11 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2012, సోమవారం

మూడో సారి అమెరికా ప్రయాణం

ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. కానీ నాలోనే ఏదో మార్పు వచ్చినట్లుంది.

అది ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు కానీ, ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసుకున్నట్లు అంగీకరించడం ఎందుకో కష్టంగా ఉంది. కానీ నిజాన్ని నిజం అని ఒప్పుకోక తప్పదు. కానీ నిజాన్ని ఒప్పుకునేంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాలో ఎందుకు కలగలేదో అర్దం కావటం లేదు. ఒక్కొక్క సారి చాలా కుశ్చితంగా ఆలోచిస్తున్నాను అని వ్రాసుకోవడానికి సిగ్గుగా లేదు కానీ, ఇలా వ్రాసుకోవడానికి చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఇలా నారో మైండెడ్ గా తయరవ్వడానికి నా ఆలోచనలే కారణమని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది.

ఇలా వ్రాసినంత మాత్రాన నేను ఇంతక ముందు వ్రాసినవన్నీ యాదార్దాలు కాకపోలేదు. ఆచారాన్ని సహిస్తాను కానీ అనాచారారాన్ని అంగీకరించలేను. ఇది అనాచారము అని నిర్ణయించే హక్కు నాకు లేక పోయినా, ఆచారముగా చెప్పబడినదానికి విరుద్దంగా ప్రవర్తించి మా ప్రవర్తన ఇంతే, ఎవ్వరో నిర్ణయించిన ఆ ఆచారాన్ని మేము పాటించము, మా ఆచారాన్ని మేము వ్రాసుకుని మాకు నచ్చినట్లు ఉంటాము అనే వారి ఆచారము నాకు అనాచారముగా అనిపిస్తోంది అనేది మాత్రం నిజం. ఏది సదాచారము? ఏది దురాచారము? అని నేను నిర్ణయించే స్థితిలో నేను లేకపోయినా, అలాంటి చర్చకు కూడా నేను సిద్దంగా లేను. అంతే కాదు సరికదా, అలాంటి చర్చను కూడా స్వాగతించే  హక్కు నాకు లేదు. ఈ చర్చ ఇప్పుడు అప్రస్తుతం అయనా, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు.

నేను కొంచం (కొంచం ఏం ఖర్మ, చాలానే..) దూకుడు మన:తత్వం కలిగిన వాడిని. అలాంటి నాకు ఈ సారి అమెరికా ప్రయాణంలో చాలా అవరోధాలు ఎదురైనా చిరునవ్వుతో దాటవేసే గుణం ఎందుకు కలిగిందో నాకు అర్దం కాలేదు. నా ప్రస్తుత ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుంటే, హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమాన యానం ముంబైలో మఱో అంకానికి చేరుకుంది. అక్కడి నుంచి పారీస్ వరకూ బాగానే సాగినా అక్కడి నుంచే మొదలైంది అసలైన కధ. నేను శాఖాహారిని. ముంబై నుంచి వచ్చే లేదా ముంబైకి వెళ్లే ప్లైట్లలో చాలామంది శాఖాహారులు ఉండటం అనేది చాలా సామాన్యం. కావున సదరు విమానాలలో విమానయానం చేసే ప్రయాణీకుల సౌకర్యార్దం కొన్ని శాఖాహార భోజనాలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతూ ఉంటారు. కానీ పారీస్ నుంచి అటు పశ్చిమంగా వెళ్లే వారిలో శాఖాహారులు ఉండటం అనేదు అఱదు. కావున ప్రత్యేకంగా చెప్పకపోతే గాని శాఖాహారాన్ని అందు బాటులో ఉంచుకోరు. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు నేను టికెట్ కౌంటర్లో శాఖాహారిని అని చెప్పనందున వారు నా విషయాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల నేను సాధారణ మాంసాహారిని అన్నమాట.

శాఖాహారం తినటం అనేది నాకు పరంపరగా వచ్చిన ఆచారం. మా ఇంటికి అతిధి వస్తే లేదా మేము ఆహ్వానిస్తే, మేము శాఖాహారమే పెడతాము. అదే విధంగా మాంశాహారం పశ్చిమ దేశాలలో ఆచారంగా వస్తున్నందున అక్కడి వారు కూడా అక్కడికి విచ్చేసే యాత్రికులకు అదే ఆచారం ప్రకారం పద్దతలు పాటిస్తారు కదా, అదే పంధాలో అక్కడికి వచ్చే వారికి కూడా మాంశాహారాన్ని పెడతారు కదా!! అలాగే నా విషయంలో మాంశాహారాన్ని నా ప్రధాన ఆహార ఆచారంగా తీసేసుకున్నారు. కానీ నేను శాఖాహారిని అని తెలిసిన తరువాత శాఖహారం వడ్డించడం జరగక పోయినా, శాఖాహారం లేదని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చినా, నాలోని సహనం ఆ కోపాన్ని అధిగమించేసింది. నవ్వుతో ఆనాటికి పళ్ల రసంతో సరిపెట్టుకుని, బ్రెడ్డు ముక్కలు తిని చాలించాను. అదిగో అలా మొదలైంది మఱో వింత అనుభవం. ఏదో తెలియని క్రొత్త ఆలోచనలు. సరి క్రొత్త భావనలు.

 

అదే ప్రపంచం మఱో కోణంలో కనబడటం మొదలైంది.

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

11, మార్చి 2011, శుక్రవారం

నేను అనుభవాలనుంచి నేర్చుకోవటం లేదు

ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది. దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం.

స్వతహాగా నాకు ఉన్న కొన్ని బలహీనతలలో ఒకటి నన్ను చాలా ఇబ్బందులలోకి తోస్తోంది. అలా చెయ్యడం ద్వారా నేను ఇబ్బందుల పాలౌతున్నాను అన్న విషయం గ్రహించి కూడా అలా చెయ్యడం మానుకోలేక పోతున్నాను. అలా చెయ్యడం మానడానికి నేను చాలా శ్రమించ వలసి వస్తుంది. కానీ చాలా కాలంనుంచి ఉన్న అలవాట్లు తొందరగా మానుకోలేం అన్న ఆంగ్ల నానుడి నాయందు స్పష్టమైంది. ఆంగ్ల నానుడిని ఆంగ్లంలో, Old habits die hard.

ఈ పుట వ్రాయడం వెనకాల ఉన్న చాలా విషయాలలో ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ’రాయడం’ అనే పదం చూచిన రోజునుంచి నాకు చాలా కోపంగా ఉండేది. ఎవ్వడో చదువురాని లేదా వ్రాయడం చేత కాని ఓ అభాగ్యుడు వ్రాయడం అనే అచ్చమైన తెలుగు పదాన్ని తెలియక అలా వ్రాస్తే, ఏవిదంగా వ్రాస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తూ ఈ నాటి చాలా మంది రచయితలు అందునా విద్యావంతులు అంతే కాక సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా ఈ రాసే జబ్బుని వారంటించుకుని అందరికీ పూయ్యడం అలవాటు చేస్తుంటే కడుపు రగిలిపోయ్యేది. ఇక్కడ మరో విషయన్ని ప్రస్తావించాలి.

ఉదాహరణాకి, ఓ ఇంటి ముందు నుంచొని ఓ పెద్దాయిన ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది..

౧) అబ్బాయి, మీ నాన్నగారు ఉన్నారా?

౨) బిడ్డా!, మీ నాయిన ఉన్నడా?

౨) కొడకా, బాబు ఏంజేస్తుండు?

౪) వగైరా .. వగైరా..

ఇవన్నీ ఏదో ప్రాంతీయ యాస కలిగి ఉంటాయి, అంతే కానీ ఏ భాణిలోను మనం తండ్రి అనే పదాన్ని అగౌరవ పరచం. కాకపోతే మనం చేయ్య వలసినదల్లా, ఆ ప్రాంతీయ తత్వాన్ని మనం అర్దం చేసుకోవడమే.

అదిగో అలాంటి సమయంలో తెలుగు బ్లాగింగ్ చెయ్యడం, eతెలుగులో చేరడం, నా అభిప్రాయాన్ని నలుగురితో పంచుకోవడం, పలువురు నన్ను వ్యక్తిగతంగా నిందించడం, వగైరా వగైరా, ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయ్యాయి. ఎవ్వరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ విషయమై నేను ఓ అభిప్రాయానికి వచ్చేసాను. నేను తెలుగు భాషని నలుగురిలోకి తీసుకు వేళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరు ఏవిధంగా నైనా తెలుగులో వ్రాయడం మొదలైతే ఎంతో కొంత తెలుగు భాష వాడుకలోకి వస్తుంది కదా అని సమర్దించుకుని నా భాదని దిగమింగుకుని నాకు వీలైనంత వరకూ వ్రాయడమే చేస్తున్నాను.

అదిగో అలాంటిదే మరొక్కటి. అయినా నాకు ఎందుకో ఈ జాడ్యం? భాష యందు పూర్తి పట్టులేక పోయినా కొన్ని కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పవచ్చు. నాకు అవగాహన ఉన్న విషయాలలోని అర్దాన్ని తెలియని అందునా మాకు తెలియని విషయాన్ని చెప్పండి అని అడిగిన వారికి మాత్రమే తెలియ జేస్తుంటాను. అలా తెలియజేస్తూ ఉండే ప్రక్రియలో తెలుసుకునే వారు, తాము చేస్తున్నది భాషకి విరుద్దం అని తెలిసి.. ఆ విషయాన్ని ఒప్పుకునే చొరవ లేక వితండంగా వాదించడమే కాకుండా తిరిగి నాపై లేదా నేను చేసే తప్పులను భూతద్దంలో చూపించి వారేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవుతారు.

ఇలాంటి వారి విషయాలలో కొన్ని అంశాలు. మొదటిది, నాకు నేరుగా తపుచేస్తున్న వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం లేదు. వారు అడిగితేనే నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను. రెండవది. నేనేమి తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని ఎవ్వర్ని నేను అడగలేదే, మరి అలాంటది నా చర్యలపై ఎందుకు స్పందిస్తారు? ఇలాంటి వాటి గురించి మరోసారి. ప్రస్తుతానికి ముఖ్య విషయానికి వచ్చేస్తా..

ప్రస్తుత ముఖ్య విషయాన్ని, అనుభవం నుంచి నేర్చుకోవడం అనే విషయంపై నేను ఇంతకు ముందు ’వ్రాయడం’ అనే విషయంలో అనుభవించి ఉన్నాను. కానీ ఇది పునరావృత్తం అవుతోంది అంటే, నేను అనుభవాలనుంచి నేర్చుకో లేక పోవడమే కాకుండా, స్వయం కృతాపరాధానికి అనుభవించాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం జరుగుతుందో చూడాలి ఇకనైనా నేను నాలోని ఈ బలహీనతను అధిగమించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూచుకోవాలి.

11, జనవరి 2011, మంగళవారం

ఈ నాటి ప్రత్యేకత

హల్లో..

ఈ నాటి ప్రత్యేకతేమిటో తెలుసా.. అదేనండి. ఇవ్వాల్టి తేదీలో దాదాపు అన్నీ ఒకట్లే!! ఎలా అంటారా.. ఇదిగో ఇలా

ఒకటో నెల - 1

పదకొండో రోజు - 11

పదకొండో సంవత్సరం - 11

అదే గనుక పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకన్లకు ..  11:11:11 am అవుతుందన్నమాట. సొ ఫైనల్‍గా చెప్పొచ్చేదేమిటంటే,

11/1/11 తారీకున 11:11:11 am సమయ్యాన్ని ఇప్పుడు మీరు మిస్ అయితే, మరో పది నెలలు ఆగండి. అప్పుడు ఇలాంటిది మరొకటి వస్తుంది. అదేనండి నవంబర్ నెలలో కూడా రెండు ఒకట్లు ఉన్నాయి కదా.. ఇప్పుడు మిస్ ఆయిన శుభం మీకు 11/11/11 తేదీన 11:11:11 am సమయంలో తప్పకుండా జరగాలని కోరుకుంటూ ..

సెలవ్

 
Clicky Web Analytics