ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.
ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.
ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.
ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి