మా మంత్రాలయ మొదటి భాగం విషేశాలు చదివారు కదా.. ఇదిగో ఇప్పుడు మరికొన్ని. శనివారం రాత్రి అలా మంత్రాలయం రైల్వే స్టేషన్‍లోని విశ్రాంతి గదిలో (రిటైరింగ్ రూమ్) బస. అక్కడ ఆది వారం తెల్లవారింది. అదిగో అప్పుడు మెల్లగా మగతగా గుర్తుకు వచ్చింది రాత్రి ఎవ్వరో వచ్చారు, ఏదో అడిగారు, దానికి నేను ఉదయం ఏడు గంటలకల్లా తయారయి ఉంటానని చెప్పినట్లు. సరిగ్గా అప్పుడు చేతికి ఉన్న వాచీ చూద్దును కదా తెల్లావారి బారెడు ప్రొద్దెక్కి చక్కగా ఆరు గంటల ఇరవై నిమిషాలైంది. వామ్మో!! రాత్రి వచ్చిన వాళ్ళు ఠంచనుగా ఏడు గంటలకు వచ్చేస్తారు అనుకుంటూ.. గబగబా స్నాన పాన ఇత్యాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఖశ్చితంగా ఏడు గంటలకు సిధ్ధమై బాల్కనీ లోకి వచ్చి నుంచున్నాను. ఏదీ ఎవ్వరూ కనబడరే!!! అనుకుంటూ మెల్లగా క్రిందికి వెళ్ళి ఓ ఛాయ్ కొట్టి వస్తానని శ్రీమతికి చెప్పి బయలు దేరాను. మీకు తెలియని దేముంది, ఆడాళ్ళు తయ్యారవ్వటం అంటే మాటలా!! అధమ పక్షం ఓ గంటకు తక్కువ కాకుండా ఉంటుందా అనుకుంటూ క్రిందకు వెళ్ళి ఓ ఛాయ్ త్రాగి వచ్చాను. అక్కడ కాఫీ అడిగితే, బడ్డీ కొట్టు వాడు కొంచం వింతగా చూశాడు, నేనేదో ఇతర గ్రహం నుంచి వచ్చి అడగ కూడనిది ఏదో అడిగినట్లు కూడనిది అడిగినట్లు. ఇంతలో ట్రంగ్.. ట్రంగ్.. అంటూ నా ఫోన్ మ్రోగింది. ఎవ్వరా!! అనుకుంటూ.. ఆన్సర్ చేసాను. అటు వైపు నుంచి, ’సార్ .. వచ్చేస్తున్నానండి.. సత్యసార్ చెప్పారు’ అంటుంటే, నోట మాట రాక, ’సరే నండి .. ఇక్కడే ఎదురు చూస్తున్నా ..’ అని ఫోన్ పెట్టేశా.
ఇక్కడ మరో విషయం చెప్పాలి, ఇందాక చెప్పినట్లు ఇంతులు తయారవ్వడానికి గంట కావాలన్నానా. అందుకు విరుధంగా ఇరవై ఐదు నిమిషాల కల్లా నా శ్రీమతి తయారై గిన్నిసు బుక్కు రికార్డు బద్దల కొట్టిందనుకోండి. ఇలా ఏడు ఇరవై ఐదు అవుతుండగా మరో పెద్దాయన వచ్చి మమ్మల్ని కలిసారు. మాటల్లో వారిపేరు రాఘవేంద్ర అని అర్దం అయ్యింది. (వారి అసలు పేరు ప్రచురించటానికి అనుమతి లేక ఇలా..). చాలా మర్యాదస్తులు. ఎంత మర్యాదస్తులంటే, ముందుగా వీరిని మర్యాద రామన్న అని పరిచయం చేద్దాం అనుకునేంత. కానీ రాఘ వేంద్ర అని అంటే బాగుంటుందనిపించి అలా మార్చేసాను. మొదటి భాగంలో సత్యన్నారాయణ శర్మ గారు చెప్పిన కొన్ని మాటలు ఒక్క సారి నెమరు వేసు కుందాం..
..విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు ..
అది సంగతి, సత్యన్నారాయణ శర్మ గారు చెప్పినట్లుగా, ఈ రాఘవేంద్ర గారే ఆ సదురు వ్యక్తి అన్నమాట. రాత్రి వచ్చిన ఫ్రకాశ్ గారిని ఈయనే పురమాయించి ఉంటారని అప్పుడు అర్దం అయ్యింది. సదురు రాఘవేంద్ర గారితో పిచ్చాపాటీ వేసుకుంటూ చిన్నగా స్టేషన్ బయటకు వచ్చి అక్కడి ప్రకృతిని ఆశ్వాదిస్తూ అక్కడే పచార్లు కొడుతూ ఉన్నంతలో, రాఘవేంద్ర గారు మన ప్రకాశ్ కోసం ఫోన్‍లో ప్రయత్నిస్తున్నారు. మన ప్రకాశ్ ఏమో స్పందించడం లేదు. అలా అక్కడే ఎనిమిది గంటలైంది. మేము మనసులో పడే ఇబ్బందిని తొలగించాలనే ప్రయత్నంలో చక్కటి కాఫీ ఒకటి పోయించి కొంచం చల్లార్చారు. పదే, పదే చేసిన ప్రయత్నాలలో ఒకటి కలిసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే, ప్రకాశ్ గారి తండ్రి గారికి ఆ రోజు ఉదయమే శుస్తి చేసిందని. అందువల్ల తండ్రిగారికి సపర్యలు చేసే నిమిత్తమై ప్రకాశ్ గారు ఇఱుక్కు పోయ్యారని. హతవిధీ!! ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నంతలో,
“ఇక్కడే, ప్రక్కనే మంత్రాలయ దేవస్థానం వారి ఆశ్రమం ఉంది అది చూసి వద్దాం పదండి .." అని రాఘవేంద్ర గారు అనడంతో అటు బయలు దేరాము. అలా అక్కడికి ప్రక్కనే ఉన్న ఆశ్రమం చూసుకుని అక్కడ మరో గంటన్నర గడిపిన పిదప మన ప్రకాశ్ గారు ఆటోతో సహా వచ్చారు. చక్కగా ఆటో ఎక్కి మంత్రాలయం వైపు బయలు దేరాము.
మెల్లిగా ఓ అరగంట ప్రయాణం చేసిన పిదప మంత్రాలయం ఆలయం చేరుకోవడం ఆటో నడిపే వ్యక్తి చక్కగా మమ్ములను గుడి ద్వారం దగ్గరకి చేర్చడం అన్నీ అనుకోని విధంగా జరిగి పోయ్యాయి.సరి అని కాళ్ళకున్న చెప్పులు కాస్తా ఆటోలో వదిలి చేతిలో ఉన్న కెమెరా శ్రీమతి చేతి సంచిలో ఉంచి అడుగులో ఆడుగు వేసుకుంటూ మ్రెల్లిగా గుడిలోపలికి చేరుకున్నాం. అదిగో అప్పుడు తెలియలేదు మాకు అక్కడి గర్బ గుడిలోకి మేము వెళ్ళి వస్తామని.
లోపలికి వెళుతూ .. అచంగా పుష్కరం క్రిందట విచ్చేసినప్పటి నా అనుభవాలను ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా నా శ్రీమతితో పంచుకుంటున్నాను. క్రిందటి పుటలో దీప్తిధార చీమకుర్తి భాస్కర రావుగారు స్పందించినట్లుగా.. నా జీవితంలో మొట్ట మొదటి సారిగా మ్రొక్కులు ఎంత వెరైటీగా ఉంటాయో ఈ దేవాలయం లోనే చూసాను. అలాగే మ్రొక్కులు తీర్చే క్రమంలో భక్తులకు ఎన్నెన్ని గాయాలౌతాయో ప్రత్యేకంగా ఈ కళ్ళతో వీక్షించాను. అలా ఆ రోజు నేను మాత్రమే కాకుండా నా భార్య కూడా సాక్ష్యం పలికింది. ఎవ్వరికి అనుకుంటున్నారా.. మ్రొక్కులు తీర్చుకునే వాళ్ళకి.
లోపలకి వెళ్ళిన తరువాత ప్రకాశ్ అడగనే అడిగారు, పంచ కండువా తెచ్చుకోలేదా అని. ఒక్క శ్రీశైలం మరియూ కాళకస్తి గుళ్ళలోనే ఇలా పంచ కండువాతో మాత్రమే రానిస్తారని తెలుసు కానీ ఇక్కడ కూడ అలాగే వెళ్ళాలని తెలియనందుకు కొంచం సిగ్గు పడ్డాను. నా సంకట స్థితిని గమనించిన మన ప్రకాశ్ అక్కడే ఉన్న పంతులు గారి దగ్గరకు తీసికు వెళ్ళి కండువా ఒకటి దానమిప్పించారు. ఇక పంచె విషయాన్నికి వస్తే తన కండువాని నాకు చేబదులిచ్చి లుంగీగా కట్టుకోమన్నారు. అదిగో అలా చొక్కా పాంట్ పోయి పంచా కండువా వచ్చాయి. అలా ఆహార్యం మార్చి వీఐపీ ద్వారం గుండా ఒకసారి దర్శనం చేసుకుని, మరోసారి గర్బ గుడిలోకి ప్రవేసించే అవకాశం ఏ జన్మ పుణ్యమో కదా అనుకుంటూ ఈ పుటని ఇక్కడితో ముగింపు పలుకుతాను. మరో పుటలో మరిన్ని వివరాలు.
అంత వరకూ సెలవా మరి.
ఇట్లు భవదీయుడు
7 కామెంట్‌లు:
mito patu ma andariki kuda darshanam cheyyinchina anubhuty ni kalgistunnaru .manalo mana mata a panche kanduva tirigi ichhesara?mantralayam tipi gurtu ga techhesukunnara?
చాలా బాగుంది పుట/టపా. ఇంతకు రాఘవేంద్రుల వారు ఏమన్నారు.... ;)
మంత్రాలయ దర్శనం మొదటి సారి అనుకుంటాను మీకు చక్రవర్తి గారూ!
మొదటిసారి చూసినపుడు ఆ అడుగడుగు దండాలు, మోకాలి దండాలు మొదలైనవి చూసి నేనూ ఆశ్చర్యపోయాను. అలాగే చక్రాంకితాలు వేయించుకోవడం కూడా. అది సరే , ఆలయానికి ముందే ఉండే మంచాలమ్మను దర్శించాక కదా రాఘవేంద్ర స్వామి ని దర్శించాలి?
సంప్రదాయ వేషధారణలో రాఘవేంద్రుడిని దర్శించడం బాగానే ఉంటుంది కానీ అక్కడి పూజార్ల కక్కుర్తిని భరించడం చాలా కష్టం అనిపిస్తుందండీ నాకు. తరచు గా వెళుతూనే ఉంటాం.డబ్బు చేతిలో పడితేనే కానీ కనీసం తీర్థం, మంత్రాక్షతలు ఇవ్వడానిక్కూడా ఆసక్తి చూపించరు. పంతం కొద్దీ వాళ్ళకు పైసా కూడా ఇవ్వకుండా భోజన శాలలో పని చేసే పేద బ్రాహ్మలకు డబ్బు ఇచ్చి వచ్చాను నేను.
పంచముఖి చూశారా?
నీలం రంగు వస్త్రం చూసి, ఇదేమి మన మిత్రుడు చీర కట్టుకున్నాడని గాబరా పడ్డాను.
తెలుగు వార పత్రికల్లో ధారావాహికాల్లా, సశేషాలేంటండి, ఒక టపాలో మొత్తం 'వ్రాసి' పడేయకుండా :)
రవిగారూ,
అది మీ మంచితనం. పంచె తిరిగి ఇచ్చేసాను, కానీ కండువా ఇవ్వలేదు. ఎందుకంటారా.. అది దేవాలయం వారు ఇచ్చినది, కాబట్టి తిరిగి ఇవ్వనక్కరలేదు
నాగన్న గారూ,
అదేదో సినిమాలో అన్నట్లు .. బాగుండాలి, బాగుండాలి, అంతా బాగుండలి అన్నారు
సుజాత గారూ,
మంచాలమ్మను దర్శించుకోలేదండి. మా గైడ్ మమ్ములను తిన్నగా దేవాలయం లోకి తీసుకు వెళ్ళారు. అక్కడ మంచాలమ్మ ఉన్నారన్న విషయం మాకు తెలియదు. నా భార్య స్వాతి వ్రాసిన పుటకి స్పందించ వాళ్ళలో ఎవ్వరు కూడా ఈ విషయం తెలియ చేయ్యలేక పోవడంతో మిస్స్ అయ్యామండి. ఈ సారికి ఇంతే ప్రాప్తం అనుకోవడమే.
ఇక దేవాలయ సిబ్బంది గానీ పూజార్ల విషయానికి వస్తే.. ఏమో నండి, నేను ఒక్క పైసా ఎవ్వరికీ ఇవ్వలేదు. కానీ మీరు చెప్పినట్లు ఉచిత భోజనం మాత్రం చేసి వచ్చాము.
చీమకుర్తి గారూ,
ఈ అనుమానం మీకు మాత్రమే కాదండి .. నా మిత్రులలో చాలామందికి వచ్చింది. కానీ చెప్పాను కదా, అక్కడి పద్దతులు తెలియక పోవడం వల్ల ముందుగా ప్రిపేర్ అవ్వలేక అలా పాంట్ చొక్కాతో వెళ్ళిపోయ్యాను.
సూరీడు గారూ,
మున్ముందు తెలుగు మాస పత్రికలలో సీరియల్స్ వ్రాద్దామనుకుంటున్నానండి, దానికి ఇది ఓ రిహార్సల్
ఏమనుకోకండి, ఎంత తక్కువగా చెబుదాం అనుకున్నా కుదరటం లేదు. నేను ఇంకా నేర్చుకోవలసినది చాలా ఉంది
ఆ ప్రయత్నం లో ఉన్నాను.
అందరికీ ఒకేసారి పెడతాండా... నెనరులు
photos bagunnayi. thanks for sharing !
కామెంట్‌ను పోస్ట్ చేయండి