21, జనవరి 2009, బుధవారం

కనబడుట లేదు - దేశభక్తి - తప్పి పోయింది

గత సంవత్సరం ఆగస్టు 15వ తారికు నుండి నా దగ్గర ఉండ వలసిన దేశభక్తి తప్పి పోయింది. కావున తెచ్చిపెట్టిన వారికి తగిన బహుమానం ఇవ్వ బడుతుంది. అందునా ఈ నేలలో గణతంత్ర దినోత్సవం వస్తోంది. ఆలోగా నేను ఎట్లాగైనా ఈ దేశభక్తిని పట్టి తెచ్చుకుని, గణతంత్ర దినోత్సవం నాడు ఎదో పూనకం వచ్చినట్లు పెద్ద పెద్ద స్పీచ్‍లు ఇవ్వాలి. కావున బ్లాగు ప్రపంచ్ం లోని మిత్రులు శత్రువులు, చితులు, పరిచితులు, అపరిచితులు, హితులు, సన్నిహితులు, స్నేహితులు, భంధు మిత్ర సకుంటుంబ సపరివారు అందరికీ  విన్న వించుకోనిది ఏమనగా..

 

నా దేశభక్తి బొత్తిగా భయం భక్తి లేకుండా నాకు చెప్పకుండా పారి పోయింది. దేశభక్తి గురుతులు చెబుతాను కొంచం జాగ్రత్తగా గుర్తుపెట్టు కోగలరు. ఆగస్టు పదిహేనో తారీకున ఝండా ఎగుర వెయ్యలని పిస్తుంది, అలాగే, మన గాంధీ గారి పుట్టిన రోజున, నెహ్రూ గారు పూట్టిన రోజున, అలాంటి ఒకటో రెండో రోజులలో అవేవ్వో మూడు రంగులు ఉన్నట్లుగా అని పించే తెరచాపను.. (అయ్యో ఈ మాట మన రాజ్యాంగం వ్రాసిన వారు  కనుక చదివితే నన్ను బొక్కలో వేసి కుమ్మేయ్య గలరు) గుర్తుకు తెచ్చేది దొరికిన వారు కానీ, దానికి సంభందించిన సమాచారం ఇచ్చినా గాని, తగిన పారితోషికం ఇవ్వబడును. ఇంతకీ ఏమిటా భహుమానం అనుకుంటున్నారా.. ఒక ముష్టి ఘాతం, రెండు లెంప కాయలు, మూడు జెల్లకాయలు, నాలుగు డిప్ప కాయలు, ఐదు మొట్టికాయలు, ఆరు పిక్కపాసాలు, ఏడు గుంజీళ్ళు, ఎనిమిది .. నొమ్మిది.. (ఇలాంటివే మరికొన్ని.. ఆలోచిస్తున్నా ఏమేమి ఇవ్వ వచ్చో.. అంత వరకూ ఖాళీలు పూరించు కోగలరు.)

 

*******************

ఇదేంటి అనుకుంటున్నారా!! గత రెండు రోజులుగా సికిందరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ ప్రక్కగా పోతుంటే, గణతంత్ర దినోత్సవ సందర్బంగా జరిపే కార్య క్రమాల రిహార్సల్స్ జరుగుతున్నాయి. అదిగో అటుగా ఉన్న ఫ్లైఓవర్ మీదుగా పోతున్న నాకు ప్రతి సారీ అనుకుంటూనే ఉన్నాను. చక్కగా దేశభక్తిపై ఒక చక్కని పుట ప్రచురిద్దామని. కానీ ఇలా మొదలు పెట్టానేమిటా అని అనుకుంటున్నారా.. అదిగో ఆ విషయానికే వస్తున్నా..

ఏమి వ్రాద్దామా అని ఆలోచిస్తుంటే.. దేశభక్తి అంటే దేశం మీద ఉన్న భక్తి అని సమర్దించుకుని, చాలా కాలంగా పరదేశంలో పని చెయ్యడానికి నేను ఎన్ని అవకాశాలు వచ్చాయో ఎన్నింటిని నేను మాతృ దేశం మీద ఉన్న ప్రేమతో (లేదా) భక్తితో లేని పోని కారణాల వల్ల తిరస్కరించానో .. వాటి చిట్టా అంతా విప్పి మీ ముందు ఉంచుదాం అనుకున్నాను. అదిగో అప్పుడే ఆత్మా రాముడు, నేను ఉన్నానంటూ, ఎవ్వరి మెప్పుకై ఈ చిట్టా తయారు చేస్తున్నవు అన్నాడు. అయినా కొంచం విపులంగా ఆలోచిద్దాం అని కొంత విరామం తరువాత మళ్ళి మొదలు పెట్టాను. అదిగో అప్పుడు ఉదయించిన ఆలోచనల ఫలితమే ఈ పుట శీర్షిక. ఇక అసలు విషయానికి వస్తాను.

దేశమంటే మట్టి కాదోయ్, దేశ మంటే మనుష్యులోయ్.. అని ఎక్కడో చదువుకున్నట్లు గుర్తు. అలా ఆలోచిస్తే, నాకు ఉన్న దేశభక్తి నిజంగా ఈ దేశంలో ఉన్న మనుష్యుల పైనా లేక ఒట్టి ఓ దేశ మట్టి మీదనా అన్న ఆలోచనలో నుంచి ఉద్భవించినదే ఈ పుట. అవును, ఇంత కాలం నేను అంటూ ప్రేమించినది మన దేశం అన బడే ఈ ప్రాంతాన్నే కానీ నాతో బ్రతికే జనాల్ని కాదు అన్న నిజం నన్ను నిస్తేజుడిని చేసింది. ఇంత కాలం మన దేశం అంత గొప్పది .. ఇంత శ్రేష్టమైన చారిత్మక విలువలు కలది.. అని మాత్రమే చెప్పుకుంటూ గత జన్మ తరం చేసిన పనులకు నేను గొప్పలందుకుంటూ బ్రతికేస్తున్నాను.  కానీ నిజానికి నేను నా భందువులను తప్పితే నాకు చుట్టరికం లేని వాళ్ళను ఎవ్వరినీ ప్రేమించటం లేదు. అలాంటి నాకు దేశభక్తి లేదనే చెప్పుకోవాలి.

ఈ పరిస్తితి నా ఒక్కడిదేనా అంటే, నేనేమీ అదేదో కొత్త రకం జబ్బుతో మంచం పట్ట లేదని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. నాతో పని చేసే చాలా మందికి దేశమంటే మట్టి మాత్రమే అని, దేశం లో ఉన్న మనుష్యులను ప్రేమించడం దేశాన్ని ప్రేమించడంతో సమానమని అనుకోవడం లేదు. ఎవ్వరిని దేశభక్తి గురించి కదిలించినా, దేశభక్తి అంటే.. వారు అమెరికా పోకుండా ఎందుకు ఉండి పోయ్యారో చెబుతున్నారే గానీ.. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం .. వారికి సేవలు చెయ్యడం అని అనుకోవటం లేదు. కాబట్టి నేనేమీ ఇలాంటి ఆలోచనలకు అతీతుడను కాదని మనవి చేసుకుంటూ, తమరెవరికైనా పైన ఉదహరించిన సదురు దేశభక్తి అనే పదార్దం అంతా కాకపోయినా, ఓ కేజీయో అంతగా కుదరక పోతే, అర కేజీ అయినా దొరికితే నాకు ఒక తారు పంపంగలరు. అదే నండి జాబు లేదా ఉత్తరం.

పంపిస్తారు కదూ అంత వరకూ సెలవు

ఇట్లు,

భవదీయుడు

2 కామెంట్‌లు:

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"దేశభక్తి అనే పదార్దం అంతా కాకపోయినా, ఓ కేజీయో అంతగా కుదరక పోతే, అర కేజీ అయినా దొరికితే"
ఏదో నా బరువులో ఓ పదో పరకో కేజీలు ఇమ్మంటే ఇచ్చేవాడ్ని హాయిగా ఆనందిస్తూ ఇదేమి కోరిక బాబూ భవదీయుడా..

Nrahamthulla చెప్పారు...

గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
“కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.

 
Clicky Web Analytics