18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

1 కామెంట్‌:

Ramu S చెప్పారు...

బాగుందండీ,
మాది, నాది...నా భార్యది, కొత్తగూడెం. ఒక ఇరవై ఏళ్ల కిందట అక్కడ ఉన్నప్పుడు భద్రాచలం వెళ్లి వచ్చేవాళ్లం. చాలా రోజుల నుంచి మరొక్కసారి వెళ్లి రావాలని అనుకుంటూనే వెళ్లలేకపోయాం. మీ పోస్టు ద్వారా వెళ్లిరావాలని మరొకసారి గట్టిగా అనుకున్నాను.
థాంక్స్
రాము
apmediakaburlu.blogspot.com

 
Clicky Web Analytics