9, ఫిబ్రవరి 2009, సోమవారం

మా ఊరు వెళుతున్నానోచ్

వచ్చే వారాంతంలో నేను మా ఊరు వెళుతున్నాను. మా ఊరు అంటే, నేను పుట్టి పెరిగిన ఊరు కాదు కానీ, మా పూర్వీకులు ఉన్న ఊరు అన్నమాట. నిజానికి మా ముందు తరం లోని మా నాన్నగారు అక్కడ పుట్టలేదు, కానీ మా తాతగారు కాలం చేసేంత వరకూ అక్కడే గడిపారు. అక్కడే కాలం చేసారు. అక్కడే కరణంగా పనిచేసారు.

ఏదో ఆనందం... ఎందుకో తెలియదు.. కానీ ఆనందం. అక్కడ నేను పుట్టలేదు, పోనీ అక్కడ పెరిగానా!! అంటే, అదీ కాదు. ప్రతీ సంవత్సరం సెలవులకు అక్కడకు వెళ్ళే అలవాటు ఉందా అంటే, అదీలేదు. ఏదో పండగకో పబ్బానికో వెళ్ళినట్లు చూచాయగా ఒకటో రెండో అనుభవాలు లీలగా గుర్తుకు వస్తున్నాయి. అయినా ఎందుకీ ఆనందం? మా చిన్నాన్న ఒక్కడే అక్కడ ఉంటున్నాడు. చిన్నాన్నా మరియు పిన్నీ తప్ప అక్కడ మరెవ్వరూ ఉండటం లేదు. మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, వరసకు తమ్ముడు కూడా ఇక్కడే, అంటే హైదరాబాద్‍ లోనే ఉద్యోగం చేసుకుంటున్నాడు. వీడికి ఒడుగు చేస్తున్నారంటూ పిన్ని ఫోన్ చేసి చెప్పిన తరువాత వెంటనే రైల్ రిజర్వేషన్ చేయించాను. మాకంటూ అక్కడ అస్తిపాస్తులు ఏమీ లేవు.. కానీ ఎందుకీ ఎదురు చూపులు??

అక్కడి మట్టితో ఎటువంటి అనుబందం లేదే.. కానీ ఎందుకీ ఎదురు చూపులు?? ఎప్పుడో కాడి కట్టుకుని నీళ్ళు మోసినందుకా!!! లేక వేరుశనగ చేలోకి వెళ్ళి దొంగతనంగా వేరిశనగ కాయల మొక్కలు పీకి కాల్చుకుని తిన్నందుకా!!! లేకపోతే పెరడులో కాచిన పుచ్చకాయలను కోసుకు రమ్మన్నప్పుడు, కోసిన పుచ్చకాయను మొయ్యలేక మీదవేసుకుని చతికిలపడ్డ వైనం మరోసారి గుర్తుకు తెచ్చుకునేందుకా!! నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. మా వూళ్ళో ఎవ్వరూ వాటి గురించి పట్టించుకోరు. ఎందుకంటే, ఎవ్వరి పెరడు చూసినా తప్పకుండా కనబడుతూనే ఉంటాయి. ఎన్ని సార్లు గంపలు గంపలు సీతాఫలాలు బ్రేక్ ఫాస్ట్‍గా లాగించామో గుర్తు తెచ్చుకునేందుకా!! ఎండాకాలంలో లేత లేత ముంజికాయలను బ్రొటన వ్రేలితో జుర్రుకుని తిన్న పొలం గట్ల వెంబడి పరుగు తీసేటందుకా!! పండిపోయిన తాటి ముంజి కాయలను కాల్చి రశం తీసుకుని మామిడి చెట్టు కొమ్మల మీద కోతీ కొమ్మచ్చి ఆట ఆడిన రోజులను మర్చిపోకుండా పదిలంగా పదికాలాల పాటు భద్ర పరచుకునేందులకు.. వెళ్ళుతున్నా.. వెళ్ళుతున్నా.. మా ఊరు వెళ్ళుతున్నా..

ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా.. ఏలూరు దగ్గరున్న దెందులూరు మండలం పరిధి లోని చల్ల చింతల పూడి.   ఈ పర్యటన తరువాత వికీ పీడియాలో మరిన్ని వివరాలు పొందు పరుస్తాను.

4 కామెంట్‌లు:

సూర్యుడు చెప్పారు...

All the best :-)

cbrao చెప్పారు...

మా ఊరు అంటే పాత మధుర స్మృతులు గుర్తుకు రావటం ఖాయం. మన ఊరు వెళ్తున్నాము అనగానే చిన్ననాటి సంగతులు మనసు నిండా ముసురుకోకుండా ఎలా వుంటాయి? అవి వెంటాడే జ్ఞాపకాలు. అప్పటి పాత స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నరో, ఏమి చేస్తున్నారో అని మనసు విలవిలలాడటం ఖాయం. ఇంతకూ ఏ వూరు వెళ్తున్నారు ?

Unknown చెప్పారు...

ఈ గాలి, ఈ నెల , అని పాడుకుంటూ వేల్తారన్న మాట , ఇంతకీ మీ వూళ్ళో సెల్ సొల్లు కి అవకాశం ఉందా సిగ్నల్స్ రావా?

durgeswara చెప్పారు...

ade naa anukunE daanilO vuMDE bamdhamu yokka shakti.best of luck

 
Clicky Web Analytics