తెలుగు సాహిత్యం అనే గూగుల్ గుంపులో ‘భవదీయుడు’ అనే పదం యొక్క అర్దంపై ఓ చక్కని చర్చ జరిగింది. ఆ చర్చలో గౌరవనీయులైన Dr. R. P. Sarma గారు ఇచ్చిన వివరం బహు విపులంగా ఉండటంతో దానిని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.
మొదటగా పవిరాల అచ్యుత్ ప్రసాద్ గారు ఈ ప్రశ్నని అడిగి ఈ క్రింది విధంగా వివరించారు
భవదీయుడు = భవత్ + విధేయుడు = your's obidiently
ఇక్కడ "భవదీయుడు" ని విడదీసిన విధానము మరియు "భవత్ = your's" రెండూ కూడా crude guesses మాత్రమే
ఇందుకు స్పందిస్తూ టెకుముళ్ళ వెంకటప్పయ్య గారు ఈ క్రింది విధంగా వివరిస్తూ తెలుగులోని ప్రధమా విభక్తి ప్రస్తావన తెచ్చారు
భవత్ అంటె నీవు, మీరు, జరుగుచున్న కాలం అని అర్ధము. అదే భవదీయ అంటే నీది అని అర్ధం
ఐతే తెలుగు లో ("డు, ము, వు, లు") ప్రధమా విభక్తి చేయడంతో భవదీయుడు అయింది. అంటే.... మీ యొక్క అని మాత్రమే, విధేయుడు అని అర్ధము తీసుకోరాదు అని నా అభిప్రాయం
నేదునూరి రాజేశ్వరి గారు తెలుగులో భవదీయుడు అన్న పదానికి అర్ధం దొరకలేదు కానీ
భవము =పుట్టుక,సంసారము,ప్రాప్తి,శుభము ,సత్తా అని
భవత్ =కలుగుచున్న,పుట్టుచున్నఅనీ,
భవదీయము =మీది ,అనీ,విధేయము = సాసింప తగినది , విహిత కార్యము అనీ
విధేయుడు = సేవకుడు చెప్పినట్లు వినువాడు అనీ
ఇలా అర్ధాలు ఉన్నాయి అని వివరించారు.
వీరిని సమర్దిస్తూ సుధాకర్ గారు సంసృతంలో భవదీయుడు అని చదివినట్టు ఉంది అని ప్రస్తావించగా, Dr. R. P. Sarma గారు ఈ క్రింది విధంగా వివరించారు. వారి పాఠ్యాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.
ఆసక్తికరమైన చర్చ జరిగింది. మొదటే టేకుమళ్ళవారు సరిగానే వివరించారు. భవదీయుడు పదం తెలుగు నిఘంటువుల్లో దొరకకుంటే దొరకక పోవచ్చుగాక. ఎందుకంటే - మనం వినే ఇటువంటి సంస్కృతపదాలు చూడండి. దేశీయ పదజాలం, రాష్టీయ అసమానతలు, మానవీయ సంబంధాలు, జతీయ సంపద మొదలైనవి. (స్పష్టత కోసం వేరేపదాలతో సమసించిన పదాలను ఇచ్చాను.) వీటిని దేశ+ఈయ; రాష్ట్ర+ఈయ; మానవ+ఈయ; జాతి+ఈయ అనే విధంగా విభజించాలి. ఇందులో మొదటిది పదం(ప్రకృతి).రెండవది ప్రత్యయం. ‘ఈయ’ అనేప్రత్యయానికి పై ఉదాహరణలవల్ల ‘సంబంధించిన’ అనే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి
భవదీయ = భవత్+ ఈయ అని విభజించాలి.
ఇందులో భవత్ అనేది టేకుమళ్ళవారు చెప్పినట్టు ...‘తమరు’ అనే అర్థం ఇచ్చే శబ్దం. దాన్ని భవచ్ఛబ్దం అంటారు. దీనికి సంస్కృతంలో మూడులింగాల్లోనూ రూపాలున్నాయి.
పుం. భవాన్ భవన్తౌ భవన్త: .........
స్త్రీ . భవతీ భవత్యౌ భవత్య: ........
నపుం. భవత్ భవతీ భవంతీ ........
కాబట్టి - భవత్+ఈయ > భవదీయ= తమరి (Yours)...
ఇక నిఘంటువుల్లో సాధారణంగా మూలపదం మాత్రమే ఇస్తుంటారు. దాని మీద ప్రత్యయాలు చేరగా ఏర్పడే కృత్తద్ధిత పదాలు అన్నీ ఇయ్యకపోవచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ఇందుకు కొంత మినహాయింపు.ఇంకా భవ శబ్దానికి 1.పుట్టుక 2. సంసారం మొ. అర్థాలూ ఉన్నాయి.
భవత్ శబ్దానికి ‘జరుగుచున్న కాలం’ అనే అర్థం లేకపోయి ఉండవచ్చని గెడ్డపువారు అభిప్రాయపడినారు. కాని, జరుగుచున్న/జరగబోయే/జరిగిన అనే అర్థాల్లో ఉంది. సంస్కృతంలో ‘భూ’ ధాతువు(క్రియ) ఉంది. దానికి ‘సత్తాయాం’ అని అర్థం.
సత్తా అంటే ‘స్థితి’(Status).
మనం వాడే ‘భూత,భవిష్యత్’ పదాలు ఆ ధాతువునుండి పుట్టినవే.వర్తమాన అనే పదమొక్కటి ‘వృతూ వర్తనే’ అనే వేరొక ధాతువునుండి పుట్టినది.
ఇక ‘అస్మదీయ’ అనే పదం విషయానికి వస్తే.. అస్మద్ శబ్దం (అహం=నేను అనేది ఈ శబ్దరూపమే)పై ఈయ చేరిన రూపం