9, మార్చి 2009, సోమవారం

మహిళా దినం - ఇండాలు


ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్బంగా, ఓ వింత పేరడి చేసే ప్రయత్నంలో ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదని గమనించగలరు. ఇది ఒక తుంటర్వూ మాత్రమే అని బ్లాగు పూర్వకంగా తెలియ జేసుకుంటున్నాను.


మహిళా దినోత్సం సందర్బంగా ఓ సాధారణ మహిళని తుంటర్వూ చేస్తే ఎలా ఉంటుందని అనిపించి, ఆంద్ర ప్రదేశ్ లోని ఓ సాధరణ గృహిణిని కలిసాను. ఆవిడతో సాగిన తుంటర్వూ లోని కొన్ని ముఖ్యాంసాలు..

నేను : నమస్కారం.. మహిళ గారూ..

మహిళ : నమస్కారం భవదీయుడు గారూ.. అలా నిలబడ్డారే, కూర్చోండి ఇప్పుడే వస్తాను. లోపల డిక్కు డిక్కు టీవీ వారు నిర్వహిస్తున్న డొక్కు డొక్కు వంట అనే కార్యక్రమం వస్తోంది. అయ్యిన తరువాత వస్తాను

నేను : మరి ఇప్పుడు ..

మహిళ : ఆ అర్దం అయ్యింది, అక్కడ బ్రేక్.. ప్రకటనలు వస్తున్నాయి..

నేను : కాస్త మంచి నీళ్ళు ఇస్తారా!!

మహిళ : ఆ.. తరువాత బ్రేక్‍లో ఇస్తాను (హా!! మూర్ఛ వచ్చినంత పనైంది నాకు..)

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇవిగోండి.. మంచి నీళ్ళు

నేను : మంచిదండి. అదిసరే కానీయండి, ఇవ్వాళ్ళ మహిళా దినోత్సవం కదాండి.. (ఇంకా అనబోయ్యేంతలో..)

మహిళ : అయితే ఏమిటండి.. ఎవ్వరికి కావాలండి ఈ దినాలు?? ఇండాలు??

నేను : ఇండాలా!! అవేంటండి?

మహిళ : తద్దినం నాడు పెట్టేది పిండాలైతే, ఇలాంటి దినాల నాడు పెట్టేది ఇండం

నేను : అర్దం కాలేదండి కొంచం వివరించ గలరా..

మహిళ : అలాగే.. తద్దినం లోంచి ’తద్’ తీశేసారనుకోండి అది దినం అవుతుంది, అలాగే పిండం లోంచి ప తీసేయ్యండి.. అంతే.. అదే ఇండం

నేను : బాగుందండి, ఇక అసలు విషయానికి వద్దాం.

మహిళ : ఆ.. అదిగో బ్రేక్ అయినట్లుంది.. ఇప్పుడే వస్తాను..

నేను : !!!

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : హా.. ఇప్పుడు చెప్పండి..

నేను : మరి ప్రపంచం మొత్తం ఈ రోజున ఏవేవో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా!! మరి మీరు ఈ దినాన్ని ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు?

మహిళ : నాకు తెలియక అడుగుతాను, ఒక్క మాట సూటిగా సమాధానం చెప్పండి.. అస్సలు, స్త్రీలకంటూ ఒక రోజు కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్పండి?

నేను : అది కాదండి!! ఇది ఎప్పటినుంచో వస్తున్న అలవాటు కదా అని, ఏదో అడగ బోయ్యాను..

మహిళ : మహిళలకు ఒక రోజు అంటూ సంవత్సరం మొత్తం కాదని చప్పకనే చెప్పినట్లు చెబుతున్నారే..

నేను : అంటే, మీరు అపార్దం చేసుకుంటున్నారండి..

మహిళ : అపార్దం కాకపోతే మరి ఏమిటిది.. సంవత్సరానికి ఒక్క సారే నిర్వహించే తద్దినంలా, ఈ మహిళా దినం ఏమిటి?

నేను : అది .. సంవత్సరం లో ఒక్కసారే వచ్చే, ఒక పుట్టిన రోజు లాంటిది.. ఓ పెళ్ళి రోజు లాంటిది.. ఇంకా ఇలాంటి వాటిల్లాగానే ఇది కూడా..

మహిళ : మరి ఈ దినాన్ని .. మహిళా రోజు అనవచ్చు కదా..

నేను : అనవచ్చు ..

మహిళ : ఇప్పుడే వస్తా.. అక్కడ ప్రకటనలు అయినట్లున్నాయి

..

.. కొంత సేపయ్యాక ..

మహిళ : ఇందాకేదో చెబుతున్నారు..

నేను : అదండీ.. మీతో వాదిస్తున్నాననుకోకండి.. మీరి అలా ఆలోచించకుండా.. ఆగస్టు 15ని స్వాతంత్ర దినం అని.. అలాగే గణతంత్ర దినం.. ఇలా మరిన్ని ఉన్నాయి కదా.. వాటిల్ని మనం వక్ర దృష్టితో చూడడం దేనికి.. చక్కగా మంచిగా చూడవచ్చుకదా..

మహిళ : నిజమే అనుకోండి. నేను ఇండాక అడిగినట్లు.. ఇలాంటి దినం కావాలని ఏ స్త్రీ అడిగిందో చెప్ప గలరా!!

నేను : లేదండి..

మహిళ : నన్ను చెప్ప మంటారా.. ఇది కూడా మరో మగాడే సృష్టించి ఉండాడని నా గట్టి నమ్మకం

నేను : అయ్యుండ వచ్చు. ఏది ఏమైనా మహిళలకూ ఒక దినాన్ని కేటాయించడం ఎంతైనా మంచిదే కదా. ఈ విధంగా నైనా మహిళలకు ఒకరకమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది.. దాని ఆవశ్యకత ఎంత ఉందో అందరికీ తెలుస్తుంది.. (ఆవేశంగా ఇంకా అనబోయ్యేటంతలో..)

మహిళ : హల్లో భవదీయుడు గారూ.. ఒక్క నిమిషం .. మీరు నేల మీద ఉన్నారు.. ఆ విషయం మర్చి పోకండి. మీరు ఏ స్టేజీ ఎక్కి ప్రసంగం చెయ్యటం లేదు.. కాసిన్ని మంచి నీళ్ళు త్రాగండి

నేను : ..!!

మహిళ : అయినా మాకేం.. తక్కువందనీ మీరు అంత ఇదై పోతున్నారు. చక్కగా తిండి పెట్టడానికి మొగుడున్నాడు, చెత్తో బొత్తో .. మన టీవీలలో సెంటిమెంటు సీరియళ్ళకు కొదవ లేదు. పండగలో పబ్బాలో వచ్చాయంటే .. వచ్చే పోయ్యే చుట్టాలతో బాతాకాణీ కొట్టడానికే సమయం చాలటం లేదు

నేను : మరి ఆర్దిక స్వాతంత్ర్యం కావాలి కదా..

మహిళ : ఎవ్వరికి కావాలి?? మాకా!!! ఎందుకు? మాదగ్గర డబ్బులున్నాయి అనుకోండి, ఉన్నంత లోనే సర్దు కోవాలి. ఆ డబ్బులే లేవనుకోండి, నచ్చింది కొని పెట్ట లేదని కట్టుకున్న వాడిని చక్కగా పలు విధాలుగా రాచి రంపాన పెట్టేయ్యచ్చు. ఒకవేళ అడగంగానే కొని పెట్టారనుకోండి.. ఇంకేం పండగే, అడిగినప్పుడల్లా కొని పెడుతూనే ఉంటాడు అనుకోండి అంతకన్నా కావాల్సిందేముంది?

నేను : మరి మీ వ్యక్తిత్వం..

మహిళ : ఇంకే వ్యక్తిత్వం వికాశం.. అదేదో సామెత చెప్పినట్లు. అబ్బాయి సార్దకుడు అయ్యాడని ఎప్పుడు చెబుతామో చెప్ప గలరా..

నేను : .. అన్ని అవసరాలకు సరిపడేంత సంపాదించే చక్కని ఉద్యోగం ఉండి .. సుగుణవంతుడై..

మహిళ : అంతే కాకుండా.. స్తోమత కలిగిన కుటుంబం నుంచి ఆస్తిపాస్తులు గురించి మర్చి పోకండి..

నేను : హా!!

మహిళ : అలాగే ఓ అమ్మాయి సార్దకురాలు ఎప్పుడవుతుందో తెలుసా..

నేను : .. (ఇంకా ఆశ్చర్యం లోనే..)

మహిళ : పైన చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకున్నప్పుడు. అదే వ్యక్తిత్వం.

నేను : మరి మీకంటూ రుచులు .. అభి రుచులు..

మహిళ : అందుకేగా.. ఈ వంటా వార్పు… చక్కగా మాకు నచ్చినది చేసుకుంటాం.. ఆ రోజు నచ్చలేదనుకోండి.. చక్కగా బయట నుంచి తెప్పించుకుంటాం..

నేను : మరి మీ వారు ఒప్పుకుంటారా..

మహిళ : వారు ఒప్పుకునేది ఏముంది.. నాబొంద!! చేసిన వంటలో కొంచం ఉప్పు ఎక్కువ వేశాం అనుకోండి.. ఉప్పు ఎక్కువైందని ఓ నాలుగు కేకలేసి, వారే తెప్పిస్తారు. మొగుడు అనే మూర్ఖుడు ఉన్నది ఎందుకనుకున్నారు? ఉండండి.. అదిగో ప్రకటనలు అయ్యినట్లున్నాయి.. ఇప్పుడే వస్తాను..

..

.. కొంత సేపయ్యాక ..

నేను : మీరంటే పెళ్ళైన వాళ్ళు.. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ అభిప్రాయం ఏమిటో!!

మహిళ : అవునండీ.. నేనూ చూస్తున్నాను. పాపం.. అవన్నీ స్వయంకృతాపరాధాలు.. ఇలాంటి అత్యాచారాలు చేసే అబ్బాయిలను ఎలా గుర్తించాలి వాళ్ళనుండి ఎలా తప్పించు కోవాలి అనే విషయాలను ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాలి. ఆ పధాంలో ఇవ్వాళ సాక్షి ఆదివారం స్పెషల్ లో మన హైదరాబాద్ అమ్మాయి సానియా మిర్జా ఇంటర్వూని ప్రతీ అమ్మాయి చదవాలి. అందులో ఓ నూతన సంవత్సరం నాడు సానియాకు జరిగిన సంఘటన లో ప్రతీ అమ్మాయికి ఓ మంచి చిట్కా దాగి ఉంది.

నేను : అదేమిటో మీ మాటల్లో చెప్పగలరా..

మహిళ : ముందుగా ప్రతీ అమ్మాయి గుర్తు పెట్టుకోవల్సినది.. అమ్మాయి స్నేహితుల సంఖ్య కన్నా స్నేహితులు అనిపించుకునే అబ్బాయిల సంఖ్యే ఎక్కువ ఉండేటట్లు ఛూసుకోవాలి. చొంగ కార్చుకునే అబ్బాయిలే వాళ్ళ పాలిట వరం .. వారే వీరికి రక్ష. అప్పుడప్పుడు వీళ్ళ కళ్ళకు విందు కలిగించేలా, జెబ్బలు లేని జాకెట్లో లేక టీషర్ట్ ‍లో వేసుకుంటే చాలు.. అలాగే పొట్ట కనిపించే పొట్టి కుర్తాలో.. పిఱలు కనిపించేలా లోహిప్ జీన్సో వేసుకుంటే చాలు.. బెల్లం చుట్టూ ఈగల్లాగ చచ్చినట్లు మనచుట్టూ తిరుగుతూ మన బాడీకి జీతం లేని వాచ్ మెన్స్‍ గా ఉండి పెడతారు.

నేను : మరి పెళ్ళి విషయానికి వస్తే..

మహిళ : దానికి కొత్తగా వచ్చేదేముంది!! ఇందాక చెప్పినట్లు, ఆనీ ఉన్న ఓ బకరా గాడిని మన పెద్దలు ఎలాగో మనకు కట్ట బెడతారుగా.. ఒకవేళ మన పెద్ద వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ చప్పగా ఉన్నాయనుకోండి, మన చిరంజీవి గారి చిన్న కూతురు చేసినట్లు.. ఎవ్వడో ఒకడు గుడ్డిగా ప్రేమ దోమ అనకపోడు.. వాడితో ఎంచక్కా కొన్ని సంవత్సరాలు గడిపేయ్యవచ్చు. ఆ తరువాత నచ్చలేదనుకోండి, పుట్టిల్లు ఎలాగో ఉండనే ఉందిగా.. మన ప్రమోద్ మహాజన్ కొడుకు రాహుల్ మహాజెన్ భార్య స్వేత మనకి ఇలాంటి వాటిల్లో ఆదర్శం

నేను : మరి ఆ తరువాత భవిష్యత్తు??

మహిళ : ఏముంది మన హీరోయిన్ గౌతమీ చేసినట్లు, ఇద్దరు పెళ్ళాలను వదిలెసిన రెండో పెళ్ళి వాడైన కమల్ హాసన్ లాంటి వాడు దొరక్క పోడు.. వాడి వల్ల గౌతమీ ఈ మధ్య తల్లి కాబోతోందని పుకారు.. అలా ఏదో ఒక అక్రమ సంబందం సక్రమం కాకపోదు. ఇలాంటి వాటిల్లో మన రేణుకా దేశాయ్ ని చూడండి. చక్కగా కలసి కాపురం చేసుకుని పిల్లల్ని కని వాళ్ళ పేరు మీద శుభలేఖలు కొట్టించేయ్యచ్చు. ఇంత స్వాతంత్ర్యంగా మేము బ్రతికేస్తుంటే.. మాకేదో పెద్ద నష్టం జరిగి పోతున్నట్లు ఏదేదో వాగేస్తున్నారే..

నేను : అంటే మీ ఉద్దేశ్యంలో మహిళా దినోత్సవం అక్కరలేదంటారా..

మహిళ : వద్దని అనను కానీ మరీ ఒక్కరోజే పెట్టే బదులు సంవత్సరంలో కనీసం ఓ ఆరు నెలలు మాకంటూ కేటాయిస్తే బాగుంటుంది అంటాను..

నేను : ఇచ్చాం.. అనుకోండి.. ఏమి చేస్తారు?

మహిళ : నేను చేసేది ఏముంది.. అస్సలు.. మహిళా దినం అనేది ఒకటి కావాలి అనే మహిళలను అడగండి వాళ్ళు చెబుతారు

నేను : కనుక చదివే చదువరులందరికీ ఒక విన్నపం. మహిళా దినం అనేది ఒకటి కావాలా?? దాని ఆవశ్యకత ఏమిటో? అలాంటి దినం వల్ల మీరు సాధించేది ఏమిటో? అలాంటి రోజుని ఒక పండుగగా ఎందుకు చేసుకోవాలో సదురు మహిళకు తెలియ జేస్తారని మనవి

మహిళ : ఏంటీ మీ బ్లాగుని మహిళలు కూడా చదువుతారా!!

నేను : అవునండి

మహిళ : చూద్దాం!!! మీ మహిళా బ్లాగర్లు ఏమి చెబుతారో..

నేను : అంతైనా.. అదేదో పాటలో చెప్పినట్లుగా.. ఆడాళ్ళూ!!! మీకు జోహార్లు..

మహిళ : ఏయ్!! ఏంటి!! అప్పుడే మమ్మల్ని ఫోటోలో పెట్టి గోడ కెక్కించేస్తున్నారు

నేను : నేనా..

మహిళ : కాదా మరి .. జోహార్లు ఎవ్వరికి చెబుతారు!!


ఈ పుటని హాస్యస్పదంగా తీసుకుంటారని ఆశిస్తాను.

7 కామెంట్‌లు:

జీడిపప్పు చెప్పారు...

హ హ్హ హ్హా భలే రాసారు.. errr.. వ్రాసారు మహిళల దినం గురించి. ఈ "దినా"ల గురించి మరిన్ని వ్రాయండి.

కొత్త పాళీ చెప్పారు...

good show! :)

సుజాత వేల్పూరి చెప్పారు...

నిజంగానే చాలా సరదాగా ఉంది టపా!

ఓ బ్రమ్మీ చెప్పారు...

జీడిపప్పు గారు,
ప్రయత్నిస్తాను.

శంకరగిరి గారు,

స్పందించినందులకు నెనరులు.

సుజాత గారు,

ఈ పుట వెయ్యడానికి ఎంత కలవర పడ్డానో.. మహిళా లోకం నన్ను దుమ్మెత్తి పోస్తుందనుకున్నాను. ఇంత వరకూ అంతా ఊరుకుని ఉన్నారంటే ఏదో పెద్ద ప్రళయమే వచ్చేట్టుంది. ఏది ఏమైనా సరదాగా తీసుకుని స్పందించినందులకు నెనరులు

నీహారిక చెప్పారు...

మీరు అన్నీ నిజాలే వ్రాసారు.వార్నీ... మగవాళ్ళెంత తెలివిమీరిపోతున్నారు అని హాశ్చర్యపోవడంతో మానోట మాటలు రావటం లేదు. మీరు ఇలాటివన్ని నేర్పేసి మా నోట మట్టి కొట్టకండి.

Malakpet Rowdy చెప్పారు...

Too Good! LOLZ

అజ్ఞాత చెప్పారు...

సూపర్!

 
Clicky Web Analytics