20, ఆగస్టు 2011, శనివారం

భద్రాచలం – మఱో ఙ్ఞాపకం

DSCN2500వెళ్ళిన వెంటనే లగేజి సత్రంలో ఉంచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రక్కనే ఉన్న గోదావరిని చూచి వచ్చిన తరువాత ఆలశ్యం అవుతోందని, తొందరలో అయ్యవారి దర్శనార్దం వెళ్ళాము. తీరా దేవాలయం దగ్గరకి వెళితే, అయ్యవారు కొండెక్కి కూర్చున్నారు. ఆ మాత్రం కష్టపడక పోతే అయ్యవారి దర్శనం కలగదులే అని అనుకుని, మెల్లగా ఒక్కోఅడుగు ముందుకు వేసుకుంటూ కనబడుతున్న మెట్లెక్కడం మొదలు పెట్టాను.

భక్తులలో చాలా రకాలు ఉంటారు కదా, వారిలో అయ్యవారిని తొందరగా దర్శనం చేసుకునే హడావిడి ఉన్నవారికి నాలా నత్తలా నడుస్తున్న వారు కనబడక పోవడం వల్ల కొంచం చికాకు వేసినా, నా స్థితికి నేను సమాధానం ఇచ్చుకుని పరుగులెత్తేవారికి దారివ్వడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నా అదృష్టమో లేక అది సహజమో కానీ సర్వదర్శనానికి ఎవ్వరూ లేరు, అందరూ ప్రత్యేక దర్శనానికే మక్కువ చూపుతున్నారు. అందుకని మేము కూడా ప్రత్యేక దర్శనానికే టికెట్టు తీసుకుని దర్శనార్దం వరుసలో నిలబడ్డాం. మెల్లగా ఒక్కొరొక్కరూ ముందుకు సాగుతుంటే, గర్బాలయంలో కూర్చొని ఉన్న అయ్యవారిని దర్శించుకునే అవకాశం రానే వచ్చింది.

చక్కగా సీతమ్మను ఎడమ తొడపై కూర్చొని ఉంచుకున్న  శ్రీరాముడుని చూడటానికి నా కన్నులు చాలలేదంటే నమ్మండి. ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నా కళ్ళ ముందు నిలిపివేసిన ఆ క్షణాన్ని ఏమని చెప్పాలి. వీరిద్దరినే చూద్దాం అనుకున్నంతలో వీరి ప్రక్కనే నిలబడ్డ లక్ష్మణ స్వామి నా దృష్టిని ఆకర్షించారు. ఆవిధంగా సీతమ్మ సమేతుడైన శ్రీరాముడుని మఱియు లక్ష్మణ స్వామిని దర్శించుకున్న తృప్తి వర్ణనాతీతం. అలా సాగి ఆలయం బయటకు వచ్చిన మాకు ఆ ప్రక్కనే పులిహోర ప్రసాదంగా లభించింది. అది తింటూ చుట్టూ చూస్తుంటే, శ్రీరామదాసు కాలం నాటి ఆభరణాలను ఉంచిన మ్యూజియం కూడా దేవాలయ ప్రాంగణంలో ఉంచడం కొంచం ఆశ్చర్య పఱచినా, ఇది బాగానే ఉందనిపించింది.

వింతైన విషయం ఏమిటంటే, అయ్యవారిని చూడటానికి ఎంత మంది బారులు తీరారో అంతకు రొండింతలు ఇక్కడ కనబడ్డారు. దానికి ప్రవేశ రుసుముగా రెండు రూపాయలు దేవస్థానం వారు ఎందుకు విధించారో నాకైతే అర్దం కాలేదు కానీ ఆ విధంగా నైనా కొంత ద్రవ్యం అయ్యవారి ఖాతాకు జమా అయ్యి ఎంతో కొంత మొత్తం భక్తుల సౌకర్యార్దం ఉపయోగపడుతుందనుకుంటాను. ఇక్కడ మఱో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయ్యవారి ఆలయం ప్రక్కనే కళ్యాణం చేస్తున్నారు. అక్కడ కళ్యాణం చేయించుకునే దంపతులు అందరూ ఆసీనులై ఉన్నారు. వారితో సమానంగా మనమూ కూర్చునే వీలున్నా మేము మాత్రం ఓ ప్రక్కగా కూర్చుని కళ్యాణాన్ని తిలకిద్దాం అని అనుకుని అనువైన చోటుకోసం వెతుకుతుంటే, మా అదృష్టమో ఏమో కానీ వేదం చదువుకుంటున్న విఙ్ఞులు మా కంట పడ్డారు.

అధర్వ వేదం చదువుకుంటున్న ఓ మహానుభావుని వద్దకు చేరుకుని మమ్ములను మేము పరిచయం చేసుకుని వారి క్షేమ సమాచారాలు తెలుసుకి కొంత సేపు సజ్జనులతో గడిపాము. ఇంతలో అక్కడ వరుసలో ఎవ్వరూ కనబడకపోయేసరికి, నా భార్య మఱో సారి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుని వస్తానన్ని వెళ్ళి చక్కగా రెండోసారి దర్శన భాగ్యం కలిగించుకుంది. ఇలా సాగింది ఆ రోజు ఉదయం. అక్కడి నుంచి మెల్లగా రూముకి చేరుకుని, బట్టలు మార్చుకుని సత్రంలో భోజనం కోసం వెళ్ళాం.

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మూడు సంవత్సరాల క్రితం మాకుకూడా చక్కటి దర్శనభాగ్యం కలిగించారు సీతారామ లక్ష్మణులు.ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.అక్కడ మేము సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం కూడా చేసాము.మళ్ళీ మాతో మానసిక దర్శనం చేయించిన మీ దంపతులకు కృతజ్ఞతలు.మీరు త్వరగా కోలుకోవాలని ఆ సీతారాములను ప్రార్థిస్తున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

సంతోషం

 
Clicky Web Analytics