13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

3 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

ఊరూరనొకశక్తి ఊగులాడెను నేనే దేవుణ్ననే వారు కుప్పలుగా పుట్టుకొస్తారని తాతగారు వీరబ్రహ్మేంద్రులు ముందుగానే హెచ్చరించారు .

Disp Name చెప్పారు...

మానవుడు నిజమండీ,
దేవుడు నిజమనుకుంటా నండీ,
మధ్యలో అన్నీ డౌటే నేమోనండీ !

చీర్స్
జిలేబి.

చక్రవర్తి చెప్పారు...

దుర్గేశ్వరరావు గారు,

నిజమేనండి. భవిష్యత్ పురాణం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని పాశ్చాత్యులు నమ్మరు కానీ వీర బ్రహ్మేంద్రులు లాంటి వారు మరొకరున్నాను, వారి పేరు గుర్తుకు రావటం లేదు, బహుసా నోస్ట్రస్ డామస్ అనుకుంటా.. వీరు కూడా ఇలానే చెప్పినా అర్దం చేసుకోని పాశ్చాత్యులు ఎవేవో వాగితే వాటినే వేదం అనుకునే తరానికి మనం ఏమి చెప్పినా ఎక్కదు. స్పందించి మీ మనోభావాన్ని తెలియజేసినందులకు ధన్యవాదములు

జిలేబీ గారు,

మీలాగా అనుమానంతో ఉండే వాళ్ళకోసం ఆఖర్లో మఱో వాక్యాన్ని వ్రాసారు. దేవుడు అబద్దం కావచ్చు, కానీ మంచి గురువు మాత్రం నిజం. కాకపోతే, మనం నేర్చుకోవడానికి సిద్దమై ఉండాలి. అంతే, మిగిలినవి అన్నీ యధా విధిగా వాటంతట అవే జరిగిపోతాయి. చీర్స్ కొట్టడనికి అక్కిరాజు గారి బ్లాగుకు వెళ్ళండి, చక్కగా సరిపోతుంది. ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచి నందులకు ధన్యవాదములు.

 
Clicky Web Analytics