పుస్తక ప్రదర్శన - 2009 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక ప్రదర్శన - 2009 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2009, శనివారం

బుక్ ఎగ్జిబిషన్ కమిటీ ప్రస్తావన : సలహాలు

ఉండాలి .. ఉండాలి .. అందరూ బాగుండాలి.

నిరుడు జరిగిన బుక్ ఎగ్జిబిషన్ నందు e-తెలుగు వారి ఆధ్వర్యంలో మరియు తోటి తెలుగు బ్లాగర్ల సహకారంతో నడిచిన స్టాల్ ని మీరందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు అందరికీ e-తెలుగు వారి తరుఫున ధన్యవాదములు. మరి  రాబోయే బుక్ ఎగ్జిబిషన్ నందు ఒక స్టాల్ నిర్వహిస్తే ఎంతమంది సహకరిస్తారో అన్న తలంపుతో ఉద్బవించినదే ఈ జాబు.

ఇక అసలు విషయానికి వస్తే, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారో తెలియజేయ ప్రార్దన. ఈ కమిటీలో సభ్యులు కావలసిన వారు e-తెలుగులో సభ్యత్వం తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు. కావున అందరూ అర్హులే. ఇది రాజుగారి ఇంట్లో పెళ్ళి కావున తెలుగు పాలు పోయ్యాల్సిందిగా
విన్నవించుకుంటున్నాము. అందరూ పాలు పోస్తున్నారుగా నా గ్లాసు నీళ్ళతో చేరుకున్న పాలేమీ పలుచనైపోవు అని అనుకోకుండా అందరూ తృణమో.. ఫలమో.. చేతి సాయమో.. నోటి సాయమో.. లేక మరేదైనా వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను.

 

మీ మీ అభిప్రాయాలు.. సలహాలు.. సూచనలూ.. నిందలు.. అపవాదులు.. వగైరా వగైరా.. ఏవైనా నేను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి చదివిన ప్రతి ఒక్కరూ స్పందించ ప్రార్దన.

మొదటి సలహా అందినది, కావున సలహా పాటించడమైనదని గమనించగలరు

31, జనవరి 2009, శనివారం

అంతర్మధనం – మలి భాగం

ఈ అంతర్మధనం వెనకాల కారణాన్ని మొదటి భాగంలో చదివారు కదా, ఇప్పుడు మలి భాగానికి వస్తాను. ఈ పుట నేను రెండవ సారి వ్రాస్తున్నాను. మొదటి సారి అంతా వ్రాసి చక్కగా ప్రచురించే వేళకి నా కలన యంత్రం కాస్తా భీష్మించుకు కూర్చుంది. తప్పక రీబూట్ చేసి మళ్ళి మొదలు పెట్టాను. ఈసారి మొదటి సారి వివరించినంతగా కాకపోయినా కొంచం సహనంతో అన్ని విషయాలు ఏకరువు పెట్టడానికి ప్రయత్నిస్తాను.

అస్సలు విషయంలోకి వెళ్ళే ముందు ఒక ఉపోద్ఘాతం. మా తాతయ్యగారు, శ్రీ దామరాజు వెంకట రామ సూరి గారు, కాలం చేసే ముందు కొంత కాలం మా దగ్గర ఉన్నారు. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వారు చెప్పిన ఓ కధ ఈ పుటకి మూలం. ఆ కధని నేను ఎప్పుడూ మర్చి పోలేను ..

ప్రతి మనిషి తన గమ్య స్థానాన్ని వెతుక్కుంటూ సాగే పయనంలో తనకు తెలిసిన లెదా తెలుసుకున్న దారులలో శ్రేష్టమైన దానిని యెంచుకుని (ఎన్నుకుని అని వ్రాసాను, ఈ పదం ఇక్కడ బాగుందా!!) తన ప్రయాణం ఆరంభం చేస్తారు. అట్లా పయనించే పయనంలో తనకు చేదోడు వాదోడుగా ఉండడానికి, హితులు.. సన్నిహితులు.. స్నేహితులు.. భందువులు.. ఇలా ఎందరో మరెందరినో కలుపుకుని పయనిస్తూ ఉంటారు.

అలాంటి పయనంలో తనకు శత్రువులు ఎదురైతే, అది తన తప్పుగా అర్దం చేసుకోవాలి. కానీ అదే పయనంలో తనకు తోడుగా పయనిస్తున్న మిత్రులు ఒక్కొరొక్కరుగా తొలగిపోతూ ఉంటే, అది తాను ఎంచుకున్న దారి తప్పుగా అర్దం చేసుకోవాలి. మన శ్రేయస్సు కోరే వారిని బలి ఇచ్చి సాగించే పయనంలో ఒక్కొక్కరూ తొలగి పోతూ ఉంటే, అలాంటి పయనంలో ఆఖరుగా మిగిలేది ఒంటరి తనమే. అలాంటి పయనం కన్నా శుఖః దుఖాఃలయందు మనతో పాటు కలసి పయనించే తోడు అవసరం అని ప్రతి వ్యక్తి గమనించాలి. అలాంటి సహచరుల కోసం అవసరమైతే మనం పయనించే గమనాన్ని లేదా మనం జీవించే పంధాన్ని మార్చుకోవాలి.

ఇది చాలా పెద్ద కధ, కానీ క్లుప్తంగా పైన చెప్పినట్లన్నమాట. అందువల్ల చెప్పొచ్చినదేమిటంటే, నా పంధా కనుక నాకు శత్రువులను తెచ్చిపెట్టినా ఫరవాలేదు కానీ, ఉన్న మిత్రులను కోల్పోయేటట్లుంటే, ఆలోచించ వలసిన .. కాదు కాదు, మార్చుకో్వలసిన సమయం ఆశన్నమైందన్నమాట. అందుకని ఒక్కొక్క పుటని ఒక్కొక్కరికి కేటాయించేదుకు బదులుగా .. అందరికీ ఒక్క సారే జేజేలు కొట్టేస్తే పోలా అని తోచింది. అదిగో అలా తోచినదే తడవుగా ఇలా..

***************************************************************************

తాడేపల్లి గారు : వీరి గురించి నేను చెప్పేటంతటి వాడినా!! వీరు ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. మరి పుస్తక ప్రదర్శన శాలలో ఊరుకుంటారా.. వీరి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే..

దాట్ల శ్రీనివాస రాజు గారు: వయస్సులో నాకన్నా చిన్న వారైనా, ఎప్పుడూ చిరునవ్వుతో ఏది అడిగినా సహనంతో చక్కగా వచ్చే పోయ్యే వారందరికీ ఏదో తనకు తోచినది చేర వెయ్యాలి అన్న తపన నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది..

నల్లమోతు శ్రీధర్ గారు: వీరికి దేవుడు ఓర్పు అనే పదాన్ని లెదా పదార్దాన్ని ఎంత మోతాదులో ఇచ్చాడో అని ఎన్ని సార్లు నన్ను నేను ప్రశ్నించు కున్నానో నాకే తెలియదు. వీరికి ఇంత ఓర్పు ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్దం కాలెదు

నమ్మల నాగ మురళీధర్ : వీరు వచ్చినన్ని రోజులూ వీరితో పాటుగా వీరి కలన యంత్రం చక్కగా పాలు పంచుకుంది. వీరికి ధన్యవాదాలు చెప్పాలో లేక వీరి కలనయంత్రానికి చెప్పాలో అర్దం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. వీరి కలనయంత్రం చాలా బాగా ఉపయోగ పడిందంటే అతిసయోక్తి కాదు్

కశ్యప్ గారు : అడగంగానే పుల్లైస్ కొనిచ్చిన వీరిని ముందుగా ప్రస్తావిస్తే ఏదో స్వార్దం అనుకుంటారని తలుస్తూ.. తటపటాయిస్తూ.. ఏది ఏమైనా వీరిని మర్చి పోకూడదని ఇక్కడ. ఎంత చలాకీగా పాలు పంచు కున్నారంటే, వీరిని చూస్తే దీపావళి సీమటపాసు కాయ గుర్తుకు వస్తుంది

జీవితంలో కొత్తకోణంతో మన ముందున్న శ్రీనివాస్ గారు : ఎంత వినయస్తులో .. నేను చెప్పేకన్నా మీరు మాట్లాడి చూస్తే తెలుస్తుంది. ఇంత నిదానం మనిశిని నేను ఇంతక ముందు చూడలేదంటే నమ్ముతారా..

చావా కిరణ్ గారు : అడగంగానే నేనున్నాను అనే రీతిలో ఎక్కడున్నా ఎప్పుడైనా పిలవంగానే వాలేస్తారు. కావలంటే ఒక్క సారి మీరు ప్రయత్నించి చూడండి

సనాతన భారతిగా బ్లాగుతున్న సతీశ్ : లేటుగా వచ్చినా లేటెశ్టుగా వచ్చా .. అన్న నానుడి వీరికి చక్కగా సరిపోతుందేమో వీరు అంతగా పాలు పంచుకోక పోయినా, ఎవ్వరెవరు ఏమేమి చేస్తున్నారు అని గమనిస్తూ, ఎవ్వరికైనా ఏదైనా సహాయం కావలంటే సహాయం చెయ్యడానికి సంశయించని వీరి వ్యక్తిత్వానికి జేజేలు కొట్టాలనిపించింది

చాలా మంది పేర్లు నాకు గుర్తుకు రావటం లేదు, కావున మీరు నాకు గుర్తులేరనుకోవద్దు, ఒక్క సారి స్పందించ గలరు. మీ ముఖ చిత్రం చూస్తే తప్పక గుర్తు పడతాను. కావున నన్ను క్షమించి, ఇక్కడ ఒక్కసారి స్పందించండి.

ఇక మహిళా బ్లాగర్ల విషయానికి వస్తే.. మొట్ట మొదటగా ఒక్కరు నేను ప్రస్తావించకుండ ఉండలేను ..

రమణి గారు : కాలేజీకి వెళ్ళే కూతురు ప్రక్కనే ఉన్నా, నేను గమనించ లేక పోయ్యాను. అంటే ఇకడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే.. వీరు వయ్యస్సులో పెద్దవారైనా అంత గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా, అందరితో చనువుగా మెలిగిన తీరు చూస్తుంటే, అబ్బుర పడ్డాను.

పప్పు అరుణ గారు : వీరిని చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. అదేదో పాత సినిమాలో ఉమ్మడి కుటుంబంలో సావిత్రి గారిలా, మరో సినిమాలో ఇంటికి పెద్దక్క అయిన జయప్రద గారిలా, మరో సినిమాలో సౌందర్య లాగా చలాకీగా తిరిగే వారు

ఙ్ఞాన ప్రసూనాంబ గారు : వీరు చేసిన పూర్ణాలు ఇంకా నా శృతి పధంలోంచి జారుకోలేదంటే నమ్మండి. మేము తింటామని తలచి కష్టపడి ఇంటి నుంచి చేసి తీసుకు వచ్చారంటే, వీరి ఆప్యాయతను ఏ శిఖరానితో పోల్చాలో నాకు అర్దం కావటం లేదు. వీరు చేసిన పూర్ణాలకు ముక్తాయింపు నేను, నాకు తోడుగా పైన ఉదహరించిన రమణిగారు వీరికి సరి సమానంగా మరో బ్లాగరు సుజాత గారు పోటీ పడి మరీ ఆ డబ్బను ఖాళీ చేసామనుకోండి. బ్లాగు ముఖంగా వీరికి మరోసారి భన్యవాదములు అలాగే మరో విన్నపము.. మనం ఇంకొక సారి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు? అదేనండీ కలవడానికి వచ్చినప్పుడు మీరెలాగో ఒట్టి చేతులతో రారు కదా.. చక్కగా వచ్చేటప్పుడు ఆ పూర్ణాలేవో చేసి తెస్తారు కదా.. వాటి గురించి మనం అప్పుడు చర్చించు కుందాం. ఏమంటారు.. ఏమి అనకండి, ఎప్పుడు కలుస్తున్నామో నాకు ఒక్కడికే మైల్ చెయ్యండి, లోకానికి తెలిసందనుకోండి నా వాటా పూర్ణాలు కొట్టేస్తారు. (ఇక్కడ వ్రాసిన వాళ్ళందరిలో వీరి గురించే ఎక్కువ ప్రస్తావించడం వెనుక పూర్ణాలే కారణం కాదని గమనించాలి)

శిరీష గారు : వీరు ఓ పెద్ద కంపెనీలో మంచి పొజీషన్ లో ఉన్నా అందరితో చాలా కలివిడిగా తిరిగిన తీరు చూస్తుంటే, ముచ్చట వేసింది. నేను చాలా కొద్ది మహిళా బ్లాగర్లతో మాట్లాడాను, అలాంట్ వాళ్ళలో ఎక్కువ సేపు వీరితోనే మాట్లాడానంటే మీరు నమ్మాలి

పూర్ణిమ గారు : వయస్సులో నాకన్నా చిన్నవారైనా (ఇలాంటి పద ప్రయోగం చెయ్యడం అసభ్యం అనుకుంటే, క్షమించాలి) వీరితో అస్సలు మాట్లాడలేదు కానీ వీరు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా వీరి భావనలు, వీరి ఆలోచనలు నా ప్రమేయం లేకుండనే నా చెవిన పడ్డాయి. కొన్ని విషయాలలో వీరిది చాలా స్పష్టమైన భావన, ఖశ్చితమైన ఆలోచనా సరళి, వీరి పరి పక్వాన్ని తెలియ జేసింది. ఇంకా ఎక్కువ వ్రాస్తే, అర్దం చేసుకునే కన్నా అపార్దానికి అవకాశం ఉంది.

సుజాత గారు : ముందు చెప్పినట్లుగా, వీరు నాకు పోటీకి వచ్చారు. అదేనండీ, పైన ప్రస్తావించిన పూర్ణాల విషయం గుర్తు ఉండే ఉంటుంది. కొంచం కుళ్ళొచ్చింది, కానీ అక్కడ స్థానబలం వారి వైపే ఉంది. వీరితో మాట్లాడుతుంటే, ఎటువంటి inhibition లేకుండా మాట్లాడేశానంటీ అని నామీద నాకే ఆశ్చర్యం వేసింది. అడగంగానే వెళ్ళి మిర్చి బజ్జీలు తెచ్చిచ్చారు. కానీ నా వరకూ రాలేదు. పైన ఉదహరించిన అరుణగారు మళ్ళి వెళ్ళి తీసుకు వచ్చి, మిస్సయిన వాళ్ళకోసం దాచి మరీ పంచారు.

వలబోజు జ్యోతి గారు : వీరిని రెండుసార్లు కలిసాను, కలసిన రెండు సార్లు, చక్కగా వారి ఇద్దరు సంతానంతో వచ్చారు. వారి పుత్రికా పుత్రులు వారిలాగే చాలా కలివిడిగా కలసి మెలసి పోయ్యారు. ఆ!! మరో విషయం మర్చి పోయ్యాను. అదేనండీ, సున్నుండలు.. ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ బాగున్నాయి. వీరు ఉత్తచేతులతో రావడం నేనెప్పుడూ చూడలేదు. ఏమిటో ఇలాంటి వాళ్ళను చూస్తే, కొంచం గర్వంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉన్నాను అని

ఆఖరుగా కాకపోయినా చివ్వరలో, వరూధిని గారు : వీరిని కలవక ముందు వరకూ వీరికి కొంచం గాంభీర్యం పాళ్ళు ఎక్కువ అని అనుకునే వాడిని. వీరిని కలిసిన తరువాత నేను చదివిన వారేష్ బ్లాగు చీరిదేనా అనిపించింది. అచ్చంగా చెప్పాలంటే, down to earth, అనుకోండి. తెలుగులో ఇలాంటి వారిని ఏమంటారో అర్దం కాలేక పోవడమే ఈ పుట ఇంత ఆలస్యంగా ప్రచురించడానికి కారణం. నేను అతి తక్కువగా మాట్లాడిన మహిళా బ్లాగర్లలో వీరిదే అగ్రస్థానం.

--------

ముగించే ముందు మరొక విన్నపం, రాజుగారి రెండవ భార్య బాగుంది అంటే.. పెద్ద భార్య బాగాలేదా అన్నాడట వెనుకటికి ఒకడు.. అలా ఒకళ్ళ గురించి వ్రాస్తే, మరొకరికి ఈ గొప్పతనం లేదా అని మాత్రం చచ్చు ప్రశ్నలు వేయకండి. అలాంటి చొప్పదంటు స్పందనలను తొలగించే హక్కు నాకు ఉందని మరచి పోవద్దు

ఇక నా అభిప్రాయం ఇంతటితో ముగింపునకు వచ్చింది. మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను,

ఇట్లు,

భవదీయుడు

22, జనవరి 2009, గురువారం

అంతర్మధనం - మొదటి అంకం

eతెలుగు సభ్యులతో కలిసి నేను పాలు పంచుకున్న పుస్తక ప్రదర్శన నైపధ్యంగా వెలువదుతున్న పుటలకు స్పందనగా ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఫలితమే ఈ పుట. ప్రధాన అంశం లోకి వెళ్ళేటప్పుడు, ఈ పుటకు కారణభూతాలైన కొన్ని ముఖ్య సంఘటల గురించి.

మొదటిది : చదువరుల స్పందనలు
చదివేవారికి నా అభిప్రాయాలు నిందాస్తుతిగా అని పించడం, అలాగే నేను స్పందించే తీరు వ్యంగ్యభావాన్ని కలిగించడం కూడా నన్ను ఆలోచించుకునేటట్లు చేసాయు.

రెండవది : బ్లాగు ప్రపంచం లోకి ఇప్పుడిప్పుడే ప్రవేశించి, అనన్యమైన ప్రతిభతో తన గుర్తింపుని చాటుతున్న మరో బ్లాగరుతో నా సంభాషణ. నా సంభాషణ అనేకన్నా ఆ బ్లాగర్ విన్నపము అను చెబితే బాగుంటుంది. ఆ సంభాషణ (లేదా) విన్నపాన్ని యధావిధిగా మీతో పంచుకుంటాను. ఈ సంభాషణ అంతా తంతీ మాధ్యమం (అదేనండి, టెలీఫోన్) ద్వారా జరిగింది. అనవసర విషయాలని ప్రక్కన పెట్టి అసలు విషయాన్ని యదావిధిగా మీ ముందు ఈ క్రింది విధంగా..

కొత్త బ్లాగరు: బాబాయ్.. బాగున్నావా..
భవదీయుడు: ఏదోనండీ.. ఫరవాలేదు .. బాగానే ఉన్నాను. అయినా ఏమిటిది కొత్తగా "బాబాయి .." అంటున్నారు..
కొత్త బ్లాగరు: ఏమీ లేదండి, ఏదో పెద్దవారుగా .. అందుకే అలా.. ఎంతైనా మంచి చేసుకోవాలికదా.. (చమత్కారంతో అన్నారనుకున్నా..)
భవదీయుడు: ఏమిటో .. ఒక్క ముక్క అర్దం కాలేదు.. చక్కగా విషయానికి వచ్చేయ్యండి
కొత్త బ్లాగరు: అదిగో ఆ విషయానికే వస్తున్నా.. ఈ మధ్య మీరు eతెలుగు సభ్యుల గురించి వ్రాస్తున్నారంటగా..
భవదీయుడు: అవునండి, ఏదో చేద్దాం అనుకుంటే, ఏదేదో అవుతోంది
కొత్త బ్లాగరు: అందుకే ఇలా మీకు కాల్ చేసా.. కొంచం మీతో మాట్లాడదామని ..
భవదీయుడు: నిజమా !! అయితే చెప్పండి (కుతూహలంగా..)
కొత్త బ్లాగరు: ఈ సారి మీరెవరిపై వ్రాస్తారనో అని జనాలందరూ పిసుక్కు చస్తున్నారు..
భవదీయుడు: ఆ!!! (నమ్మలేనట్లుగా..)
కొత్త బ్లాగరు: ప్రతీ ఒక్కరూ బయటకు చెప్పట్లేదు కానీ అందరూ బయపడి చస్తున్నారనుకోండి. అందులో నేనూ ఒక్కడిని
భవదీయుడు: అయ్యయ్యో!! నేన..(మాట్లడ బోయ్యేంతలో )
కొత్త బ్లాగరు: ఆ వరుసలో నేనూ ఉన్నానేమో అని, ముందుగా మీకో మాట చెబుదామని ఫోన్ చేసాను, తప్పుగా అనుకోకండి
భవదీయుడు: అయ్యయ్యో !! అదేం లేదండి. నాకు ఎవ్వరి (మాట్లాడనీయ్య కుండా అడ్డు కుంటూ..)
కొత్త బ్లాగరు: ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే వాడిని ఏదైనా ఎక్కువ తక్కువలు మీతో అని ఉంటే, నాగురించేమీ వ్రాయకండి
భవదీయుడు: అది కాదండి .. ( ఇంకా ఏదో అనే లోపుల..)
కొత్త బ్లాగరు: మీరు వ్రాసినది ఎవ్వరైనా చదివారనుకోండి, అది చేరవలసిన వారి చేరకుండా, మా ఛండ శాసనుడు చేతికి చిక్కిందనుకోండి, ఉన్న ఉద్యోగం కాస్తా ఊడుతుంది అనే ప్రమాదం కనబడుతోంది. అందుకని..
భవదీయుడు: .. (మాటలు మరచి వింటూనే ఉన్నా)
కొత్త బ్లాగరు: నా గురించి ఏమైనా వ్రాయదలచు కుంటే, నాకే పంపండి. అంతే గానీ బ్లాగు ముఖంగా వ్రాయకండి
భవదీయుడు: .. (కొంత సేపు నిశ్శభ్దం)
కొత్త బ్లాగరు: ఉన్నారా..
భవదీయుడు: ఆ .. ఉన్నానండి, ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను
కొత్త బ్లాగరు: అంతగా ఆలోచించ కండి, కానీ నా గురించి మాత్రం వ్రాయకండి
భవదీయుడు: కానీ నాకు ఎవ్వరి పైన ఎటువంటి వ్యక్తిగతమైన దురభిప్రాయం గానీ లేదండి.. ఆ పుటల వెనకాల ఉద్దేశ్యం అది కాదండి, కాకపోతే.. (ఇంకా మాట్లాడుతూ ఉంటే.. మధ్యలో కలిగించుకుని)
కొత్త బ్లాగరు: అది కాదండి, మీరేదో తప్పుగా వ్రాస్తున్నారని కాదు నా ఉద్దేశ్యం, కానీ ఏది వ్రాసినా అర్దం చేసుకునే వాళ్ళలో మా ఛండశాసనుడు కూడ ఉండ వచ్చు కదా అన్న భావనతో ఈ విధంగా..

తరువాత సంభాషణ అప్రస్తుతం.. కానీ ఇవన్నీ జీర్ణించుకుని, ఇంతకు ముందు ప్రచురించిన పుట, http://bhavadeeyudu.blogspot.com/2008/09/blog-post_11.html, ఙ్ఞాపకంతో ఒక నుర్ణయానికి వచ్చాను. ఆ విషయం మరో పుటలో విపులంగా..

16, జనవరి 2009, శుక్రవారం

పుస్తక ప్రదర్శనలో eతెలుగు - నా భావనలు

క్రిందటి పుటతో నా మీద జాలి పడడం మొదలైంది. ఇక ఈ పుటతో ఏమి మొదలౌతుందో చూడాలి. ఈ పుటలో ముఖ్యంగా ఒక్కరి గురించి ప్రస్తావించదలచాను. ఎంత వద్దనుకున్నా చాలా మంది అనుభవాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎలా వీళ్ళ నుంచి తప్పించు కోవాలో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా ఒక్కొక్క పుటతో వీళ్ళని వదిలించు కునే ప్రయత్నం చేస్తాను.

 

వరుసలో మూడవ వారు, అలుపెరగని యుధ వీరుడు.. eతెలుగు కోశాధికారి, మన వెంకట రమణ. అందరి కన్నా పొడుగేమో.. ఏమాత్రం తగ్గేది లేదంటూ ఇరగ దీసాడనుకోండి. ఏమి చేసాడంటారా.. వస్తున్నా.. ఆ మాటకే వస్తున్నా. ఇంతక ముందు చెప్పినట్లుగా నేను eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వాళ్ళకు ’అంతర్జాలంలో తెలుగుని ఎలా ..? ’ అనే విషయమై డిసైడ్ అయ్యాను అని చెప్పాగా. ఆ పనిలో eతెలుగు వాళ్ళు ఇచ్చిన కర పత్రాలు పంచుతూ అడిగిన వాళ్ళకి తెలిసిన సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాను. ఇక్కడ చెప్పొచ్చిన / గమనించ తగ్గ విషయమేమిటంటే.. eతెలుగు స్టాల్ ముందు నుంచి వెళ్ళుతున్న వారందరికీ నేను కర పత్రాలు పంచటం లేదు. నా దగ్గరకు వచ్చి నిలబడి, ఏమిటిది? అని అడిగిన వాళ్ళకు మాత్రమే పంచుతున్నాను. నా వరకూ నాకు ఒక్క కరపత్రమైనా వ్యయం క్రింద లెక్కే. ఎంత వరకూ వృధా అవకుండా చూద్దామా అన ఆలోచనతో, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఉత్సూకత ఉన్న వాళ్ళే అయ్యి ఉంటారు. కాబట్టి నా శ్రమ కొంచం తగ్గినట్లే అనుకుంటూ వచ్చే పోయే వారిని గమనిస్తూ ఉండి పోయ్యాను. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, "అవసరం ఉన్న వాళ్ళకే సహాయం చెయ్యాలి.. ", మన దగ్గరకు వచ్చిన వాడికే మన సమాచారం ఇద్దాం అని డిసైడ్ అయ్యాను. అందు వల్ల చాలా తక్కువ కర పత్రాలు మాత్రమే పంచానని చెప్పుకోవచ్చు.

 

ఇక మన హీరో గారి విషయానికి వస్తే. వీరు నాకు పూర్తిగా విరిద్ధం. కర పత్రాలు చేతిలో పట్టుకుని పంచుతూ ఉంటే eతెలుగు స్టాల్ దడ దడ లాడిందనుకోండి. eతెలుగు స్టాల్ పైపుగా పోతున్నప్పుడు, సందర్శకులు చక్కగా వారికై వారు వచ్చి తీసుకున్నారా, మర్యాదగా ఉంటుంది. తల తిప్పి చూసి మేము పంచుతున్న విషయం చూచి కుతూహలంతో వచ్చి కరపత్రం అందుకున్నారా.. బాగు బాగు.. అంత దూరం నుంచి అటుగా పోతూ..  eతెలుగు స్టాల్ ని నిర్లక్ష్యం చేసి మేము నుంచున్న బల్ల నుండి నాలుగు అడుగుల దూరంలో ఏ ఒక్క వ్యక్తి అయినా అటుగా వెళ్ళాడంటే, అదిగో అట్లాంటి వాడు మన హీరో గారి కంట్లో పడ్డాడా..  అంతే.. చచ్చాడే అన్న మాట. వాని చేతుల్లో మన కరపత్రం కనబడి తీరాల్సిందే.  లేదా వీరు చేయి చాచి పత్రం ముందుకు పెట్టారో అల్లంత దూరాన ఉన్న వ్యక్తైనా సరే వచ్చి తీసుకోవాల్సిందే. "ఈయన పంపకం వలన ఉపయోగం ఉంటుందా.." అని మొదట్లో కొంచం సంశయించినా, ఫలితం ఆశించ కుండా క్రియే ప్రధానంగా వారి వంతు కృషి వారు నిర్వర్తించిన తీరు చూస్తూంటే.. అహా.. అనిపించింది. చివ్వరలో వీరు నాకు శ్రీ కృష్ణుడు లాగా కనిపించారు. మన కిట్టయ్య చెప్పిన శ్లోకం.. అదేనండీ..

"కర్మణ్యేవాధి కారస్తే.." ఇంకా.. ఇంకా..

ఫలితం గురించి ఆలోచించకు. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి. అన్నట్లుగా వీరు చించారను కోండి. ఏంటీ ఒక్క కర పత్రాలు పంచడం మాత్రమే అనుకున్నారా.. అదిగో అక్కడే కూరలో కూడా కాలేశారు. (తప్పు్లోనూ పప్పులోనూ ఎప్పుడూ కాలేసారని వేరేగా చెప్పనవసరం లేదుగా) eతెలుగు స్టాల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు అడిగిన వాళ్ళకు అడిగినంత, అవసరమైన వాళ్ళకు అవసరమైనంత అలాగే తెలియని వాళ్ళకు తెలియాల్సినంత చెప్పి , ఇదేదో బాగుందే అని అనిపించు కునేంత వరకూ వదిలే వారు. వీరు ఇంత జిడ్డా అని అనుకుంటున్నారా.. ఇప్పుడు సాంబారుతో సహా పులుసులో కూడ కాలేశారు. వీరి ఉత్సాహం అలాంటిది.. వచ్చిన వారి జిఙ్ఞాస అన్నింటికీ మించినది.

 

ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి. నేనూ చాలా సేపు eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వారితో సంభాషిస్తూ చాలా సేపు నిలబడే ఉన్నాను. కానీ నుంచోని నుంచొని కాళ్ళు నొప్పి పుడుతూ ఉండడం వల్ల కొంత సేపు లోపల కుర్చీలలో కూలబడే వాడిని లేదా బయట నుంచొని eతెలుగు స్టాల్ ని చూస్తూ మన తెలుగు బ్లాగర్లతో ముచ్చట్లేశే వాడిని. కానీ మన హీరో గారైతే కూర్చోగా నేను చూడ లేదనే చెప్పవచ్చు. ఒక వేళ కూర్చొన్నారేమో ఎవ్వరైనా చూస్తే స్పందించండి. ముందుగా చెప్పినట్లుగా "అలుపెరుగని యుధ వీరుడు" అనే బిరుదు వీరికి అన్ని విధాలుగా సరిపోతుంది అనడానికి ఇదొక మరొ కారణం.

 

ఇంకా ఎక్కువ వ్రాస్తే మిగిలిన వాళ్ళు కొడతారేమో.. మరో పుటలో మరొకరిపై నా భావనలతో మరలా కలుస్తాను.. అంత వరకూ సెలవు,

ఇట్లు,

భవదీయుడు

 
Clicky Web Analytics