30, డిసెంబర్ 2008, మంగళవారం

e-తెలుగుతో నా అనుబంధం - మొదటి భాగం

హైదరాబాదులో ఈ మద్య జరిగిన పుస్తక ప్రదర్శన గురించి అందరికీ తెలుసు, కాబట్టి నేను కొత్తగా చెప్పొచ్చేది ఏమీ లేదు. కానీ ఇక్కడ నేను ప్రస్తావించే విషయలు e-తెలుగు సంఘం గురించి, అలాగే e-తెలుగు సంఘం తో నాకు ఉన్న అనుభవం గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. రాబోయే రెండవ భాగంలో పుస్తక ప్రదర్శనలో e-తెలుగు సంఘం యొక్క కార్యకలాపాలలో నా వంతు కృషి ఏమిటి? ఎలా? ఎందుకు? వంటి పలు విషయాలు ప్రస్తావిస్తాను.

నేను కాలానుగుణంగా మారుతూ ఉన్నాను అనేందుకు సాక్షమే ఈ పుట. నా ప్రవర్తనకి నేను ఎవ్వరికీ జవాబుదారీ కాక పోయినా, నా మటుకూ నేను ఎంత నిస్పక్షపాతంగా ఉన్నానో అని నేను తెలుసుకునే క్రమంలో వెలువడినదే ఈ ప్రచురణ. ఈ పుటకి ఉన్న శీర్షిక ఏమాత్రం సరిపోక పోయినా, రెండవ పుటకి ఇది ఉపోద్ఘాతం.

ఈ బ్లాగు నందు కొంచం సీరియస్ గా అనిపించే విషయాలు ప్రస్తావించినా, మరోవైపు సరదాగా ఉండేందుకు మొదలు పెట్టిన బ్లాగు, ’ఉబుసు పోక..’. దీనికి ముందు నేను ఎక్కువగా e-తెలుగు సైటు నందు చలాకీగా పాలు పంచుకుంటూ ఉండేవాడిని. ’అందరూ చేస్తుండగా లేంది మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం..’ అంటూ మొదలు పెట్టిన బ్లాగే ’ఉబుసు పోక..’. ఇదిగో అలా అలా కాల క్రమేణంలో నేను భవదీయుడుగా రూపాతరం చెందిన ఉదంతం జగద్విదితమే. నాకు తోడుగా, నా సహధర్మచారిణి తన మనసులో మాటగా మొదలు పెట్టి, మహిళా బ్లాగర్లాందరి నుంచి పొందిన ప్రోత్సాహంతో, ఇదిగో ఇప్పుడిప్పుడే తన ఊసులు నలుగురితో పంచుతోంది. అప్పట్లో మా దగ్గరే ఉంటున్న మా అమ్మ కూడా ’ఒక సగటు భారత నారి ఆలోచనలు..’ అంటూ తన అభి ప్రాయాలు ప్రచురించడం మొదలు పెట్టింది. కానీ ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా విజయవాడలో ఉండటం వలన కొంత కాలం తరువాత తను తిరిగి తన బ్లాగు ప్రపంచంలోకి అడుగిడుతుంది.

ఇన్ని బ్లాగులకు ప్రేరితమైన తెలుగు ప్రియులకు ఆలవాలమైన e-తెలుగు సంఘం గురించి మరో పుటలో నా అనుభవాలతో కలుస్తాను, అంతవరకూ

సెలవు,

ఇట్లు,

భవదీయుడు

కామెంట్‌లు లేవు:

 
Clicky Web Analytics