయడంతో భవదీయుడు అయింది.  అంటే....  మీ యొక్క అని మాత్రమే, విధేయుడు అని అర్ధము తీసుకోరాదు అని నా అభిప్రాయం


నేదునూరి రాజేశ్వరి గారు తెలుగులో భవదీయుడు అన్న పదానికి అర్ధం దొరకలేదు కానీ

భవము =పుట్టుక,సంసారము,ప్రాప్తి,శుభము ,సత్తా అని

భవత్ =కలుగుచున్న,పుట్టుచున్నఅనీ,

భవదీయము =మీది ,అనీ,విధేయము = సాసింప తగినది , విహిత కార్యము అనీ

విధేయుడు = సేవకుడు  చెప్పినట్లు వినువాడు అనీ

ఇలా అర్ధాలు ఉన్నాయి అని వివరించారు.


వీరిని సమర్దిస్తూ సుధాకర్ గారు సంసృతంలో భవదీయుడు అని చదివినట్టు ఉంది అని ప్రస్తావించగా, Dr. R. P. Sarma గారు ఈ క్రింది విధంగా వివరించారు. వారి పాఠ్యాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


ఆసక్తికరమైన చర్చ జరిగింది. మొదటే టేకుమళ్ళవారు సరిగానే వివరించారు. భవదీయుడు పదం తెలుగు నిఘంటువుల్లో దొరకకుంటే దొరకక పోవచ్చుగాక. ఎందుకంటే - మనం వినే ఇటువంటి  సంస్కృతపదాలు చూడండి. దేశీయ పదజాలం, రాష్టీయ అసమానతలు, మానవీయ సంబంధాలు, జతీయ సంపద మొదలైనవి. (స్పష్టత కోసం వేరేపదాలతో సమసించిన పదాలను ఇచ్చాను.) వీటిని దేశ+ఈయ; రాష్ట్ర+ఈయ; మానవ+ఈయ; జాతి+ఈయ అనే విధంగా విభజించాలి. ఇందులో మొదటిది పదం(ప్రకృతి).రెండవది ప్రత్యయం. ‘ఈయ’ అనేప్రత్యయానికి పై ఉదాహరణలవల్ల ‘సంబంధించిన’ అనే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి

 

భవదీయ = భవత్+ ఈయ  అని విభజించాలి.


ఇందులో భవత్ అనేది టేకుమళ్ళవారు చెప్పినట్టు ...‘తమరు’ అనే అర్థం ఇచ్చే శబ్దం. దాన్ని భవచ్ఛబ్దం అంటారు. దీనికి సంస్కృతంలో మూడులింగాల్లోనూ రూపాలున్నాయి.


పుం.      భవాన్      భవన్తౌ      భవన్త:  .........
స్త్రీ .        భవతీ       భవత్యౌ     భవత్య:  ........
నపుం.    భవత్       భవతీ       భవంతీ ........


కాబట్టి - భవత్+ఈయ > భవదీయ= తమరి (Yours)...


ఇక నిఘంటువుల్లో సాధారణంగా మూలపదం మాత్రమే ఇస్తుంటారు. దాని మీద ప్రత్యయాలు చేరగా ఏర్పడే కృత్తద్ధిత పదాలు అన్నీ ఇయ్యకపోవచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ఇందుకు కొంత మినహాయింపు.

ఇంకా భవ శబ్దానికి 1.పుట్టుక 2. సంసారం మొ. అర్థాలూ ఉన్నాయి.

భవత్ శబ్దానికి ‘జరుగుచున్న కాలం’ అనే అర్థం లేకపోయి ఉండవచ్చని గెడ్డపువారు అభిప్రాయపడినారు. కాని, జరుగుచున్న/జరగబోయే/జరిగిన అనే అర్థాల్లో ఉంది. సంస్కృతంలో ‘భూ’ ధాతువు(క్రియ) ఉంది. దానికి ‘సత్తాయాం’ అని అర్థం.

సత్తా అంటే ‘స్థితి’(Status).

మనం వాడే ‘భూత,భవిష్యత్’ పదాలు ఆ ధాతువునుండి పుట్టినవే.వర్తమాన అనే పదమొక్కటి ‘వృతూ వర్తనే’ అనే వేరొక ధాతువునుండి పుట్టినది.

ఇక ‘అస్మదీయ’ అనే పదం విషయానికి వస్తే.. అస్మద్ శబ్దం (అహం=నేను అనేది ఈ శబ్దరూపమే)పై ఈయ చేరిన రూపం

 
Clicky Web Analytics