24 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

24, ఆగస్టు 2011, బుధవారం

తెలుగుబాట లో పాలు పంచుకుందాం

telugubaata

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.


ఇది తెలుగు బాట లంకెలో  ఉన్న సమాచారం. కానీ దీనికి ఓ చక్కటి పుట వ్రాద్దాం అని ఆలోచిస్తూన్నంతలో నామాల మురళీధర్ గారు ఓ చక్కని లేఖవ్రాసారు. దానిని యధాతధంగా ఇస్తేనే నా మనసుకు తృప్తి.

 


ఆత్మీయులైన తెలుగుబ్లాగు మిత్రులకు,

e-తెలుగు సంస్థ తెలుగుబాటలో పాల్గొనవలసినదిగా సాదర ఆహ్వానంపలుకుతుంది. తామంతా పాల్గొనటమే కాక ఈ ఆహ్వానాన్ని మీమిత్రులందరితో పంచుకుని, తెలుగుబాటలో అత్యధికులు పాల్గొనటంలో మీసహాయాన్ని అందించవలసినదిగా కోరుతున్నాం.

 

అమ్మ అనే మాటతో మొదలయ్యి, నాన్న వేలు పట్టుకుని ఊ కొడుతూ, తాత పాడే పద్యాలను వల్లె వేస్తూ, బామ్మ చెప్పే కధలతో ఊహల రెక్కలు సంతరించుకునిమూర్తీభవించిన వ్యక్తిత్వాలని అందించిన కమ్మని అమ్మ తెలుగు.  లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లోచెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష తెలుగు. “దేశభాషలందు తెలుగులెస్స” అని పొరుగువారు కీర్తించిన కమ్మని భాష తెలుగు. అంత గొప్ప భాషకు, సంస్కృతికి వారసులమైన మనం మన అమ్మ వంటి భాషనేనిర్లక్ష్యం చేస్తున్నాం.  ఆంధ్రమహాభారతాలు, ఆంధ్రభాషాపదకోశాలు ఏనాడో అటకెక్కి చెదలుపట్టాయి. తెలుగుభాషకున్న అనంతమైన సాహితీ సంపదను భావి తరాలకి అందించే వారధులు కరువయ్యారు.కాస్తో కూస్తో మిగిలి, నోటిలో నానిన నీతిశతకాలకి ఇప్పుడు మనం మంగళంపాడేసాం. కారణం బ్రతుకుతెరువుకు అక్కరకురాని భాష అయిపోయింది తెలుగు.

 

జీవితమంటే కేవలం బ్రతుకుతెరువే కాదు. బ్రతుకు తెరువు చూపటం లేదని చెదలు పట్టించెయ్యడానికి భాష అంటే కేవలంఒక అక్షరమాల, గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం. ఆ జాతి జీవలక్షణం, అంతర్లీనంగా మెదిలే జీవశక్తి. అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగామిగిలిపోవటమే. మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్నిచాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమనిప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

 

తెలుగు ప్రజలందరినీచైతన్యవంతం చెయ్యటానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయసంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో అందరికీ వీలుగా ఉండేందుకుఆదివారం నాడు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. తెలుగు లలిత కళాతోరణంనుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువనుప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతఅందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటడానికి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మనభాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని మహోద్యమంగామారుద్దాం.


కృతజ్ఞతలతో,

e-తెలుగు.


ఎంత చక్కగా వ్రాసారో అనిపించి ఇక్కడ ఉంచుకుంటే, ఇలాంటి డ్రాఫ్ట్ నాకు మున్ముందు పనికి వస్తుందనిపించింది

24, జనవరి 2011, సోమవారం

రిపబ్లిక్ డే వచ్చేసిందోచ్.. బ్లాగర్లకు విన్నపం

రిపబ్లిక్ డే పరంగా పాఠశాల రోజులలో (అంటే చదువుకునే రోజులలో అని చదువుకో మనవి) మేము చక్కగా జరుపుకునే వాళ్ళము. నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి నేను విజయవాడ SKPVV హిందూ హైస్కూల్ విధ్యార్ధిని. అలాగే మేము బావాజీ పేట మొదటి లైన్లో ఉండే వాళ్ళము. నాన్నగారు విజయవాడ రైల్వేస్టేషన్‍లో పని చేసే వారు. వారి ఉద్యోగరీత్యా ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్ళే వారు. నాకు మ్యూజికల్ కళాశాలలో నాట్యభ్యాశం ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా ఇంటికి చేరుకునే వాడిని. అలాంటి రోజుల్లో నాకు బాగా గుర్తున్న కొన్ని సంఘటనలలో ఒకటి నాన్నగారితో వెళ్ళి కూరగాయల మార్కెట్‍కు వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చేవాడిని. కూరగాయలి కొనిచ్చి నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళేవారు. ఆలా మార్కెట్ నుంచి వచ్చిన తరువాత అమ్మ పెట్టిన పెరుగన్నం తిని ఝాం ఝాం అంటూ స్కూల్‍కి పరిగెత్తే వాడిని. అదిగో అలాంటి రోజుల్లో మరొకటి ఈ రిపబ్లిక్ డే రోజు.

స్వతహాగా మా పాఠశాల నిభందనల ప్రకారం ఆకు పచ్చ లాగు అలాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగే నాట్యాభ్యాసానికి తెల్ల పైజామా పై తెల్ల కుర్తా వేసుకుని వెళ్ళే వాడిని. కానీ ఒక్క రిపబ్లిక్ డే నాడు మాత్రం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వైట్ అండ్ వైట్ అన్న మాట. అలా తెల్ల డ్రస్ వేసుకుని చాలా మంది వచ్చే వాళ్ళు కానీ నేను మాత్రం తళతళ మని మెరుస్తూ ఉండే వాడిని. ఎందుకంటారా.. తెల్ల లాల్చి కుర్తా డ్రస్‍పై మా అమ్మ చాలా శ్రద్ద తీసుకునేది. ఎందుకంటే ఇది భరతనాట్యం నేర్చుకునేటప్పుడు వేసుకునే డ్రస్ కదా అందుకన్నమాట. మా అమ్మకు నాట్యం అంటే ఎందుకో తెలియని అభిమానం. అందువల్ల స్కూల్ విధ్యార్దులందరిలో నేను కొంచం స్పెషల్‍గా కనబడే వాడిని. అలా మెరుస్తూ ఉండటం వల్ల మా హెడ్ మాస్టారు గారు ఆ నాటి ప్రతిజ్ఞని నా చేత చదివించే వారు. అలా అలవాటైన ప్రతిజ్ఞా కార్యక్రమం ఇంటర్ మీడియట్ కాలేజీ రోజుల్లో కొనసాగినా, డిగ్రీ రోజుల్లో సాగలేదు. అందుకు కారణం నేను చదువుకున్నది ముస్లిం కాలేజీ. అక్కడ ఇలాంటివి పాటించేవారు కాదు.

కానీ ఉద్యోగ భాధ్యతలు వచ్చిన తరువాత నేను చొరవ తీసుకుని ఈ రోజున అక్కడ పని చేసే వారిలో ఔత్సాహికులను ఓ చోట చేర్చి జండా వందన కార్యక్రమం చేసే వాడిని. పోను పోను ఔత్సాహికులు తగ్గిపోవడం వల్ల రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే ఒక సెలవు రోజుగా మాత్రమే మిగిలిపోయింది కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగటం లేదు. కనీసం ఆ నాడైనా బ్లాగర్లు అందరూ ఓ పోస్టు వేస్తే బాగుంటుందని నా ప్రపోజల్. చదివే వారు ఏమంటారు?

 
Clicky Web Analytics