26, అక్టోబర్ 2010, మంగళవారం

అమెరికా ప్రయాణ ఫలితాలు

నేను అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళి వచ్చాను. రెండు సార్లు రెండు వైవిధ్యభరితమైన అనుభవాలను మిగుల్చింది. వీటిల్ని ఎప్పటి నుంచో వ్రాయాలనుకుంటున్నాను, కుదరటం లేదు. ఇవ్వాళ మొదలు పెట్టాను, చూద్దాం ఎన్ని రోజుల్లో ముగిస్తానో..

మొదటి సారి

రెండొవ సారి

౧) అమెరికా ఆర్ధిక మాంధ్యం మొదలైంది ౧) ఆర్ధిక మాంధ్యం నుంచి బయట పడ్డట్టు వార్తలు వచ్చాయ్
౨) ఆరు నెలలు అనుకున్న ప్రయాణం ఎనిమిది వారాలలో ముగిసింది ౨) రెండు వారాలు అనుకున్న ప్రయాణం పదమూడు వారాలు సాగింది
౩) మొదటి వారంలో దిగిన హోటల్ నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారాల్సి వచ్చింది ౩) దిగిన చోటే చివ్వరి దాకా ఉన్నాను
౪) హోటల్ పనిమనుష్యులు నా డబ్బుని దొంగిలించారు ౪) హోటల్ వాళ్ళు ఒక్క పెన్నీ కూడా ముట్టుకోలేదు
౫) ఓ రోజు తెల్లవారుఝామున పోలీసు వాళ్ళు నిద్రని పాడు చేసి పోలీస్ స్టేషన్ కి పట్టు కేళ్ళారు. కారణం ఏమిటంటే, నేనుంటున్న ఇంటిలో ఇంతకు మునుపు ఓ దొంగ వెధవ ఉండే వాడంట, వాడి పేరున అరస్ట్ వారెంట్ ఉండటం వల్ల అది నేననుకుని పట్టుకు పోయ్యారు. కాదని ఎంత చెప్పినా వినలేదు ౪) ఈ సారి పోలీసోళ్ళ గొడవే లేదసలు.
౬) ఎడారిలో ఒయసిస్సులా కల్పన అక్క ౬) లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నల్ లా వెరైజన్లో పనిచేసిన సహ ఉద్యోగి హరనాద్ గారు మరియు వారి ఫామిలి
౭) ఆస్టిన్ తప్పమరే ఊరు చూడలేదు ౭) వెళ్ళింది రెడ్డింగ్ అనే పల్లెటూరికి, కానీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ మొదలుకుని, ఫిలడెల్‍ఫియాలోని పలు పట్టణాలు తిరిగాను. న్యూజెర్సీ లోని సోమర్ సెట్ ప్రాంతలో ఉన్న హరనాద్ వారింటికి, మరియు వారికి దగ్గరలోని మరికొన్ని ప్రాంతాలు. వాషింగ్‍టన్ డీసీ, మేరీలాండ్, వర్జీనియా, న్యూజెర్సి సిటీతో కలుపుకుని విహారం బాగానే చేసాను
౮) కల్పన అక్క వాళ్ళు తప్ప మరెవ్వరితో కలవలేకపోయ్యాను ౮) ముఖ పరిచయంలేని చాలా మంది మెక్సికన్స్ తో కలసి ఎన్నో సాహసయాత్రలు చేసాను అలాగే వారి గెట్ తుగెదర్స్ కి అటెండ్ అయ్యాను
౯) క్లైంట్ చాలా బాగా చూసుకున్నాడు ౯) క్లైంట్ బాగా చూసుకోలేదు అని చెప్పలేను కానీ బాగా చూసుకున్నాడు అని మాత్రం చెప్పలేను.
౧౦) అహారం మరియు చిరు తిండి విషయాలలో ఇక్కడ ఎలాంటి కొరత లేకపోయింది ౧౦) అహారం విషయం ప్రక్కన పెడితే, మంచినీళ్ళుకూడా కొనుక్కోవలసి వచ్చింది
౧౧) క్లైంట్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చాడు. తాగడానికి కూల్ డ్రింక్స్, తినడానికి రకరకాలైన తిను బండారలతో బాటుగా, ప్రతీ రోజు రకరకాలైన స్నాక్ ఇచ్చేవారు ౧౧) ఉచితమా!! అంటే ఏమిటి?
౧౨) క్లైంట్ దగ్గర పనిచేసే వారందరి కోసం వారాంతంలో ఇంటికి పట్టుకెళ్ళేందుకు కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉండేటట్టుగా ఆర్డర్ చేసే వారు ౧౨) హూ!! What language am I using and what is the grammar of the language?
౧౩) అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న వైనంలా, నేను వెళ్ళిన కార్యక్రమం పతాకస్థాయికి చేరుకునేటప్పటికి క్లైంట్ వాళ్ళని మరో కంపెనీ కొనేసి మానోట్లో మట్టి కొట్టింది ౧౩) వెళ్ళింది ఒక పని పై అయితే, నా పని తీరు నచ్చి మరో రేండు పనులు చేయించుకుని, రెండు కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా ఓ చిన్న ప్రాజెక్టుని ఇండియాకి పార్శిల్ చేసారు
౧౪) నాలుగు రాళ్ళు వెనకేసుకోవాల్సిన నేను ఉన్నది పోగొట్టుకుని, ఉంచుకున్నదాని పోగొట్టు కోవాల్సి వచ్చింది. అంటే ఇండియాలో ఉన్న ఉద్యోగం కూడా పోయింది ౧౪) నాలుగు వెనకేసుకుందాం అనుకుంటే, రోజుకి పది డాలర్ల బోనస్ గా క్లైంట్ ఇచ్చాడు. అలా నాలుగు కాస్తా ఐదు అయ్యింది. లాభదాయకమే
౧౫) భోజన పరంగా ఇబ్బంది కలగలేదు. వీకెండ్స్ లో కల్పనక్క వాళ్ళింట్లో చక్కగా భోజనం అలాగే ఓ రెండు కూరలు వండుకుని తెచ్చుకునే వాడిని. అలా సోమ మంగళ వారాలు గడిపేస్తే, భుధ గురువారాలకు ఏదో చేసుకుని తినేసే వాడిని. ఇక శుక్రవారం నాటికి మళ్ళీ అక్కావాళ్ళింటికి చెరుకునేవాడిని.. ౧౫) ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బంది అయ్యింది. మొత్తం మీద ఇబ్బంది కరంగానే సాగింది
౧౬) తిరుగు ప్రయాణం అసహనంగా గడిచింది ౧౬) తిరుగు ప్రయాణం బాగా జరిగినా, రెడ్డింగ్ చేరుకునే టప్పుడు పలు చికాకులు, అలాగే ఇరవై నిమిషాల విమాన ప్రయాణానికి ఎనిమిది గంటలు వేచి చూడవలసి వచ్చింది
౧౭) వచ్చేటప్పుడు ఇంట్లో వారికోసం తెచ్చిన సామానులలో ఓ పెద్ద బ్యాగ్ ఆమ్‍స్టర్ డామ్ ఏయిర్‍పోర్ట్ లో తప్పిపోయింది. దానికి ఎటువంటి రికవరీ అందలేదు ౧౭) ఈ సారి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు కుమ్మేసారు
౧౮) క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు ఓ ఐదు నెలల పాటు అనవసరమైన పేమెంట్స్ చెయ్యాల్సి వచ్చింది ౧౮) క్రెడిట్ కార్డ్స్ వారికి ముందుగా తెలియ జేసినా, అవి పని చెయ్యలేదు
౧౯) బంధు మిత్రులను ఎవ్వరినీ కలవలేదు ౧౯) మా పెద్దనాన్నగారి పిల్లల్ని వారి పిల్లల్ని కలిసాను
౨౦) మొత్తంగా చెప్పాలి అంటే, ఆదాయం ౩ ఖర్చు ఏడు ౨౦) అదాయం ఆరు ఖర్చు నాలుగు

14, అక్టోబర్ 2010, గురువారం

నా పోర్ట్ ఫోలియోలో నష్టాల షేర్లు

ఈ మధ్య మన షేర్ మార్కెట్ భలే పరుగెడుతోంది. ఇవ్వాళ్ళ ఆల్ టైం హై చేరుకుంది. సన్సెక్స్ గరిష్టంగా 20710 వద్దకు చేరుకోగా నిఫ్టీ 6239 కు చేరుకుని రికార్డులు బద్దలు కొట్టాయి. ఇంత జరుగుతున్నా నా పోర్టు ఫోలియోలో రెండు స్టాక్స్ మాత్రం నాకు నష్టాన్ని చూపిస్తున్నాయి. వాటిల్లో మొదటిది NHPC రెండవది రిసర్గీస్ మైన్స్. వీటి ద్వారా నేను నష్ట పోయింది పెద్దగా లేదు కానీ ఎందుకో ఈ రెండు షేర్లలో పెద్దగా చలనం కనబడటం లేదు.

NHPC షేర్ ద్వారా నేను 1400/- నష్టపోతే, రిసర్గీస్ ద్వారా 2100/- రూపాయలు నష్టపోయ్యాను. మొత్తం మీద 3500/- నష్టం ఈ నాటి లెక్కల ద్వారా. ఈ రెండు షేర్స్ కొనడానికి నా దగ్గర ఉన్న జెస్టిఫికేషన్ ఏమిటంటే ఫండమెంటల్స్ బాగుండటం మాత్రమే కాకుండా మార్కెట్లో వీటి ధర నాకు అందుబాటులో ఉండటమే. నేను పెద్ద పెద్ద షేర్స్ పైన ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేను కాని చిన్న చిన్న కంపెనీలపై దీర్ఘకాలిక ప్రణాళికతో ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట.

వివరాల్లోకి వెళ్ళే ముందు షేర్స్ పై నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తానో చెబితే ఈ రెండు షేర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసానో మీకు అర్దం అవుతుంది. షేర్స్ లో నేను పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి నాకు పదేళ్ళ తరువాత పనికి వచ్చే ఆదాయం అన్న ఉద్దేశ్యంతో స్వల్ప కాల వ్యవధి కాకుండా దీర్ఘకాల ప్రణాళిక అన్నమాట. అందువల్ల ప్రస్తుతం ఉన్న బుల్ మార్కెట్లో నేను లాభాలను దండుకోవటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే..

NHPC, భారతదేశం లోని మొట్ట మొదటి హైడ్రో పవర్ సృష్టించే కంపెని. ఇందులో ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానిదే. లాంగ్ రన్ లో ఆలోచిస్తే ఎప్పుడో అప్పుడు ఇది ప్రవైట్ పరం అవ్వక పోదు అప్పుడు ఇది లాభాల బాట పట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్నాను. ఇవి కొని ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతోంది. అయినా వీటి విలువ పెరగటం లేదు. అయినా ప్రస్తుతం నాకు ఈ డబ్బులు అవసరం లేదు కాబట్టి వీటి గురించి పట్టించుకోనవసరం లేదు.

రిసర్గీస్ వారి ప్రస్తుత ముఖ విలువ రూపాయి కాగా మార్కెట్ విలువ 2.35/- రూపాయలుగా ఉంది. కొంతకాలం క్రిందట వీరి షేర్ ముఖ విలువ పది రూపాయలుగా ఉన్నప్పుడు వీరి మార్కెట్ విలువ డెభైఅయిదు రూపాయలుగా ఉండేది. అప్పుడు ఈ కంపెనీ వారు షేర్ని స్ప్లిట్ చేస్తున్నారు అన్న సమాచారం మరియు ప్రతీ ఒక్క షేర్ కి బోనస్ గా రెండు షేర్స్ ఇస్తున్నారు అన్న వార్త నన్ను ఈ షేర్ని కొనేటట్టు చేసింది. అన్నట్టు గానే స్ప్లిట్ మరియు బోనస్ వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ షేర్ నష్టాలలో సాగుతోంది.

23, సెప్టెంబర్ 2010, గురువారం

టాలెంట్ ఎక్కడో లేదు – మనం గుర్తించడంలోనే ఉంది

ఈ పోస్టు వ్రాయడానికి ముందు పైన చూపిన వీడియోని హరనాద్ గారు వారి బ్లాగులో ఉంచారు. నేను స్వతహాగా వీడియోలను చూడను. కానీ ఈ పోస్టు చూడటానికి ఒకటే కారణం ఆ పాట. మర్యాద రామన్న సినిమాలో నాకు నచ్చిన అంశాలలో ఈ పాట ఒకటి. అదేదో సినిమాలో మహేష్ బాబు ఎంట్రన్స్ కూరగాయల బండిపై చిత్రీకరించారు. ఆ స్టైల్లో తీసినదీ పాట.

మర్యాద రామన్న సినిమాపై నా రివ్యూ మరొ సారి వ్రాస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈ కుర్ర గాంగ్ కూడా యమ చేసారు. బాగుంది వీరి క్రియేటివిటి. అన్నింటికన్నా నాకు నచ్చిన అంశం ఏమిటంటే.. ఈ పాట మధ్యలో ఒక్కసారిగా మన హీరోలు అమెరికా నుంచి ఆంద్రాలోని మురికి వాడలో కనిపించడం.  అలాగే మరి కొన్ని సీన్లు. హాలీవుడ్ తీరులో తల్లక్రిందులుగా కొన్ని కొన్ని సీన్లను చిత్రీకరించడం సాంకేతుకంగా పెద్ద కఠినమైన పని కాకపోయినా, క్రియాత్మకతని దృష్టిలో ఉంచుకుంటే.. తలక్రిందులు అనే పదానికి ఈ విడియోలో బాగా కుదిరింది అని నా అభిప్రాయం.

ఈ మధ్య నాకు ఎదురైన కొంత మంది యువకులలో ఒకరిద్దరు వారి వారి భవిష్యత్ ప్రణాళికల పరంగా ఏమి అవుతావు అని అడిగితే సినిమా డైరెక్టర్ అవుతా అని చెప్పడం కొంచం విశ్మయానికి గురి చేసినా, ఇలాంటి వాళ్ళని చూస్తే వీరి ఆలోచనలు నిజమే అనిపిస్తుంది. అవును ఒక విషయాన్ని ప్రజెంట్ చెయ్యడానికి అందరూ పెద్ద పెద్ద పేరు మోసిన డైరెక్టర్స్ మాత్రమే అవ్వాల్సిన పనిలేదు. క్రొత్తగా ఆలోచించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోగల అవగాహన ఉంటే చాలు అని నా అభిప్రాయం. ఇదిగో ఇలా.. వీరు నా స్టేట్‍మెంట్‍కి సాక్షాలు. వీరిలో ఏదో తెలియని ఫైర్ ఉంది. వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కనుక దీనిని చూస్తే వీళ్ళని పైకిరాకుండా తొక్కేస్తారు. ఈ విడియోలో నాకు మంచి డాన్స్ కనబడింది.. అలాగే వైవిధ్యమైన డైరెక్షన్ కనబడింది.. మరికొంత హ్యూమర్.. మొత్తానికి హాస్యభరితంగా పాటకు తగ్గట్టుగా ఉంది.

ఆ విధంగా టాలెంట్ అనేది ఎవ్వరో గుర్తించ వలసిన అవసరం లేదు, మనకి మనం ముందుగా తెలుసుకుంటే అంతే చాలు. వీరు గుర్తించి ప్రజెంట్ చేసారు. మన ప్రతిభని ముందుగా మనం తెలుసుకుంటే అందులోంచి క్రొత్తగా ఏదో ఒకటి ఉద్బవిస్తుంది. అలా ఉద్బవించినదే మనకి గుర్తింపుని తెస్తుంది. అంతే గాని మన టాలెంట్ ఎదుటివారు గుర్తించాలి అని మనం ఏదో ఒకటి చెయ్యకూడదు అని నేను నమ్ముతాను. ఏదో ఒకటి చెయ్య్ండి .. కానీ ఆ చేసేది క్రొత్తగా మీ స్వంత ఆలోచనతో మీదైన ఒక శైలిలో చెయ్యండి. అప్పుడు నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు. అదేదో ఆంగ్లంలో చెప్పినట్టు సెల్ఫ్ రియలైజేషన్ అన్నింటికన్నా ముందుండాలి అన్నట్టు, ముందుగా మీరు మీ టాలెంట్ ఏమిటో తెలుసుకోండి.

ఈ సందర్బంగా నాకు 7G బృందావన్ కాలని సినిమాలోని హీరో హీరోయిన్ గుర్తుకు వస్తారు. ప్రతీ వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అసలు సమస్య అంతా దానిని తెలుసు కోవడంలోనే ఉంది. దానిని తెలుసుకో గలిగితే, ఇక మనకి అడ్డు లేదు అని నేనంటాను. మరి మీరేమంటారు.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉచిత విధ్యాలయం

మొదటి రెండు పుటలు నా కలల సౌధానికి రూప కల్పన చేస్తే.. ఈ పుట ద్వారా, ఉచిత విధ్యాలయం ఎలా ఉండాలను కుంటున్నానో తెలియ జేయడానికి ప్రయత్నిస్తాను.
పేరు చెప్పినట్లుగా, ఇక్కడ పూర్తిగా ఉచితం.. విధ్య మాత్రమే కాకుండా, విధ్యార్ధనకు అవసరమైన అన్నీ ఉచితమే అని అర్దమన్నమాట. ఇక్కడ చదువుకోవాలి అనుకునే వారికి ఉండేటటు వంటి ఒకే ఒక అర్హత, ’చదువుకోవాలి అని అనుకోవడమే’.. ఏంటీ కొత్తగా.. కొంచం అర్దం కానట్లుందా.. ఈ బడిలో చేరాలనుకునే పిల్లలకు స్వతహాగా ఆ ఆలోచన ఉండాలి అన్న మాట. ఏంటిది .. పిల్లలు స్వతహాగా అలా ఆలోచిస్తారా అని మీకు అనుమానం రావచ్చు. కానీ పిల్లల ఆశక్తి దేనిమీద ఉందో తెలుసుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. అలాగే నాకంటూ కొన్ని పరిక్షలు ఉన్నాయి. అవి సశాస్త్రీయమైనవో కాదో నాకు తెలియదు కానీ అవి నాకు ఫలితాన్నిచ్చాయి. ఆ పద్దతులను నేను పలు పిల్లలపై విశ్లేషించినప్పుడు నేను ఆశించిన ఫలితం వచ్చింది. అలాగే వారు ఆ విధంగా తీర్చిదిద్దబడుతున్నారు.
కొంతమంది పిల్లలలో చదువంటే ఆశక్తి ఉంటుంది, మరికొంత మంది పిల్లలలో ఆటలంటే ఆశక్తి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా అలాగే అందరూ ఐన్ స్టీన్ అవ్వాలనీ ఎక్కడా వ్రాసి లేదు. కొందరు విశ్వనాద్ ఆనంద్ లాంటి వారులాగా తయ్యారయ్యితే మరికొందరు జెస్సీ ఒవెన్స్ లాగా తయ్యారు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీరందరికీ కావాలసినది అల్లా ఒక్క చేయూత మాత్రమే. అదేదో సినిమాలో చెప్పినట్టు .. ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. అవకాశం మాత్రమే కావాలి. నాకు తెలిసినంత వరకూ అదేదో తెలుగు సామెత చెప్పినట్టు, జింక చిక్కిందంటే పరుగెత్త లేక కాదు కాలం కలసి రాక .. అలా కాలం ప్రతీ ఒక్కరికీ కలసి వస్తే ప్రతీ వ్యక్తి ఓ మహర్షి అవుతాడు అని నేను నమ్ముతాను.
అవకాశం రాకే ప్రతీ వ్యక్తి పనికిరానివడౌతాడని నా నమ్మకం. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎంతమంది వచ్చిన అవకాశాలను ఒదులుకుంటున్నారో (అని వ్రాయడం కన్నా జారవిడచుకుంటున్నారో అని వ్రాయడం ఇక్కడ సమంజసంగా ఉంటుంది) నాకు తెలుసు. అలా అవకాశాలు రాక కొందరు నిర్జీవులైతే.. వచ్చిన అవకాశాలను కాలరాచి మరికొందరు నిస్తాణువులై ఏమి పట్టనట్టు మిగిలిపోతున్నారు. వీటన్నింటికీ కారణం చిన్న వయస్సులో పడాల్సిన మంచి నాట్లు అని నా అభిప్రాయం. చిన్నప్పుడు గనక మంచి చదువు లేదా మంచి నడవడిక అలవాటైతే వారి భావితరం బాగా వర్దిల్లుతుందని నేను నమ్ముతాను.
ఇలా చిన్న వయస్సులో మంచి నడవడిక, మంచి చదువు, ఇక్కడ చదువు అంటే పుస్తకాలకు పరిమితమైనటువంటిది మాత్రమే కాదు సుమా.. కనుక మనం నేర్పగలిగితే భావితారాలకు ఎంతోకొంత మేలు చేసిన వారం అవుతామని నా అభిప్రాయం. ఇక విద్యాలయం విషయానికి వస్తే.. ఇక్కడ పూర్తిగా గురుకులం పద్దతిలో ఓ సుశిక్షుతుడైన యోధుడు ఎలా క్రమశిక్షణగా పెరుగుతాడో అలాంటి ఒక వాతావరణం ఇక్కడ కనబడాలని నేను కలగంటున్నాను. ఈ రోజునాటికి నాకు ఉన్న ఆలోచన ఈ విధంగా సాగింది, మరి రేపటి విషయమేమిటో.. నా పాఠశాలలో నేను జరపాలనుకునే దినచర్య ఈ విధంగా ఉంటుంది. మార్పు చెందవచ్చు..
  • వేకువఝామున, సూర్యోదయానికి ముందుగా పిల్లలు నిద్రలేస్తే.. సూర్యోదయం తరువాత ఓ గంట సమయానికల్లా చక్కగా తయ్యారై బ్రేక్ ఫాస్ట్ చేసేచోటికి చేరుకుని ఓ అరగంటలో తృప్తిగా తిని ఆటలాడుకోవడానికి వెళతారన్నమాట
  • ఇలా ఆటలాడుకోవడానికి వెళే సమయం దాదాపు ఏడు గంటలవుతుంది. ఇలా ఆటలాడడానికి వెళ్ళిన పిల్లలు ఓ రెండు గంటల పాటు ఆటలాడి తొమ్మిదిన్నర కల్లా చక్కగా  వారి వారికి ఏర్పరిచిన స్థలాలోకి చేరి ఓ కడివెడు పాలు త్రాగి పది గంటలకల్లా స్నానపానాది కార్యక్రమాలు ముగించుకుంటారు.
  • పదిన్నర లేదా పదకొండు గంటలకల్లా చదువు మొదలు
  • ఒంటిగంటకు భోజనం
  • రెండుగంటకు తిరిగి చదువు మొదలు
  • నాలుగున్నరవరకూ చదువు ఆ తరువాత ఫలహారం
  • ఐదునుంచి ఏడు వరకు మళీ ఆటలు
  • ఏడునుంచి ఎనిమిది వరకూ విశ్రాంతి
  • ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య రాత్రి భోజనం
  • తొమ్మిదిన్నర నుంచి ఎవ్వరిస్టానుసారం చదువు లేదా నిద్ర
  • ..
ఎలా ఉంది నా ఆలోచన..?

26, ఆగస్టు 2010, గురువారం

అమెరికాలో నాకు నచ్చిన అంశాలు

AMERICA

ఎప్పుడూ అమెరికాని ఆడిపోసుకుంటున్నననే అనుకుంటునారుగా, అదేంలేదు. ఇదిగో ఇక్కడ అమెరికాని మరో కోణంలోంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ప్రతీ నాణానికి రెండు వైపులుంటాయి, ఇంతకాలం ఒకవైపు చదివిన మీకు ఇప్పుడు మరో వైపు చూపడానికే ఈ ప్రయత్నం.

అన్నింటికన్నా మొదటిది వీరి నవ్వు మొహం. మనం ఎవ్వరమో తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం వారిని చూసాము అన్న విషయం వారు గమనించగానే నవ్వుతూ .. ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఇలా ప్రశన్న వదనంతో పలకరించడం వీరికి చిన్నప్పటి నుంచి నేర్పి ఉంటారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, స్మైల్ కాస్ట్స్ నథింగ్, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నా మొహం ఎప్పుడో కాని స్మైలీగా కనబడదు. అలాగని చికాకు వదనంతో కూడా ఉండను. అక్కడే వచ్చింది చిక్కంతా, ఆ పెట్టే మొహం ఏదో నవ్వు మొహం కాకపోయినా చిరు దరహాసమో లేక మందహాసమో నీ మొహంలోకి తెచ్చుకోవేరా వెధవా అని నా అంతరాత్మ తెగ ఘోషిస్తూ ఉంటుంది. అయినా మొహాన్ని కొంచం ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా!!

ఇక రెండొవది. వీరి సహజ వనరుల నిధి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు అలాగే పచ్చని గడ్డి. అంటే నేను ప్రస్తుతం ఎండాకాలం మరియు వానాకాలం మధ్యలో ఉన్నాను కదా అలాగే ఉంటుంది. వీళ్ళ శీతాకాలంలో ఇక్కడ ఎక్కడ చూసినా మంచే కనబడుతుందంట. నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఊరిలో ఉన్న చెట్లను ఆ ఊరి ప్రభుత్వం చూస్కుకుంటే, ఇంటి బయట ఉన్న విశాలమైన ప్రదేశంలో ఇష్టమున్న వాళ్ళు వారి అభీష్టం మేరకు చెట్లను పెంచితే, లేని వాళ్ళు కనీసం గడ్డిని క్రమబద్దంగా పెంచుతారు. ఆ విధంగా పచ్చదనం అన్ని చోట్ల కనబడుతుంది. ఇక పై చెప్పిన రెండు చోట్లకాక అడవిలో పెరిగే చెట్లను కూడా వీరు చాలా శ్రద్దగా చూసుకుంటారు, అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న అడవులు కాలుతుంటాయి కూడా. అలా అడవులు కాలుతూ ఉండే సమయంలో ఆ మంటలర్పడం కూడా ఓ నేర్పే. దానికి కూడా, అంటే అడవులు ఆర్పడానికి ఉండే సిబ్బంది కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు అంతే కాకుండా అది ఒక కెరీర్ అంటే నమ్ముతారా!! ఇక్కడ అనవసరమైనా మఱో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చాలా రాష్ట్రాలలో ఫైర్ మెన్స్ అంతా జీతాలు లేకుండా పనిచేసే సంఘ శేవకులు అంటే నమ్ముతారా!! అంటే వీళ్ళకు ఎంతో కొంత మొత్తం జీత భత్యాలు ఉంటాయి కానీ ఇక్కడి ఫైర్ మెన్ మాత్రం జీత భత్యాల కోశం మాత్రం పని చెయ్యరు అన్నది నేను విన్నది. ఇది నిజమైతే వీరెంత నిశ్వార్ధ పరులో కదా..

ఇక మూడవది వీరి డ్రైవింగ్ విధానం. చాలా మంది అంటే నూటికి తొంబై శాతం మంది డ్రైవింగ్ పద్దతులను చూచా తప్పకుండా పాటిస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవ్వరూ వస్తున్నట్టు కనబడకపోయినా, ఎవ్వరూ చూడకపోయినా, ఆగుము అన్న సంజ్ఞ కనబడగానే కారుని అచ్చంగా ఆపి మరీ వెళతారు అనేది ఒక చిన్న ఉదాహరణ. ఎటొచ్చీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ నగరంలో మాత్రం అలా కాలేదు. అక్కడ మరో విధంగా ఉంది. అది అచ్చం మన హైదరాబాద్ లాగా అనిపించింది. ఇలా అనిపించడం వెనకాల ఒకటే కారణం అక్కడ ఎక్కువ మంది జనాభా ఉండటమే. అలాగే రోడ్డు మీద నడిచేవాళ్ళు కనుక కనబడితే తప్పని సరిగ్గా నడిచి వెళ్ళే వాళ్ళకే వీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. రోడ్డు దాటేటప్పుడు అడ్డదిడ్డంగా దాటినా వీరేమి అనరు, ఎటొచ్చి బండి ఆగగల వేగంలో వెళుతూ ఉంటే తప్పని సరిగా ఆపేసి నడిచి వెళ్ళే వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఒక వేళ బండి కనుక ఆపలేని వేగంతో వెళుతోందనుకోండి.. నడిచి వెళ్ళే వాళ్ళను ఎవ్వరూ ఆదుకోలేరు. వీరికి అవకాశం ఉన్నంత వరకూ నడిచి వెళ్ళే వాళ్ళకు దారినిచ్చిన తరువాతే వీరి ప్రయాణం సాగుతుంది. చాలా తక్కువగా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అన్నంత మాత్రాన అవ్వవు అని కాదు కాకపోతే వీటి తీవ్రత చాకా తక్కువ అని నా ఉద్దేశ్యం. చాలా మటుకు ఇన్స్యూరెన్స్ ఉండటం మూలాన ఎవ్వరికి ఇది ఇబ్బంది కాదు, ఇన్స్యూరెన్స్ లేకపోతే ..

మరో పుటలో మరికొన్ని నచ్చిన అంశాలతో .. వీటిపై మీ స్పందనలను మాత్రం మరువవద్దు..

 
Clicky Web Analytics