ఈ పుటకి పేర్కొన్న శీర్షిక వెనకాల అప్పుడెప్పుడో చదువుకున్న జోక్ ఒకటి మూల కారణం. మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరోసారి గుర్తు తెచ్చుకుంటాను. అదేమిటంటే, భిన్నత్వంలో ఏకత్వానికి అస్సలైన ఉదాహరణ ఎమిటి అని ఎవ్వరినైనా అడిగితే, డయనా మరణం అంటారు. ఎందుకంటే ఓ బ్రిటన్ అమ్మాయి ఓ ఈజిప్ట్ దేశస్తుడితో కలసి జెర్మనీలో తయ్యారయిన బెంజ్ కారులో వెళుతూ ఫ్రాన్స్ లోని పారిస్ లో చనిపోవడం, ఆ విషయాన్ని ఇండియాలోని ఓ అబ్బాయి చైనా లో తయ్యరయ్యిన చిపు ఉన్న జపాన్ మేడ్ కంప్యూటర్లో వ్రాసి ప్రచురిస్తే ఆస్ట్రేలియాలోని మరో తెలుగు వాడు స్పందించాడు .. అంటూ ఈ జోక్ అన్ని దేశాలను కలుపుతూ ఉంటుంది. ఆ జోక్ కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. మీకు గనక తెలిస్తే నాకు పంపించండి.
ఇక అసలు విషయానికి వస్తే.. ఓ భారతీయుడు అమెరికా వచ్చి మెక్సికో వాళ్ళు జరుపుకునే ఓ గెట్ టుగెదర్ లో పాలుపంచుకుంటే బ్రజీల్ అమ్మాయిలు బెల్లి డాన్స్ చేస్తే వెనుజ్యువెలా అమ్మాయిలు మరో రకమైన నాట్యాలు చేసారు. వీటికి తోడుగా పెరు సంస్కృతిని ప్రతిబింబించే వంటకాలలో బొల్వియా లభ్యమయ్యే ఓరకం జంతువు యొక్క మాంశంతో తయ్యారు చేసిన ఓ వంటకం ప్రధాన అంశం అయ్యింది. దాన్ని చైనాలో తయ్యారయ్యిన ఐఫోన్లో నేను భందిస్తే.. బ్లా .. బ్లా.. ఇక ఇక్కడితో ఈ దేశాలను కలిపే పని ఆపి ఆ కార్యక్రమం విషయాలకు వస్తాను. ఓ మెక్సికో దేశస్తుడు నేను ఉంటున్న హోటల్లోనే బస చేస్తున్నాడు అదిగో అతనే రమొన్. మేమిద్దరం సాయత్రం ఐదు గంటల వేళ రెడింగ్ టౌన్ హాల్ ప్రక్కనే ఉన్న చర్చికి చేరుకున్నాం. మేము అక్కడకు చేరుకునేటప్పటికి అక్కడ ఒకరిద్దరే కనబడ్డారు.
కాసేపు అయిన తరువాత మెల్లగా ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభమైంది. దాదాపు అందరూ వచ్చిన తరువాత, ఇక లేండి అందరం భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు. తీరా అక్కడకు వెళ్ళి చూద్దును కదా అంతా మాంశాహారమే.. అందుకే అక్కడ ఉన్న కొన్ని అప్పడాలు కొన్ని చిప్స్ మరియు కొన్ని టాకోస్ లాంటివి తెచ్చుకుని నేను భోజనానికి సిద్దం అయ్యా.
ఇక నా భోజనంపై నా ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.
అప్పడాలు అప్పడాల్ల లేవు, విష్ణూ చక్రాల్లా ఉన్నాయి. వాటిల్ని విరక్కొట్టడానికి నా వేళ్ళల్లో శక్తి చాల్లేదు. ఇక ఠాకో లైతే ఉండ చుట్టిన అరిసెల్లాగా కరకర లాడేటట్టు కాల్చి ఉంచారు. నాకు తెలిసినంత వరకూ ఠాకోకు మన చెపాతిల్లాగా ఉంటాయి. అందువల్ల అవి మెత్తగా ఉంటాయి. ఇవి వాటికి వ్యతిరేకంగా గట్టిగా కరకర లాడేటట్టు తయ్యారు చేసారు. ఇక మనకు నచ్చినది ఒకటే.. అదేనండి పొటాటో చిప్స్. సరే వాటితోనే పని కానించేసా.
ఇలా జరుగుతున్న మా సాయంకాల వేళలో కొంత మంది పిల్లకాయలు దూరారు. వీళ్ళంత అక్కడి మెక్సికన్ కుంటుంబాల పిల్లలన్నమాట. మన రమోన్ గారు వీరికి కొన్ని చిన్న డాన్సలు నేర్పించారు, వాటిల్ని వీరు అక్కడ ప్రదర్శించారు.
ఇలా చిన్న పిల్లల నృత్యాలు నడుస్తుంటే, ప్రక్కనే మరికొంతమంది అమ్మాయిలు సిద్దం అయ్యారు..
నిజం చెప్పొకోవాలంటే, ఈ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేశింది. అల్లరి చేసే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అలాంటి అల్లరిపిల్లలో కొంత మంది ఇంత చక్కగా నేర్చుకుని, గుర్తు పెట్టుకుని భేషుగ్గా పెర్‍ఫామ్ చేసారంటే ముద్దెట్టుకోక ఎవ్వరుంటారు చెప్పండి. ఇలా ఆలోచిస్తూ ఉండగానే మెక్సికన్ స్టైల్ లో నాట్యం మొదలైంది
ఇది కొంత సేపు నడిచింది. ఈ నాట్యంలో నాకు పెద్ద గొప్పదనం కనబడలేదు సరికదా అంతగా ఆనందించ లేక పోయ్యాను. దీనికి కొన్ని కారణాలు. అన్నింటికన్నా మించి నాకు డాన్స్ వచ్చి ఉండటం. ఈ నృత్యం వీళ్ళకీ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ప్రస్తావించే రెండు నృత్య రీతుల్ని మన భారతీయ శాస్త్రీయ నృత్య రీతులత్ పోల్చుంకుంటే, నక్కకు నాగలోకానికి ఉన్న దూరం కనబడుతుంది. భారతీయ నృత్య రీతులలో ఉన్నంత వైవిధ్యం నేనింత వరకూ ఎక్కడ చూడలేదు. అఫ్ కోర్స్ నేను చూసిన లోకం చాలా చిన్నది.
- ఇందులో లంగాను ఊపడం తప్పితే మరింకేం కనబడలేదు
- పాద ప్రయోగం చాలా సున్నితంగా సాగితే చేతులు అచ్చంగా లంగాను పట్టుకుని ఊపడంతో సరిపోయాయి
- హావభావాలకన్నా ఇంస్ట్రుమెంటల్ మ్యూజికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు
ఇది అయిన తరువాత బెల్లీడాన్స్..
ఇదిగో ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాం. ఈ పిల్లలు చాలా సేపు ఇలా తలలు దించుకుని కూర్చొని ఉన్నారు, ఎంతకీ పాట ప్రారంభం అవటం లేదు. వీళ్ళందరికీ మధ్యలో ఉందే ఆ అమ్మాయే వీళ్ళకు లీడర్ అన్న మాట. చాలా సేపు ఎదురు చూసిన తరువాత ఏమి జరుగుతోంది అని అలా తల ఎత్తి చూస్తోంది.
ఏదో కొంచం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున నేనున్నా అంటూ నేను ఓ దూకు దూకా!! దూకే ముందు ప్రక్కనున్న అమ్మాయికి నా ఐ ఫోన్ ఇచ్చి నన్ను ఫొటో తియ్యమంటే, అలాగే కూర్చున్న అమ్మాయిలని ఓ పది తీసింది.. ఇదిగో ఇలా
ఆఖరికి అమ్మాయిలు కాస్తా లేచి నాట్యం మొదలు పెట్టారు. ఈ నృత్యం నన్ను ఆకట్టుకుంది. ఎందుకంటే ఆద్యంతం పూర్తిగా కదలికలతో కలిగి ఎక్కడా ఆగకుండా ఓ పదినిమిషాల పాటు సాగింది. మెల్లగా మొదలైన ఈ నృత్య శైలి మంద్రస్థాయిలో సాతి ఆఖరికి ఉదృత స్థాయి చేరుకుంది. ఒక్క ఫొటో కూడా బాగా రాకపోవడాని ఇదీ ఒక కారణమే
ఇలా వాళ్ళు అక్కడ నాట్యం చేస్తుంటే నా ప్రక్కనే ఉన్న నెలల పాపకూడా ఆ సంగీతానికి ముగ్దురాలై చేతులు కాళ్ళు కదపడం మొదలెట్టింది.