ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.
గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..
వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.
ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.
దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.