భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009 సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.
ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.