13, ఆగస్టు 2010, శుక్రవారం

పాత పాటలోని లిరిక్స్ – ప్రశ్నలకు సమాధానాలు

ఇంతక మ్రుందు వ్రాసిన పుటలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సమాధానాలు వ్రాయడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసానంటే.. దానికి పలు కారణాలున్నాయి. వాటిల్లో ఒకటి ఈ పాత పాట మళ్ళీ నా చెవిన పడటం మొదటి కారణమైతే, ఇంతకు ముందు వ్రాసిన పుటకి ఎవ్వరూ స్పందించకపోవడం ఈ ఆలశ్యానికి మఱో కారణం. ఏది ఏమైనా ఈ సినిమా నేను పుట్టడానికి ఓ సంవత్సరం ముందు విడుదలైంది, అంటే 1971 లో అన్నమాట. ఈ సినిమాకి కేవీ మహదేవన్ సంగీతాన్ని అందిస్తే మల్లికార్జున్ దర్శకత్వ భాద్య్తతలను స్వీకరించారు. నట శేఖర కృష్ణ మరియు భారతి అలాగే జయసుధ ముఖ్య పాత్రలలో నటించింన అందరికీ మొనగాడు సినిమాలోని "ఆడగనా మాననా అమ్మాయి.." పాటలోని చరణాలే ఇంతకు మ్రుందు వ్రాసిన పుటలో ప్రశ్నలకు మూలం.

ఇదిగో ఇక ఆలశ్యం చెయ్యకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ క్రింది విధంగా..

౧) మగవాడు చేసేది అల్లరి .. వగలాడి విరిసేది మురిసేది రాగ వల్లరి..

౨) మగవాడు తలచేది కమ్మని కైపు.. జవరాలు మఱువనిది ప్రియతమ రూపు..

౩) మగవాడు కోరేది ఆనందం.. ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబందం..

౪) ..

నాల్గొవ ప్రశ్నకు సమాధానం నేను వ్రాయను. మీకు తెలుసుకోవాలనిపిస్తే ఎక్కడైనా ఈ పాటని పట్టుకోండి లేదా నన్ను సంప్రతించండి. ఈ పాటను నేను మీకు పంపుతాను, అది విన్న తరువాత మీకే అర్దం అవుతుంది ఆ నాల్గొవ ప్రశ్నకు సమాధానం

5, ఆగస్టు 2010, గురువారం

ద గివింగ్ ప్లడ్జ్ – సంపాదనను దానం చేస్తానన్న ప్రమాణం

page_header

ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వారిలో కొంతమంది అంటే ఓ లభైమంది తాము సంపాదించిన దానిలో వీరి ఆస్తిలోని దాదాపు అంతా సమాజ సేవకు దానం చేస్తామని ప్రమాణం చేసారు. ఇలా ప్రమాణం చేసిన వీరి ఆస్తులు వీరు బ్రతికి ఉండగాగానీ తదనంతరం కానీ సమాజ సేవకు ఉపయోగ పడుతుందన్న మాట. వీరంతా వ్యాపారాలకు భిన్నంగా ఒకే గూటి క్రిందకు చేరి పాలు నీళ్ళుగా కలసి మెలిసి అందరం బాగుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని నేను ఏదో సొల్లు వేస్తున్నాననుకోకండి. వీలైతే ఓ సారి ఈ లంకెను దర్శించండి. మీకే అర్దం అవుతుంది. ఇలా ఈ గివింగ్ ప్లడ్జ్ లో పాలు పంచుకోవాలంటె మీకు ఉండవలసిన అర్హత అల్లా ఒక్కటే మీ ఆస్తి బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ ఉండటమే..

ఇలా మ్రుందుకు వచ్చిన వాళ్ళలో నాకు చాలా బాగానచ్చే వాళ్లలో ఒకడైన లారీ ఎలిసన్ కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా ప్రపంచం అంతా ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటారని అందరూ అంటారు. కానీ కొన్ని విషయాలలో ఇలా ప్రపంచానికి ఎదురీదటం మంచిదే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇది నిజం కాకపోతే.. ప్రపంచంలోని అన్ని పర్సనల్ కంప్యూటర్లు దాదాపు ఒకే రకమైన ప్రోససర్ మరియు మదర్ బోర్డ్ వంటి నిర్మాణంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆ వైపు అడుగులు వేస్తుంటే, వీరందరినీ కాదని తనదంటూ ఒక హార్డ్‍వేర్ ఆర్కిటెక్చర్ తయ్యారు చేసుకుని, ఈరోజుల్లో ఐఫోన్ దగ్గర్నుంచి మాక్ కంప్యూటర్ వరకూ తనదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మాక్ అధిపతి స్టీవ్ జాబ్స్ ఆలోచన కూడా నిజంకాదు.

నా ఆలోచనలు నా అభిప్రాయాలను ప్రక్కన పెట్టి మనం కనుక ఆలోచించుకుంటే, హిల్టన్ హోటల్స్ అధిపతికూడా ఇలా తన సంపాదనలో ఎక్కువ శాతం సంపాదనని అవసరమైన వారికి ధారాదత్తం చేస్తానని ప్రమాణం చేసారు. ఇలా ఇక్కడ ఓ నలభై మంది ప్రమాణం చేస్తే, వీరందరిలో ఓ ముగ్గురి గురించి మాత్రమే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉంది. నాకు తెలిసిన ఆ ముగ్గురు ఎవ్వరంటే, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ మరియు వీరి భార్య ఒక్కరైతే, తన ఆస్తిలో 99% వాటాని మిలిండా గేట్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ పేర వ్రాసిన అపర దానశీలి వారెన్ బఫేట్ మరొక్కరు. ఆఖరుగా నేను అభిమానించే వ్యక్తి, ఆరకిల్ అధిపతి లారీ ఎలీసన్.

వీలైతే మీరు ఒకసారి చూడండి.

4, ఆగస్టు 2010, బుధవారం

అమెరికా వాళ్ళు ఇంత పిసినారోళ్ళనుకోలేదు..

అమెరికాలోని మనుష్యులు కూడా పిసినారోళ్ళే. వీళ్ళేం పెద్ద పుడ్డింగోళేంకాదు. వీళ్ళు మామూలు మన లాంటి సాదా సీదా వాళ్ళే కానీ మనలా బయటకి కనబడరు. దొంగలు.. ఇవాల్టి యు.ఎస్.టుడే వార్తలలో ఒకటి నిరుద్యోగం వారికి ప్రభుత్వం వారు ఇచ్చే జీవన్ భృతి గురించి. ఆ వార్త శీర్షిక ఈ విధంగా ఉంది, నిరుద్యోగం మరియు ఉపాధి బెనిఫిట్స్ స్థిరంగా ఉన్నాయి. ఒకవేళ నేను తెలుగులోకి సరిగ్గా తర్జుమా చెయ్యలేకపోతే ఈ వార్తని ఈ లంకెలో చదువుకోండి. అఖరి గణనాంకాల ప్రకారం అమెరికాలోని నిరుద్యోగుల శాతం దాదాపు ౯.౫ (9.5%). అంతే కాకుండా ప్రతీ నిరుద్యోగికి ప్రబ్యుత్వం తరుఫున అందే మొత్తం  సగటున ౧,౫౪౬$లు (1,546$). దీనిని బట్టి మీకు అర్దం అయ్యిందేమిటి, ఇక్కడ నిరుద్యోగికి భత్యం వీరి నిత్య జీవనానికి సరిపోయే అంత దానికన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అలస్కా అనే రాస్ట్రంలో అయితే ఈ సంఖ్య మరీ ఎక్కువ దాదాపు మూడున్నర వేలకు పైగా. అన్నింటికన్నా అధమంగా ఫ్లోరిడా రాస్ట్రంలో పన్నిండున్నర వందల డాలర్లు నెలసరి వేతనంగా ఇచ్చారు. ఇవి జూన్ లెక్కలు. అస్సలు ఉద్యోగం లేని వ్యక్తికి ఇలా డబ్బులు ఇస్తే వాడెందుకు ఉద్యోగం చేస్తాడు? ఈ విషయం ప్రక్కన పెడితే.. ఇందుకు భిన్నంగా మూడు నాలుగు రోజుల క్రిందట ఓ వార్త చదివాను.. అది నన్ను విశ్మయానికి గురి చేసింది.

cashcowx ప్రస్తుత గణనాంకాల ప్రకారం నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో దాదాపుగా ఎనిమిదిన్నర వందల బిలియన్ల ధనం రొక్కంగా మూలుగుతోందట. ఇక్కడ రొక్కం అనే విషయాన్ని మీరు కాష్ అని చదువుకోండి. ఈ క్యాష్ నిలువలు ఇతిమిద్దంగా పెరిగి అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని కని విని ఎరుగని మొత్తాన్ని చేరుకున్నాయంట. ఇది ఒక రికార్డ్. ఈ మొత్తం ఎదుగుదల ఇక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉందంట. అంటే ఇది ఇలాగే సాగితే, ఈ సంవత్సరాంతానికి అది దాదాపు వెయ్యి బిలియన్ల మొత్తానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ళ క్రిందట మొదలైన బ్యాంకుల మూతల నష్టాన్ని అమెరికా ప్రపంచం మొత్తానికి చూపించి సానుభూతిని కొట్టేసిందే, మరి ఇక్కడ పేరుకు పోతున్న నిధుల విషయమేమిటో. అది సరే గాని ఈ ఎనిమిదిన్నర బిలియన్ల్ మొత్తం ఏ మేరకు సరిపోతుందో తెలుసా.. దాదాపు రెండున్నర మిలియన్ల మందికి సంవత్సరానికి డెభ్భైవేల జీతంతో ఐదు సంవత్సరాల పాటు ఉపాధికి సరి సమానం. అంటే ఐదేళ్ళపాటు దాదాపు పాతిక లక్షల మందికి అవసరానికన్నా మించి మూడొంతులకు సరి సమానంగా ఆర్ధిక స్థితి ఉందన్నమాట, అంతే కాకుండా వీరు సంపాదించేదానిలో మూడో వంతు మళ్ళీ టాక్సులనో తొక్కనో లేకపోతే గాదిడ గుడ్డనో ప్రభుత్వం తీసుకుంటుందికదా. సంపాదించిన ప్రతీవాడు ఏదో విధంగా ఖర్చు చేస్తాడు కదా.. ఈ విధంగా వ్యాపారాల్లు పునఃరుద్దరణకు నోచుకుంటాయి కదా.. ఒక వేళ వీడు ఖర్చు పెట్ట లేదనుకోండి, మిగిలిన డబ్బులను బ్యాంకులోనే కదా దాచుకునేది. ఆవిధంగా నైనా డబ్బు మళ్ళీ బ్యాంకుల్లోనే కదా చేరేది. ఇలా ఎలా చూసుకున్నా వీరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉండేది!! ఎప్పుడ్? పైన ఉదహరించిన నాన్-ఫైనాషియల్ సంస్థలలో నిల్వలుగా పేరుకుంటున్న నికర ధనం గనుక ఉపాధికి ఉపయోగిస్తే.

పని చెయ్యొద్దురా ఉచితంగా డబ్బులిస్తాం అని ప్రభుత్వం గోల చేస్తుంటే, ఎవ్వడు మాత్రం పని చేస్తాడు? వీటన్నింటి వెనుక మరో రహస్యం. నాన్-ఫైనాన్షియల్ సంస్థలలోనే ఇంత మొత్తం మూలుగుతుంటే, మరి ఫైనాన్షియల్ సంస్థల పరిస్థితేమిటంటా!! వీటి గురించి మరో సారి మనం విశ్లేషించుకుందాం. అంత వరకూ బై..

3, ఆగస్టు 2010, మంగళవారం

అమెరికాలో నేను చేసిన మొదటి సాహసం

 

DSCN1095 అమెరికాని దర్శించడం నేను ఇది రెండవసారి. మొదటి సారి వచ్చినప్పుడు పెద్దగా ఏమీ చూడలేదు సరికదా ఎక్కువగా ఎక్స్ ప్లోర్ చేసింది లేదు. కాని అందుకు భిన్నంగా ఈ సారి ఎన్నో సాహస ప్రయత్నాలు చేస్తున్నాను. వాటిల్లో మొదటిది వచ్చీ రాగానే న్యూయార్క్ నగరాన్ని చుట్టేయ్యడం. దీని గురించి ఒక్క సారి క్లుప్తంగా కాకపోయినా కొంచం తక్కువ వివరంగా..

నా ఫ్లైట్ భాగ్యనగరం నుంచి దుబాయికి మొదటి అంగలో చేరుకుంటే, రెండవ అంగ దుబాయి నుంచి న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయానికి, ఆ తరువాత అక్కడినుంచి ఫిలడెల్‍ఫియాకు మూడవ అంగలో విమాన యానం. ఫిలడెల్‍ఫియా నుంచి రెడింగ్ నగరానికి కారులో ప్రయాణం అన్నమాట. ఇదిగో ఇక్కడే నేను చేసిన మొదటి సాహసం. న్యూయార్క్ ఏయిర్ పోర్టులో దిగిన తరువాత ఇక్కడి సహోద్యోగులకు ఫోన్ చేసి నేను క్షేమంగా చేరుకున్నాను ఇక్కడ నాకు ఓ అయిదు గంటల సమయం ఖాళీ దొరికింది, కనుక ఏమి చెయ్యమంటారు అని అడిగాను. ఏమీ చెయ్యొద్దు, చక్కగా అక్కడ లాంజ్‍లో నిద్దరో అన్నారు. ఉన్న అయిదు గంటల్లో ఓ గంట మళ్ళీ సెక్యూరిటీ చెకిన్.. గాడిద గుడ్డు .. గోంగుర పాసు ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కడో ఓ జాగా చూసుకుని ఓ మూడు గంటలు కళ్ళు మూసుకుని కునుకు తీయ్యు అని ఓ చెత్త సలహా ఇచ్చారు.

అది కాదురా ఎలాగో న్యూయార్క్ ఏయిర్ పోర్టులో ఉన్నాగా అలా ఓ రౌండ్ వేసి వస్తా అన్నా, ఎవ్వడి కాడు నన్ను భయపెట్టినోళ్ళే గాని, భలే !! మంచి ఆలోచన జాగ్రత్తగా పోయి చూసి క్షేమంగా తిరిగిరా అన్న వెధవలేడు. అలాంటప్పుడేకదా నేను సాహసం చేసేది. ఇంకేం, లగేజీ చెకిన్ చేసేసి కెన్నెడి విమానాశ్రయం నుంచి మాన్‍హట్టన్ నగరానికి ఎయిర్ ట్రైన్ ఉంటే అది పట్టుకుని జాం అంటూ బయలు దేరాను, అక్క్డడకు వెళ్ళంగానే నాకోసమే అన్నట్టు లోకల్ ట్రిప్స్ తిప్పే బస్సు వాడు వేచి ఉన్నాడు. వాడి మొహాన ఓ నలభై నాలుగు డాలర్లు కొట్టి ఇక ఫో అన్నా. వాడు వెంటనే ఓ తాడి చెట్టంత చిట్టా చించి నా మొహాన విసిరి నా పనైపోయిందన్నట్టు చూసాడు. ఇంతకీ ఇది ఏమిటిరా అబ్బాయి అని అడగ్గానే, ఓ వింత మనిషిని చూసినట్టు ఓ లుక్కేసి, దీనిని రిసీట్ అంటారు, నువ్వు ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా నిన్ను ఎవ్వరూ అడగరు. నిన్ను న్యూయార్క్ నగరం మొత్తం చుట్టాలంటే, మూడు దారులు గుండా నిన్ను తిప్పాలి కాబట్టి ఒక్కొ మార్గంలో తిరిగే బస్సు వాళ్ళు ఒక్కొక్క బిల్లు తీసుకుంటారు అంటూ విసుక్కున్నాడు

DSCN1117 విసుక్కుంటే విసుక్కున్నాడు వివరం చెప్పాడు అనుకుని ఎదురుగా కనబడ్డ డబల్ డక్కర్ బస్సెక్కి మన బొమ్మరిల్లు సినిమాలో వీరోయిన్ కూర్చున్నట్టు బస్సు టాప్ ఎక్కి అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్న రెండు సీట్లను ఆక్రమించేసా. ఇంతలో మరో తెల్ల తోలు వచ్చి నీ ప్రక్కన చోటుందా అని అడిగితే, మొహమాటం లేకుండా అదిగో ప్రక్కన ఉన్న మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ సద్దుకో అని ఓ సలహా పడేశా.. హీ హీ.. అదిగో అలా బయలు దేరిన న్యూయార్క్ ప్రయాణంలో అక్కడి చారిత్రక కట్టడాలను చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోలు తీసుకుంటూ గడిపేశా. అక్కడ నేను చూసిన కొన్ని చారిత్రాత్మక స్థలాలలో మొదటిది.. టైటానిక్ ఓడని ఉపయోగించిన వ్యాపార సంస్థ భవనం. ఆ తరువాత ఎంపైర్ స్టేట్ భవనం.. అటుపై గ్రౌండ్ జీరో మరియు దానికి ప్రక్కనే ఉన్న న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి, దూరం నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టి, న్యూయార్క్ బ్రిడ్జ్, చైనా టౌన్ మొదలగు ప్రదేశాలు చూస్తుంటే పుణ్యకాలం ఎలా గడిచిపోయిందో తెలియదు.

న్యూయార్క్ లో నా ఫ్లైట్ మూడు గంటలకు తీరా చూద్దును కదా అప్పటికే రెండయ్యింది. ఇంకే మరొసారి సాహసం. గబగబా దగ్గర్లోని సబ్‍స్టేషన్ పట్టుకుని, అక్కడి నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం. ఇది దాదాపు ఓ నలబై నిమిషాలు. తీరా అక్కడికి చేరుకున్న తరువాత తెలిసిన విషయమేమిటంటే సెక్యూరిటీ చెకిన్ మూసేశారని. అక్కడి కౌంటర్ క్లర్క్ ఆ రోజున ఎవ్వరితోనో గొడవ పడ్డట్టున్నాడు అందువల్ల ఏ మాత్రం నాగోడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకుని, కొంచం టోన్ మార్చి గంభీరంగా అడిగా, ఎప్పుడైతే గొంతుకులో సౌండు మారిందో వెధవ దారికొచ్చాడు. బోర్డింగ్ టికెట్ ఇస్తా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆలశ్యం చేస్తే దానికి నాది కాదు పూచీ అన్నాడు. ఏదో ఒకటి ముందు చెయ్యిరా మగడా అని వాడినుంచి బోర్డింగ్ టికెట్ తీసుకుని సెక్యూరిటీ చెకిన్ చేసే క్యూలోకి దూరాను. అక్కడ మరో చాంతాడంత క్యూ ఉంది. ఎలాగరా అనుకుంటూ దిక్కులు చూస్తుంటే అక్కడి సెక్యూరిటీ వాళ్ళకు నాపైన అనుమానం కలిగింది.

వెంటనే ఓ ఆఫీసర్ నన్ను ప్రక్కకి పిలిచి విషయమేమిటన్నాడు. ఇదీ సంగతి అక్కడ నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకొన్ని నిమిషాలలో ఎగర బోతున్నది ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నా. విషయం అర్దం చేసుకున్న ఆఫీసర్ ముందుగా క్షమాపణలు అడిగి ఆతరువాత అక్కడ ఉన్న మరో ఆఫీసర్‍తో ఏదో మాట్లాడి ఆ క్యూలోంచి ప్రక్క దారిలో చెక్కింగ్ చేయించే ప్రయత్నం చేసాడు. హమ్మయ అనుకునేంతలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఆఖరుగా చెక్కింగ్ చేసే అధికారికి నాపై లేని పోని అనుమానం కలిగింది. నన్ను తీసుకొచ్చిన ఆఫీసర్ నాకెలా తెలుసు, నన్ను ఎందుకు ప్రక్కదారిలో ఇక్కడకు తెచ్చాడు, వంటి వంకర టింకర ప్రశ్నలు వేస్తుంటే.. ఇందాక టికెట్ దగ్గర వాయిస్ పెంచితే పనైన విషయం గుర్తుకు వచ్చి మెల్లగా నా వాయిస్ స్థాయిని పెంచి సమాధానాలిస్తూ, ఒక వేళ నేను ఫ్లైట్ మిస్ అయితే నువ్వే మరో ఫ్లైట్లో నన్ను పంపించాల్సొస్తుంది అని క్లూ ఇచ్చాను. ఈ విషయం తెలియంగానే ముందుగా కంట్ర్లోల్ రూమ్‍కి ఫోన్లో నా విషయాన్ని చేరవేసి మా ఫ్లైట్ కొంత సేపు ఆపించాడు.

విషయం తెలియంగానే హమ్మయ్య అనుకున్నా. ఇక నీ ఇష్టం ఎన్ని ప్రశ్నలు కావాలో అన్ని ఏసుకోరా అంటూ ఎదురు తిరిగాను. అప్పుడు మొదలైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం దాదాపు ఓ అరవై నిమిషాలు సాగింది. వాడికి కాలక్షేపం నాకు అదో ఆటవిడుపు. ఈ ప్రశ్నోత్తరాలలో నా బ్యాగ్‍లో ఉన్న టూత్ పేస్ట్ కూడా పాలు పంచుకుంది. దాని అలా టాయిలెట్ బాక్స్ లో ఉంచి తీసుకెళ్ళకూడదంట. దానికి మరో ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు పట్టుకెళ్ళాలంట. వీటికి తోడు మా అమ్మ చేసిచ్చిన గారెలు మరియు దిబ్బరొట్టెలు. ఇవేంటన్నాడు. వీటిల్ని దిబ్బరొట్టేలంటారు వీటిల్ని ఆవకాయతో తింటాం అంటే ఏదీ ఇప్పుడు తిని చూపించమన్నాడు. ఒరేయ్ ఇవి నాకు రాత్రికిరా అంటే వినడే. అప్పటికప్పుడు తినమంటాడు. సరే అని ఓ సగం తిన్న తరువాత అంతా నువ్వే తింటావా అన్న లుక్కు వాడి మొహంలో కనబడగానే ఓ సగం వాడికి ఆఫర్ చెసా. ఆకలి మీద ఉన్నపులి మాంశం కనబడగానే ఎలా ఎగ్గిరి దూకుతుందో అలా వీడు నా దిబ్బరొట్టిపైకి దాడి చేశాడు.

ఎప్పుడైతే వీడు మనదారిలోకి వచ్చాడో అని తెలియంగానే ఇక మా ఇద్దరి మధ్య వాయిస్ సౌండ్‍లో స్థాయి తగ్గి సిఖరాగ్రావేశ సమావేసపు చర్చలు సజావుగా సాగినాయి. అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇకపో అన్నాడు. ఏడికి పోయేది నువ్వురా నాతోటి లేకపోతే ఆ ఫ్లైట్ వాళ్ళు నన్ను తిడతారు అన్నా. సరే అలాగే కానీయ్ అంటూ నా వెనకాలే మా బోర్డింగ్ కౌంటర్ దాకా వచ్చి దింపి పోయ్యాడు. అలా ఉన్న అయిదు గంటల్లో ఓ సారి న్యూయార్క్ నగరాన్ని చుట్టి రావడమే కాకుండా సెక్యూరిటీ వాళ్ళకు ఆంద్రా దిబ్బరొట్టెలను ఆవకాయను రుచి చూపించాను.

ఈ వీకెండ్లో మరో సాహస యాత్ర విషయమై మళ్ళీ మీముందుంటాను, అప్పటి దాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూఉంటా..

2, ఆగస్టు 2010, సోమవారం

పాత పాటలోని లిరిక్స్ - ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలు ఓ పాత పాటలోనివి.. కొంచం ద్వందర్దాలుగా ఉంటాయి కానీ బాగున్నాయి. వీలైతే మీరు ప్రయత్నించండి. వీటికి సమాధానాలు మరో పుటలో.. అప్పుటిదాకా ప్రశ్నలు మాత్రమే. చదివే వాళ్ళు ఏ విధింగా స్పందింస్తారో చూద్దాం.

 

౧) మొగవాడు చేసేది ఏమిటి? వగలాడి మురిసేది ఏమిటి?

౨) మొగవాడు తలచేది ఏమిటి? జవరాలు మరువనిది ఏమిటి?

౩) మొగవాడు కోరేది ఏమిటి? ప్రియురాలు ఇచ్చేది ఏమిటి?

౪) మొగవాడు అడిగేది ఏమిటి? ప్రాణసఖి ఇచ్చేది ఏమిటి?

 

ఈ పాటలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే నాయికని ఎన్ని విధాలుగా వర్ణించారో బాగుంది కానీ నచ్చని విశయమేమిటంటే అన్ని సార్లు మగవాడు అంటూ వర్ణించడం. ఏది ఏమైనా వీటి వర్ణనలు ప్రక్కన పెడితే, పాటలోని చరణాలు వాటిల్లోని పద ప్రయోగం మాత్రం బాగుంది.

నిజం వ్రాయాలంటే ఈ పాట వింటున్నప్పుడు అన్ని సార్లు ద్వందార్ద సమాధానాలు మదిలో తలచాయి, కానీ సున్నితంగా వీటికి నాయిక సమాధానం ఇవ్వటం బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది?

 
Clicky Web Analytics