24, ఆగస్టు 2011, బుధవారం

తెలుగుబాట లో పాలు పంచుకుందాం

telugubaata

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.


ఇది తెలుగు బాట లంకెలో  ఉన్న సమాచారం. కానీ దీనికి ఓ చక్కటి పుట వ్రాద్దాం అని ఆలోచిస్తూన్నంతలో నామాల మురళీధర్ గారు ఓ చక్కని లేఖవ్రాసారు. దానిని యధాతధంగా ఇస్తేనే నా మనసుకు తృప్తి.

 


ఆత్మీయులైన తెలుగుబ్లాగు మిత్రులకు,

e-తెలుగు సంస్థ తెలుగుబాటలో పాల్గొనవలసినదిగా సాదర ఆహ్వానంపలుకుతుంది. తామంతా పాల్గొనటమే కాక ఈ ఆహ్వానాన్ని మీమిత్రులందరితో పంచుకుని, తెలుగుబాటలో అత్యధికులు పాల్గొనటంలో మీసహాయాన్ని అందించవలసినదిగా కోరుతున్నాం.

 

అమ్మ అనే మాటతో మొదలయ్యి, నాన్న వేలు పట్టుకుని ఊ కొడుతూ, తాత పాడే పద్యాలను వల్లె వేస్తూ, బామ్మ చెప్పే కధలతో ఊహల రెక్కలు సంతరించుకునిమూర్తీభవించిన వ్యక్తిత్వాలని అందించిన కమ్మని అమ్మ తెలుగు.  లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లోచెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష తెలుగు. “దేశభాషలందు తెలుగులెస్స” అని పొరుగువారు కీర్తించిన కమ్మని భాష తెలుగు. అంత గొప్ప భాషకు, సంస్కృతికి వారసులమైన మనం మన అమ్మ వంటి భాషనేనిర్లక్ష్యం చేస్తున్నాం.  ఆంధ్రమహాభారతాలు, ఆంధ్రభాషాపదకోశాలు ఏనాడో అటకెక్కి చెదలుపట్టాయి. తెలుగుభాషకున్న అనంతమైన సాహితీ సంపదను భావి తరాలకి అందించే వారధులు కరువయ్యారు.కాస్తో కూస్తో మిగిలి, నోటిలో నానిన నీతిశతకాలకి ఇప్పుడు మనం మంగళంపాడేసాం. కారణం బ్రతుకుతెరువుకు అక్కరకురాని భాష అయిపోయింది తెలుగు.

 

జీవితమంటే కేవలం బ్రతుకుతెరువే కాదు. బ్రతుకు తెరువు చూపటం లేదని చెదలు పట్టించెయ్యడానికి భాష అంటే కేవలంఒక అక్షరమాల, గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం. ఆ జాతి జీవలక్షణం, అంతర్లీనంగా మెదిలే జీవశక్తి. అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగామిగిలిపోవటమే. మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్నిచాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమనిప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

 

తెలుగు ప్రజలందరినీచైతన్యవంతం చెయ్యటానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయసంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో అందరికీ వీలుగా ఉండేందుకుఆదివారం నాడు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. తెలుగు లలిత కళాతోరణంనుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువనుప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతఅందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటడానికి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మనభాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని మహోద్యమంగామారుద్దాం.


కృతజ్ఞతలతో,

e-తెలుగు.


ఎంత చక్కగా వ్రాసారో అనిపించి ఇక్కడ ఉంచుకుంటే, ఇలాంటి డ్రాఫ్ట్ నాకు మున్ముందు పనికి వస్తుందనిపించింది

1 కామెంట్‌:

Praveen Mandangi చెప్పారు...

నేను తెలుగు బాటకి వస్తున్నాను. వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి రిజర్వేషన్ చేశాను. వైటింగ్ లిస్ట్ లేకుండా కన్ఫర్మేషన్ అయిపోయింది.

 
Clicky Web Analytics