ఈ పోస్టు వ్రాయడానికి ముందు పైన చూపిన వీడియోని హరనాద్ గారు వారి బ్లాగులో ఉంచారు. నేను స్వతహాగా వీడియోలను చూడను. కానీ ఈ పోస్టు చూడటానికి ఒకటే కారణం ఆ పాట. మర్యాద రామన్న సినిమాలో నాకు నచ్చిన అంశాలలో ఈ పాట ఒకటి. అదేదో సినిమాలో మహేష్ బాబు ఎంట్రన్స్ కూరగాయల బండిపై చిత్రీకరించారు. ఆ స్టైల్లో తీసినదీ పాట.
మర్యాద రామన్న సినిమాపై నా రివ్యూ మరొ సారి వ్రాస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ కుర్ర గాంగ్ కూడా యమ చేసారు. బాగుంది వీరి క్రియేటివిటి. అన్నింటికన్నా నాకు నచ్చిన అంశం ఏమిటంటే.. ఈ పాట మధ్యలో ఒక్కసారిగా మన హీరోలు అమెరికా నుంచి ఆంద్రాలోని మురికి వాడలో కనిపించడం. అలాగే మరి కొన్ని సీన్లు. హాలీవుడ్ తీరులో తల్లక్రిందులుగా కొన్ని కొన్ని సీన్లను చిత్రీకరించడం సాంకేతుకంగా పెద్ద కఠినమైన పని కాకపోయినా, క్రియాత్మకతని దృష్టిలో ఉంచుకుంటే.. తలక్రిందులు అనే పదానికి ఈ విడియోలో బాగా కుదిరింది అని నా అభిప్రాయం.
ఈ మధ్య నాకు ఎదురైన కొంత మంది యువకులలో ఒకరిద్దరు వారి వారి భవిష్యత్ ప్రణాళికల పరంగా ఏమి అవుతావు అని అడిగితే సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పడం కొంచం విశ్మయానికి గురి చేసినా, ఇలాంటి వాళ్ళని చూస్తే వీరి ఆలోచనలు నిజమే అనిపిస్తుంది. అవును ఒక విషయాన్ని ప్రజెంట్ చెయ్యడానికి అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్స్ మాత్రమే అవ్వాల్సిన పనిలేదు. క్రొత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోగల అవగాహన ఉంటే చాలు అని నా అభిప్రాయం. ఇదిగో ఇలా.. వీరు నా స్టేట్‍మెంట్‍కి సాక్షాలు. వీరిలో ఏదో తెలియని ఫైర్ ఉంది. వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కనుక దీనిని చూస్తే వీళ్ళని పైకిరాకుండా తొక్కేస్తారు. ఈ విడియోలో నాకు మంచి డాన్స్ కనబడింది.. అలాగే వైవిధ్యమైన డైరెక్షన్ కనబడింది.. మరికొంత హ్యూమర్.. మొత్తానికి హాస్యభరితంగా పాటకు తగ్గట్టుగా ఉంది.
ఆ విధంగా టాలెంట్ అనేది ఎవ్వరో గుర్తించ వలసిన అవసరం లేదు, మనకి మనం ముందుగా తెలుసుకుంటే అంతే చాలు. వీరు గుర్తించి ప్రజెంట్ చేసారు. మన ప్రతిభని ముందుగా మనం తెలుసుకుంటే అందులోంచి క్రొత్తగా ఏదో ఒకటి ఉద్బవిస్తుంది. అలా ఉద్బవించినదే మనకి గుర్తింపుని తెస్తుంది. అంతే గాని మన టాలెంట్ ఎదుటివారు గుర్తించాలి అని మనం ఏదో ఒకటి చెయ్యకూడదు అని నేను నమ్ముతాను. ఏదో ఒకటి చెయ్య్ండి .. కానీ ఆ చేసేది క్రొత్తగా మీ స్వంత ఆలోచనతో మీదైన ఒక శైలిలో చెయ్యండి. అప్పుడు నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు. అదేదో ఆంగ్లంలో చెప్పినట్టు సెల్ఫ్ రియలైజేషన్ అన్నింటికన్నా ముందుండాలి అన్నట్టు, ముందుగా మీరు మీ టాలెంట్ ఏమిటో తెలుసుకోండి.
ఈ సందర్బంగా నాకు 7G బృందావన్ కాలని సినిమాలోని హీరో హీరోయిన్ గుర్తుకు వస్తారు. ప్రతీ వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అసలు సమస్య అంతా దానిని తెలుసు కోవడంలోనే ఉంది. దానిని తెలుసుకో గలిగితే, ఇక మనకి అడ్డు లేదు అని నేనంటాను. మరి మీరేమంటారు.