ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు వ్యంగ్య భావన పుటమరించి ఉంది అని పాఠకుల భావన. వారి దృక్కోణంలో ఆలోచించినప్పుడు నాకు అది నిజముగానే అనిపించింది. వారి భావన యందు దోషం కనబడ లేదు. ఇది నేను అంగీకరించడాని చాలా కష్టపడవలసి వచ్చింది. అదిగో అప్పుడు అనిపించింది, ఏదైనా విషయాన్ని మన మనోభవాలకు విబేధంగా ఉన్నప్పుడు దాని యందు ఉన్న తత్వాన్ని యధా విధిగా అంగీకరించడానికి బదులుగా వ్యతిరేక భావన కలగడం ఎంత సహజమో, అలాగే ఆ విషయాన్ని ఆ విధంగా అంగీకరించి యధాతధంగా స్వీకరించడానికి చాలా మనోబలం కావాలి కూడా అని.
ఇలాంటి ఆత్మా మధనంలోని భావాలకు ఆధ్యం పోసినట్లుగా మఱో ఘటన ఈ మధ్య జరిగింది. ఆ ఘటన గురించి నా భావనను వ్రాసే ముందు ఆ ఘటన లోని విషయాన్ని, అలాగే దానియందు నాకు కలిగిన భావనను ప్రస్తావిస్థాను.
వృత్తి పరంగా పనికి వస్తుందని మఱో సెమినార్ భాగ్యనగరంలో జరుగుతోందని తెలిసిన తరువాత వీలుచేసుకుని హాజరయ్యాను. అక్కడకు వచ్చిన వారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఆ యువతి ఆహార్యం ప్రకారం వివరించాల్సి వస్తే, తల నీలాలకు తైల సంస్కారం లేదు. నీలలను చక్కగా ఒద్దికగా ప్రక్కకి అదిమి పాపిడ తీసి లేవు. ఇక దుస్తులు విషయానికి వస్తే, తొడలు కనబడేలా ఉండి లోదుస్తులు కనబడే విధంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడుగా, నోటిలోని దంతాలు పచ్చగా ఉండి దుర్ఘందాన్నిస్తున్నాయి. అన్నింటినో మించి ఘాటైన స్ప్రే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ముక్కు పుటాలను అదరగొడుతోంది.
ఇలాంటి యువతులను ఇంతకు పూర్వం చాలా మందిని చూసాను. కానీ ఆ నాడు నాకు కలగని ఆలోచన ఈ నాడు కలిగింది. ఒక్కసారి నా ఆహార్యం గురించి అలాగే అదే సమయంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకున్నాను. తలారా స్నానం చేసి నుదుట వీభూతి ధరించినా, నేను సెమినార్ హాల్ చేరుకునేటప్పటికి నుదురుపై ఉన్న వీభూతి కనబడలేదు. నొసట కుంకుమ ధరించి, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, శరీర దుర్గందం రాకుండా ఉండే విధంగా (నా ఉద్దేశ్యంలో చమట పట్టకుండా..) శ్రద్ద తీసుకుని సెమినార్ జరిగే స్థలానికి చేరుకున్నాను. సెమినార్ జరిగే ప్రదేశం అంతా ఏసీ ఉండటం వల్ల ఎటువంటి వాసన అయినా పసిగెట్టేయ్యవచ్చు.
ఇప్పుడు ఒక ప్రశ్న. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండాలి అని నాకు అనిపించింది, దానికి సవా లక్ష కారణాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే ఆ విదేశీ యువతి ఎందుకు అలా ఉంది? దానికి సమాధానంగా, అలా ఉంటే తాను అందంగా ఉన్నాను అని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఉంటే తాను బాగుంటాను అని ఆ అమ్మాయి మనసు చెప్పి ఉండవచ్చు. అలా ఉంటే ఆ అమ్మాయి మనసు తృప్తి చెందుతుండవచ్చు. అది ఆ అమ్మాయి స్వాతంత్ర్యం. అది ఆ అమ్మాయి అభీష్టం. అది ఆ అమ్మాయి మనో సంకల్పం. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, “రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నట్లు..”, ఆ అమ్మాయి భారత దేశంలో ఉన్నప్పుడు భారతీయ యువతిలా ఉందా అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎక్కడ ఉన్నా నేను నేనులా ఉన్నాను అని ఆ అమ్మాయి ఆ ఆహార్యం చెబుతోంది.
మఱొ అడుగు వేసి, ఒకవేళ ఆ అమ్మాయి
- ఆహార్యాన్ని నేను ప్రశ్నిస్తే..
- శరీర తత్వాన్ని నేను ఆక్షేపిస్స్తే ..
- ప్రవర్తనా విధానన్ని వ్యతిరేకిస్తే ..
- .. .. ఇంకా ఇంకా .. .. డాష్ .. డాష్ .. చేస్తే ..
ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రశ్నించ వచ్చు. కానీ కొంచం మర్యాద పూర్వకంగా ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది.
“ .. నువ్వెందుకు అలా ఉండాలి అని అనుకున్నావో నాకు అనవసరం. అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు అనవసరం అని అనక పోయినా, నేను ఇలా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించు .. .. ”
ఆంగ్లంలో వ్రాయాల్సి వస్తే, నాకు ఇలా అనిపించింది.
“.. you decide to be what you are, so the same with me. I decide to be what I’m, so I’m .. .. accept me as I’m .. ”
ఇలాంటి ఆలోచనతో / దృక్పధంతో / ధృకోణంతో ఆలోచిస్తే, ఇంతకు ముందు నేను పాశ్చాత్యులపై వ్రాసిన నా అభిప్రాయాలు నాకు వింతగా అనిపిస్తున్నాయి. వారు ఆవిధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఆ ఆలోచనల గురించి మఱో సారి ..