దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.
మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?
ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.
ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.
వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.
ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.
మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??
గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.
ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.
ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..
చదివి తెలుసుకోవాలి..
విని తెలుసుకోవాలి..
అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..
ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.