14, అక్టోబర్ 2008, మంగళవారం

ఎందుకీ స్తబ్తత?

 

రోజూలాగే ఈ రోజు మొదలైందనుకున్నాను. కానీ ఏదో తెలియని నిస్సత్తువ. మనసంతా ఒక్కసారే శూన్యమైపోయింది. ఏమి చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో నాకే అర్దం కావటం లేదు. రోజూ లాగే, ఉదయానే లేచి కాలకృత్యలతో పాటుగా స్నానం అయ్యిన తరువాత అన్నం వండుకున్నా.. ఆఫీస్ లో తినడానికి కారియర్ సద్దుకున్నా.. ఆపిల్స్ తిన్నా.. సాయంత్రానికి బ్రెడ్ జామ్ మూట కట్టుకున్నా.. అంట్లు తోమి ఆరబెట్టాను. ఇన్ని చేస్తున్నా.. ఏదో శూన్యం .. యాంత్రికంగా చేసేస్తున్నా. నా ప్రమేయమేమీ లేకుండా అన్ని జరిగి పోతున్నాయి. అప్పుడు గుర్తుకొచ్చింది. చక్కగా కర్ణాటక సంగీతం వినవచ్చు కదా అని. అన్నదే తడవుగా esnips నుంచి దించుకున్న పాటలు గుర్తుకొచ్చాయి. ఏమ్ ఎస్ సుబ్బలక్ష్మి.. బాల మురళీ.. వంటి ఎందరో మహానుభావులు పాడిన గీతాలు అక్కడ ఉచితంగా దొరుకుతున్నాయి.


చూసారా.. ఇప్పుడు కూడా ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో పోతున్నా.. దిశ నిర్దేశం లేకుండా.. ఏమిటిది.. ఎందుకిలా జరుగుతోంది. అప్పుడెప్పుడో ఒకసారి నాలోని ఆలోచనలన్నీ ఒక్కసారిగా కట్ట కట్టుకుని మూట ముల్లె సర్దుకుని నానుంచి నన్నడగకుండా సెలవు తీసుకుని వెళ్ళిపోయాయి. ఎంతో కష్టపడి.. ఎన్నో వ్యయ ప్రయాశలకు తలలొగ్గి తిరిగి మామూలు స్తితికి వచ్చేటప్పటికి తలలోని ప్రాణం కాస్తా తోకలోకి వచ్చినంత పనైంది. మరి ఇప్పుడేంటి?? ఆలోచనలే కాదు.. మొత్తం భవిష్యత్తంతా శూన్యంగా తోస్తోంది. నాకు తెలిసినంత వరకూ వైరాగ్యాలు నాలుగు రకాలు. శ్మసాన , శృంగార, భక్తి మరియు ప్రసవ సమయాల్లో కలిగే భావనలే ఆ నాలుగు రకాలు, అని చిన్నప్పుడెప్పుడో మాతాతయ్య గారు చెప్పగా విన్నట్లు గుర్తు. తప్పైతే సరిదిద్ద గలరు. ఇప్పుడు నేనున్న పరిస్తితి వైరాగ్యమా!!! అయితే ఎలాంటిది? అర్దం కావటం లేదే..


అయిన వాళ్ళకి దూరంగా ఉన్నందునా ఈ స్తబ్తత? కానీ వృత్తి లేనిదే భుక్తి గడవదుకదా.. వృత్తి ధర్మం ముఖ్యమా !!! ప్రవృత్తి ముఖ్యమా!! ఏది ఆలోచించుకోవాలి.. ఏమిటిది? నాలో ప్రశ్నలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి? అన్నీ ఉన్నా ఏమీ లేని భావనను ఏమనుకోవాలి? ఇది నాకేనా.. ఇలాంటి భావన నాకే ఎందుకు కలుగుతోంది? నాలో ఏమి లోపించింది? అందరిలాగా నాలో ఉండాల్సిన భావ రాగ ద్వేష కోప తాపాలు ఎక్కడికి పోయ్యాయి? ఈ శూన్యం నన్ను ఎక్కడికి తీసుకు పోతోంది?

 

హమ్మో ఇన్ని ప్రశ్నలే.. వీటిలో దేనికైనా మీ దగ్గర బదులున్నట్లైతే, విన్నవించి ఆదుకో గలరని మనవి.
ఇట్లు
భవదీయుడు

1, అక్టోబర్ 2008, బుధవారం

బంధం - సంబంధం - అనుబంధం | అమెరికాలో నా ఆలోచనలు

ఈ పుట వ్రాద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏవేవో కారణాంతరాల వల్ల ఎప్పటికప్పుడు దాటేస్తూనే ఉన్నాను. ఇక లాభంలేదని ఇదిగో 23వ తారీఖున మొదలు పెట్టాను. చూద్దాం ఎప్పటికి అవుతుందో.. ఇదిగో ఇవ్వాళ్టికి పూర్తి అయ్యింది.

 

అస్సలు విషయానికి వస్తే.. ఆఖరుగా అనుబంధం గురించి వ్రాద్దామనుకున్నా కదా.. ముందుగా కొంత ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతానికి చరిత్ర దగ్గర దగ్గరగా ఓ పాతికేళ్ళు ఉంటాయనుకోండి. అంటే నేను దాదాపుగా పది పన్నిండేళ్ళవాడిని అన్నప్పుడన్న మాట. అన్ని సంవత్సరాల క్రిందటి విషయానికి ప్రస్తుత కాలానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. చదివే మీరే ఆలోచిస్తుంటే.. గత నెలరోజులుగా నన్ను భరిస్తున్న వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

 

పాతికేళ్ళ క్రిందట, ’అక్కా’ అనిపించుకున్న పాపానికి, ఇక్కడ (అంటే అమెరికాలో) గత నెలన్నర నుంచి నన్ను మరియు నా చేష్టలను భరించ వలసి వచ్చిందంటే, వాళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందో .. ఆ పరిస్థితిని మీ ఊహాతీతానికి వదిలేస్తాను. ఇక్కడ పేరులు అంత సమంజసంగా ఉండదేమో అని ప్రస్తావించడం లేదు, కానీ చిన్నప్పుడు నేను భరతనాట్యం నేర్చుకునేటప్పుడు, మా ఇంటికి దగ్గరలోనే ఉండే మరో సహ విద్యార్ధినితో కలసి సంగీత కళాశాలకు వెళ్ళేవాడిని. నేను తనకన్నా చిన్నవాడిని అందులోనూ ఆ అమ్మాయికీ నా వయస్సు తమ్ముడు ఉండటంతో వాళ్ళిద్దరూ నాతో చనువుగానే ఉండేవారు. మాఇంట్లో ఆడ పిల్లలు లేనందున, అందరు ఆడ పిల్లలందరూ మాకు అక్కలే!! అందుకని ఈ అమ్మాయిని.. అక్కా.. అక్కా.. అంటూ పలకరించడమే కాకుండా వాళ్ళింట్లో సరదాగా తిరిగే వాడిని. వాళ్ళింట్లో కూడా ఏమి అనుకునే వారు కాదు. ఆ అమ్మాయి తల్లి తండ్ర్లులు కూడా చాలా ఆప్యాయంగా చూసుకునేవారు. కాలానుగుణంగా, ఆ అమ్మాయి పెద్దదయి.. చదువు రీత్యా, నాట్యాభ్యాశానికి తీరిక దొరకక పోవడం వల్ల నేను మాత్రమే కొనసాగించడం జరిగింది. ఈ కాలం వచ్చేటప్పటికి, మా నాన్నగారు చిన్న సైకిల్ కొనడం, సైకిల్ మనకి కొత్త.. దానితో సంతోషంలో ప్రపంచాన్నే జయించాం అన్న భావనతో సైకిలెక్కి ఒంటరిగా పయనించడం అలవాటు చేసుకున్నాను. ఇలా పాతికేళ్ళ క్రిందట ’అక్కా’ అనిపించుకున్న పాపానికి.. ఆ అమ్మాయే కాకుండా ఆమె భర్తకూడా, ఇద్దరూ ప్రస్తుతం ప్రతీ వారాంతం నన్ను భరిస్తున్నారు.

 

ప్రస్తుతం నేనువృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను. ఇక్కడ తెలుగు తెలిసిన వారెవ్వరూ లేక పోవడం నన్ను కొంచం ఆందోళనకు గురి చేసింది. ఎవ్వరూ లేరనుకుంటుండగా, ఎడారిలో ఒయాసిస్సులా ఇక్కడ నివసిస్తున్న జంట గురించి తెలిసింది. అంతే.. ’అక్కా..’ అంటూ ఉత్తరం వ్రాయడం, తరువాత ప్రత్యుత్తరం.. ఇలా కొంత మనో ధైర్యం తెచ్చుకుని ప్రయాణం మొదలుపెట్టాను. హైదరాబద్ నుంచి ఆంస్టర్‍డాం వరకూ కొంచం సరదాగే సాగింది. ఆంస్టర్‍డాంలో ఆరు గంటలు వేచి యున్న తరువాత మెమ్‍ఫసిస్‍కు పయనం. ఈ పయనమే అసలు సిసలు నరకం అనిపించింది. తరువాత మరో నాలుగు గంటలు కాలక్షేపం తరువాత మరో గంట ప్రయాణం తరువాత గమ్యస్థానానికి చేరుకున్నాను. ఏమీ తెలియని ప్రదేశం ... దేశం కాని దేశం.. ఎలాగోలా.. హొటల్‍కు చేరుకున్నా. మరునాడు ఉదయం వారిని కలసిన తరువాత పోయిన ప్రాణం లేచి వచ్చినట్లైంది. ఆ తరువాత ప్రతి వారాంతం వారింటికి వెళ్ళడం .. వారి అబ్బాయితో ఆడుకోవడం.. వారితో కలసి ఊరంతా తిరిగి రావడం.. ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి. కానీ ఎటువంటి రక్త సంబంధం లేని వాళ్ళు నన్ను ఎందుకు entertain చెయ్యాలో ఒక్క సారి ఆలోచించండి.

 

ఇక్కడ మరో విషయం, ఉన్న వాడిని ఉండకుండా.. పెద్ద పుడింగ్ లాగా వాళ్ళింట్లో వంట చెయ్యడం మొదలు పెట్టాను.. మొదటి సారి చేసిన కూర నిండా ఉప్పే. ఉప్పగా ఉన్న ఆ కూరను, మొహమాటం కొద్ది తిని, "బాగుంది, బాగుంది .." అని వాళ్ళంటుంటే.. నిజంగా బాగానే ఉందేమో ఆని కొంచం రొమ్ము విరుచుకుని నేను తినడానికి ఉపక్రమించాను. తీరా మొదటి ముద్ద తిన్నాక గాని అసలు విషయం అర్దం కాలేదు. ఉప్పు కశం.. చేసిన తప్పుకి కొంచం సిగ్గేసింది. కుక్కిన పేనులాగా అయ్యింది నాపని. మారు మాట్లాడ కుండా తిన్నాను. రెండవసారి ప్రయత్నించినప్పుడు, ఉప్పు తక్కువైనా .. ఈ సారి కారం కొంచం ఎక్కువైంది. ఇన్ని సార్లు తినే తిండి చెడగొడుతున్నా, ఏమి అనకుండా.. అంతే కాకుండా.. "భలే.. భలే.. బాగుంది.. బాగుంది .." అని వాళ్ళంటుంటే.. వారి పెద్దరికానికి జేజేలు కొట్టాలనిపిస్తోంది. ఏదైనా ఒక వారాంత వెళ్ళడానికి కుదరలేదనుకోండి, అక్కేమో నాకు కాల్ చేసి... ఎక్కడున్నావు.. ఏమి చేస్తున్నావు.. అని ఆడుగుతుంది. ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే, ఏమయ్యానో అని తాను కంగారు పడుతుంది. అమెరికాలాంటి చోట్ల ప్రజలకు ఆనందానికి దొరికేదే వారాంతం. అట్టి వారాంతాలలో నాలాంటి వాడు వెళ్ళి పెద్ద పుడ్డింగ్ లాగా వాళ్ళ కాలాని చెడగొడుతూ ఉంటే.. ఎవ్వరైనా ఎందుకు భరిస్తారు? ఎంతకాలం భరిస్తారు? మరి వీళ్ళేంటీ.. వీళ్ళు మనుష్యులు కారా.. వీరికి కోపతాపాలు ఉండవా? నా మానసిక స్థైర్యం కోసం వీళ్ళ కాలాన్ని బలి ఇవ్వాలా?

 

ఇలా ఆలోచిస్త్తూ ఉంటే.. ఈ పుటకి మూల పదమైన "అనుబంధం" అనే పదం గుర్తుకు వచ్చింది. మన సంసృతిలో .. చుట్టరికాలు ఉండనక్కరలేదు.. కానీ ఆప్యాయతగా .. అక్కా.. అనో .. మామా .. అనో.. తాతా.. అనో .. పిన్నీ .. అనో.. పలకరించే పలకరింపు వెనుక ఎంతటి అనుబంధం ఉందో కదా అనిపిస్తుంది. ఈ అనుభూతి నాకేనా.. లేక మీకు కూడానా..

 

మీ స్పందనలకై ఎదురుచూస్తూ ఉంటాను,
ఇట్లు,
భవదీయుడు

 
Clicky Web Analytics