26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ

భారత దేశం నా మాతృభూమి. భారతీయులు అందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. శుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

 

ఇలా చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకము. ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికైనా ఇది గుర్తుందా?? ఇలా ఏ పాఠశాలలోనైనా పదిమంది చేత చెప్పిస్తున్నారా??(డౌటే) ఇందులో మార్పు చెయ్యాల్సిన విషయాలు ఏమిటబ్బా!! మరోసారి ఆలోచిస్తాను. అంతవరకూ .. జైహింద్.

24, జనవరి 2011, సోమవారం

రిపబ్లిక్ డే వచ్చేసిందోచ్.. బ్లాగర్లకు విన్నపం

రిపబ్లిక్ డే పరంగా పాఠశాల రోజులలో (అంటే చదువుకునే రోజులలో అని చదువుకో మనవి) మేము చక్కగా జరుపుకునే వాళ్ళము. నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి నేను విజయవాడ SKPVV హిందూ హైస్కూల్ విధ్యార్ధిని. అలాగే మేము బావాజీ పేట మొదటి లైన్లో ఉండే వాళ్ళము. నాన్నగారు విజయవాడ రైల్వేస్టేషన్‍లో పని చేసే వారు. వారి ఉద్యోగరీత్యా ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్ళే వారు. నాకు మ్యూజికల్ కళాశాలలో నాట్యభ్యాశం ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా ఇంటికి చేరుకునే వాడిని. అలాంటి రోజుల్లో నాకు బాగా గుర్తున్న కొన్ని సంఘటనలలో ఒకటి నాన్నగారితో వెళ్ళి కూరగాయల మార్కెట్‍కు వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చేవాడిని. కూరగాయలి కొనిచ్చి నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళేవారు. ఆలా మార్కెట్ నుంచి వచ్చిన తరువాత అమ్మ పెట్టిన పెరుగన్నం తిని ఝాం ఝాం అంటూ స్కూల్‍కి పరిగెత్తే వాడిని. అదిగో అలాంటి రోజుల్లో మరొకటి ఈ రిపబ్లిక్ డే రోజు.

స్వతహాగా మా పాఠశాల నిభందనల ప్రకారం ఆకు పచ్చ లాగు అలాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగే నాట్యాభ్యాసానికి తెల్ల పైజామా పై తెల్ల కుర్తా వేసుకుని వెళ్ళే వాడిని. కానీ ఒక్క రిపబ్లిక్ డే నాడు మాత్రం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వైట్ అండ్ వైట్ అన్న మాట. అలా తెల్ల డ్రస్ వేసుకుని చాలా మంది వచ్చే వాళ్ళు కానీ నేను మాత్రం తళతళ మని మెరుస్తూ ఉండే వాడిని. ఎందుకంటారా.. తెల్ల లాల్చి కుర్తా డ్రస్‍పై మా అమ్మ చాలా శ్రద్ద తీసుకునేది. ఎందుకంటే ఇది భరతనాట్యం నేర్చుకునేటప్పుడు వేసుకునే డ్రస్ కదా అందుకన్నమాట. మా అమ్మకు నాట్యం అంటే ఎందుకో తెలియని అభిమానం. అందువల్ల స్కూల్ విధ్యార్దులందరిలో నేను కొంచం స్పెషల్‍గా కనబడే వాడిని. అలా మెరుస్తూ ఉండటం వల్ల మా హెడ్ మాస్టారు గారు ఆ నాటి ప్రతిజ్ఞని నా చేత చదివించే వారు. అలా అలవాటైన ప్రతిజ్ఞా కార్యక్రమం ఇంటర్ మీడియట్ కాలేజీ రోజుల్లో కొనసాగినా, డిగ్రీ రోజుల్లో సాగలేదు. అందుకు కారణం నేను చదువుకున్నది ముస్లిం కాలేజీ. అక్కడ ఇలాంటివి పాటించేవారు కాదు.

కానీ ఉద్యోగ భాధ్యతలు వచ్చిన తరువాత నేను చొరవ తీసుకుని ఈ రోజున అక్కడ పని చేసే వారిలో ఔత్సాహికులను ఓ చోట చేర్చి జండా వందన కార్యక్రమం చేసే వాడిని. పోను పోను ఔత్సాహికులు తగ్గిపోవడం వల్ల రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే ఒక సెలవు రోజుగా మాత్రమే మిగిలిపోయింది కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగటం లేదు. కనీసం ఆ నాడైనా బ్లాగర్లు అందరూ ఓ పోస్టు వేస్తే బాగుంటుందని నా ప్రపోజల్. చదివే వారు ఏమంటారు?

13, జనవరి 2011, గురువారం

సంక్రాంతి సంబరాలు – అ!!!

సంక్రాంతి సంబరాలు ఈ మధ్య సన్నబడుతున్నాయనిపిస్తోంది, ఎందుకో జనాలు సంక్రాంతి అంటే ఒక సెలవు రోజు మాత్రమే అనుకుంటున్నారు తప్ప ఒక సంస్కృతి అనుకోవటం లేదు అనిపిస్తోంది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక కట్టెల అడితి ఉండేది, దాని చుట్టూ రాత్రంతా మేము కాపు కాచే వాళ్ళము. ఎందుకంటే, ఎవ్వరైనా దొంగలు వచ్చి దుంగలు పట్టుకుపోకుండా చూస్తే మాకు పొద్దున్న కొన్ని దుంగలు ఊరికినే ఇచ్చేవాడు ఆ కట్టేల అడితి ఓనర్. అలా తెచ్చుకున్న దుంగలను రోడ్డు మధ్యలో వేసి కాల్చి వేడి నీళ్ళు కాచుకునే వాళ్ళం. అలా కాచిన నీళ్ళతో తల స్నానాలు. ఇవన్నీ భాగ్యనగరంలో కనబడటం లేదు. ప్చ్.. చూడబోతే ఇది కూడా కొద్ది రోజులకి దేశభక్తిలాగా తయ్యారవుతుందేమో!!

11, జనవరి 2011, మంగళవారం

ఈ నాటి ప్రత్యేకత

హల్లో..

ఈ నాటి ప్రత్యేకతేమిటో తెలుసా.. అదేనండి. ఇవ్వాల్టి తేదీలో దాదాపు అన్నీ ఒకట్లే!! ఎలా అంటారా.. ఇదిగో ఇలా

ఒకటో నెల - 1

పదకొండో రోజు - 11

పదకొండో సంవత్సరం - 11

అదే గనుక పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకన్లకు ..  11:11:11 am అవుతుందన్నమాట. సొ ఫైనల్‍గా చెప్పొచ్చేదేమిటంటే,

11/1/11 తారీకున 11:11:11 am సమయ్యాన్ని ఇప్పుడు మీరు మిస్ అయితే, మరో పది నెలలు ఆగండి. అప్పుడు ఇలాంటిది మరొకటి వస్తుంది. అదేనండి నవంబర్ నెలలో కూడా రెండు ఒకట్లు ఉన్నాయి కదా.. ఇప్పుడు మిస్ ఆయిన శుభం మీకు 11/11/11 తేదీన 11:11:11 am సమయంలో తప్పకుండా జరగాలని కోరుకుంటూ ..

సెలవ్

 
Clicky Web Analytics