ఎప్పుడూ అమెరికాని ఆడిపోసుకుంటున్నననే అనుకుంటునారుగా, అదేంలేదు. ఇదిగో ఇక్కడ అమెరికాని మరో కోణంలోంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ నాణానికి రెండు వైపులుంటాయి, ఇంతకాలం ఒకవైపు చదివిన మీకు ఇప్పుడు మరో వైపు చూపడానికే ఈ ప్రయత్నం.
అన్నింటికన్నా మొదటిది వీరి నవ్వు మొహం. మనం ఎవ్వరమో తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం వారిని చూసాము అన్న విషయం వారు గమనించగానే నవ్వుతూ .. ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఇలా ప్రశన్న వదనంతో పలకరించడం వీరికి చిన్నప్పటి నుంచి నేర్పి ఉంటారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, స్మైల్ కాస్ట్స్ నథింగ్, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా మొహం ఎప్పుడో కాని స్మైలీగా కనబడదు. అలాగని చికాకు వదనంతో కూడా ఉండను. అక్కడే వచ్చింది చిక్కంతా, ఆ పెట్టే మొహం ఏదో నవ్వు మొహం కాకపోయినా చిరు దరహాసమో లేక మందహాసమో నీ మొహంలోకి తెచ్చుకోవేరా వెధవా అని నా అంతరాత్మ తెగ ఘోషిస్తూ ఉంటుంది. అయినా మొహాన్ని కొంచం ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా!!
ఇక రెండొవది. వీరి సహజ వనరుల నిధి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అలాగే పచ్చని గడ్డి. అంటే నేను ప్రస్తుతం ఎండాకాలం మరియు వానాకాలం మధ్యలో ఉన్నాను కదా అలాగే ఉంటుంది. వీళ్ళ శీతాకాలంలో ఇక్కడ ఎక్కడ చూసినా మంచే కనబడుతుందంట. నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఊరిలో ఉన్న చెట్లను ఆ ఊరి ప్రభుత్వం చూస్కుకుంటే, ఇంటి బయట ఉన్న విశాలమైన ప్రదేశంలో ఇష్టమున్న వాళ్ళు వారి అభీష్టం మేరకు చెట్లను పెంచితే, లేని వాళ్ళు కనీసం గడ్డిని క్రమబద్దంగా పెంచుతారు. ఆ విధంగా పచ్చదనం అన్ని చోట్ల కనబడుతుంది. ఇక పై చెప్పిన రెండు చోట్లకాక అడవిలో పెరిగే చెట్లను కూడా వీరు చాలా శ్రద్దగా చూసుకుంటారు, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న అడవులు కాలుతుంటాయి కూడా. అలా అడవులు కాలుతూ ఉండే సమయంలో ఆ మంటలర్పడం కూడా ఓ నేర్పే. దానికి కూడా, అంటే అడవులు ఆర్పడానికి ఉండే సిబ్బంది కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు అంతే కాకుండా అది ఒక కెరీర్ అంటే నమ్ముతారా!! ఇక్కడ అనవసరమైనా మఱో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చాలా రాష్ట్రాలలో ఫైర్ మెన్స్ అంతా జీతాలు లేకుండా పనిచేసే సంఘ శేవకులు అంటే నమ్ముతారా!! అంటే వీళ్ళకు ఎంతో కొంత మొత్తం జీత భత్యాలు ఉంటాయి కానీ ఇక్కడి ఫైర్ మెన్ మాత్రం జీత భత్యాల కోశం మాత్రం పని చెయ్యరు అన్నది నేను విన్నది. ఇది నిజమైతే వీరెంత నిశ్వార్ధ పరులో కదా..
ఇక మూడవది వీరి డ్రైవింగ్ విధానం. చాలా మంది అంటే నూటికి తొంబై శాతం మంది డ్రైవింగ్ పద్దతులను చూచా తప్పకుండా పాటిస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవ్వరూ వస్తున్నట్టు కనబడకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా, ఆగుము అన్న సంజ్ఞ కనబడగానే కారుని అచ్చంగా ఆపి మరీ వెళతారు అనేది ఒక చిన్న ఉదాహరణ. ఎటొచ్చీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ నగరంలో మాత్రం అలా కాలేదు. అక్కడ మరో విధంగా ఉంది. అది అచ్చం మన హైదరాబాద్ లాగా అనిపించింది. ఇలా అనిపించడం వెనకాల ఒకటే కారణం అక్కడ ఎక్కువ మంది జనాభా ఉండటమే. అలాగే రోడ్డు మీద నడిచేవాళ్ళు కనుక కనబడితే తప్పని సరిగ్గా నడిచి వెళ్ళే వాళ్ళకే వీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. రోడ్డు దాటేటప్పుడు అడ్డదిడ్డంగా దాటినా వీరేమి అనరు, ఎటొచ్చి బండి ఆగగల వేగంలో వెళుతూ ఉంటే తప్పని సరిగా ఆపేసి నడిచి వెళ్ళే వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఒక వేళ బండి కనుక ఆపలేని వేగంతో వెళుతోందనుకోండి.. నడిచి వెళ్ళే వాళ్ళను ఎవ్వరూ ఆదుకోలేరు. వీరికి అవకాశం ఉన్నంత వరకూ నడిచి వెళ్ళే వాళ్ళకు దారినిచ్చిన తరువాతే వీరి ప్రయాణం సాగుతుంది. చాలా తక్కువగా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అన్నంత మాత్రాన అవ్వవు అని కాదు కాకపోతే వీటి తీవ్రత చాకా తక్కువ అని నా ఉద్దేశ్యం. చాలా మటుకు ఇన్స్యూరెన్స్ ఉండటం మూలాన ఎవ్వరికి ఇది ఇబ్బంది కాదు, ఇన్స్యూరెన్స్ లేకపోతే ..
మరో పుటలో మరికొన్ని నచ్చిన అంశాలతో .. వీటిపై మీ స్పందనలను మాత్రం మరువవద్దు..