1, మార్చి 2009, ఆదివారం

బ్లాక్ – ద కలర్ ఆఫ్ మ్యూసిక్

ETV వారు నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాలలో శీర్షికలో తెలియజేసిన పేరు మీద ఒక కార్యక్రమం ప్రతీ శని వారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రసారమౌతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, పాడే వాళ్ళంతా అంధులే. ఆఖరికి వీరిని మరియు వీరి ప్రతిభా పాఠవాలని బేరీజు వేసే న్యాయ నిర్ణేతలలో ఒక్కరు కూడా అంధులే అంటే నమ్ముతారా. ఇక అసలు విషయానికి వస్తాను.

ఈ కార్యక్రమానికి ఝాన్సి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటే, సినీ నటి లయ మరియు సినీ గేయ రచయత అనంత్ శ్రీరామ్ మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. మూడో న్యాయనిర్ణేత మురళీ కృష్ణ గారు ఎవ్వరో నాకు అంతగా తెలియదు, కావున వారి గురించి ప్రస్తావించడం భావ్యం కాదు. ఈ పుట ప్రచురించడనికి ప్రేరేపణ మన హీరోయిన్ లయ గారు. ఈవిడ చేసే కామెంట్లే నన్ను ఈ పుట వ్రాయడానికి ప్రేరేపించాయంటే నమ్ముతారా.. అలాగే వీటికి తోడుగా క్రిందటి వారం కార్యక్రమంలో నిష్క్రమించిన తేజాలక్ష్మి అనే అమ్మాయి మాట్లాడిన తుది పదాలు నన్ను లోలోపల్నుంచి .. (అంటే గుండె లోతుల్లోంచి అన్న మాట..).. .. .. .. .. .. .. .. … .. .. ఏమి వ్రాయాలో మాటలు రావటం లేదు. ఎక్కువ సుత్తి వెయ్యకుండా .. ఆమె మాటలు యధా విధిగా…

ఝాన్సి : తేజా లక్ష్మి.. మరి ఈ ఎపిసోడ్ నుంచి నువ్వు ఎలిమినేట్ అయ్యవు. ఇక్కడితో నీ ఈ ప్రయాణం ఆగి పోతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు!!!???

(ఏమిటిది అడగడం??? ఎంత సీనియర్ యాంకర్ అయితే మాత్రం ఓడిపోయిన వాళ్ళని అడిగే ప్రశ్నేనా ఇది?? ఏదో కప్పు గెలిచావు అన్న లెక్కలో ఓడిపోయ్యావు ఎలా ఫీలవుతున్నావు అని అడుగుతావా అనిపించింది. అందునా మామూలుగా ఉండే వాళ్ళను ఏదైనా కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు అడిగితే వారు ఎంత భాద పడుతూ కంట నీళ్ళు పెట్టు కుంటారో చాలా కార్యక్రమాలలో చూస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి అందునా చూపు లేని ఈ పిల్ల ఎలా స్పందిస్తుందా అని భాద పడుతూ.. దేవుడా !!! ఈ పిల్లని ఏడ్పించకు అని మనసులో మ్రొక్కుకుంటుంటే.. ఈ అమ్మాయి స్పందన ఈ క్రింది చిధంగా ఉంది)

తేజా లక్ష్మి: గెలుపుని ఎంతగా ఆస్వాదించానో ఓటమినీ అంత ఆస్వాదిస్తున్నాను. రెండింటిల్లో పెద్ద తేడా ఏమీ లేదు..

ఇలాంటి స్పందన విన్నందుకు నాకు ఎగ్గిరి గెంతెయ్యాలనిపించింది. ఎంతో పరిపక్వం చెందిన వ్యక్తిత్వం నాకు ఆ మాటల్లో కనబడింది. ఇలాంటి కార్యక్రమాలనుంచి వైదొలుగుతున్న వారు తప్పని సరిగా కంట తడి పెట్టుకోవడం మనకు సర్వ సాధారణంగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది, అంధు రాలైన తేజా లక్ష్మి కొంచం కూడా తొణకకుండా, బెదర కుండా, ఎంతో గొప్ప మనసుతో ఎటువంటి భాధ కనబడ నీయ్యక ఇచ్చిన సమాధానం నన్ను మంత్ర ముగ్దుడ్ని చేసింది.

ఇక మన హీరోయిన్ లయ గారి విషయానికి వస్తే, ఈ పుట వ్రాసే సమయానికి జరిగిన కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తనలో కొంచం పరిపక్వం కనబడుతోంది. అంతకు ముందు ఎపిసోడ్‍లలో న్యాయ నిర్ణేతగా వీరి ప్రవర్తన చాలా అసందర్బంగా సాగింది. ఎలా అంటారా!! కళ్ళు లేని లోకాన్ని ఒక్క సారి ఆలోచించ కోండి. అలాగే హావ భావాలకు ప్రధానం కళ్ళు. అట్లాంటి కళ్ళతో మనం తెలియకుండా ఎన్నో విషయాలను ఎదుటివారికి తెలియ జేస్తుంటాము. కధాకళి నాట్యానికి ప్రాణం ఈ కళ్ళు మరియు వాటితో పలికించే అనేక భావాలు. కళ్ళు ఉన్న మనకే ఒక్కొక్క సారి ఎదుటి వారిని అనుకరించడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది కళ్ళతో చూడకుండా ఎదుటి వారిని అనుకరించాలంటే అందునా ఎదుటివారి మాటల్ని మాత్రమే వింటూ యధావిధంగా పాడాలి అన్నది ఎంత వరకూ సుళువో ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.

ఇంత కష్ట తరమైన కళలో వీరి వంతు కృషి వీరు చేస్తూ చాతనైనంత బాగా పాడాలనే ప్రయత్నం చేస్తుంటే, మన హీ(జీ)రోయిన్ లయ గారు అందరు గాయకులకు ఒకటే స్టాండర్డ్ కామెంట్.. ఏమిటంటే.. మీరు పాడిన పాటలోని ఫీలింగ్ మిస్ అయ్యినట్లు ఉంది. మీరు కొంచం బాగా పాడొచ్చు. ఎక్స్ ప్రషన్ ఇంకా ఉంటే బాగుంటుంది.ఎక్స్ ప్రషన్ విషయంలో కొంచం ఎక్కువ శ్రద్ద తీసుకోండి

ఇట్లా ఈవిడ గారి స్పందనలు సాగుతింటే.. నామనసులో ఈ క్రింది విధంగా అనిపించింది.

తొక్కలో ఎక్స్ ప్రషన్.. అస్సలు చూపే లేని వారికి ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? ఒక వేళ తెలిసిందనుకుందాం, కళ్ళు లేని వారికి సదురు పాటను పాడిన వారి ఎక్స్ ప్రషన్ ఎలా కనబడుతుంది? నవ రసాలలోని హాస్యం మరియు విషాదం తప్ప మరేమీ తెలియని అంధులకు మిగిలిన రసాలను ఎలా అర్దం చేసుకుంటారు? ఒక వేళ అర్దం చేసుకున్నా వాటిల్ని ఇలా వ్యక్తం చేయ్యాలని ఎలా తెలుస్తుంది? ఈవిడగారు నటించేటపుడు ప్రతీ షాటు ఎన్ని సారు రీటేక్‍లు చేసేదో ఈవిడగారు మర్చి పోయినట్లున్నారు. న్యాయనిర్ణేతగా వచ్చేటప్పటికి ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో తెలియకుండా.. ఆ స్థానానికి తగ్గ హుందాతనంతో ప్రవర్తించ కుండా ఇలాంటి కామెంట్లు చేస్తే.. పాడాలనే హుషారు ఉన్న గాయకులకు సదురు ’ఎక్స్ ప్రషన్’ అంటే ఏమిటో తెలియక నిరుత్సాహ పడిపోరా? ఈ విషయం మన హీ(జీ)రోయిన్ గారికి ఎలా తెలుస్తుంది?

ముగించే ముందుగా మఱో విషయం. ఇక్కడ పాడే వారిలో కొంత మంది పాట పాడుతూ హుషారుగా పాటలో ఎంతగా లీనమై పోతున్నారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఝాన్సీ వీరిని తీసుకు వచ్చి కెమెరా ముందు నిలబెడితే, పాటలో లీనమై పోయి పాడుతు పాడుతూ వీరు మఱో ప్రక్కకి తిరిగిపోతూ ఉంటుంటే ప్రక్కనే న్రుంచున్న ఝాన్సీ వీరిని మళ్ళీ కెమెరా వైపుకు త్రిప్పాల్సి వస్తోందంటేనే అర్దం అవుతోంది వీరు ఈ పాటలను ఎంతగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పాడుతున్నారో. ఈ చిన్ని విషయం మన లయగారికి అర్దం అయినట్లు లేదు. ఇంతక ముందు ఈవిడ గారి మీద ఉన్న గౌరవం కాస్తా ఇట్లాంటి స్పందనలతో తుడిచి పెట్టుకు పోయింది.

ఏది ఏమైనా మీకు వీలైతే తప్పని సరిగా మీరు చూడదగ్గ కార్యక్రమం. మీరు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగిందా.. మరి మీస్పందనలు ఏమిటో నాతో పంచుకుంటారా?

అంత వరకూ సెలవు,
ఇట్లు,
భవదీయుడు

5 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

నిజమేనండీ ! బ్లాక్ నేనూ చూస్తాను .నా మనసులోని భావాలే మీరు టపాలో రాసినవి .అన్ని అవయవాలూ సవ్యంగా ఉండీ తర్వాత అవకాశాలోచ్చే చాన్స్ ఉండీ కూడాఎలిమినేషన్ టైంలో కొంతమంది స్టేజ్ మీద ప్రవర్తించే తీరు విసుగనిపిస్తుంది .వీరెంత హుందాగా ప్రవర్తిస్తున్నారో చూసైనా నేర్చుకుంటే బావుండును .

అజ్ఞాత చెప్పారు...

యాంకర్లు, జడ్జిలు ఎలా ఉన్నా, ఇంత మంచి కార్యక్రమం చూపిస్తున్నందుకు ఈ టి వి వారిని అభినందించాలి.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నిజమే...మీరన్నట్టు ఝాన్సి లాంటి ఒక సీనియర్ వ్యాఖ్యాత ఎలిమినేట్ అయిన వారిని అలా అడగకూడదు.
చాలా సార్లు నాకు విన్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఈ కార్యక్రమం గురించి మీ వంతు ప్రచారం చేస్తున్నందుకు మీరు అభినందనీయులు.

బ్లాక్ కార్యక్రమం పై గతంలో నేను రాసిన టపాను మీరు ఒక సారి వీలయితే చూడగలరు.
http://eti-gattu.blogspot.com/2009/02/blog-post_03.html

బుజ్జి చెప్పారు...

I also felt the same thing abt jhansee.. check

http://blaagu.com/bujjikanna/category/టీవీ/page/2/

అజ్ఞాత చెప్పారు...

నిర్ణేతలలో ఒక్కరు కూడా - నిర్ణేతలలో కూడా ఒకరు అంధులే...; ఏదో టైపోనే ఐతే ’వాకే’లెండి.మీకెంత తెలుసో నాకు తెలీక చెప్పాను.

బావుంది.ఐనా ఇది ఆ గుడ్డిగా ,గుడ్డి పాత్రని చేసి, గుడ్డొచ్చి చేలో పడ్డట్టు అవార్డ్ కూడా కొట్టేసిన లయమీద మీకున్న లవ్ (హేట్) అని తెలిసాక,ఇక చెప్పగూడదు కానీ...

అంధులకి నవరసాలు తెలుస్తాయి అని నా కనిపిస్తుంది; ఎవరితో ఐనా తిరిగి తెలుసుకొని అప్పుడు చెప్పండి.

ఇంకోటి..మీ ప్రొఫైల్.. ఆయా వయసులకు, ఆయామనసులతో..టైపులో రాసారు; అది బావుంది. మారతాము అని తెలియడం చాలా ఇంపార్టెంట్;

కానీ, మన వయస్సు ఎలా ఉన్నా,ఆయా పాత్రల వయస్సులు, మనస్సులు, కాలాలు , ప్రదేశాలు వేరుగా ఉంటే,మీరు అవి చూడగలిగి అలా రాయగలిగితే,చెప్పేదాంట్లో అందరి దృష్టి వచ్చి సృష్టికర్త ద్రష్టగా భావించ బడతాడు.ఇదేదో రాసే ’దూలతో’ పడింది ఈ లైను; భౌతికంగా ఉండనీయండి; కానీ మీ మనసుతో ఈ లైను వదిలేయండి. :) ; ఇంతకీ నిన్న నేను పండంటి సూత్రాలు ఓ ఐదు రాసాను,ఏవవి!? నాదగ్గర కాపీ కూడా లేదు..నా బ్లాగులో అన్నా వేసుకోవడానికి.

 
Clicky Web Analytics