5, అక్టోబర్ 2011, బుధవారం

క్రొత్తగా నేర్చుకున్న పాఠం

చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలదాకా వస్తాయన్న సామెత పరంగా కొన్ని కొన్ని అలవాట్లు నన్ను వదలి పోనంటున్నాయి.

ఇంతకు ముందు కొంతకాలం క్రిందట, అనుభవాలనుంచి నేను నేర్చుకోవటం లేదని వ్రాసుకున్నట్లు గుర్తు. ఇది జరిగి దాదాపుగా ఓ తొమ్మిది నెలలైనా, ఈ నిజం వంటపట్టడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. తోలు మందంకదా. అందునా ఒంటి నిండా కొవ్వుందని ఈ మధ్యనే డాక్టర్ గారు తేల్చేశారు. అంత కొవ్వు కరిగి నిజం మింగుడు పడాలంటే, కొంచం కష్టమే కానీ నిజం నిజం కాకపోతుందా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చదరంగం ఆట మఱియు నా ప్రవేశం గురించి.

ప్రతీ సంవత్సరం మా ఆఫీస్ వాళ్ళు చదరంగం పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నేను పాలు పంచుకుంటాను. క్రిందటి ఏడాది ఇలాగే పాలు పంచుకుని ఓ అనామకుని చేతిలో ఓడిపోయ్యాను. ఈసారి కూడా గెలుపు అంచులదాకా వెళ్ళి ఓడిపోయ్యానని ఒప్పుకుని విరమించుకున్నాను. నేను ఓడిపోయ్యాను అన్న స్థితికి ఒక్క నిమిషం వరకూ ఆలోచిస్తే, అన్ని కోణాల్లోనూ నాదే పైచేయ్యిగా సాగుతున్న ఆట అది. కానీ ఇక్కడ నా ప్రత్యర్ది పోరాట పఠిమని మెచ్చుకోకుండా ఉండలేను. తాను ఓడిపోవడనికి అన్ని దారుల్లోనూ వీలుంది అని తెలిసి కూడా చచ్చేవరకూ పోరాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అతనిని గెలిపించింది.

మానవుడన్న తరువాత తప్పులు అనేవి సహజం. ఒక్కొసారి మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో నాకు ఎన్ని సార్లు అవగతం అవుతున్నా, నేను తెలుసుకోలేక పోతున్నా. చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వతహాగా నాలో ఓ చిన్న భావన ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని. అదిగో అందువల్లే ఇంతకు ముందు నేను గెలవాల్సిన ఆట ఓడిపోవడనికి దారి తీసింది.

పోనీలే అని ఊరుకోకుండా, నిష్కర్షగా ఎలా పడితే అలా నరుక్కుంటూ పోతే అప్పుడు ఎదుటి వారు బాధ పడుతున్నారు అన్న భావన నాలో ఉత్పన్నం అవకుండా ఉండి, నేను గెలవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చివ్వరిదాకా పోరాడాలి అన్న క్రొత్త పాఠం నేను నేర్చుకున్నాను. ఎదుటి వారు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవ్వడం ఇంతకాలం నేను చేసిన ఓ తప్పిదం అని ప్రస్తుత కాలం ఓ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే కాలం ఇంకేం నేర్పుతుందో.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

>>మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని.<<

100% కరెక్ట్ సార్ .. మీతో అన్నానో లేదో గుర్తు లేదు కాని నేను చాలా సార్లు అది గమనించాను .. చదరంగం గేమ్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అవకాశం వచ్చినప్పుడు కుమ్మి పడేయ్యాలి సార్ .. పైచేయి కలిగి కూడా ఒక ఓటమి మరియు ఓటమిని స్పోరిటి‌వ్ గా తీసుకొలేని నా మనస్థత్వంకు పోటిలో పాల్గోనే అర్హత లేదని చదరంగం మానేసి ఐదేళ్ళు అయ్యింది .. మీ పోస్ట్ చూస్తుంటే మళ్ళీ ఆడాలనిపిస్తుంది ..

 
Clicky Web Analytics