16, జనవరి 2009, శుక్రవారం

పుస్తక ప్రదర్శనలో eతెలుగు - నా భావనలు

క్రిందటి పుటతో నా మీద జాలి పడడం మొదలైంది. ఇక ఈ పుటతో ఏమి మొదలౌతుందో చూడాలి. ఈ పుటలో ముఖ్యంగా ఒక్కరి గురించి ప్రస్తావించదలచాను. ఎంత వద్దనుకున్నా చాలా మంది అనుభవాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎలా వీళ్ళ నుంచి తప్పించు కోవాలో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా ఒక్కొక్క పుటతో వీళ్ళని వదిలించు కునే ప్రయత్నం చేస్తాను.

 

వరుసలో మూడవ వారు, అలుపెరగని యుధ వీరుడు.. eతెలుగు కోశాధికారి, మన వెంకట రమణ. అందరి కన్నా పొడుగేమో.. ఏమాత్రం తగ్గేది లేదంటూ ఇరగ దీసాడనుకోండి. ఏమి చేసాడంటారా.. వస్తున్నా.. ఆ మాటకే వస్తున్నా. ఇంతక ముందు చెప్పినట్లుగా నేను eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వాళ్ళకు ’అంతర్జాలంలో తెలుగుని ఎలా ..? ’ అనే విషయమై డిసైడ్ అయ్యాను అని చెప్పాగా. ఆ పనిలో eతెలుగు వాళ్ళు ఇచ్చిన కర పత్రాలు పంచుతూ అడిగిన వాళ్ళకి తెలిసిన సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాను. ఇక్కడ చెప్పొచ్చిన / గమనించ తగ్గ విషయమేమిటంటే.. eతెలుగు స్టాల్ ముందు నుంచి వెళ్ళుతున్న వారందరికీ నేను కర పత్రాలు పంచటం లేదు. నా దగ్గరకు వచ్చి నిలబడి, ఏమిటిది? అని అడిగిన వాళ్ళకు మాత్రమే పంచుతున్నాను. నా వరకూ నాకు ఒక్క కరపత్రమైనా వ్యయం క్రింద లెక్కే. ఎంత వరకూ వృధా అవకుండా చూద్దామా అన ఆలోచనతో, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఉత్సూకత ఉన్న వాళ్ళే అయ్యి ఉంటారు. కాబట్టి నా శ్రమ కొంచం తగ్గినట్లే అనుకుంటూ వచ్చే పోయే వారిని గమనిస్తూ ఉండి పోయ్యాను. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, "అవసరం ఉన్న వాళ్ళకే సహాయం చెయ్యాలి.. ", మన దగ్గరకు వచ్చిన వాడికే మన సమాచారం ఇద్దాం అని డిసైడ్ అయ్యాను. అందు వల్ల చాలా తక్కువ కర పత్రాలు మాత్రమే పంచానని చెప్పుకోవచ్చు.

 

ఇక మన హీరో గారి విషయానికి వస్తే. వీరు నాకు పూర్తిగా విరిద్ధం. కర పత్రాలు చేతిలో పట్టుకుని పంచుతూ ఉంటే eతెలుగు స్టాల్ దడ దడ లాడిందనుకోండి. eతెలుగు స్టాల్ పైపుగా పోతున్నప్పుడు, సందర్శకులు చక్కగా వారికై వారు వచ్చి తీసుకున్నారా, మర్యాదగా ఉంటుంది. తల తిప్పి చూసి మేము పంచుతున్న విషయం చూచి కుతూహలంతో వచ్చి కరపత్రం అందుకున్నారా.. బాగు బాగు.. అంత దూరం నుంచి అటుగా పోతూ..  eతెలుగు స్టాల్ ని నిర్లక్ష్యం చేసి మేము నుంచున్న బల్ల నుండి నాలుగు అడుగుల దూరంలో ఏ ఒక్క వ్యక్తి అయినా అటుగా వెళ్ళాడంటే, అదిగో అట్లాంటి వాడు మన హీరో గారి కంట్లో పడ్డాడా..  అంతే.. చచ్చాడే అన్న మాట. వాని చేతుల్లో మన కరపత్రం కనబడి తీరాల్సిందే.  లేదా వీరు చేయి చాచి పత్రం ముందుకు పెట్టారో అల్లంత దూరాన ఉన్న వ్యక్తైనా సరే వచ్చి తీసుకోవాల్సిందే. "ఈయన పంపకం వలన ఉపయోగం ఉంటుందా.." అని మొదట్లో కొంచం సంశయించినా, ఫలితం ఆశించ కుండా క్రియే ప్రధానంగా వారి వంతు కృషి వారు నిర్వర్తించిన తీరు చూస్తూంటే.. అహా.. అనిపించింది. చివ్వరలో వీరు నాకు శ్రీ కృష్ణుడు లాగా కనిపించారు. మన కిట్టయ్య చెప్పిన శ్లోకం.. అదేనండీ..

"కర్మణ్యేవాధి కారస్తే.." ఇంకా.. ఇంకా..

ఫలితం గురించి ఆలోచించకు. నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి. అన్నట్లుగా వీరు చించారను కోండి. ఏంటీ ఒక్క కర పత్రాలు పంచడం మాత్రమే అనుకున్నారా.. అదిగో అక్కడే కూరలో కూడా కాలేశారు. (తప్పు్లోనూ పప్పులోనూ ఎప్పుడూ కాలేసారని వేరేగా చెప్పనవసరం లేదుగా) eతెలుగు స్టాల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు అడిగిన వాళ్ళకు అడిగినంత, అవసరమైన వాళ్ళకు అవసరమైనంత అలాగే తెలియని వాళ్ళకు తెలియాల్సినంత చెప్పి , ఇదేదో బాగుందే అని అనిపించు కునేంత వరకూ వదిలే వారు. వీరు ఇంత జిడ్డా అని అనుకుంటున్నారా.. ఇప్పుడు సాంబారుతో సహా పులుసులో కూడ కాలేశారు. వీరి ఉత్సాహం అలాంటిది.. వచ్చిన వారి జిఙ్ఞాస అన్నింటికీ మించినది.

 

ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి. నేనూ చాలా సేపు eతెలుగు స్టాల్ దగ్గర నుంచొని వచ్చే పోయ్యే వారితో సంభాషిస్తూ చాలా సేపు నిలబడే ఉన్నాను. కానీ నుంచోని నుంచొని కాళ్ళు నొప్పి పుడుతూ ఉండడం వల్ల కొంత సేపు లోపల కుర్చీలలో కూలబడే వాడిని లేదా బయట నుంచొని eతెలుగు స్టాల్ ని చూస్తూ మన తెలుగు బ్లాగర్లతో ముచ్చట్లేశే వాడిని. కానీ మన హీరో గారైతే కూర్చోగా నేను చూడ లేదనే చెప్పవచ్చు. ఒక వేళ కూర్చొన్నారేమో ఎవ్వరైనా చూస్తే స్పందించండి. ముందుగా చెప్పినట్లుగా "అలుపెరుగని యుధ వీరుడు" అనే బిరుదు వీరికి అన్ని విధాలుగా సరిపోతుంది అనడానికి ఇదొక మరొ కారణం.

 

ఇంకా ఎక్కువ వ్రాస్తే మిగిలిన వాళ్ళు కొడతారేమో.. మరో పుటలో మరొకరిపై నా భావనలతో మరలా కలుస్తాను.. అంత వరకూ సెలవు,

ఇట్లు,

భవదీయుడు

8 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

మీకు రమణ గారి మీద కూడా కోపం వున్నట్టుందే.పొగుడుతూ తిట్టారు.అది సరే గానీ కరపత్రాలకోసం జనాలెవరూ ఎగపడరండి.ఎవరన్నా ఇస్తే ఒక చూపుచూసి పడేస్తారంతే.ఆ చూపు కోసమేగా ఈ తెలుగు వాళ్ళు అన్ని పాట్లు పడింది.అంటే మీరు బాగా టైము వేష్టు చేసారన్న మాట అక్కడ :) ముందు టపాలో అనిలు గారి వల్లే స్టాలు దొరికింది అన్నా కూడా మీ వ్యగ్యం వదల్లేదంటే మీకేమన్నా వ్యక్తిగత సమస్యలున్నాయా ఆయనతో.[మీరు ఎంతో ఓపెన్ గా రాస్తున్నారుగా.అందుకే ఇంత ఓపెన్ గా అడుగుతున్నా.ఏమీ అనుకోరుగా]

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఏమిటోనండీ.. నేను ఏది వ్రాసినా అందరూ దానిని అర్దంతో పాటుగా అపార్దం కూడా చేసుకుంటున్నారు.

రమణ గారి మీద నాకు ఎటువంటి కోపమూ లేదండి. అస్సలు ఆ విషయానికి వస్తే ముందు ఉదహరించిన అనీల్ గారి పై నా స్పందన కూడా (నాది) సదభిప్రాయం తప్పితే వారిపై నాకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు లేవు. అస్సలు వారిని నేను అక్కడ చూడడమే మొదలు. అంతక ముందు వారి మేనేజ్‍మెంట్ లెసన్స్ వినడం తప్పితే, వారిని ఎప్పుడూ కన లేదు.

కాకపోతే, నా స్పందన వ్యంగ్యంగా ఉందంటే.. నేను స్పందించే పంధా మారాలి అన్న మాట. నిజం చెప్పి పుణ్యం మూట కట్టు కున్నారు. లేక పోతే చదివే జనమంతా నన్ను అపార్దం చేసుకుంటున్నారు. అందుకేనా ముందు టపాలో నామీద జాలేస్తోందన్నారు.

చూద్దాం నా పద్దతి మారుతుందో లేదో.

ఇక నేను వేష్టు చేసిన సమయానికి వస్తే, చెప్పాను కదా.. నేను అక్కడ సహాయం చెయ్యగలను అని పెద్ద బోర్డుపెట్టి నుంచొని ఉన్నప్పుడు నాదగ్గరకు వచ్చి అడిగితేనే సహాయం చేస్తాను అని మడి గట్టుకుని కూర్చున్నాను అని. అందువల్ల సమయం నష్టపోతే దాని వల్ల ఎవ్వరికీ అనర్ధం జరగలేదని నా అభిమతం.

కాకపోతే ప్రతీ అనుభవం ఒక గుణపాఠమే. అలాగే ఈ అనుభవ పాఠానుశారమే .. రమణగారి ప్రవర్తన పాఠం.. కర్మనే పాటించు, ఫలితాన్ని ఆలోచించకు.

ఇక రమణ గారిని తిట్టాను అనేటటువంటి అర్దాన్ని కూడా నా మాటలు తెచ్చాయంటే, అది నా భావాన్ని వ్యక్తీకరించే పద జాలానిది తప్పితే, నా భావనలో అది లేదని గమనించండి. ఇకపై నా పదజాలం మర్చే ప్రయత్నం చేస్తాను. ఇదే ఒక పెద్ద పుట అయ్యింది.

teresa చెప్పారు...

పనిలో పనిగా 'ఖశ్చితం,భుద్ధి,యుధవీరుడు లాంటి పదాలు కరెక్ట్ చేసుకోండి ప్లీజ్! మీ శైలి గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే..

ఓ బ్రమ్మీ చెప్పారు...

తెరెస గారూ.. కరెక్ట్ చేసుకో మన్నారు .. బాగానే ఉంది.. కానీ ఏదైతే బాగో కూడా చెప్పి పుణ్యం కట్టు కోండి.

’..తక్కువ చెప్పినా ఎక్కువే..’ అంటూ ఏమీ చెప్పలేదు.. ఇంతకీ నచ్చిందా .. నచ్చలేదా .. బాగుందా.. బాగాలేదా.. షడ్ రుచులు వేరు వేరుగానే ఉంటాయి.. వాటిల్లో ఏది నాది??

జ్యోతి చెప్పారు...

చక్రవర్తిగారు,

మీరు రాస్తున్న టపాలన్నింటిలో నాకు నిందాస్తుతి కనిపిస్తుంది. అందుకే ఇప్పటివరకు కామెంటలేదు. ఇప్పుడు మీరే అడిగారని చెప్తున్నాను. మీరు రాసిన విధానం ఐతే మాకు అపార్దం మాత్రమే కలిగిస్తుంది.. మెచ్చుకుంటో తిట్టినట్టు అనిపిస్తుంది నాకైతే..

ఓ బ్రమ్మీ చెప్పారు...

అయ్యో!! :-(

జీడిపప్పు చెప్పారు...

నిర్మొహమాటంగా చెప్తున్నందుకు అన్యదా భావించకండి, ఒక మితృడిగా చెబుతున్నా... మీ పొస్టులు చదువుతుంటే "అక్కడ వాళ్ళేదో కష్టపడి మంచి పని చేస్తుంటే ఇతడేంటి అందరినీ అలా విమర్శిస్తూ ఆడిపోసుకుంటున్నాడు" అనిపిస్తున్నది. కేవలం అందరినీ విమర్శించడానికే ఈ పోస్టులు వేస్తున్నారు అనుకుటున్నాను ఇప్పటికీ!!

ఓ బ్రమ్మీ చెప్పారు...

నిర్మొమహమాటంగా మీ భానను పంచుకున్నందులకు నెనర్లు.

ఇక ముందుకూడా ఇలాగే స్పందిస్తారని భావిస్తాను.

మంచి భావనైనా .. చెడు అభిప్రాయమైనా చెబితేనే తెలుస్తుంది. లేకపోతే, గుంభనంగా చాపక్రింద నీరులా అంతా అయ్యిపోయ్యాక తెలియ బడే విషయలను ఉద్దేశించే పెద్దవాళ్ళు అంత్య నిష్ఠూరం కన్నా ఆది మేలన్నారు.

మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఇందులో తప్పుగా అనుకునేది ఏమీ లేదని గమనించండి.

 
Clicky Web Analytics